22.11.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రం 4వ. శ్లోకం మరియు అర్ధం:
శ్లోకం: సర్వ శ్శర్వ శ్శివ స్ఠాణు ర్భూతాధిర్నిధిరవ్యయః
సంభవో భావనోభర్తా ప్రభవః ప్రభురీశ్వరః ||
సమస్తము తాను అయినవాడు, హింసను నశింపచేయువాడు, శుభము కలిగించువాడు, భూతములకు స్థిరమైన కారణమైనవాడు, వ్యయము కాని నిధి అయినవాడు, భావమై పుట్టుకయైనవాడు, భరించువాడు, మేల్కొలుపటకు సమర్ధుడైనవాడు, ఆట్లు సృష్టివైభమునకు కారణమైన వానికి నమస్కారము.
సమస్తమనగా సృష్టియందలి మరియు దానికి అతీతముగా ఉన్న మొత్తము పరమాత్మ యొక్క ప్రజ్ఞయే.
శర్వః అనగా హింసించువాడు లేక నశింపచేయువాడు. ఈ సృష్టినంతటినీ నశింపచేయుట అనగా సమస్తము దేనినుండి పుట్టినదో దానియందు లయమగుట.
శివుడనగా శుభము లేక మంగళము కలిగించువాడు; జీవులకు తాత్కాలిక శుభములను సుఖములను కల్గించుటతో ప్రారంభించి శాశ్వత సుఖమును, ఆనందమును కల్షించువాడు. అందుచేతనే నాస్తికుడు అయినవాడు మొట్ట మొదటగా భగవంతునికి తన కష్టములు తొలగింపుమని మ్రొక్కినచో వెంటనే జరుగును. వానికి ఆ కష్టము తొలగిపోయి సుఖము కలుగును.
స్థాణుః : రాయివలె స్థిరమయినవాడు. పరమాత్మ సృష్టికి వెలుపల, లోపల కూడా స్థిరమయి యుండును.
భూతది: అన్ని భూతములకు, ప్రాణులకు, జీవులకు తను పుట్టుక అయి వున్నాడు.
నిధిః : దాచబడిన సంపద అయినవాడు
అవ్యయః : వ్యయమగుట లేనివాడు, లేక నశించుట లేనివాడు.
సంభవః : పుట్టుక లేక కలిగించుట అనుదానికి అధిపతి అయినవాడు.
భావనః : భావమును నడిపించువాడు.
భర్తా : పోషించువాడు.
ప్రభవః : మేల్కొల్పుటకు లేక వ్యక్త మగుటము అధిపతి అయినవాడు.
ప్రభుః : సమర్ధుడు లేక అధిపతి.
ఈశ్వరః : సృష్టి వైభవమునకు అధిపతి అయినవాడు.
సాయితో మధుర క్షణాలకు ఒక్క క్షణం విశ్రాంతినిచ్చి .....
ఈ రోజునుండి సాయి.బా.ని.స. చెప్పబోయే జనన మరణ చక్రాలపై సాయి ఆలోచనలు అందిస్తున్నాను. మధ్య మధ్యలో వీరి ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది.
ఈ రోజు మొదటి భాగం వినండి...
జన్మ మరియు పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 1
ఓం శ్రీ గణేషాయనమః, ఓం శ్రీ సరస్వ్వత్యైనమః, ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయనమః.
శ్రీ సాయి సత్ చరిత్ర 10 మరియు 15వ. అధ్యాయాలలో తాను తన భక్తులకు బానిసనని, తాను అందరి హృదయాలలో నివసిస్తున్నానని చెప్పారు. అసలు విషయానికి వచ్చేముందు, సాయి బా ని స గా మీకందరకూ నా ప్రణామములు.
