20.11.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్బుతమైన మధుర క్షణం. అన్నీ మధుర క్షణాలే.
ముందుగా శ్రీ విష్ణుసహస్రనామం 2వ. శ్లోకం, మరియు తాత్పర్యం
శ్లోకం 2. పూతాత్మా పరమాత్మాచ ముక్తానాం పరమాగతిః
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ ||
తాత్పర్యము: పరిశుధ్ధమైన ఆత్మ కలవాడు, గొప్ప ఆత్మయైనవాడు, మోక్షము పొందిన జీవులకు ప్రధాన లక్ష్యముగా నున్నవాడు, తరుగుట యనునది లేనివాడు, దేహమునందున్న ప్రజ్ఞలన్నింటినీ గమనించువాడు, ఉపాధియందుండి తెలిసికొనువాడు, నాశనము లేనివాడు కదా ! (అక్షరః = నాశనము లేనివాడు, ఏవచ = ఆవిధముగానున్నాడు కదా)
శ్రీసాయితో మధురక్షణాలు - 3
నీ బిడ్డను పట్టుకో.....
1945 సెప్టెంబరు న శ్రీ టీ.ఎల్.ఎస్. మణి అయ్యర్ గారికి అమ్మాయి జన్మించింది. ఆమెకు "సాయి చంద్ర" అని పేరు పెట్టారు. మిగతా కుటుంబాన్ని రక్షించినట్లే శ్రీసాయి బాబా ఈపాపను కూడా రక్షించారు. 25, జనవరి 1946 వ.సంవత్సరంలో మణి అయ్యర్ గారు ఒకరోజు వేకువజామున 4 గంటలకు లేచి యింటినుంచి బయలుదేరడానికి సిద్ధమయారు. తను పడుకున్న మంచం మీద అయిదు నెలలున్న తనపాప రెండు అడుగుల ఎత్తు ఉన్న మంచం మీద ఒక్కతే నిద్రపోతూ ఉంది. మంచానికి రెండువైపులా ఎటువంటి రక్షణా లేదు. ఆయన మరొక ప్రక్కన నిద్రపోతున్న తన భార్యతో "పాపను జాగ్రత్తగా చూసుకో" అంటూ బయటకువెళ్ళిపోయారు. ఆయన భార్య అలాగే అని సమాధానమిచ్చి వెంటనే నిద్రలోకి జారిపోయింది. నిద్రలో ఉన్నతల్లికి (కుఝంధైయ యై ఏదు) " నీ పాపను పట్టుకో" అనే మాటలు వినపడటంతో ఉలిక్కిపడి హటాత్తుగా లేచింది. అక్కడ ఆమాటలు అన్నవారెవరూ కనపడలేదు. పాప మంచం మీదనుంచి కిందకి వేలాడుతూ పడిపోవడానికి సిధ్ధంగా ఉంది. ఆమె పాపను పట్టుకోవడానికి ముందుకు జరిగినపుడు భూమిలోనుంచి రెండు చేతులు వచ్చి పసిపాప పడిపోకుండా రక్షణగా ఉండటం కనిపించింది. తల్లి మంచి గాఢనిద్రలో ఉన్నపుడు పాపని అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నది ఎవరు? స్వయంగా ఆసాయినాధుడే. ఎల్లపుడు మనందరినీ ప్రేమించే తల్లి, తండ్రి. తల్లి, ఆపాపని తన చేతులలోనికి తీసుకోగానే, అంతవరకు సాయిచంద్ర పడిపోకుండా రక్షణగా ఉన్న ఆచేతులు అదృశ్యమయ్యాయి.
బావిలో పడిన మూడు సంవత్సరాల బాలిక శాంతిని, మేడమీదనుంచి పడిన రెండు సంవత్సరాల బాలుడు నాచ్నేను రక్షించినట్లుగానే బాబా ఆపాపను రక్షించారు.
(1928 వ.సంవత్సరంలో సాయినాధ్ నాచ్నే రెండు సంవత్సరాల బాలుడు. ఒకరోజున ఆపిల్లవాడు పరిగెడుతూ ఉండగా ప్రమాదవశాత్తు మేడమీదనుంచి పడిపోయాడు. కింద పెద్దరాళ్ళగుట్ట, చెత్త ఉంది. నాచ్నే పరుగెత్తుకుని వెళ్ళి చూసేటప్పటికి అతని కుమారుడు ఎటువంటి గాయాలు, దెబ్బలు లేకుండా నిల్చుని ఉన్నాడు. నాచ్నే తన తండ్రితో "భయపడద్దు, బాబా నన్ను పైకి లేపారు" అన్నాడు.
సాయిసుధ - సావనీర్ 1946 ప్రచురణ నుంచి సమాచారం .
(యింకా ఉన్నాయి మధురక్షణాలు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment