19.08.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 8
66. నీకు యిష్టములేని వ్యక్తులను నీవు నీయింటికి పిలిచి వారికి అమర్యాద చేసేకంటే నీవే వారినుండి దూరముగా యుండటము మేలు.
- 09.11.96
67. గృహస్థాశ్రమములో దైవ భక్తి ముఖ్యము. దానికంటే చాలా ముఖ్యమైనది, ఈర్ష్యాద్వేషాలను విడనాడటము. అపుడే గృహస్థ ఆశ్రమములో ప్రశాంతత లభించుతుంది.
- 07.12.96
68. నీవు యవ్వనములో యుండగా నీశరీరము అందము చూసుకొని మురిసిపోయినావు. ఈనాడు వృధ్ధాప్యములో నీశరీరము జామిపండులాగ యున్నది అని మురిసిపోతున్నావు.
మరి ఆజామిపండు నేలమీద రాలిపోయినపుడు అందు పురుగులు చేరుతాయి అనే విషయము గుర్తుకు వచ్చినదా! ఆలోచించు.
- 15.12.96
69. చెడుసహవాసాలును ప్రోత్సహించే వారితో స్నేహము చేయుటకన్నా మంచి మార్గములో ప్రయాణము సాగించుతున్నవారి పాదాల క్రిందపడి నలిగి మరణించటము మిన్న.
- 15.01.97
70. నీస్నేహితులు, బంధువులు నీనుండి నీసుఖశాంతులను దోచుకోగలరు. కాని, నీకున్న భగవంతుని అనుగ్రహాన్ని దోచుకోలేరు. ఆనుగ్రహముతో నీవు ప్రశాంతముగా జీవించగలవు.
- 24.01.97
71. పరుల సొమ్ముపై ఆశ వదిలించుకోవాలి అంటే నీవు కష్టపడి సంపాదించిన ధనాన్ని ముందుగా దాన ధర్మాలుకు వినియోగించాలి.
- 29.01.97
72. నావిగ్రహానికి పూజలు చేసేకంటే, మానసికముగా నానామము ఉచ్చరించుతూ, నాలీలలను జ్ఞాపకం చేసుకొంటూ నాదగ్గరకు వచ్చేవారే నాకు యిష్ఠులు.
- 20.03.97
73. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా వాటిని బయట పెట్టేది నేనే. ఆటువంటిపనులు చేసేవారిని శిక్షించేది నేనే. అందుచేత నీకు అన్యాయము, నీపై అక్రమము జరుగుతున్న సమయములో నన్ను తలచుకో. నేను ఏదో ఒకరూపములో ప్రత్యక్షమై నీకు సహాయము చేస్తాను, సలహాను యిస్తాను.
- 29.03.97
74. ఈప్రాపంచిక రంగములో శరీరము ప్రాపంచిక సుఖాలు అనుభవించటానికి మాత్రమే ఉపయోగపడి ఆఖరికి మట్టిలో కలసిపోతుంది. ఆధ్యాత్మిక రంగములోని ఆధ్యాత్మిక సుఖాలను అనుభవించేది నీఆత్మ. ఆత్మకు నాశనములేదు. అటువంటి నాశనములేని ఆత్మ గురించి తెలుసుకోవటము మంచిది కదా.
- 01.04.97
75. పంజరములో బందీ అయిన చిలుక తన యజమాని యిచ్చిన ఫలాలు తిని జీవించుతున్నది.
శరీరములో బందీ అయిన ఆత్మ తన యజమాని (భగవంతుడు) కి యిష్టమైన నవవిధ భక్తి అనే ఫలాలు తిని జీవించుతున్నది.
- 10.04.97
(యింకా ఉంది)
సెర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment