Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 16, 2013

శ్రీసాయితో మధురక్షణాలు - 26

Posted by tyagaraju on 6:18 AM
                                  
                           
16.11.2013 శనివారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు - 26 

రెండురోజుల క్రితమే హైదరాబాదునుండి నరసాపురం రావడం జరిగింది. దాని వల్ల, యింకా మరి అనువాదం చేయడంలోను కాస్త ఆలశ్యమయింది.  మరలా 19వ.తారీకున హైదరాబాదు ప్రయాణం, తరువాత 22వ.తారీకున దుబాయికి ప్రయాణం.  అందుచేత ప్రచురణకి కొంత ఆలశ్యం జరుగుతుంది.  మరలా దుబాయినుండి యధాప్రకారంగా బ్లాగులో ప్రచురణ కొనసాగుతుంది. శ్రీసాయితో మధురక్షణాలలోని ప్రతీ క్షణం అద్భుతమే.  మరలా మరొక్కసారి యింతకుముందు ప్రచురించిన లీలలన్నీ చదువుకొని బాబా చెంతనే ఉన్నట్లుగా అనుభూతిని పొందండి.   

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 93వ.శ్లోకం, తాత్పర్యం.
                                   
శ్రీవిష్ణుసహస్రనామం

శ్లోకం:    సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః  |

            అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః        || 

తాత్పర్యం: పరమాత్మను సత్వస్ఠితిగా మరియూ మనస్సు స్వభావమూ సాత్వికమైనవానిగా, సత్యముగా, సత్యధర్మముల కంకితమైనవానిగా, మనయందు ప్రియముగల అభిప్రాయముగా, ధ్యానము చేయవలెను.  ఆయనను అట్టి అభిప్రాయముగానే అర్చన చేయవలెను.  ఆయన అర్చనగనే తెలియబడుచున్నాడు.  ఆయనకు అర్చన వలననే జీవులపై ప్రీతి కలుగుతున్నది.  అంతేగాక యితరులకు తనయందు ప్రీతిని కలిగించి దానిని వృద్దిపొందించుచున్నాడు.  

శ్రీసాయితో మధురక్షణాలు - 26

బాబా అప్పుడే కాదు ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు

సంవత్సరం క్రితమే నేను బాబా గురించి విన్నాను.  అదే సమయంలో ఒకరు నాకు శ్రీసాయి సత్ చరిత్రను బహూకరించారు.  కొన్ని పేజీలు చదివి తరువాత మానేశాను.  బాబా చేసిన అద్భుతాలు నమ్మదగినవిగా లేవనే కారణంతో కాక, నిరాశతో ఉన్ననాకు ఒక గురువు ఆవశ్యకత ఉన్న నాలాంటివాడికి అవి ఏవిధంగానూ ఉపయోగం కాదనే ఉద్దేశ్యంతో మానేశాను. కొన్ని నెలల తరువాత రాజసులోచనగారితో పరిచయం కలిగింది.   ఆమెకు బాబామీద సంపూర్ణ విశ్వాసం ఉంది.


  అయినాగాని యిప్పటికీ నాలాంటివానికి బాబా వల్ల ఉపయోగం ఉంటుందనే విషయం నామనసు ఒప్పుకోలేదు.  కానీ బాబా నామీద తన దయ చూపించదలచుకొన్నారు.  ఆకారణం చేతనే నాకు భరద్వాజగారిని కలుసుకొనే అదృష్టం కలిగింది.  పారాయణ వల్ల కలిగే లాభాలు గురించి, బాబా గురించి ఆయన ద్వారా విన్నాను.  ఆయన నన్ను శ్రీ సాయి సత్ చరిత్రను మూడు సార్లు చదివి బాబాకు పరీక్ష పెట్టమని చెప్పారు.  నేను ఆయన చెప్పినట్లే చేశాను.

