29.12.2014 సోమవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిలీల ద్వైమాసపతిక మే-జూన్ 2008వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అద్భుతమైన లీల తెలుసుకొందాము.
బాబా తనభక్తుల మరణాన్ని కూడా తప్పించగలరు
గౌ.వాసుదేవ్ సీతారాం రతన్ జన్ కర్, హైదరాబాద్ రెసిడెన్సీ. యింటి.నం. 163.
సాయి గురించి ఆయన లీలల గురించి మొట్టమొదటగా నేను కుశాభావూ (వేదశాస్త్ర సంపన్న కృష్ణనాధ్ భువమిరాజ్ గామోంకర్ జోషి) గారి ద్వారా 1908వ.సంవత్సరంలో విన్నాను. భక్తులందరూ ఆయనను పూజకు పిలిచి సత్కరిస్తూ ఉండేవారు. గ్రామంలో ఈవిధంగా చాలా రోజులు పూజలు జరిగాయి. ఒకసారి వేదశాస్త్ర సంపన్న సీతారాం ఖాట్ జీ ఘాటేగారి ఇంటిలో పూజ జరిగింది. ఆయన మా మేనమామ. పూజ జరుగుతున్నపుడు నేను కూడా అక్కడే ఉన్నాను. సాయి కధలు వింటున్నప్పుడు నాకు సాయి ( అనగా బాబా భక్తుడు) మాయింటికి వచ్చి మాయింటిలో కూడా పూజ చేస్తే బాగుండుననిపించింది. అప్పుడే మహరాజ్ "రేపు నేను మీయింటికి వస్తున్నాను" అన్నారు. పూజకు కావలసిన ఏర్పాట్లు ఏమేమి చేయాలో వాటిగురించి ఆలోచించుకుంటూ సంతోషంగా యింటికి వెళ్ళి అందరికీ విషయం చేప్పాను.
తెల్లవారుఝామున మా అమ్మగారయిన గంగాబాయికి ఒక యోగి కాషాయ వస్త్రాలు ధరించి తిన్నగా మాయింటిలోకి వస్తున్నట్లుగా కలలో కనిపించారు. మా అమ్మగారు ఆయనకి కూర్చోవడానికి ఆసనం చూపించారు. కాని ఆయన ఆప్రదేశం లో నుంచునే ఉన్నారు. మా అమ్మగారు ఆయన పాదాలకు తన శిరస్సును తాకించారు. కల కరిగిపోయి మెలకువ వచ్చింది. ఆమె అందరికీ తన స్వప్న వృత్తాంతం చెప్పింది. కాని ఎవరూ కుడా ఆమె చెప్పినదానికి అంతగా ప్రాధాన్యం యివ్వలేదు.
అదే రోజు నేను మళ్ళీ మామేనమామగారి యింటిలో జరుగుతున్న పూజ చూడటానికి వెళ్ళాను. తీర్ధప్రసాదాలను పంచుతూ, మహరాజ్ నాకు సాయి ఫొటోనిచ్చారు. దానిని పూజలో పెట్టుకొని ప్రతిరోజూ పూజించమని చెప్పారు. నేను ఫొటోని యింటికి తీసుకొని వచ్చి అందరికీ చూపించిన తరువాత, మా అమ్మగారికి వచ్చిన కల ప్రాధాన్యత ఏమిటో అప్పుడు అందరూ గ్రహించారు.
నేను మహరాజ్ గారిని (శ్రీ కృష్ణానంత్ మహరాజ్) మాయింటికి భోజనానికి పిలిచి మాయింటిలో పూజ చేయమని ఆహ్వానించాను. ఈవిధంగా నాకు సాయిబాబా గురించి తెలిసింది.
అందరూ సాయి గురించి తమ అనుభవాలను వివరించి చెపుతున్నపుడు, వింటూ ఉండేవాడిని. అప్పుడు నాకు కూడా సాయి దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందాలనిపించింది. కాని 2,3 సంవత్సరాల తరువాత 1912 వ.సంవత్సరంలో బాబా దర్శనం కలిగింది. బ్రిటిష్ చక్రవర్తి బొంబాయి వస్తున్నారని తెలిసి ఆయనను చూడటానికి బొంబాయికి ప్రయాణం పెట్టుకొన్నాను. కాని ఒకరోజు ఉదయాన్నే శ్రీశివదాస్ ధాటేగారు షిరిడీ వెళ్ళడానికి టిక్కెట్ యిచ్చారు. అది నాకు సాయి పంపించిన ఆహ్వానంగా భావించి, బొంబాయి ప్రయాణాన్ని రద్దు చేసుకొని అదే రోజు సాయంత్రం షిరిడీకి ప్రయాణమయ్యాను. అక్కడ నాకెన్నో అనుభవాలు, సంకేతాలు అనుభవమయ్యాయి. బాబా మీద కొన్ని పద్యాలను ఒక 'పద్యమాల ' గా వ్రాశాను.
బాబా చూపిన అధ్బుతాలలో స్వర్గీయ శ్రీమతి మాలన్ బాయ్ కి సంబంధించినదే ఉదాహరణ. అది అత్యద్భుతం. మాలన్ బాయ్ మా పిన్ని కూతురు. ఆమె స్వర్గీయ శ్రీదామోదర్ రంగనాధ్ జోషి దెగోన్ కర్ గారి కుమార్తె. చాలా రోజులనుండి ఆమె జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆఖరికి అది క్షయవ్యాధని తేలింది. ఎందరో వైద్యులకి చూపించి ఎన్నో మందులు వాడాము. కాని ఎటువంటి గుణం కనపడలేదు. ఆఖరికి మేము మందులతోపాటుగా బాబా ఊదీని యివ్వడం మొదలు పెట్టాము.
క్షయవ్యాధి తో బాధపడలేక మాలన్ బాయి తనని బాబా దగ్గరకు తీసుకొని వెళ్లమని, ఆయనే తన వ్యాధిని నయం చేయగలరని అంటూ ఉండేది. కాని ఆమెకి కూర్చోవడానికే శక్తి లేకుండా చాలా బలహీనంగా తయారయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయించడం కూడా చాలా ప్రమాదకరం. ఆమె పరిస్థితి చూసి జాలిపడి వైద్యులు కూడా ఆమె షిరిడీ వెళ్ళడానికి ఒప్పుకొన్నారు. దానివల్ల ఆమెకి మానసికంగా కూడా కాస్త ఉపశమనంగా ఉంటుందని భావించారు. ఇద్దరు ముగ్గురు ఆమెకి తోడుగా షిరిడీ వచ్చారు.
బాబా ఆమెని చూడగానే దుర్భాషలాడసాగారు "ఆమెని కంబళీ మీద పడుకోబెట్టండి. త్రాగడానికికుండలోని నీటిని మాత్రమే యివ్వండి" అన్నారు బాబా. ఆమె ఆవిధంగా 7,8 రోజులపాటు మంచినీరు మాత్రమే త్రాగుతూ, బాబా మాత్రమే తన రోగాన్ని నయం చేస్తారనే నమ్మకంతో అలా పడుకొనే ఉంది.
7,8 రోజుల తరువాత నిద్రనుండి లేచే సమయందాటినా కూడా బాబా యింకా నిద్రనుండి లేవలేదు. కాకడ హారతికి వచ్చిన వారంతా బాబా యింతవరకూ లేవకపోవడమేమిటని ఆశ్చర్యపడుతూ ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇక్కడేమో మాలన్ బాయి మరణించింది. బంధువులు ఆమె అంత్యక్రియలకి ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ఆమె తల్లి (మా పిన్ని) నేను విచారంగా మాలన్ బాయి ప్రక్కనే కూర్చొని ఉన్నాము. సాఠేకాకా (సాయి భక్తుడు) ఓదార్చసాగాడు. హఠాత్తుగా మాలన్ బాయిలో కదలిక వచ్చింది. ఆవలిస్తూ కళ్ళు తెరచి చూసింది. ఆమె భయపడుతున్నట్లుగా చుట్టూ చూసింది. అక్కడ చుట్టూ ఉన్నవారందరిలోను ఆనందం వెల్లివిరిసింది. ఆమె చేప్పేదంతా శ్రధ్ధగా ఆలకించసాగారు. "నల్లగా ఉన్న ఒకమనిషి నన్ను తనతో తీసుకొని వెడుతున్నాడు. అప్పుడు నేను భయంతో బాబాని సహాయం చేయమని ఏడిచాను. అప్పుడు బాబా వచ్చి ఆ మనిషిని తన సటకాతో కొట్టారు. అతని పట్టునుంచి నన్ను రక్షించి చావడిలోకి తీసుకొని వెళ్ళారు" అని వివరంగా చెప్పింది. చావడి ఎలా ఉంటుందో వర్ణించి చెప్పింది. విచిత్రమేమిటంటే ఆమె యింతకుముందు ఎప్పుడూ చావడి చూసి ఉండలేదు.
ఇక్కడ చావడిలో బాబా యింతవరకూ లేవకపోవడమేమిటని అక్కడున్నవారందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా బాబా లేచి సటకాతో కొడుతూ దీక్షిత్ వాడాలో పడుకున్న అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. భక్తులందరూ ఆయన వెనకే పరుగెత్తుకుంటూ వెళ్ళారు. వారికి అమ్మాయి విచిత్రంగా తిరిగి బ్రతికిందని బాబాతో చెప్పడానికి వస్తున్నవారు ఎదురయారు. ఆవిధంగా బాబా తన భక్తులను మరణాన్నించి కూడా తప్పిస్తారన్నదానికి యిదే ఋజువు. ఇంకాచాలా అనుభవాలున్నాయి. కాని స్థలాభావం వల్ల వివరించలేకపోతున్నాను.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment