Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, December 31, 2014

శ్రధ్ధ - సబూరి - చేసిన సహాయం

Posted by tyagaraju on 10:34 PM

   
    


01.01.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
నూతన సంవత్సర, మరియు ముక్కోటి ఏకాదశ శుభాకాంక్షలు

ఈ రోజు సాయి లీల ద్వైమాసపత్రిక జూలై-ఆగస్టు 2008 వ.సంచికలోని మరొక అద్భుతమైన సాయి లీల తెలుసుకొందాము.

శ్రధ్ధ - సబూరి - చేసిన సహాయం

భగవత్ గంగాధర్ సోన్ వానె (అంభుర్నికర్) (సోన్ గడ్ ఫోర్ట్ పోస్ట్, జనగాన్ రాం మందిర్ వద్ద, తాపి జిల్లా, గుజరాత్)

మాది గుజరాత్ లోని తాపి జిల్లా సోన్ గడ్ ప్రాంతం.  గత పది సంవత్సరాలుగా మేము ప్రతి గురుపూర్ణిమకి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొంటూ ఉంటాము.  ఒకసారి జూలై రెండవ తారీకున గురుపూర్ణిమ వచ్చింది.  మేమంతా జూలై 1వ.తేదీ రాత్రి బస్సులో షిరిడీకి బయలుదేరాము.  బస్సు ప్రయాణీకులతో బాగా క్రిక్కిరిసి వుంది.   

నేను, నాభార్య, మా అమ్మాయి ముగ్గురం బస్సులో ప్రయాణం చేస్తున్నాము.  మా అమ్మాయికి యిటీవలే వివాహమయింది.  అత్తవారిల్లు నాసిక్ లో ఉంది.  మొదటగా షిరిడీలో బాబా దర్శనం చేసుకొన్న తరువాత అమ్మాయిని అత్తవారింట్లో దిగబెడదామనుకున్నాము.  రాత్రిపూట ప్రయాణం కావడంతో మా అమ్మాయి తన విలువైన పట్టు చీరలు, నగలు అన్నింటినీ ఒక బ్యాగ్ లో సద్దుకొంది.  వాటివిలువ 75,000/- రూపాయలు.  బస్సులో కూర్చోవడానికి అస్సలు చోటు లేదు.  బాగ్ లన్నిటినీ నాకాళ్ళవద్దే ఉంచుకొని నిలబడిఉన్నాను.  తరువాత నా భార్యకు, అమ్మాయికి సీట్లుదొరకడంతో వాళ్ళు సీట్లలో కూర్చొన్నారు.  నేను మాత్రం నిలబడే ఉన్నాను.  బ్యాగ్ లన్నీ నాకాళ్ళవద్దే ఉన్నాయి.  తెల్లవారుజామున గం.3.30ని.కి బస్సు మన్మాడ్ చేరుకొంది.  నాకప్పుడు సీటు దొరికింది.  సీటులో కూర్చున్న వెంటనే బాగా నిద్ర పట్టేసింది. 

గంట తరువాత బస్సు ఏవలా చేరుకొంది.  ఏవలాలో నలుగురైదుగురు దిగిపోయారు.  వాళ్ళు కూడా తమ మూడు బ్యాగ్ లని బస్సులో నా కాళ్ళదగ్గిరే క్రింద పెట్టారు.  పొరబాటున వాళ్ళు తమతో మా అమ్మాయి బాగ్ కూడా తీసుకొని దిగిపోయారు.  నేను గాఢ నిద్రలో ఉండటంవల్ల ఈవిషయం గమనించలేదు.  కొంతసేపటి తరువాత బాబా నాకలలో కనిపించి " బాబూ నువ్వు నిద్రపోతున్నావు.  మీ అమ్మాయి బ్యాగ్ ని కూడా ఇంతకుముందు దిగినవారు తమ బ్యాగ్ లతో దింపుకొని వెళ్ళిపోయారు" అన్నారు.  ఉలిక్కిపడి వెంటనే లేచి మా అమ్మాయి బ్యాగ్ కోసం చూశాను.  బస్సంతా చీకటిగా ఉంది. లైట్లు లేవు.  నాకేమీ కనపడలేదు.  బస్సు కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత కోపర్ గావ్ వచ్చింది.  డ్రైవరు లైట్లు వేశాడు.  మా అమ్మాయి బ్యాగ్ లేదు.  నాకసలె బీ.పీ. ఉండటంతో వళ్ళంతా చెమటలు పట్టింది.  నోట మాటరాలేదు.  అందరూ యిక ఆబ్యాగ్ దొరకదని చెప్పారు.  కాని నాకు బాబా మీద పూర్తి నమ్మకం ఉంది.  వెంటనే కోపర్ గావ్ లో దిగిపోయి ఏవలా వెళ్ళే బస్సు ఎక్కాము.  బస్సులో కూర్చొని ఏవలా చేరుకునేంతవరకూ 'ఓం శ్రీసాయినాధాయనమహ '  అని కళ్ళు మూసుకొని మనసులో జపించుకుంటూనే వున్నాను.  కొద్దిసేపటి తరువాత బాబా "అబ్బాయీ, భయపడకు.  నీకు నీ బ్యాగ్ దొరుకుతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు.

బస్సు ఏవలా చేరుకునేటప్పటికి తెల్లవారింది.  అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లనందరినీ తెల్లవారు జామున బస్సునుండి దిగిన నలుగురైదుగురు ప్రయాణీకుల గురించి వాకబు చేశాను.  వారిలో ఒకతను రాత్రిపూట ఉండే ఆటో డ్రైవరును అడిగితే విషయం తెలియవచ్చని చెప్పి అతనిని పిలిచాడు.  తాను వారిని 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేవడగాన్ గ్రామానికి తీసుకొని వెళ్ళినట్లుగా చెప్పాడు.  మమ్మల్ని కూడా వారిని దింపిన చోటకు తీసుకొని వెళ్ళమన్నాము.  ఆటో డ్రైవరు మమ్మల్ని వారి యింటికి తీసుకొని వెళ్ళాడు.  ఆటో హారన్ శబ్దం విని యింటిలోని వారు బయటకు వచ్చారు.  మేమింకా ఏమీ అడగకుండానె, పొరబాటున బ్యాగ్ తెచ్చేశామని చెప్పారు.  అందులో చాలా విలువయిన వస్తువులు ఉన్నాయని చెప్పాము.  మా అమ్మాయితో అన్నీ సరిగా ఉన్నాయో లేదో పరీక్షించి చూసుకొమని చెప్పారు.  అందులో అన్నీ సరిగా ఉన్నాయి.  తమ వల్ల జరిగిన పొరపాటుకు క్షమించమని మాకు టీ ఇచ్చి ఆతిధ్యమిచ్చారు.

తరువాత మేము షిరిడీ చేరుకొన్నాము.  బాబా దయవల్ల మాబ్యాగ్ మాకు దొరికింది.  బాబా చెప్పిన శ్రధ్ధ, సబూరీ మాటలు మామదిలో మెదిలాయి.  

నమ్మకం, సహనం ఉన్నవారిని శ్రీహరి రక్షిస్తాడు.
                   ఓవీ.83 అ. 26 శ్రీసాయి సత్ చరిత్ర

కష్టంలో పడ్డ మమ్మల్ని బాబా రక్షించారు.  బాబాకి కృతజ్ఞతా పూర్వకంగా పదకొండు నెలలపాటు ప్రతి పౌర్ణమికి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొన్నాము.  వెళ్ళిన ప్రతిసారి ఎటువంటి కష్టం లేకుండా బాబాను దర్శించుకొన్నాము.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List