జోషీమఠ్ శంకరాచార్య శ్రీ శాంతానంద సరస్వతి గారు ఢిల్లి విచ్చేస్తున్నారని తెలిసింది.  నేను ఆయనని చూడటానికి వెడుతూ బాబాని మనసులో యిలా కోరుకున్నాను "బాబా నువ్వు సాధు పుంగవులందరిలోను ఉన్నావని నిరూపించదలచుకొంటే (ఏకత్వం), నిష్ఠ, సబూరీలకు గుర్తుగా శాంతానందగారు నాకు రెండు పుష్పాలనివ్వాలి".  శాంతానందగారు చెప్పే ప్రవచనం శ్రధ్ధగా కూర్చొని వింటున్నాను.  ఆయన ప్రవచనం పూర్తయింది.  శాంతానందగారు నాకు ఏవిధంగా రెండు పుష్పాలనిస్తారో చూద్దామని ఆలోచిస్తూ నేనింకా వెళ్లకుండా అక్కడే ఉన్నాను.  ఆయనెక్కడో దూరంగా ఆసనంలో ఆశీనులయి ఉన్నారు.  ఆయన వద్దకు వెళ్ళే ధైర్యం లేదు నాకు.  ఇక విచారంతో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొన్నాను.  నేను వెళ్ళడానికి లేవగానే శాంతానందగారు తన శిష్యులలో ఒకరిని పిలచి అందరికీ ప్రసాదం యివ్వమని చెప్పారు.  అతను ఒక ఫలాన్ని తీశాడు.  నేను ఆఫలాన్ని తీసుకోవడానికి చేయి చాపగానే శాంతానందగారు రెండు ఫలాలనివ్వు అనడం వినపడింది. అందరికీ రెండేసి పళ్ళు యిస్తున్నారనుకొన్నాను.  కాని తరువాత విచారిస్తే నావెనుకనున్న అందరికీ ఒక్కటే యిచ్చారని చెప్పారు.  నాకు చాలా సంతోషం కలిగింది. కాని యిదంతా పూర్తిగా కాకతాళీయమని తోసిపుచ్చలేకపోయాను.  అందుచేత మరొక ప్రయత్నం చేద్దామనుకొన్నాను.  

నాలో నమ్మకం పెరిగేకొద్దీ, తరువాత  షిర్దీ వెళ్ళాలనుకొన్నాను.  ఆశ్చర్యకరంగా వెంటనే షిర్దీ దర్శించే భాగ్యం కలిగింది.  ద్వారకామాయిలోకి వెళ్ళి బాబా పటం ముందు కూర్చొని ఆయన మెడలో ఉన్న పూలదండలపై దృష్ట్టిపెట్టి ధ్యానం చేస్తున్నాను.  
                  
                        

ఆయన నన్ను స్వీకరిస్తే దానికి సూచనగా నాకు రెండు దండలు యివ్వాలని అడగడానికి నిర్ణయించుకున్నాను.  రెండుగంటలపాటు ధ్యానం చేశాను.   బాబా ఉన్న రోజులలో షిర్దీ ఎలాగ ఉండేదో, యిప్పుడు బాబా లేనప్పుడు షిర్దీ ఎలా ఉన్నదో, రెండిటికి మధ్య ఉన్న తేడాలను గురించి ధ్యానంలోనే ఆలోచిస్తూ ఉన్నాను. షిర్డీకి నా అంతట నేను వచ్చాను.  మరలా నా అంతట నేనే షిర్దీ నుంచి తిరిగి వెడుతున్నాను.  ఎవరైనా షిరిడీనుండి తిరిగి వెళ్ళేముందు బాబా వారికి అనుమతిచ్చి ఊదీనిచ్చి పంపేవారు.  మరి యిప్పుడు నాకు షిరిడీ విడిచి వెళ్ళడానికి అనుమతినిచ్చి, వెళ్ళేముందు ఊదీ ప్రసాదంగా యివ్వడానికి బాబా లేరు..  ఆరోజులలో బాబా నుండి స్వయంగా ప్రసాదం లభించిన వారిపై నాకు అసూయ కలిగింది, కారణం నేను సమర్పించిన వాటిని తిరిగి బాబా ప్రసాదంగా నాకు యిచ్చినా అది నిజమైన ప్రసాదం కాదనే భావన నాలో కలిగింది. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ధ్యానంలో అలా కూర్చిండిపోయాను.  ఆవిధంగా రెండు గంటలు గడిచిపోయాయి.  ఇక లేవబోయే సమయం దగ్గర పడుతున్నాగాని బాబావారినుంచి ఎటువంటి సూచన లభించలేదు.  ఇక నిరాశతో లేచాను.  నేను లేచిన వెంటనే ఒక వృధ్ధుడు లోపలికి వచ్చాడు. అతను మసీదులోనికి ప్రవేశించగానే అక్కడ ఉన్న ఒక నౌకరు ఆవృధ్ధుడు ఎవరో తెలుసా అని నన్ను అడిగాడు.  నాకు తెలియదని చెప్పాను.  అప్పుడతను ఆయన మహల్సాపతిగారి కుమారుడు అని చెప్పాడు.  అది వినగానే నాలో అశలు చిగురించాయి.  నేనాయన వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసి ప్రసాదం కోసం చేతులు చాచాను.  ఆయన ఏమీ యివ్వకుండా నన్ను మహల్సాపతిగారి కుటీరానికి రమ్మని చెప్పారు.  మొదట సందేహించినా, ఆఖరిగా నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆయనని అనుసరించాను. 
                        
మహల్సాపతిగారి కుటీరానికి వెళ్ళగానే, అడగకుండానే నాకాయన ప్రసాదం యిచ్చారు.  ఆయన చేతిలో పూలదండలు చాలా ఉన్నాయి.  అవన్నీ చిక్కులుపడిపోయి ఉన్నాయి.  వాటిని ఆయన వేటికవి విడివిడిగా తీయడం మొదలుపెట్టారు.  ఆయన వాటినుండి ఒక దండ వేరు చేశారు గాని దానిని నాకివ్వడానికి సందేహించారు.  దాని బదులుగా ఆయన నాకు చిక్కులు పడివున్న దండల గుత్తి యిచ్చారు.  వాటిని నేను తీసుకున్నాను.  నా హృదయం దడ దడ కొట్టుకుంటూ ఉంది.  వాటి వంక తేరిపార చూశాను.  ఆశ్చర్యం అవి రెండు దండలు.  నేనేమి కావాలని అడిగానో అవి నాకు లభించాయి.  నాకన్నులనుండి ఆనంద భాష్పాలు కారాయి.  మహల్సాపతిగారి కుమారుడు నన్ను కారణమడిగారు.  బాబాకు నేను పెట్టిన పరీక్ష గురించి చెప్పి, అది యిప్పుడు నిర్ధారణ అయిందని చెప్పాను.  బాబా మనం చేసే ప్రార్ధనలకి ఎల్లప్పుడు సమాధానాలిస్తారనే మాట వాస్తవం.  మహాసమాధికి  ముందు బాబా "నా ఎముకలు మాటలాడతాయి" అని చెప్పిన మాట వాస్తవం. 

ఇంకా అప్పుడే అయిపోలేదు. ఇక వెళ్లబోయేముందు  బాబా విగ్రహం పాదాల వద్ద దక్షిణ పెట్టాను.  ఇక నేను లేచేముందు మహల్సాపతి కుమారుడి వద్దనుండే పరిచారకుడు ఊదీ ఇవ్వమంటారా అని అడగగానే వెంటనే సందేహించకుండా యిమ్మని చెప్పాను.  అది బాబా ధునిలోని ఊదీ అని భావించాను.  అది నావద్ద చాలా ఉంది.  కాని, ఆ ఊదీ బాబా గారు జీవించి ఉన్న రోజులలోనిది.  ఆయన మహాసమాధి చెందినపుడు ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు ధునిలో ఉన్న ఊదీనంతటినీ సేకరించారు.  ఎవరయితే ఆఊదీ కావాలనుకుంటారో వారికి, ఎవరయితే అదృష్టవంతులో వారికి ఒక్కసారి పార్ధిస్తే చాలు వారికి లభిస్తుంది.  నాప్రార్ధనలను మన్నించారనడానికి సూచనగా నాకు శ్రీసాయిబాబా వారి నుంచి రెండు దండలు, ఊదీ ప్రసాదంగా లభించాయి.  నేనింకేమీ అడగగలను?  షిరిడీనుండి తిరిగి వెళ్ళడానికి అనుమతి యిచ్చినట్లుగా ఊదీ కూడా లబించింది.

అందుచేత నేను చెప్పదలచుకునేదేమిటంటే బాబా యిప్పటికీ ఉన్నారు.  వారు మనం చేసే ప్రార్ధనలని ఆలకించి వాటికి సమాధానాలను కూడా యిస్తున్నారు.

సాయిప్రభ
శాంతాసింగ్
నెల్లూర్ జిల్లా   

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List