04.01.2013 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్రనామం 22వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: అమృత్యు స్సర్వదృక్సిం హస్సన్ ధాతా సంధిమాన్ స్థిరః
అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ||
పరమాత్మను మృత్యువు లేనివానిగా, సమస్తమును చూచువానిగా మరియు అందరి చూపు తన చూపైనవానిగా, సిం హమువంటి పరాక్రమము కలవానిగా, అన్నివిషయములను సంధాన పరచి సమన్వయము చేయువానిగా, స్థిరమైనవానిగా, పుట్టుక లేకపోవుటచే జయించుటకు సాధ్యము కానివానిగా, జగత్తును శాసించువానిగా, జ్ఞానుల ఆత్మ తానే అయినవానిగా, మరియు దేవతల శత్రువులను సం హరించువానిగా, ధ్యానము చేయుము.
శ్రీసాయితో మధుర క్షణాలు 13/2
ఆస్పత్రిలో సుహాస్ కు బాబాదర్శనమగుట - 2వ.భాగం
ఆ సమయంలో అక్కడ సుహాస్ తలిదండ్రులు లేరు. అందుచేత వైద్యం వాయిదా వేయవలసిన పరిస్థితి. అదే రోజు రాత్రి సుహాస్ యింటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాడు. అతని ప్రక్కనే డా.జయంత్ రావ్ జాదవ్ కూడా వున్నారు. అప్పుడే అతను బాబాను తన మంచం ప్రక్కన చూడటం, వెంటనె డా.జాదవ్ తో బాబా కూర్చోవడానికి కుర్చీ చూపించమని అడగటం జరిగింది. కొంత సేపయిన తరువాత డా.జాదవ్ ఐ.సీ.యూ. లోనుంచి బయటకు వచ్చి, సుహాస్ మంచం ప్రక్కన ఏమి జరిగిందో అంతా వివరంగా అతని తల్లిదండ్రులకు వివరించారు.ఈ సంఘటన శ్రీసాయిబాబా ఆశీర్వాదములు సుహాస్ కు లభించాయని చెప్పడానికి సంకేతం. ఆస్పత్రిలో ఉన్నవారందరూ కూడా యిక ఆందోళన చెందనవసరం ఏమీలేదని సుహాస్ తల్లిదండ్రులతో చెప్పారు.
మరునాడు ఉదయం గం.10.30 కు సుహాస్ ని కెం ఆస్పత్రికి తీసుకొని వెళ్ళారు. డా.కార్నిక్, డా.జయంత్ జాదవ్ గార్లు బ్రాంకోస్కోప్ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు. సాయంత్రానికి సుహాస్ బాగా కోలుకొని ఆడుకోవడం మొదలు పెట్టాడు. బ్రాంకో స్కోపీ పరీక్షలో చిన్న రబ్బరు గొట్టాన్ని శ్వాస నాళంలోకి పంపి, శ్వాస కోశంలో శ్వాసకు అడ్డంపడి అవరోధం కలిగించేవి ఏమన్నా ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. లోపల ఏ అవయవాలకి ఎటువంటి హాని కలుగకుండా ఈపరీక్ష చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఈ పరీక్షలో శ్వాసనాళంలో యిరుక్కున్న చింతగింజ యొక్క చిన్న ముక్క ఒకటి బయటకు వచ్చింది. అది బయటకు తీసిన వెంటనే సుహాస్ కు శ్వాస పీల్చుకోవడంలో ఎటువంటి యిబ్బందీ కలగ లేదు. అంత చిన్న వయసులోనే బాబా దర్శనం కలగడం సుహాస్ ఎంతో అదృష్టవంతుడు. శ్రీసాయినాధులవారు వచ్చారనడానికి డా.జాదవ్ గారికి సాక్ష్యం దొరికింది. మనం కూడా శ్రీసాయిబాబాపై స్వచ్చమయిన భక్తిని తెలుపుకొని ఆయనయొక్క అనుగ్రహానికి పాత్రులగుదాము.
అయిపోయింది
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment