21.11.2012 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణు సహస్రనామం 3వ.శ్లోకం:
యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరః
నారసిం హవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ||
తాత్పర్యము: ఆయనే యోగము, యోగులకు నాయకుడైయున్నవాడు. మూల ప్రకృతిలేక మాయగా వచ్చినవాడు. పురుషులకు ఈశ్వరుడైనవాడు. నృసిం హ రూపముతో వచ్చినవాడు, లక్ష్మీదేవికి భర్త. లోకములే ఆయన కేశములు. ఉత్తమ పురుషుడను ప్రవృత్తిచే తెలియబడినవాడు.
యోగమనగా అన్నిలోకములలోను ప్రజ్ఞ మేల్కొని యుండుట. అన్నమయము (భౌతికము) ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయమను కోశముల యందన్నిటియందు జీవులు సమానముగా మేల్కొని యుండు స్థితి. దీనిని సాధించుకొనుటకే యోగాభ్యాసము ఆవశ్యకము. అట్టి యోగాభ్యాసము ప్రారంభింపవలెనన్న కోరిక పరమాత్మనుండియే మనయందు పుట్టుచున్నది. కనుక పరమాత్మయే యోగమను పేర కూడా తెలియబడుచున్నాడు.
అందుచేత యోగసాధన చేయువారికి, ప్రారంభించువారికి నాయకుడు లేక మార్గ దర్శకుడు నారాయణుడే అగుచున్నాడు. యోగాభ్యాసము మొదట ఒక సద్గురువునొద్ద ఉపదేశము పొందవలెను అట్లు ఉపదేశించు గురువు ద్వారా యోగము నారాయణుడే ఉపదేశించుచున్నాడు. అనగా గురువు నుండి శిష్యులలోనికి నారాయణుడే ప్రవేశించుచున్నాడు.
సాయితో మధురక్షణాలు ప్రతిక్షణం తలుచుకుంటూ ఉండండి.
శ్రీసాయితో మధుర క్షణాలు
- 4
నాయెందవరి దృష్టో
వారియందే నాదృష్టి
మీరు ద్వారకామాయిలోకి
అడుగుపెట్టగానే రాత్రి పొద్దుపోయిన సమయంలో కూడా కొంత మంది భక్తులు ధ్యాన నిమగ్నులై
ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం. కొత్తగా
ధ్యానం ప్రారంభించే భక్తులు ద్వారకామాయిలో ఉన్న ఆయన చిత్రపటం ముందు కూర్చొని ఆయన
రూపాన్ని ధ్యానిస్తారు. ఈ బాబా చిత్రపటం
వెనుక శ్రీ డీ.డీ.నిరోయ్ గారికి సంబంధించిన ఒక లీల ఉంది. శ్రీ డీ.డీ. నిరోయ్ కామూ
బాబా ( ముంబాయి గిర్ గావ్ లో ఉండే సాధువు)
కు భక్తులు. బాబా కరుణా దృష్టిని ప్రసరిస్తూ రాతి మీద కూర్చొని ఉన్న చిత్రపటాన్ని
తయారుచేయించారు. దానిని నలుగురు మనుషుల
సాయంతో ఆయన గిర్గావ్ కు తీసుకొని వచ్చి తన గురువుగారికి సమర్పించారు. కామూ బాబా ఆ చిత్రపటాన్ని చూసి ఎంతో
ప్రశంసించారు. కాని, దానిని తీసుకోవడానికి నిరాకరించారు. దానిని షిరిడీ తీసుకొని వెళ్ళి ద్వారకాయాయిలోని
సభామండపం (హాలు) లో పెట్టమని కామూ బాబా నిరోయ్ గారికి చెప్పారు.
నిరోయ్ గారు నిరాశపడి
గురువుగారి పాదాలవద్ద కూర్చొని "ఈ చిత్రాన్ని వేయించడానికి నాకు మూడు
సంవత్సరాలు పట్టింది. దానిని ఫ్రేములో బిగించడానికి నెలన్నర పట్టింది. ఖర్చు గురించి నేనాలోచించను. మీరేమో దీనిని తీసుకోనంటున్నారు"
అన్నారు. ఒక భక్తునిగా నిరోయ్ గారు ఎటూ తేల్చుకోలేక ఆందోళనలో పడ్డారు, కాని, గురువు జ్ఞాని, ఆయనకు అంతా
తెలుసు. "దానిని తిరస్కరించడం అన్నది
కాదు ప్రశ్న. నువ్వు దానిని షిరిడీకి
తీసుకొని వెళ్ళాలన్నదే నా ప్రగాఢమైన వాంచ.
అక్కడ వేలకొద్ది భక్తులకు
ప్రార్ధించుకొనే భాగ్యం కలుగుతుంది." అని ప్రశాంతంగా జవాబిచ్చారు.
ఆవిధంగా ఆ పటం
ద్వారకామాయిలోని సభామండపంలో ప్రతిష్టింపబడింది.
జరగబోయేదానిని ముందే ఊహించి కామూబాబా చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయనే
కనక ఆవిధంగా చెప్పి ఉండకపోతే ఈనాడు మనకు ద్వారకామాయిలో అంత అందమైన బాబా
చిత్రపటాన్ని దర్శించుకొనే భాగ్యం కలిగి ఉండేది కాదు.
బొంబాయి చివరి ప్రాతమయిన
అంధేరీ ప్రధాన రహదారిలో పుణ్యపురుషుడయిన కామూబాబా నివాసం. రోడ్డ్లుకు ప్రక్కనున్న బంగళాలో ఒక పార్సీ
కుటుంబం నివసిస్తోంది. కామూబాబా గారు అక్కడ నివసిస్తూ ఉండేవారు. పార్సీ కుటుంబంవారు కామూబాబా భక్తులు. వారు ఆయన సేవ చేసుకొంటూ ఉండేవారు. ప్రాపంచిక సమస్యల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పుకొని ఆయన ఆశీర్వాదాలను
పొందటం కోసం చాలా మందిఅయన దర్శనం కోసం వస్తూ ఉండేవారు.
చెన్నైకి చెందిన లాల్
చంద్ అనే భక్తుడు కామూబాబా వల్ల తాను పొందిన అనుభూతిని జ్ఞప్తికి
తెచ్చుకొన్నారు. 1952 నుంచి ఆయన షిరిడీ వెడుతూ ఉండేవారు. మానవమాత్రునిలో దైవిక శక్తులు నిక్షిప్తమయి
ఉండటం, ఆయనను దానివైపు మొగ్గు
చూపేలా చేసింది. కామూబాబా వద్దకు వెళ్ళి, ఆయన దర్శనం చేసుకోవాలనే కోరిక ఉదయించింది ఆయనలో. కాని మనసులో ఒకవిధమయిన సంశయాత్మకమయిన భావనకూడా
ఉంది. స్వచ్చమయిన పుణ్య పురుషుడి యొక్క
దర్శన భాగ్యం కలుగ చేయమని ప్రార్ధించుకొన్నారు. ఆసమయంలో ఆయనకు తన సమస్యలు
చెప్పుకొని సమాధానం పొందటానికి ఎటువంటి సమస్యలూ లేవు.
1959 వ సంవత్సరంలో ఆయన బొంబాయిలో ఉన్నపుడు ఒకరోజు సాయంత్రం 5 గంటలకు కామూబాబాను దర్శిద్దామనుకొన్నారు.
సాయంత్ర సమయంలో రద్దీగా
ఉంటుందని కాస్త ముందుగానే వెడదామనుకొని ఆఫీసునుంచి బయలుదేరబోతుండగా ఫోన్
వచ్చింది. ఆఫోన్ యొక్క సారాంశం ఏమిటంటే
ఆయన ఒక వ్యక్తికి అప్పుయిచ్చాడు. అతను
యిప్పుడు మోసపూరింతంగా తానా అప్పును తీర్చటల్లేదని చెప్పడంతో ఆయన మనసు మార్చుకొని
ఈ విషయమేదో తేల్చుకొందామనే ఉద్దేశ్యంతో కామూ బాబా వద్దకువెళ్ళడం వాయిదా
వేద్దామనుకొన్నారు. కాని మెరుపులా ఆయన మదిలోకి ఇలా అనిపించింది "ఎందుకు
చింతిస్తావు? నేనా విషయం రేపు చూసి
చక్కబరుస్తాను"
ఆయన తన స్నేహితునితో కలసి
కామూబాబా దర్శనానికి వెళ్ళారు. 200 మంది భక్తులున్న వరుసలో చోటు దొరికిం ది. ఆయన స్నేహితునితో కలసి ఎక్కడో చివర
ఉన్నారు. ఆయన కామూబాబా వద్దే ఎంతో
ఆత్రుతతో చూస్తూ, అదే సమయంలో
షిరిడీసాయిబాబా వారిని కూడా స్మరించుకుంటున్నారు.
5, 6 గురు భక్తులను చూసి,
వారి సమస్యలకు సమాధానాలు చెప్పిన తరువాత బాబా
వారివైపు చూసి చేయి ఊపారు. ఎంతోమంది తనముందు వేచి చూస్తున్నా వారినందరినీ కాదని
కామూబాబా ఆయనను పిలిచారు. బహుశా తన సమస్య,
తన ఆత్రుత కామూబాబాకు చేరి ఉండవచ్చు. ఆయన వరుసలోనుంచి బాబావద్దకు వెళ్ళారు. కామూబాబా, చిరునవ్వుతో "నీకేదైతో రాదని అనుకుంటున్నావో అదినీకు
లభిస్తుంది. చింతించకు"
అన్నారు. కామూబాబా ఆశీర్వాదాలు తీసుకొని
ఆయన తిరిగి వచ్చారు. మరునాడు ఆయన ఉదయం 11 గంటలకు అఫీసుకు చేరగానే, ఆయన ఎక్కౌంటంట్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఆయనకు ఒక
బేరర్ చెక్కు బ్రోకర్స్ వద్దనుంచి వచ్చిందనీ దానిని అయన ఖాతాలో జమ చేసినట్లుగా
చెప్పారు. యిది కామూబాబాగారు చేసిన
అద్భుతం మరియు ఆయన అనుగ్రహం.
శ్రీసాయిలీల మాసపత్రిక
డిసెంబరు 1981
లాల్ చంద్ కె.బుల్భాందినీ
- తమిళ్ నాడు
(మరికొన్ని మధురక్షణాలు ఇంకా ఉన్నాయి....)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment