13.08.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవ భాగము) - 5
41. నీవు కాలానికి కట్టుబడియుండు. ఆసమయములో నీవు నిర్వర్తించవలసిన బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించు. అంతేగాని నీబాధ్యతల వలన ఫలాన్ని అనుభవించేవారి వ్యామోహములో చిక్కుకోవద్దు.
- 30.01.96
42. నీదగ్గర ఉన్న ధనముతో పదిమింది ముందు నీ గొప్పతనాన్ని ప్రదర్శించిన తప్పులేదు. అంతేగాని నీకు భగవంతుని అనుగ్రహము ఉంది అని పదిమందికి చాటిచెప్పుకోవటము క్షమించరాని నేరము.
- 05.02.96
43. నీకు సత్ గతిని ప్రసాదించుతాము అని చెప్పి నీగొంతు కోసే దొంగ స్వాముల బారినుండి దూరంగా ఉండు. సత్ గతి గురించి నీవు ప్రయత్నించాలి అంతేగాని ఎవరు నీకు సత్ గతిని తెచ్చి యివ్వలేరు.
- 05.02.96
44. గర్భిణీ స్త్రీ నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించాలి కాని ఏడవ నెలలోనే ప్రసవించిన బిడ్డను తిరిగి తల్లి గర్భములోనికి వెళ్ళమనటము ఎలా సాధ్యముకాదో - ఎవరి కర్మానుసారము వాళ్ళు ఈలోకంలో జన్మించి వాళ్ళకాలము పూర్తి అవగానే ఈలోకమునుండి వెళ్ళిపోయేవారే. వారిని నిండు నూరేళ్ళు జీవించే లాగ చేయటము సాధ్యము కాదు.
-06.01.93
45. మనిషి విమానములో కూర్చుని ఆకాశములో ఎగరగలడు. విమానములో ఉన్న యింధనము పూర్తిగా ఆగిపోయేవరకు ఎగిరితే విమానము కూలటము ఖాయము. అలాగే జీవితములో పదవిలో కూర్చోవటము సహజమే. ఆఖరి శ్వాస తీసుకొనేవరకు పదవిలో ఉండాలి అనే కోరిక యింధనము లేక నేలపై దిగలేక కూలిపోయే విమానము వంటిది అని గుర్తుంచుకో.
- 08.04.96
46. నీవు చనిపోయిన తర్వాత నీశరీరానికి ఏవిధముగా దహన సంస్కారాలు జరపబడతాయి అని ఆలోచించటము మూర్ఖత్వము. నీవు చేసుకొన్న పాప పుణ్యఫలితము ప్రకారము నీశరీరానికి దహన సంస్కారాలు జరపబడుతాయి. అందుచేత పాప పుణ్యాల గురించి మాత్రమే ఆలోచించు.
- 13.04.96
47. ఈరోజున మీరు అందరు కలసికొని మేము అందరము సాయిబంధువులము అని చెప్పుకొంటున్నారు. మీలో మీకు ఉన్న బంధుత్వాలు, పరిచయాలు అన్నీ నాకు తెలుసు. మీఆలోచనలకు అందని విశ్వబంధువుని నేనే.
- 18.04.96
48. ఆధ్యాత్మిక భోజనము కోసము మఠాలు చుట్టూ, మఠాధిపతుల చుట్టూ తిరగనవసరము లేదు. గుడెశెలలో యుంటూ ఆధ్యాత్మిక తత్వాలు పాడుకొనే పామరులును ఆశ్రయించిన నీకు ఆధ్యాత్మిక భోజనము లభించుతుంది.
- 19.04.96
49. నీయింట (నీలో) అరిషడ్ వర్గాలు అనే ఆరుగురు దొంగలు ప్రవేశించినారు. వారు నీయింట (నీలో) పసిపిల్లలను అడ్డుగా పెట్టుకొని (ప్రేమ, అనురాగాలును కొల్లగొడుతున్నారు. నీవు నిజముగా అరిషడ్ వర్గాలనే దొంగలను ఓడించదలచితే ప్రేమ అనురాగాలు అనే పసిపిల్లలవైపు చూడకుండ దొంగలతో దెబ్బలాడి వారిని ఓడించు.
- 27.04.96
50. పూలకుండీలోని పూవులు వాడిపోకుండ తాజాగా యుండాలి అంటే వాటిపై నీళ్ళు చిలకరించుతూ ఉండాలి.
అలాగే సాయి భక్తుడుగా ఎల్లపుడు జీవించాలి అంటే సాయి సత్ సంగాలలో పాల్గోనాలి .
- 08.05.96
(యింకా ఉంది)సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment