21.02.2012 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 32 వ.భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1994 (32)
01.11.1994
నిన్నటిరోజున మనసు అదుపులో పెట్టటము ఎలాగ అని ఆలోచించినాను. సమధానము తెలియచేయమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సమాధానము. "మనసు కోరికల పుట్ట. దానికి ఆకాశము సరిహద్దు. ఈ కోరికలను మనసు అనే రాకెట్టులో పెట్టి ఆకాశములోనికి తీసుకొని వెళ్ళగలము కాని అంతరిక్షములో కొంత వరకే ఎగిరి మనసు అనే రాకెట్టు భూమిమీదకు పడక తప్పదు.
ఈ నిజాన్ని అనుక్షణము గుర్తించిననాడు మనము మనసును అదుపులో పెట్టుకోగలము.
02.11.01994
నిన్నటిరోజున శ్రీ సాయికి నమస్కరించి "చెడు ఆలోచనలను అదుపులో పెట్టే మార్గము చూపించు తండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చూపించిన దృశ్యాల సారాంశము.
"నీ మనసు ద్వీపకల్పము వంటిది. మూడువైపుల (అంటే భూత-భవిష్యత్-వర్తమానకాలాలలో) నీరు ఉన్న, చెడు ఆలోచనలు ఒకవైపు ఉన్న, భూమార్గము అంటే వెనకటి జన్మ వాసనలు ద్వారా మనసులోనికి వస్తాయి. ఒక సారి చెడు ఆలోచనలు మనసులోనికి వస్తే వాటిని అదుపులో పెట్టటము కష్టము. అందుచేత ద్వీపకల్పములాంటి నీమనసుకు ఒకవేపు ఉన్న భూమార్గాన్ని (వెనుకటి జన్మ వాసనలును) తెగకొట్టి నీ మనసు నాలుగువైపుల నీరు ప్రవహించేలా చేసుకొని నీ మనసును సాయి సాగరములోని ద్వీపముగా మార్చుకో. ఒకసారి ద్వీపముగా మారిన మనసులో చెడు ఆలోచనలు చేరలేవు". ఈ విధమైన సందేశమునకు శ్రీ సాయికి కృతజ్ఞతలు తెలియచేసినాను.
04.11.1994
నిన్న రాత్రి శ్రీ సాయి భక్తులలోకెల్ల ఉత్తమ భక్తుడు ఎవరు తెలియచేయమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సందేశము వివరాలు.
"ఎవడు అయితే తను తినే ఆహారము నాపేరిట సాటి మానవునితో పంచుకొని తినునో, మరియు ఆ సాటిమానవుడు తనకంటే తక్కువవాడు కాదు అనే భావనతో తనప్రక్కనే కూర్చుండపెట్టుకొని తినునో అతడే నా భక్తులలోకెల్ల ఉత్తమ భక్తుడు."
05.11.1994
నిన్నటి రోజున విరక్తి వైరాగ్యాలు గురించి వివరించమని శ్రీ సాయిని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యాల సారాంశము.
1) జీవితములో చీటికి మాటికి డబ్బులేదని, సౌకర్యాలు లేవని అసంతృప్తితో జీవించటము అంటే విరక్తి జీవితము అని అర్ధము.
2) జీవితములో శారీరకముగా సర్వ సుఖాలు అనుభవించుతూ మానసికముగా బాధపడుతూ జీవించటము అంటే వైరాగ్య జీవితము అని అర్ధము.
విరక్తి జీవితమునుండి బయట పడాలి అంటే "తృప్తి" తో జీవితము గడపాలి. వైరాగ్య జీవితమునుండి బయటపడాలి అంటే "ఆధ్యాత్మికత" తో జీవితము గడపాలి.
06.11.1994
నిన్నటి రోజున జీవన్ ముక్తి గురించి ఆలోచించుతూ శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు సందేశము.
"కాలాన్ని వ్యర్ధము చేయకుండ మనిషిగా పుట్టిందులకు తన బాధ్యతలను సరిగా నిర్వర్తించుతు, ప్రశాంత జీవితము గడుపుతు అనుక్షణము భగవన్ నామస్మరణ చేస్తు భగవంతుని పాదాలపై ఆఖరి శ్వాస తీసుకోవటమే జీవన్ ముక్తి. - శ్రీ సాయి.
07.11.1994
నిన్న రాత్రి నిద్రకు ముందు "ముక్తిని కోరేవారికి తత్వ విచారణ అవసరమా లేదా తెలియచేయమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి అదృశ్యావ్యక్త రూపములో యిచ్చిన సమాధానము. "మనిషి జీవించినంత కాలము సన్మార్గములో పయనించుతు భగవన్ నామస్మరణ చేస్తు ఆఖరి శ్వాస తీసుకొంటే ఆవ్యక్తికి ముక్తి లభించుతుంది. అటువంటి వ్యక్తి జీవించినపుడు తత్వ విచారణ చేసి యుండనవసరము లేదు.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment