శ్రీసాయి రామచరిత్ర - 7
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆంగ్లమూలం : ఆర్థర్ ఆస్ బోర్న్
తెలుగు అనువాదం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
సంకలనం: ఆత్రేయపురపు త్యాగరాజు
ఆధ్యాత్మిక రంగములో ప్రావీణ్యత ఉపదేశము వల్ల రాదు. అది గురువునుండి శిష్యునికి శక్తిరూపంలో ప్రసాదింపబడుతుంది. గురుశిష్యుల సంబంధము లేకుండా ఆధ్యాత్మిక రంగములో ప్రావీణ్యత సంపాదించినవారు ఒక్కరే ఒక్కరు. వారు భగవాన్ రమణమహర్షి. ఆధ్యాత్మిక రంగములో గురువు స్థానము పొందనివాడు కూడా రాణించుతాడు, కాని యితరుల బరువుబాధ్యతలను స్వీకరించి వారిని సరిఐన మార్గములో నడిపించలేడు. శ్రీసాయి మరియు భగవాన్ రమణమహర్షి ఏనాడు ఎవరికీ ఉపదేశము చేయకపోయినా తమ భక్తుల బరువుబాధ్యతలను స్వీకరించి అజ్ఞాత శక్తితో వారికి ఉపదేశము యిచ్చినారనే భ్రాంతి కలిగించారు. శ్రీసాయి తన భక్తుల బరువుబాధ్యతలను స్వీకరించి తన భక్తుల మనసులో తిరుగులేని నమ్మకాన్ని సృష్ఠించారు.
ఆయన తరచుగా ఇలా అంటూ ఉండేవారు " నేను నావాడిని నానుండి దూరముగా వెళ్ళనివ్వను" ఇదే విధముగా భగవాన్ రమణమహర్షి యిలా అనేవారు, "పులినోట బడిన జంతువుకు బయటపడటం ఎలాగ సాధ్యముకాదో, గురువు కటాక్షముపొందిన భక్తుని గురువు ఎన్నడూ వదలడు." శ్రీసాయిబాబా ఇలా అనేవారు "నీవు ప్రశాంతముగా ఉండు. అన్ని విషయాలు నేను చూసుకుంటాను." శ్రీరమణమహర్షి కూడా యిదే విధముగా అన్నారు. తేడా మాత్రము శ్రీసాయి "నేను" అనే పదము వాడేవారు. శ్రీరమణమహర్షి "భగవంతుడు" అనే పదము వాడేవారు.
శ్రీసాయిబాబా కొన్ని సందర్భాలలో ఇలా అనేవారు "నీవు ఎక్కడ ఉన్నా నన్ను తలచుకో, నేను నీతోనే ఉంటాను. తిరిగి అదే అభయాన్ని ఇచ్చే మాటలు.
ఆవిధంగా శ్రీసాయిబాబా తన భక్తుల మనసులో తిరుగులేని నమ్మకాన్ని కలిగించారు. అనేకమంది తమ మనసులలో శ్రీసాయి ఆధ్యాత్మికభావాలను మొలకెత్తించారు అని ధృవీకరించారు. శ్రీసాయి తన భక్తులకోసం శ్రమించేవారు. వారు స్వయంగా తమ హస్తాన్ని భక్తుల శిరస్సుపై ఉంచి ఆశీర్వదించేవారు. శ్రీసాయి తమ భక్తుల శిరస్సుపై తన చేతిని ఉంచి ఆశీర్వదించేటప్పుడు, భక్తుల మనసులో నూతన తరంగాలు, శక్తులు ప్రవేశించేవి. ఒక్కొక్కసారి ఆయన తమ శిరస్సుపై చేతిని ఉంచి ఆశీర్వదించేటప్పుడు విపరీతమైన బరువు తమ శిరస్సుపై ఉంచిన అనుభూతిని భక్తులు పొందేవారు. కొన్ని సార్లు మృదువుగా తల నిమిరిన అనుభూతిని పొందేవారు. ఇటువంటి అనుభూతులు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క విధంగా ఉండి ఆభక్తుని ఆధ్యాత్మికముగా వృధ్ధి చెందటానికి ఉపయోగపడేది.
శ్రీసాయి తన భక్తులకు, భగవంతునిపై భక్తి, విశ్వాసము గురువుద్వారా పొందాలని సూచించి ఆమార్గములో నడిపించేవారు.
శ్రీ జీ.జీ.నార్కే (ప్రిన్సిపాల్ దక్కన్ ఇంజనీరింగ్ కాలేజీ - పూనా) సంక్షిప్తంగా ఈవిధంగా తెలియచేశారు. భగవంతుని యందు వినయవిధేయత, సేవ, ప్రేమించటము, భక్తి మార్గానికి ముఖ్య సూత్రాలు. శ్రీసాయి చెప్పిన మాటలు, చేసి చూపిన చేష్ఠలు గురువుని భగవంతునితో సమానముగా చూడాలి అని తెలియపర్చుతుంది. భగవంతుని గురువు రూపంలో చూడటము గురువుని భగవంతుని రూపములో చూడటము ఒక్కటే కదా. ఆకారణము చేతనే గురువుని భక్తి మార్గములోనే పూజించాలి.
ఈ పధ్ధతి అనాది అయినది, శాస్త్రబధ్ధమైనది. ఇక్కడ శ్రీరమణమహర్షి చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొందాము. "నీవు - గురువు - భగవంతుడు వేరువేరు కాదు. అందరు ఒక్కరే. శ్రీరమణమహర్షి ఈవిషయముపై కొంచము విపులంగా ఈ విధంగా అన్నారు. బాహ్యప్రపంచంలోని గురువు నీమనసులో దాగియున్న గురువుని మేల్కొలుపుతాడు".
(ఇంతటితో శ్రీసాయిరామ చరిత్రలోని మధురఘట్టాలు సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment