Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, September 18, 2012

శ్రీ శివస్వరూపము - సాయి ((4 వ. భాగము)

Posted by tyagaraju on 8:11 AM




18.09.2012  మంగళవారము

ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మరియు వినాయక చవితి శుభాకాంక్షలు 


శ్రీ శివస్వరూపము - సాయి ((4 వ. భాగము)

గురుగీత 37 వ.శ్లోకం:

గురుదేవుడు నివసించు ప్రదేశము కాశీక్షేత్రము.  గురుదేవుని పాద తీర్ధమే గంగాజలము.  


గురుదేవుడే సాక్షాత్తు పరమేశ్వరుడు.  గురుబోధయే విశ్వేశ్వరుడు ఉపదేశించు ఓంకారము.

సాయి సత్ చరిత్ర 4వ. అధ్యాయములో - గోదావరి, కృష్ణానదుల ప్రాoతములు చాలా పుణ్యతమములు.  అనేకమంది యోగులు ఉద్భవించిరి.  శిరిడీ గోదావరి ప్రాoతములో ఉన్నది.  శ్రీసాయినాధుడు శిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమొనర్చెను.  సాయి భక్తులకు శిరిడి  -  పండరీపూర్, జగన్నాధ్, ద్వారక, కాశీ, రమేశ్వర్, బదరీ, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వర్, ఉజ్జయిని, మహాబలేశ్వర్ , గోకర్ణ వంటిది.  శిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము, తంత్రము.  శ్రీసాయి దర్శనము మాకు యోగసాధనముగా నుండెను.  త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాద సేవవలన కలుగుచుండెడిది.  వారి పాదోదకము మాకోరికలను నశింపచేయుచుండెడిది. వారి యాజ్ఞయే మాకు వేదవాక్కు.  వారు మాకు పరబ్రహ్మస్వరూపమే.  వారు ఎల్లపుడు సచ్చిదానంద  స్వరూపులు.  మేఘశ్యాముని దృష్టిలో సాక్షాత్తు పరమేశ్వరుడు. 

గురుగీత 38 వ. శ్లోకం:
 
గురుసేవయే గయాక్షేత్రము.  గురుదేవుని దేహమే అక్షయము.  గురుదేవుని పాదమే విష్ణుపాదము.  అట్టి గురుదేవుని పాదమునందు సమర్పింపబడిన మనస్సు బ్రహ్మ స్వరూపమే అగుచున్నది.


సాయి సత్చరిత్ర 46 వ. అధ్యాయము:

మాధవరావు దేశ్ పాండే  (శ్యామా) బాబాకు అంకిత భక్తుడు.  
ద్వారకామాయిలో నిత్యము బాబాసేవ చేయుచుండెను.  అతను గయ యాత్రకు వెళ్ళేముందు బాబా అనుమతి కోరినపుడు శ్రీసాయి అన్నమాటలు :

"నువ్వు నాప్రతినిధిగా, నాగపూర్ లో జరగబోయే కాకాసాహెబ్ దీక్షిత్ కుమారుని ఉపనయనానికి, గ్వాలియర్ లో జరగబోయే నానాసాహెబ్ చందోర్కర్ పెద్దకుమారుని వివాహానికి వెళ్ళు.  అక్కడినుంచి నువ్వు కాశీ, ప్రయాగ, గయ యాత్రలకు వెళ్ళు. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను నిన్ను  గయలో కలుసుకొంటాను."

బాబా సాయి భక్తులకు పరోక్షంగా చెప్పదలచుకొన్నది ద్వారకామాయే గయ. 

ఆవిధంగా బాబా తనను గయలోను, ద్వారకామాయిలోను దర్శించగలిగే రెండులాభాలని తెలియచేశారు.

శ్యామా ద్వారకాయామాయిలో  గురుసేవ చేసుకొన్నాడు.  బాబా పటము రూపములో శ్యామాకు గయలో దర్శనము ఇచ్చి గురుసేవలో గయా క్షేత్రఫలం  ఉంది అని చెప్పిరి. దాసగణు మహరాజ్ కు తన పాదాల బొటనవ్రేళ్ళనుండి గంగాయమునలను ప్రవహించచేసి తనపాదాలువిష్ణుపాదములు అని నిరూపించెను.  

అట్టిబాబాపాదాలయందు నమ్మకముతో తమమనస్సులను ఆయన పాదాలకు అర్పించి బ్రహ్మస్వరూపమును భక్తులు చూడగలుగుతున్నారు.

గురుగీత 39వ. శ్లోకం:

నిత్యము గురుదేవుని రూపమునే స్మరించవలెను.  గురుదేవుని నామమునే నిత్యము జపించవలెను.  గురుదేవుని ఆజ్ఞను పాటించవలెను.  గురువుకన్నను యితమైన దానిని భావించకూడదు.

శ్రీసాయి సత్ చరిత్రలో యిటువంటి  నియమాన్ని పాటించిన భక్తుడు హరి సీతారాం దీక్షిత్ (కాకాసాహెబ్ దీక్షిత్).   23 వ. అధ్యాయములో "గురుభక్తి పరీక్ష" లో శ్రీసాయి దీక్షిత్ ను పిలిచి 
మేకను చంపమని ఆజ్ఞ ఇచ్చినపుడు దీక్షిత్ అన్న మాటలు

"నీఅమృతమువంటి పలుకులె మాకు చట్టము.  మాకు యింకొక చట్టము తెలియదు.  నిన్నే ఎల్లపుడు జ్ఞప్తియందు ఉంచుకొనెదము.  నీరూపమును ధ్యానించుచు రాత్రిబవళ్ళు నీయాజ్ఞను పాటింతుము.  అది ఉచితమా? కాదా?  అని వాదించము, తర్కించము.  గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మావిధి, మా ధర్మము."
 
141,.  మంచి చెడులను  గూర్చి ఆలోచిoచక గురువు ఆజ్ఞను పాటించవలెను.  గురువు ఆజ్ఞను పాలించుచు రాత్రింబవళ్ళు దాసునివలె ప్రవర్తించవలెను.

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List