25.02.2012 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 35 వ.భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 (35)
08.12.1994
నిన్న రాత్రి నిద్రకు ముంది శ్రీ సాయికి నమస్కరించి సాయిభక్తులకు సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి, చూపించిన దృశ్యాలు వాటి వివరాలు. "ఎన్నికలు (రాజకీయాలు) లో ప్రచారానికి, చలనచిత్రాలు (సినిమాలు) లో ప్రచారానికి - స్త్రీలను, పసిపిల్లలను, నోరులేని జీవులను అమానుషముగా వాడుకొనుచున్నారు. యిదివరలో కొందరు రాజులు, జమీందారులు మాత్రమే యిటువంటి అమానుష పనులు చేసేవారు. కాని ఈనాడు చాలా మంది ప్రజలు యిటువంటి అమానుష పనులు చేస్తూ మానవాళికి చెరగని మచ్చ కలిగించుచున్నారు. సాయి భక్తులు యిటువంటి పనులకు దూరంగా ఉండాలనేది నా కోరిక.
09.12.1994
నిన్నటి రోజున గురువారము కొంతమంది మిత్రులు నాయింటికి వచ్చినారు. వారికి శ్రీ సాయిని గురించిన వివరాలు, శ్రీ సాయి తత్వ విషయాలు తెలియచేసినాను. నాకు సంతోషము కలిగినది. శ్రీ సాయి యిటువంటి పనులకు అనుమతి యిచ్చిన జీవితాంతము వరకు చేయాలి అనే కోరిక కలిగినది. రాత్రి నిద్రకు ముందు ఈ నాకోరికను శ్రీ సాయికి తెలియచేసినాను. అనుమతిని ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి నా చేతికి తెల్లటి పటికరాయిని యిచ్చి - "నీయింట ఉన్న నీళ్ళట్యాంకులో ఈ రాయిని ఉంచి, శుభ్రపడిన ఆనీరుతో నీయింటికి వచ్చే సాయి భక్తులకు దాహము తీర్చు." ఈమాటలకు నిద్రనుండి మేల్కొనినాను. శ్రీసాయి ఈ విధముగా సాయి తత్వ ప్రచారము చేయమని ఆదేశించినారు అని భావించినాను.
19.12.1994
నిన్నటిరోజున సంసార జీవితములోని సాధక, బాధలు గురించి, భార్యా భర్తల మధ్య ఘర్షణల గురించి ఆలోచించి, రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నాసమస్యలకు పరిష్కారము చూపించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపించిన దృశ్యాల వివరాలు. "1. సంసార జీవితము అనే చెఱువులో భార్య, భర్తలు చేపలవంటివారు. ఆ చెఱువుమీదకు విపరీతమైన గాలి వీచినపుడు కలిగే అలలకు అంటే భార్య చేపకు మానసిక ఆందోళనలు కలిగినపుడు ఆభార్య చేప, ఒడ్డ్లు మీదకు చేరుకొని గిలగిల కొట్టుకొనుతూ ఉంటుంది.
అటువంటి సమయములో భర్తచేప యుక్తిగా భార్యచేపను చెఱువులోనికి లాగుకొని సుఖవంతమైన సంసారము చేయాలి. అంతేగాని ఎవరో వచ్చి ఒడ్డున ఉన్న చేపను తిరిగి చెఱువులోనికి తోస్తారు అని ఆలోచించటము అవివేకము. అటువంటి సమయములో బయట ఉన్నవారు ఆచేపను తిరిగి నీటిలోనికి త్రోయటానికి బదులు చంపి తిని వేయవచ్చును. బయటనుండి సహాయము రాకపోతే ఒడ్డునపడి ఆచేప చనిపోవచ్చును. అందుచేత చెఱువులో ఎన్ని అలలు వచ్చినా ఆ చేపలు మాత్రము ఒడ్డున పడరాదు అనేది గ్రహించాలి.
2. "సంసారం జీవితములో ప్రాణస్నేహితులతో వ్యవహారము స్నేహము వరకే పరిమితము అయిననాడు ఏమీ ప్రమాదము ఉండదు. ఆస్నేహము హద్దుమీరిననాడు ఆస్నేహితులు నీయింట తిరుగుచున్న త్రాచుపాములుగా మారిపోగలరు. నీవు అజాగ్రత్తగా యుంటే ఆత్రాచుపాముల కాటుకు గురి అయ్యే ప్రమాదముయుంది - జాగ్రత్త.
26.12.1994
నిన్నటిరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ, జీవితములో నీ సహాయ సహకారాలు అన్ని సమయాలలో ఉండేలాగ చూడు తండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీసాయి ఒక పండ్లవ్యాపారి రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు,
"గోపాలరావుగారు, మీరు సరిగా బేరము చేసి సరిగా డబ్బు యిస్తారు. అటువంటప్పుడు తప్పుడు తూకాలతో తూచి మీకు పండ్లు ఎలాగ యిస్తాము. నేను మిమ్ములను ఎప్పుడు మోసము చేయను." ఈమాటలకు నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయి ఒక పండ్లవ్యాపారి. శ్రధ్ధ, సహనము అనే ధనము మనము అనే ధనము వారికి యిచ్చిన రోజున ఆయన మనకు చక్కని అదృష్ఠ ఫలాల్ని ప్రసాదించుతారు అని నమ్మినాను.
28.12.1994
నిన్నటిరోజున శ్రీ సాయిసత్ చరిత్ర నిత్యపారాయణ చేయాలి అనే ఆలోచనలతో రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి, సత్ చరిత్ర నిత్యపారాయణ చేయటానికి కావలసిన శక్తిని ప్రసాదించు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నన్ను ఆశ్చ్యర్యపరచినది. "అది విశాల సముద్రము. ఆమసుద్రపు ఒడ్డున యిసుకలో నేను అంతిమ శ్వాస వరకు పరుగు పెట్టాలనె ఆలోచనలతో నిలబడినాను.
అక్కడకు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి మీరు పరుగెడుతున్నపుడు మీకు కావలసిన శక్తి ఈ హారతి కర్పూరము బిళ్ళ యిస్తుంది. దీనిని మీతలమీద పెట్టుకొని పరుగు ప్రారంచించండి. గాలికి ఈ కర్పూరము బిళ్ళ పూర్తిగ కరిగిపోయిన రోజున మీ పరుగు కూడ ఆగిపోతుంది అని గ్రహించండి అన్నారు". నిద్రనుండి మేల్కొనినాను. శ్రీ సాయిసత్ చరిత్ర నిత్యపారాయణకు శ్రీ సాయి అనుమతిని ప్రసాదించినారు అని గ్రహించినాను.
సాయి.బా.ని.స. డైరీ - 1994 సంపూర్ణము
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
సాయి.బా.ని.స. డైరీ - 1995 కి ఎదురు చూడండి
0 comments:
Post a Comment