12.12.2015 శనివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీలోని మరికొన్ని విషయాలు తెలుసుకుందాము.
శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ - 11
20.12.1911 బుధవారం
ఈ రోజు తొందరగా
నిద్ర లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. ఆరతి పూర్తవుతుండగా అక్కడ వామనరావుని చూసి ఆశ్చర్యపోయాను. దారిలో వామనరావు, కోపర్ గావ్ వద్ద బండిని ఆపించి,
బండి తోలేవాడిని జామకాయలు కొని తెమ్మని పంపించాడని, ఎద్దులు పారిపోయాయని తెలిసింది. వాటిని వెదకటానికి వెడితే పోలీసులు పట్టుకున్నారుట . చాలా కష్టాలు పడ్డాడు. అతను చెప్పిన కధ చాలా నవ్వు పుట్టించింది.
సాయి మహరాజ్ “అల్లా మాలిక్” అని ఇంకేమీ మాట్లాడకుండా
చావడి నుండి వెళ్ళిపోయారు. నేను బసకు తిరిగి
వచ్చి ప్రార్ధన చేసుకున్నాను. సాయి మహరాజ్
బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి మసీదుకు వచ్చేటప్పుడు ఆయన దర్శనం చేసుకున్నాను. ఆయన చాలా ఉల్లాసంగా ఉన్నారు. రాత్రి సాయిమహరాజ్ వచ్చి, తన కోరిక నెరవేర్చారని
దర్వేష్ సాహెబ్ చెప్పాడు. నేను ఈ విషయాన్ని
సాయి మహరాజ్ తో చెబితే ఆయన ఏమీ మాట్లాడలేదు. ఈ రోజు నేను సాయిమహరాజ్ కాళ్ళకు మర్ధనా చేశాను. ఆయన కాళ్ళు అద్భుతంగా ఎంతో మృదువుగా ఉన్నాయి. మా భోజనం కాస్త ఆలస్యమయింది. తరువాత నేను ఈ రోజు
వచ్చిన పేపర్లన్నీ చదువుతూ కూర్చున్నాను. మిస్.కాంప్
బెల్, మిస్. విల్లీస్ నుండి ఉత్తరాలు వచ్చాయి.
సాయంత్రమవుతుండగా మసీదుకు వెళ్ళి సాయి మహరాజ్ ఆశీస్సులు పొందాను. చావడి ముందు ఆయనకు నమస్కరించి బసకు తిరిగి వచ్చాను. భీష్మ భజనకు వెళ్ళాము. అక్కడికి రామ మారుతి బువా కూడా వచ్చాడు. దీక్షిత్ రామాయణం చదివాడు.
21.12.1911 గురువారం
ఈ రోజు పెందరాడే
నిద్ర లేచాను. ప్రార్ధన చేసుకున్న తరువాత దర్వేష్
సాహెబ్ తో మాట్లాడుతూ కూర్చున్నాను. ముగ్గురు
ఆడపిల్లలు ఒక అంధురాలు వచ్చి తన తలుపు తడుతున్నట్లుగా ఒక దృశ్యం కనపడినట్లు చెప్పాడు. అతను వారిని మీరెవరని అడగగా తమను తాము సంతోష పెట్టుకోవడానికి
వచ్చామని చెప్పారు. వారు అతనిని తన్ని, ఇబ్బంది
పెట్టడంతో బయటకు పొమ్మని ఆజ్ఞాపించి ప్రార్ధన ప్రారంభించాడు. ప్రార్ధన వింటూనే ఆ అమ్మాయిలు, ఆ ముసలి స్గ్త్రీ పరిగెత్తుకుంటూ
వెళ్ళిపోయారు. అతను అక్కడ గదిలో ఉన్నవారినందరినీ,
ఇంటిలో ఉన్న గ్రామంలోని వారినందరినీ ఆశీర్వదించారు. అతను ఈ విషయం గురించి సాయి సాహెబ్ ని అడగమన్నాడు. సాయి మహరాజ్ మసీదుకు తిరిగి వచ్చాక ఆయనను దర్శించుకోవటానికి
వెళ్ళాను. నేను కూర్చోబోతుండగానే సాయిసాహెబ్ కధ ప్రారంభించారు. క్రితం రోజు రాత్రి తన గుప్తావయవాల మీద, చేతుల మీద
ఏదో కరచిందనీ, నూనె రాసుకుని, బయటకు బహిర్భూమికి వెళ్ళి వచ్చి, ధుని ముందు కూర్చున్న తరవాత మెరుగయిందని చెప్పారు. ఆయన కాళ్ళకు మర్దనా
చేసి తిరిగి వచ్చాక ఈ కధని దర్వేష్ సాహెబ్ కి చెప్పాను. సమాధానం స్పష్టంగా తెలిసింది. మధ్యాహ్న ఆరతి తరువాత
భావార్ధ రామాయణం చదువుతూ కూర్చున్నాను. తరువాత
మరలా శేజ్ ఆరతి అయిన తరువాత చావడి వద్ద సాయి మహరాజ్ ను దర్శించుకున్నాను. తరువాత భీష్మ భజన, రామ్ మారుతి బువా అభినయాలు జరిగాయి. ఆ తరువాత భీష్మ రామాయణం చదివాడు.
22.12.1911 శుక్రవారం
కాకడ ఆరతికి
వెడదామని తొందరగా లేచాను. కాని మాధవరావు అన్న
ఒక మాటతో వెళ్ళకుండా ఆగిపోయాను. కాని తరువాత
మాధవరావే స్వయంగా వెడుతుండటంతో నేను అతని కూడా వెళ్ళాను. సాయి మహరాజ్ ప్రత్యేకించి చాలా ఉత్సాహంగా కన్పించారు. కానీ ఏమీ మాట్లాడకుండా తిరిగి మసీదుకు వచ్చేటప్పుడు
మేమందరం ఆయనకు నమస్కరించాము.
షింగ్లే, దర్వేష్ సాహెబ్ ఈరోజు వెడదామని ప్రయత్నం చేశారు కాని సాయిమహరాజ్ వారికి సరయిన అనుమతినివ్వలేదు.
దర్వేష్ సాహెబ్
కి జ్వరం వచ్చింది. డా.హాటే ఆయనకు వైద్యం చేశాడు. టిప్నిస్ తన భార్యతో ఇక్కడ ఉంటున్నాడని ఇంతకు ముందు
చెప్పాననుకుంటాను. ఆమెకు సుస్తీ చేసింది. డా.హాటే తను చేయగలిగినంతగా ఆమెకు వైద్యం చేస్తున్నాడు. రామ్ మారుతి మహరాజ్ కూడా ఆమెకోసం ఇక్కడే ఉన్నాడు. సాయంత్రం ఆమెకు మూర్చ వచ్చింది. చివరికది ఆమెను ఏదో ఆవేశించినట్లు తేలింది.
దీక్షిత్ , మాధవరావు
దేశ్ పాండే ఇంకా మరికొందరు ఆమెను చూడటానికి వెళ్ళారు. ఆమె ఇంతకు ముందు నివసించిన ఇంటి యజమాని, ఇద్దరు
మహార్లు, దయ్యాలయి ఆమెను ఆవహించారు. యజమాని
ఆమెను తాను చంపేసి ఉండేవాడిననీ కాని సాయిబాబా అలా చేయవద్దని తనను ఆజ్ఞాపించారని చెప్పాడు. సాయిబాబా మహర్లను కూడా దూరంగా ఉంచారు. టిప్నిస్ తన భార్యను వాడాలోకి తీసుకువెడతానని బెదిరించాడు. ఆ దెయ్యాలు అలా చేయవద్దని అతనిని బ్రతిమిలాడాయి. అలా చేస్తే సాయిబాబా తమను కొడతారని అన్నాయి. యధాప్రకారంగా భీష్మ భజన జరిగింది. ఆ తరువాత అర్ధరాత్రికి కాస్త ముందుగా దీక్షిత్ రామాయణం
పూర్తయింది.
(మరికొన్ని విశేషాలు తరువాత సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment