Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 20, 2012

బాబా నవగురువార వ్రత మహిమ మరియు ఆ చేతులు ఎవరివి?

Posted by tyagaraju on 7:24 AM

                                
బాబా నవగురువార వ్రత మహిమ

మరియు  ఆ చేతులు ఎవరివి? 


20.08.2012  సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు పేరు వెల్లడించడానికిష్ట పడని ఒక సాయి భక్తురాలి అనుభవాన్ని వివరిస్తాను.

దానితోపాటే మా పెద్ద అమ్మాయి అనుభవాన్ని కూడా వివరిస్తాను.

మన బాబా మన చెంత ఉంటే మనం దేనికీ భయపడనక్కరలేదు.  అందుకే బాబా వారు నిరంతరం నామ స్మరణ చేయమని చెప్పారు.  మనము ఏపని చేస్తున్నా కూడా "సాయిరాం సాయిరాం, అని గాని ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి" అని గాని, సాయి, సాయి అని గాని నిరంతరం మన మనసులో ఆయన నామస్మరణ జరుగుతూనే ఉండాలి.  నామ స్మరణే మనకి శ్రీరామ రక్ష. 

ఆఖరికి మనం స్నాలా గదిలో స్నానం చేస్తున్నపుడు కూడా సాయి నామ స్మరణ చేసుకోవచ్చు.

బాబా తో నా అనుభవాలను పంచుకోవడానికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మూడవ సారి నా అనుభవాలను బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. నా బాబా దయ లేనిదే ఏది సంభవం కాదు. కనీసం నా అనుభవాలను ఏమైన వ్రాయలనుకున్నా బాబా నే సూత్రధారిగా వుండి నా చేత వ్రాయిస్తాడు. నేను వ్రాసే ప్రతి అక్షరం బాబా నోటి నుండి వెలువడినవే . బాబా నే జగన్నాటక సూత్రధారి. ప్రతీదీ ఆయన చేత నడిపించబడుతుంది. దయ చేసి నా పేరు మరియు ఇమెయిల్ ప్రకటించవద్దు. దాని బదులు నన్ను సాయి బిడ్డ గా చెప్పండి.              

                మన జీవితం లో సాయి లీలలకు అంతమనేది వుండదు. ఎల్లవేళలా మనతో పాటే ఉండి మనం ఏమయినా  తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుతూ మనల్ని సరియైన దారిలో నడిపిస్తుంటారు. నా జీవితం లో బాబా గురించి, ఆయన ఏమిటో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు.  నా బాబా గురించి ఏమైన వ్రాయాలని అనుకున్నప్పుడల్లా  మాటలు రాక నిశ్చేష్టురాలినై పోతాను. నా జీవితం అంతా బాబా మరియు బాబా లీలల తో నిండి పోయింది.  దేని గురించి చెప్పాలో నాకు పాలు పోవడం లేదు.  కాని  ఈ రోజు కొన్ని సంఘటనలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

                   నా బాబా ఎంత దయార్ద్ర్హహృదయుడంటే  నేను ఏమి అడిగిన అది వెంటనే  ఇచ్చేస్తాడు. నేను, మా చెల్లి ఇద్దరం ఒకరికొకరం బాగా సన్నిహితంగా ఉంటాము.  మేము అక్కచెల్లెళ్ళలాగ కాకుండ మంచి స్నేహితుల లాగ ఉంటాము. కొంత కాలం క్రిందట మా చెల్లి పెళ్ళి గురించి ఇంట్లో టెన్షన్ గా ఉండేది. ఏదీ కూడా అనుకున్నట్లు సరియైన పద్దతిలో జరిగేది కాదు. తనకు అస్సలు ఏ సంబంధం కుదిరేది కాదు. ఈ విషయం లో నాకు , మా చెల్లి కి చిన్న పాటి వివాదము జరిగి, మా ఇద్దరి మధ్య బేధాభిప్రాయము వచ్చింది .  మేము ఇద్దరము చాలా కాలం మాట్లాడుకోలేదు.  తన కోసం ప్రతి క్షణం ప్రార్థించేదాన్ని. తనకి మంచి జీవిత భాగస్వామిని ఇమ్మని బాబాని ప్రార్థించేదాన్ని.

         కొంతకాలం తర్వాత నా భర్త కల్పించుకోవడం తో నేను, మా చెల్లి మట్లాడుకోవడం మొదలు పెట్టాము. నేను మా చెల్లికి బాబా నవగురువారవ్రతం చేయమని చెప్పాను.  నేను కూడ అదే సమయానికి  నవగురువార వ్రతం చేయాలని అనుకున్నాను.  మేము ఇద్దరం ఒకే సారి వ్రతం మొదలు పెట్టాము. బాబా మా ప్రార్థలను విన్నారు .  వ్రతం మూడవ వారం వచ్చేసరికి మా చెల్లికి ఒక మంచి సంబంధం వచ్చింది మరియు వ్రతం ఆఖరి వారానికల్లా (తొమ్మిదవ వారం)  సంబంధం కుదిరి చెల్లి పెళ్ళి జరిగింది. బాబా దయ వలన మా చెల్లికి మంచి వాడు, అర్థం చేసుకునే భర్త దొరికాడు. అంతా బాబా దయ వలన బాగా జరిగింది. మా చెల్లి గర్భవతి అయ్యింది. ఏప్రిల్ లో చెల్లి కి డెలివరి డ్యూడేట్ అని చెప్పారు. నేను చాలా ఆనందపడ్డాను.  తన డెలివరి డ్యూడేట్ దగ్గరికి వచ్చేకొద్ది మా అందరికి చాల టెన్షన్ గా వుండేది తన డెలివరి గురించి.

    డాక్టర్ చెప్పిన డ్యూడేట్ దాటి పోయింది. తనకి ఎటువంటి నొప్పులు మొదలవలేదు. కాబట్టి తనకి  సి-సెక్షన్(సిజరిన్) చెయ్యాల్సి వస్తుందేమోనని మేము అందరం చాల భయపడ్డాము.దానికి మేము తయారుగా కూడా లేము. మేము అస్సలు సిజరిన్ చెయ్యాల్సి వస్తుందని అనుకోలేదు. డాక్టర్ కూడ అనుకున్న టైం దాటిపోతుంది కాబట్టి సి-సెక్షన్ కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు.  కాని బాబా అనే గొప్ప శక్తి మనతో ఉండగ ఏ క్షణం లో అయిన అద్భుతం జరగవచ్చు.  ఇక్కడ కూడ అదే జరిగింది.

    హాస్పిటల్ లో చేరినప్పటి నుండి మా చెల్లి బాబా ని తలచుకుంటూనే ఉంది. ఆశ్చర్యంగ  ఆపరేషన్ థియేటర్ లో ఒక నిలువెత్తు బాబా పటమును చూసింది.  అక్కడ బాబా ను చూడగానే సగం భాధ మాయమైపోయింది.   అక్కడ బాబా ఇద్దరు నర్సుల రూపం లో వచ్చారు. వాళ్ళు మా చెల్లి తో నీకు నార్మల్ డెలవరి అయ్యేందుకు సహాయం చేస్తాము. దానికి నీవు మాతో సహకరించాలని చెప్పి ఈ విషయం డాక్టర్ కి చెప్పద్దు,  చెప్పితే తమ ఉద్యోగాలకే ప్రమాదం రావచ్చు అని చెప్పారు. మేము దానికి ఒప్పుకున్నాము. బాబా మా తోనే ఉన్నారు. చెల్లికి నార్మల్ డెలవరి అయ్యింది. బిడ్డ ఏ ప్రాబ్లం లేకుండ ఆరోగ్యంగా పుట్టింది. ఏ డాక్టర్ అయితే సి-సెక్షన్ చెయ్యాల్సి వస్తుందని సలహా ఇచ్చారో ,ఇలా నార్మల్ డెలవరి అవ్వడం చూసి చాలా ఆశ్చర్యపోయారు.  ఎందుకంటే వాళ్ళు దాదాపు మూడు రోజులు నుండి నార్మల్ డెలవరి అవుతుందని చూసి చివరికి  కాక సిజేరియన్ చేయాలనుకున్నారు. కాని ఇప్పుడు అద్భుతంగా నార్మల్ డెలవరి అయ్యింది.

      ఇది అంతా నా దేవుడు సాయి వల్లనే జరిగింది. ఆయన లేకుండ  ఏది సాధ్యపడదు. బాబా ఎప్పుడు మాతో ఉన్నారు. ఆయన ప్రతి నిమిషం మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. సాయీ   మా జీవితమంతా  మీ ఉనికిని చూపిస్తూనే ఉన్నందుకు , మీ ఉనికిని మేము తెలుసుకొనేలా చేస్తున్నందుకు ఐ లవ్ యు సాయీ.  మీరు ఎప్పుడూ  మాతో ఉండాలని ,  మా అందరిని దీవిస్తుండాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను బాబా.  బాబా నీవు నా తండ్రి, తల్లి , నా స్నేహితుడవి;  నాకు అన్నీ నీవే .  నీకు బాగా తెలుసు నీ పేరు తలవకుండ నేను ఉండలేనని.  కాబట్టి ఒక్క క్షణమైన నన్ను వదిలి వెళ్ళకు బాబా,   ఎందుకంటే నీవు లేకుండ నా జీవితానికి అర్థమే లేదు. ఐ లవ్ యు బాబా.  నా జీవితమంతా నా బాబా తో నిండిపోయింది.

           మాకు జరిగిన ఇంకో అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనకు ఏది మంచిదో , ఏది ఎప్పుడు మనకు ఇవ్వాలో నా బాబా కి బాగా తెలుసు.  మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల రెండవ బిడ్డను కనాలన్న ఆలోచన ఎప్పుడు చేయలేదు. కాని మేమనుకున్నది కాకుండ బాబా మా గురించి ఇంకో విధంగా తలచాడు. మళ్ళీ బాబా ఎప్పుడు మాతోనే ఉన్నారని నిరూపించారు.  బాబా దయ వలన నా ఆరోగ్య పరిస్థితి చాలా తొందరగానే పూర్తిగా మెరుగయింది. నేను మందులు తీసుకోవడం మానేసి పూర్తిగా ఆరోగ్యవంతంగ  ఉన్నానని మాకే నమ్మశక్యం కాలేదు. ఇప్పుడు నేను ఎటువంటి సమస్య లేకుండ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. మా కుటుంబ  సభ్యులు మమ్మల్ని రెండో బిడ్డ గురించి అడగడం మొదలు పెట్టారు. బాబా మా మనసుని  మార్చి ఎలాగో రెండో బిడ్డ గురించి ఆలోచించేలా చేసారు. బాబా తో నేను ఎప్పుడు అంటుండేదాన్ని.  బాబా నేను మీ కూతుర్ని. మాకేది మంచో మీకన్న తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు. ఈవిధంగా ఆలోచించి ప్రతీదీ నాబాబా కే  వదిలేశాను.  బాబా ప్రతి సారి నన్ను ఎంత  ప్రేమిస్తున్నారో,  నా  గురించి ఎంత జాగ్రత్త పడుతున్నారో మాకు అర్థమయ్యేలా చేస్తున్నారు. మొదట నా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేలా చూశారు. తర్వాత నేను గర్భవతిని అవడానికి పూర్తిగా ఆరోగ్యంగా కోలుకునేలా చేశారు.  ఇప్పుడు నేను గర్భవతిని. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు.

     బాబా నీవు మాకు చేసిన దానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నీ ఉనికిని ఎప్పుడు చాటుతూ నా జీవితాన్ని ఆనందంతో నింపారు. దయచేసి ఎప్పుడు నాతో ఇలాగే ఉండు సాయి. నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళకు,  లేదా నా మీద కోపం తెచ్చుకోకు సాయి. ఎంతైన నేను మామూలు మనిషిని. నా వల్ల ఎన్నో తప్పులు జరిగి ఉంటాయి. దయచేసి  నా తప్పులన్నీ మన్నించి నన్ను క్షమించు. నన్ను నీ కూతురిగా స్వీకరించి నాకు ఎప్పుడు తోడు గా ఉండు . ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఒక భాగంగా ఉన్నారు. దయ చేసి ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఉండేలా దీవించు. మరియు ప్రతి ఒక్కరు మంచి మనిషిగా వుండి అర్థవంతమైన జీవితం గడిపేలా  సహాయం చేయి తండ్రి.


ఐ లవ్ యు సాయి బాబా.

ఆ చేతులు ఎవరివి?
                  

ఆ చేతులు ఎవరివి?


మీరందరూ నర్సుల రూపంలో బాబా వారు ఆపరేషన్ సమయంలో ఎటువంటి సహాయం చేసారో చదివారు.  యిపుడు మా అమ్మాయి అనుభవాన్ని మీకు వివరిస్తాను. మా అమ్మాయి కూడా బాబా భక్తురాలే.

అక్టోబరు 2011 సంవత్సరములో మా పెద్ద అమ్మాయి  హైదరాబాదులో మెటర్నిటీ ఆస్పత్రిలో చేరింది. మా అమ్మాయికి సిజేరియన్ తప్పదనుకున్నారు డాక్టర్ గారు. డెలివరీకి యింకా 10 రోజులు ఉంది కాబట్టి డాక్టరు యింటికి వెళ్ళిపొమ్మని సాయత్రం చెప్పింది.  కాని తెల్లవారిన తరువాత వెళ్ళవచ్చని ఆస్పత్రిలోనే ఉండిపోవడం జరిగింది. 

ఆ మరునాడు తెల్లవారుఝామునే నొప్పులు మొదలయ్యాయి. వెంటనే డాక్టర్ గారు వచ్చి సిజేరియన్  కి  అన్నీ ఏర్పాటు చేసుకుంటుండగానే నొప్పులు తీవ్రం అయిపోయి నార్మల్ డెలివారీ కే ప్రయత్నించాల్సి వచ్చింది.  కానీ శిశువు కొంతవరకు వచ్చి ఆగిపోయింది. ఆసమయంలో ఆపరేషన్ చేయడానికి కూడా వీలులేని పరిస్థితి.  భగవంతుడు తప్ప ఎవరూ సహాయం చేయలేరు.  అప్పుడే విచిత్రం జరిగింది. రెండు చేతులు మా అమ్మాయి తలవద్దనుంచీ పొట్ట గట్టిగా నొక్కుతున్నట్టుగా కనిపించింది. ఆ వెంటనే సుఖ ప్రసవం జరిగి శిశువు క్షేమంగా బయటికి వచ్చింది. ఆ చేతులు అంతవరకు నొప్పి వచ్చినప్పుడల్లా పొట్ట నొక్కుతూ ప్రయత్నిస్తున్న అక్కడి డాక్టర్లు, నర్సుల చేతులకన్నా వేరుగా ఉన్నాయి. మా అమ్మాయి తల వద్దనే నిలబడిన అల్లుడివి కూడా కావని తరువాత తెలిసింది. మరి ఆ చేతులు ఎవరివి? బాబావి. త్యాగరాజు


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment