31.05.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
హనుమత్ జయంతి శుభాకాంక్షలు
రేపు విశాఖపట్నం వెడుతున్నందు వల్ల 10 రోజులపాటు ప్రచురించడానికి కుదరకపోవచ్చు. వీలును బట్టి శ్రీసాయి పుష్పగిరి ప్రచురిస్తాను.
శ్రీ షిరిడీ సాయి వైభవమ్
బాబా ఊదీ మహాత్మ్యం – నాడు , నేడు
ఈ రోజు శ్రీషిరిడీ సాయి వైభవంలో మరొక అద్భుతమైన ఊదీ మహత్యం తెలుసుకుందాము.
జనార్ధన్ ఎమ్.ఫాన్సే అనబడే హరిభావూ ఎమ్.ఫాన్సే ఆదాయం అంతంత మాత్రమే. తన తల్లి బరువు బాధ్యతలు కూడా ఆయనే చూసుకోవాలి. తన సమస్య తీర్చలేని విధంగా అసాధ్యమని తేల్చుకొని అన్నిటినీ వదలి వెళ్ళిపోదామనుకున్నాడు.
తన నిర్ణయాన్ని తల్లికి చెప్పి రామేశ్వరం వెడతానని చెప్పాడు. దారిలోనే షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. రామేశ్వరం ప్రయాణం ప్రారంభించి దారిలో షిరిడీ చేసుకున్నాడు. ద్వారకామాయిలోకి అడుగుపెట్టి బాబాను చూడగానే ఎంతో ఆనందాన్ని పొందాడు. అతని తల్లి అతనికోసం ఉపవాసాలు చేస్తూ శుష్కించి పోయిందని, అతని కోసం పరితపిస్తోందనీ, చనిపోవచ్చనీ చెప్పారు బాబా. అతనిని వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపొమ్మని చెప్పారు. అతను వెళ్ళేటప్పుడు బాబా అతనికి కొంత ఊదీనిచ్చి పంపించారు.
దానిని భద్రంగా దాచుకొని ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. ఇంటికి వెళ్ళగానే తల్లికి బాబా చెప్పినదంతా వివరంగా చెప్పాడు. ఆమెకు బాబావారి దైవశక్తి మీద ఎంతో నమ్మకం కలిగింది. ఇలా ఉండగా ఒక గ్రామస్తుడు కలరా వ్యాధితో బాధ పడుతూ ఫాన్సే సహాయం కోసం వచ్చాడు. ఫాన్సే అతనికి కొంత ఊదీని ఇచ్చాడు. ఆ ఉదీ మహత్యం వల్ల అతని వ్యాధి నయమయింది. ఈ సంఘటనతో గ్రామస్థులందరూ ఫాన్సే వైద్యుడని భావించి వైద్యం కోసం అతని దగ్గరకు రావడం ప్రారంభించారు. తొందరలోనే అతని దగ్గరున్న ఊదీ అయిపోయింది. ఆ తరువాత ఏమి చేయాలో అర్ధం కాలేదు. కాని ఊరిలో కలరా వ్యాధి లేకుండా పూర్తిగా నివారింపబడింది.
ఒక రోజు యధాలాపంగా అతను మరొక గ్రామంలో ఉన్న ఒక మార్వాడీని కలుసుకోవడం తటస్థించింది. ఆ మార్వాడీ తన సోదరుని దుస్థితి గురించి చెబుతూ ఇలా అన్నాడు “నా సోదరునికి చాలా జబ్బుగా ఉంది. ఎంతో మంది వైద్యులు వైద్యం చేసినా ఏమీ ఫలితం కనపడలేదు. మీరు సాయి భక్తులు కాబట్టి మీరు వచ్చి నా సోదరుణ్ణి చూడాలి. మీ సాయిబాబాయే కనక నిజంగా దేవుడయితే నా సోదరుని జబ్బు మీద్వారా నయం చేస్తారు.” హరిభావూ అతని సోదరుని స్థితిని ఒక్కసారి చూసాడు. అతని స్థితిని చూడగానే చాలా భయం వేసింది. ఆ వెంటనే ఫాన్సే తను ఫీజు చాలా ఎక్కువగా తీసుకుంటాననీ రెండు వందల రూపాయలు ఇమ్మని చెప్పాడు. అంత పెద్ద మొత్తం మార్వాడీ ఎలాగూ ఇవ్వలేడు కాబట్టి వద్దని అంటాడనే ఉద్దేశ్యంతో ఆ విధంగా చెప్పాడు. అతను చెప్పిన ఫీజు కూడా ఏ సివిల్ సర్జన్ చెప్పనంత ఎక్కువగా చెప్పాడు. కాని ఆ మార్వాడీ అతను చెప్పిన ఫీజు ఇవ్వడానికి ఒప్పుకొన్నాడు. ఇక తప్పించుకోవడానికి వీలులేని అయోమయ పరిస్థితిలో పడ్డాడు. ఆ గ్రామంనుండి ఏదో విధంగా తప్పించుకొని వెళ్ళిపోదామనుకొన్నాడు కాని అది రాత్రి సమయం వల్ల సాధ్యం కాని పరిస్థితి. సమస్యనుండి బయటకు రాలేని స్థితిలో ఇరుక్కొన్నాడు. అతని అలవాటు ప్రకారం బాబా గారి ప్రార్ధనకి, భజనకి ఆ ఇంటిలో అన్ని ఏర్పాట్లు చేసాడు.
జబ్బుతో నున్న మార్వాడీ సోదరుడు మొత్తం పనంతా తనే స్వయంగా చేసాడు. కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యపోయారు. భజన జరుగుతున్నంత సేపు జబ్బుగా ఉన్నతను బాబా ఫొటోనే ప్రేమతో దీక్షగా ఎంతో ఏకాగ్రతతో చూస్తూ కూర్చొన్నాడు. అది చూసిన మార్వాడీకి ఎంతో సంతోషం కలిగి “జబ్బుతో ఉన్న నా సోదరుని జీవన్మరణ సమస్య భారమంతా నీ మీదే ఉంది. నువ్వు మాత్రమే నా సోదరుని జబ్బును నయం చేయగలవు” అన్నాడు. అతని మాటలకు హరిభావూ పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. ఏమి చేయాలో పాలుపోలేదు.
బాబా కరుణాసముద్రుడు. అందుచేతనే బాబా హరిభావూ కలలో దర్శనమిచ్చి, అసలు అతనికి వచ్చిన జబ్బు , దానికి ఏమందు ఎలా వాడాలో అన్నీ వివరంగా చెప్పారు. హరిభావూ బాబా చెప్పినట్లే చేయడంతో రోగి కోలుకొన్నాడు.
అన్నమాట ప్రకారం మార్వాడీ హరిభావూకి రెండువందల రూపాయలు ఫీజు ఇచ్చాడు. కాని హరిభావూ ఫీజు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. “ఇదంతా నా గురువు దయ వల్లనే జరిగింది. ఇందులో నేను చేసినదేమీ లేదు. నాకు ఫీజు ఇవ్వద్దు” అన్నాడు. మార్వాడి బాగా నిరాశ చెంది, ఆ డబ్బుతో ఒక శాలువా కొని హరిభావూ ఇంటిలో లేని సమయంలో, అతని ఇంటిలో ఇచ్చి వెళ్ళిపోయాడు. హరిభావూ ఇంటికి వచ్చి మార్వాడీ ఇచ్చిన శాలువా చూశాడు. ఎలాగయినా ఆ శాలువాను బాబాకే ఇచ్చేద్దామనుకొన్నాడు. కాని అప్పటికే బాబా మహాసమాధి చెందారు. కన్నీళ్లతో బాబాని ప్రార్ధించాడు. ఆ రోజు రాత్రి బాబా అతని కలలో కనిపించి
“చుట్టుప్రక్కలంతా అంటువ్యాధులు ప్రబలి ఉన్నాయి. ఆ శాలువాను అమ్మి, వచ్చిన డబ్బుతో బియ్యం కొను. ప్రస్తుతం బియ్యం అయిపోయేంతవరకు కొన్న ధర కన్నా తక్కువకు అమ్ము. ఆ తరువాత మరలా బియ్యం కొని లాభానికి అమ్ము. నీ జీవితం సుఖంగా సాగుతుంది” అని చెప్పారు. హరిభావూ బాబా చెప్పినట్లే చేసి ఎంతో అభివృధ్ధిలోకి వచ్చాడు. తన తల్లిని సుఖపెట్టాడు.
ఈ లీల ద్వారా మనకు బాబా ఊదీ ఎంత శక్తివంతమయినదో అర్ధమవుతుంది.
శ్రీ సాయి సత్ చరిత్ర 33, 34 అధ్యాయాలలో ఊదీ మహిమ గురించి ప్రస్తావించబడింది.
బాంద్రాలో ఉన్న ఒక బాబా భక్తునికి, వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు తో బాధ పడుతోందని తెలిసింది. తన వద్ద ఊదీ లేదని, కనుక ఊదీ పంపంచమని నానా సాహెబ్ చందోర్కర్ కి కబురు పంపించాడు. ఈ వార్త నానాకు ఠాణా రైల్వే స్టేషను దగ్గర తెలిసింది. అప్పుడతడు తన భార్యతో కల్యాణ్ కు వెడుతున్నాడు. అతని వద్ద ఊదీ లేదు. అప్పుడు నానా రోడ్డుపైన ఉన్న మట్టిని కొంచం తీసి, సాయినామ జపము చేసి, బాబా అనుగ్రహాన్ని అభ్యర్ధించి, తన భార్య నుదిటిపై రాసాడు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా గమనించాడు. ఆ భక్తుడు ఇంటికి వెళ్ళేసరికి ప్లేగుతో బాధ పడుతున్న వాని కూతురు జబ్బు నానా సాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి క్షణం నుండి తగ్గినదని విని ఎంతో సంతోషించాడు.
ఒక సారి నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టింది. నారాయణరావు ఊదీ కోసం వెదికాడు కాని కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి, బాబా పటం ముందు రాలి పడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాసాడు. అతడు ఊదీ రాసి చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయింది. జామ్నేర్ లీలలో నానా కుమార్తె ప్రసవ సమయంలో బాబా, రామ్ గిరి బువా ద్వారా ఊదీని, అడ్ కర్ ఆరతి పాటను పంపించారు.
ఎన్నో లీలల తర్వాత లీలలు, ఊదీ బాబా వారు ఇచ్చినా, లేక బాబా భక్తుడు ఎవరు ఇచ్చినా అది దివ్యమయిన ఔషధంగా పనిచేస్తుంది.
(మరికొన్ని వైభవాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment