Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, November 7, 2013

శ్రీసాయితో మధురక్షణాలు - 25

Posted by tyagaraju on 2:24 AM
                              
                                                       
07.11.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు - 25

ఈ రోజు మరొక అద్భుతమైన క్షణాన్ని తెలుసుకుందాము.  మనకి బాబా మీద ప్రేమ, భక్తి, అంకితభావం ఉండాలె గాని ఆయన ఎల్లప్పుడు తన భక్తులను అంటిపెట్టుకునే ఉంటారు.  సదా ఆయన నామాన్నే స్మరణ చేసుకుంటూ, ఆయన రూపాన్నే ధ్యానం చేసుకుంటే కొన్ని కొన్ని అనుకోని పరిస్థితులలో కూడా ఆయన మనకి చేదోడు వాడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి మనం ఊహించం.  తరువాత గాని తెలియదు అది బాబా చేసిన అద్భుతమయిన లీల అని.  అటువంటిదే మీరు ఈ రోజు చదవబోయే ఈ లీల.  ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 92వ.శ్లోకం, తాత్పర్యం. 
                                        
శ్రీవిష్ణుసహస్రనామం 

శ్లోకం : ధనుర్ధరో ధనుర్వేదో దండోదమయితా దమః   

         అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః  


తాత్పర్యము:  పరమాత్మను ధనుస్సును ధరించినవానిగా, విలువిద్య తెలిసినవానిగా ధ్యానము చేయుము.  ఇతరులను నియమించి నియమము కలుగునట్లు శిక్షణనిచ్చు న్యాయదండముగా తానేయుండి, మరల తానే ఆదండమును ధరించుచున్నాడు.  ఆయన  ఎప్పటికీ ఓడిపోవుటలేదు.  ఆయన  సామర్ధ్యము, సహనము, అన్నిటినీ మించినవి.  ఆయన జీవులకు నియామకుడు.  సక్రమముగా తీర్చిదిద్దువాడు  మరియూ శిక్షకుడునైయున్నాడు.      

సాయితో మధుర క్షణాలు -  25

బాబా లీల

బాబా మీద ప్రగాఢమయిన భక్తి ఉన్నవారికి తమ దైనందిన జీవితంలో జరిగిన  ప్రతీ సంఘటన, అది బాబాలీలే అని విశ్వసిస్తారు.  అవి వారికి మరపురాని మధురానుభూతులుగా మిగులుతాయి.  కాని భక్తి విశ్వాసం  లేనివారికి మాత్రం అవన్ని కూడా కాకతాళీయంగానే జరిగినట్లు అనిపిస్తుంది.  సాయినాధులవారు ఎవరినయితే తన భక్తులుగా స్వీకరిస్తారో లేక గుర్తిస్తారో వారెంతో అదృష్టవంతులు.ఇప్పుడు వివరింపబోయే బాబా లీల అత్యద్భుతమే కాదు,  సాయినాధులవారి మాతృప్రేమ ఎటువంటిదో మనకు అర్ధమవుతుంది.  


ఒక్కొక్కసారి మనకి లౌకిక పరంగా అవసరమయినప్పుడు మనం ఆయనని అడగకుండానే మన అవసరాలని గుర్తించి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తారు. మనం అలా జరుగుతుందని ఊహించం కూడా. 

''1973 సంవత్సరంలో నేను కుటుంబంతో సహా ఢిల్లి నుండి కారులో షిర్డీ చేరుకునేటప్పటికి మధ్యాహ్న్నం అయింది.  పూజకి, బాబా దర్శనానికి వెళ్ళేముందర స్నానం చేసి పరిశుభ్రంగా వెడదామనుకున్నాను.  ఆ ఉద్దేశ్యంతో తిన్నగా స్నానాల గదులవైపు నడిచాను.  గదులకి కొద్ది అడుగుల దూరం ఉందనగా  యిద్దరు వ్యక్తులు నన్ను ఆపి, స్నానాలు చేసే గదులలో ఏఒక్కదానిలోను చుక్క నీరు కూడా  రావటల్లేదనీ, కుళాయిలన్న్నీ ఎండిపోయి ఉన్నాయని చెప్పారు.  ఒక్క క్షణం నాకేమి చేయాలో అర్ధం కాక స్థబ్దుగా ఉండిపోయాను. 

నాకు బాగా తెలిసిన శ్రీ సాహెబ్ గారి యింటికి గాని, శ్రీ బాగ్వే సాహెబ్ గారి యింటికి గాని వెడదామనుకుని వెనుకకు తిరిగాను.  అప్పుడే మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక  వ్యక్తి నన్ను ఆగమన్నట్లుగా సంజ్ఞ చేశాడు.   

చూడటానికి అతను యువకుడిలా మంచి దుస్తులు ధరించి ఉన్నాడు.  తలకి గుడ్డ కట్టుకొని, మంచి స్ఫురద్రూపిగా, మంచి చాయతో ప్రకాశవంతమయిన కళ్ళతో ఉన్నాడు.  అతని వదనం మనోహరమైన చిరునవ్వుతో వెలిగిపోతోంది.  అతను నావద్దకు వచ్చి కరుణరసం ఉట్టిపడుతున్న స్వరంతో 'నీ కేం కావాలీ' అని అడిగాడు నన్ను.  స్నానం చేద్దామంటే ఏఒక్క గదిలోను కుళాయిలనుండి ఒక్క  చుక్క కూడా నీరు రావటల్లేదు అని చెప్పాను.  ఆ పరిచితుడు నన్ను తనతో కుడా రమ్మని దగ్గరలో ఉన్న ఒక స్నానాల  గదికి తీసుకొని వెళ్ళాడు.  అక్కడ కుళాయిలోనుండి ధారగా విస్తారంగా నీళ్ళు వస్తున్నాయి.  అన్ని నీళ్ళు చూడగానే నాకెంతో సంతోషం కలిగి హాయిగా అనిపించింది.  నేను హాయిగా స్నానం  చేసి వచ్చేటప్పటికి ఆవ్యకి అక్కడ లేడు.   

నేను పూజా సామగ్రి, బాబాకు సమర్పించడానికి ప్రసాదం కొని తొందర తొందరగా సమాధి మందిరంలోకి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది భక్తులు క్యూలో నిలబడి తమ  వంతుకోసం ఎదురు చూస్తూ ఉన్నారు.  క్యూ చాలా  పెద్దదిగా ఉంది.  అందరూ కూడా బాబా దర్శనం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.  నావంతు వచ్చేసరికి చాలా సమయం పట్టేటట్లుగా  ఉంది.  ఎంతో దూరంనుండి కారులో ప్రయాణం చేసి రావడం వల్ల చాలా అలసటగా ఉండి అంతసేపు క్యూలో నిలబడలేననిపించింది.  నావంతు వచ్చేవరకు నిరీక్షించక  తప్పదని మవునంగా నిలబడ్డాను.  ఇంతలో అకస్మాత్తుగా ఎవరో నా చెయ్యి పట్టుకొని లాగారు.  చూసేటప్పటికి ఆవ్యక్తి ఎవరో కాదు, అంతకు ముందు నన్ను స్నానాల గదికి తీసుకొని వెళ్ళిన వ్యక్తే.  అతను నా  చేయి పట్టుకొని గుంపులోనుండి తీసుకొని వెళ్ళి తిన్నగా బాబా సమాధి వద్దకు తీసుకొని  వెళ్ళి అక్కడ వదలి పెట్టాడు. క్యూలో ఉన్నవారందరూ ఖచ్చితంగా అడ్డుపెట్టి నన్ను నిందిస్తారని భయ పడుతూనే ఉన్నాను. కాని అలా ఏమీ జరగలేదు.   ఏ ఒక్కరూ కూడా అది తప్పని అనలేదు, కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. 

పూజాసామగ్రి, ప్రసాదాన్ని పూజారిగారికి అందించి బాబా ముందు శిరసు వంచి ప్రార్ధించాను.  నన్ను తీసుకొనివచ్చి ఉపకారం చేసినతనికి కృతజ్ఞతలు తెలుపుదామని వెనుకకు తిరిగాను.  ఎంత అకస్మాత్తుగా వచ్చోడొ అంత అకస్మాత్తుగానూ అతను అదృశ్యమయ్యాడు.  సమాధి  మందిరం బయటకు వచ్చి కొద్ది నిమిషాలు అతను కనపడతాడేమోనని చూశాను కాని, ఎక్కడా కనపడలేదు.  నేను నా కారును నిలిపి ఉంచిన చోటకు వచ్చాను.   అక్కడ నాతో వచ్చినవాళ్ళు చెట్టు క్రింద నీడలో యింకా అలాగే కూర్చొని ఉండటం నాకు కోపాన్ని తెప్పించించింది.  బాబా దర్శనానికి, పూజకి సమాధి మందిరానికి వెళ్ళకుండా అలా చెట్టు క్రింద సోమరుల్లాగా  ఎలా కూర్చొన్నారని ప్రశ్నించాను.  స్నానాలకి ఏఒక్క గదిలోనూ నీళ్ళు రావటల్లేదని అందరూ ముక్త కంఠంతో చెప్పారు.  వీరి జవాబు సహజంగానే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఒక గదిలో మాత్రం  బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయనీ, 20 నిమిషాల క్రితమే నేను స్నానం  చేశానని చెప్పాను. నేనెంతో నమ్మకంగా చెప్పి, పదండి చూపిస్తాను అని నేను స్నానం చేసిన గది వద్దకు వారిని  బయలుదేర దీశాను.

    నేను కొంతసేపు ఆగది కోసం వెతికాను కాని అది నానుండి తప్పిపోయింది.  నేను అయోమయంలో పడిపోయాను.  అంతా తికమకగా ఉంది.  ఇక అటుగా వెడుతున్నవారి నుంచి సహాయం తీసుకుందామనుకొన్నాను.  అంతకు 20 నిమిషాల క్రితమే నేనొక గదిలో స్నానం  చేశానని, అందులో బాగా నీళ్ళు వస్తున్నాయని ఆగది గురించి మీకేమయినా తెలుసా అని అడిగాను.  వాళ్ళు నన్ను జాలిగా తేరిపార చూశారు.  బహుశా నన్ను పిచ్చివాడి క్రింద జమకట్టి ఉంటారు.  అలా నన్ను చూసి, నాకూడా వచ్చినవారితో తాము గంటన్నరనుండి నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నామని ఎక్కడా నీళ్ళు రావటల్లేదని చెప్పారు.  ఇదంతా బాబా లీలేనని గ్రహించడానికి నాకు క్షణం పట్టలేదు.  నాకోసం, నా అవసరంకోసం, బాబా నీటిని సృష్టించారు.  చాలా దూరం ప్రయాణం చేసి, అలసిపోయి క్యూలో నిలబడలేని పరిస్థితిలో బాబా నాకు వేచిచూసే అవసరం లేకుండా వెంటనే దర్శన భాగ్యాన్ని కూడా కలిగించారు.  నాతో వచ్చినవారందరూ నాకు అదృష్టాన్ని కలిగించిన ఆ స్నానాల గది ఎక్కడని అడుగుతూనే ఉన్నారు.  కాని నానుండి ఎటువంటి సమాధానం లేదు.  నేను మాటలు రానివాడిలా అయిపోయాను.

శ్రీసాయి లీల
డిసెంబరు, 1979
ఆర్.ఎస్.చిట్నీస్
న్యూఢిల్లీ 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List