ఈ రోజు నేను ఎంచుకొన్న విషయం శ్రీమద్భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్ములవారు, శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీ సాయినాధులవారు చెప్పినటువంటి ఆత్మ, పరమాత్మ, జననం, మరణం వీటి గురించి ప్రస్తావిస్తాను. నేను సాయినాధుని స్మరిస్తూ ధ్యానంలో ఉండగా నాకు కలిగిన కొన్ని అనుభూతులను కూడా మీకు వివరిస్తాను. జీవిత చక్రానికి సంబంధించిన నిజాలను, పునర్జన్మ కు కారణభూతమయే సంఘటనలను మీకు అర్ధమయే రీతిలో మీకు చెప్పగలిగితే నా జన్మ ధన్యమయినట్లుగా భావిస్తాను.
శ్రీ సాయి తన భక్తులకు జ్ఞానేశ్వరిని చదవమని చెపుతూ ఉండేవారు. 41 వ. అధ్యాయములో బాబా తన అంకిత భక్తుడయిన శ్రీ బీ.వీ.దేవ్ గారిని జ్ఞానేశ్వరిని చదవమని సలహా ఇచ్చినారు. మరాఠీ భాష మాట్లాడేవారందరూ భగవద్గీతను జ్ఞానేశ్వరి అని పిలుస్తారు. మొదట్లో దేవ్ భగవద్గీతను అర్ధం చేసుకోలేకపోయేవారు. 1914వ. సంవత్సరం , ఏప్రిల్, 2వ.తారీకున బాబా శ్రీ బీ.వీ.దేవ్ గారికి స్వప్నంలో కనపడి సులభంగా భగవద్గీతను చదివే పధ్ధతిని విశదీకరించారు. ఆవిధంగా బాబా దేవ్ గారి ఆధ్యాత్మికోన్నతికి సహాయం చేశారు.
అందుచేత నేను, భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం లో చెప్పబడినటువంటి జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ లతో ప్రారంభిస్తాను. ఇదే విషయం శ్రీ సాయిసత్ చరిత్రలో చెప్పినదానిని కూడా మీకు వివరిస్తాను.
శ్రీమద్భగవద్గీత : రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 12, 13, శ్లోకములు:
శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పెను : ఓ! అర్జునా ! నీవుగాని, నేనుగాని లేని క్షణమే లేదు. ఇకముందుకూడా మనమిద్దరమూ జీవించే ఉంటాము. ఆత్మ స్థిరమైనది, శాశ్వతమైనది. శరీరానికే మరణం. శరీరంలో ఉండే జీవాత్మ జీవితకాలంలో బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము అనే వివిధ దశలనన్నిటినీ అనుభవిస్తుంది.
శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయములోని 18, 19 శ్లోకములు:
మన కంటికి కనపడేవన్నీ అంతమయిపోవలసినవే. కాని జీవాత్మకు మాత్రము అంతము, అనగా నాశనము లేదు. ఈ చిన్న సత్యాన్ని తెలుసుకొని యుధ్ధానికి సంసిధ్ధుడవు కమ్ము. ఎవడయితే చావుకు ఆత్మే కారణభూతమనియు,ఆత్మే యితరులచేత చంపబడునని అనుకొందురో వారిద్దరూ కూడా అజ్ఞానులే అగుచున్నారు. నిజానికి ఈ ఆత్మ ఎవరినీ చంపదు, చంపబడదు కూడా.
శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము 20, 21 శ్లోకములు:
ఆత్మకు ఎప్పుడూ కూడా జననము లేదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆత్మకు ఆద్యంతములు లేవు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది పురాతనమైనది. శరీరములో ఉన్నటువంటి ఆత్మకు మరణము లేదు. ఓ! పార్ధా! ఈ నిజాన్ని పూర్తిగా మానవుడు ఎట్లు తెలుకోగలడు. తిరుగుతున్న కాలచక్రములో ఆత్మ ఒక శరీరమునించి విడిపోయినపుడు దానిని మరణమని భావించుకొనుచున్నాడు.అదే ఆత్మ తిరిగి నూతన శరీరములోనికి ప్రవేశించినపుడు దానిని జననమని భావించుకొనుచున్నాడు. అందుచేత ఆత్మ నాశనములేనిది, శాశ్వతమైనది. దానికి జనన మరణాలు లేవు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment