22.07.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
(4) భక్తిమార్గం – 1వ.భాగమ్
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం
: ఆత్రేయపురపు త్యాగరాజు
భగవంతుని గురించి పరిపూర్ణంగా తెలుసుకొనేందుకు నాలుగు విధానాలు ఉన్నాయి. అవి (1) జ్ఞానము, (2) యోగ (మన్సును స్వాధీనమందుంచుకొనుట), (3) కర్మ (నిస్వార్ధ సేవ) (4) భక్తి (భగవంతునియందు ప్రేమ).
సాయిబాబా పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానాన్ని స్వయంగా సముపార్జించారు. ఆయన అతీంద్రియ శక్తులు కలిగిన ఒక మహాయోగి. ఆయన కఠినమైన తపోసాధన చేసి జీవితాంతం నిస్వార్ధమయిన సేవలో గడిపారు. కాని సాయిబాబా తన భక్తులకు భక్తిమార్గం అనగా భగవంతునియందు ప్రేమ గురించే సలహా ఇచ్చారు.
భక్తి మార్గాన్ని
జ్ఞానం ద్వారా చాలా త్వరితంగా సాధించగలం.
కాని అది చాలా కష్టతరమయినది. అహంకారంవల్ల
విఫలం అయ్యే అవకాశాలున్నాయి. అహంకారంతో మనం ఏదీ సాధించలేము. యోగపధ్ధతిలో/సాధనలో
శరీరాన్ని, మనసుని చాలా కఠోర శ్రమకు గురిచేయవలసి వస్తుంది. తీసుకొనే ఆహారపానీయాలకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కర్మ సాధనలో సామాన్య మానవుడు తాను చేసిన పనులకు
తానే కర్తననే విషయాన్ని, వాటివల్ల వచ్చే ఫలితాలను ఈ రెండిటినీ వదలివేయడం కష్టమనిపిస్తుంది. కాని, భగవంతునియందు ప్రేమకలిగి ఉండే విధానం వేరు. అన్నిటికన్నా అదే చాలా సులభసాధ్యమయినది. సంసారజీవితంలో జీవనం సాగిస్తూ ఎవరయినా ఈపధ్ధతిని
చాలా సౌకర్యంగా ఆచరించవచ్చు. అందుచేతనే సాయిబాబా
తన భక్తులకి ఈ భక్తి మార్గాన్ని ఆచరించమని పదే పదే బోధించారు.
శ్రీసాయి సత్
చరిత్ర 6వ.అధ్యాయంలో సాయిబాబా చెప్పిన మాటలను శ్రీహేమాడ్ పంత్ ఉదాహరణగా ఈ విధంగా చెప్పారు. “భగవంతుని
చేరడానికి నాలుగు వేరువేరు మార్గాలు ఉన్నాయి.
అవి – కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గాలు.
వీటన్నిటిలోను భక్తి మార్గం ముళ్ళతోను, గుంటలు, ఎత్తుపల్లాలతో నిండి ఉన్నప్పటికి
ఈ దారిలో ఎటువంటి మలుపులు ఉండవు. నువ్వు నీసద్గురువుని
నమ్మి ఆయన మీదే ఆధారపడి ముళ్లపొదలని, గోతులు ఎత్తుపల్లాలని లెక్కచేయక వాటినధిగమించి
తిన్నగా నడవాలి. అది నిన్ను మోక్షానికి దారి
చూపుతుంది.
(అధ్యాయం – 6)
(అధ్యాయం – 6)
భక్తి అనగా ఏమిటి?
భక్తి అంటే భగవంతునియందు ప్రేమ కలిగి ఉండటం. శాండిల్య మహాముని తన శాండిల్య భక్తి సూత్రంలో భక్తిని ఈ విధంగా నిర్వచించారు.
“सा परानुरक्तिरीश्वरे” (అనగా భగవంతునితో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకోవడం లేక భగవంతునియందు ప్రేమ). అలాగే నారదమహాముని తన నారద భక్తి సూత్రంలో భక్తి గురించి ఈ విధంగా నిర్వచించారు.
“तस्मिन् परमप्रेमरूपा” “అన్నిటినీ మించి భగవంతునియందు అత్యధికమైన ప్రేమ”
శ్రీసాయి సత్
చరిత్రలో హేమాడ్ పంత్ కూడా భక్తి గురించి ఈ విధంగా వివరించారు. “ఈ ప్రపంచంలో దేనినీ
ప్రేమించని మానవుడు ఉండడు. ప్రతి వ్యక్తికి
తనదంటూ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఇతరుల ప్రేమకన్నా
భిన్నంగా ఉంటుంది. దీనర్ధం ఒక్కొక్కళ్ళ ప్రేమ
ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరి ప్రేమ ఒకే విధంగా ఉండదు. కొంతమందికి తమ పిల్లలపై ప్రేమ ఉంటే మరికొందరికి
ధనం మీద, సంపద మీద ఉంటుంది. చాలా మందికి తమ
శరీరంమీద, ఇళ్ళు, ఆస్తిపాస్తులు, గౌరవమర్యాదలు, పురస్కారాలు, తాము చేసే వృత్తిలో, కీర్తిప్రతిష్టలు
వీటిమీద ప్రేమ ఉంటుంది. సంక్షిప్తంగా, ఇంద్రియాలకు
సుఖాన్ని, సంతోషాన్ని కలిగించే మొత్తం ప్రేమనంతటినీ భగవంతుని రూపం అనే మూసలో కరిగించి
వేస్తే అది భక్తిగా ఉద్భవిస్తుంది.
(శ్రీసాయి సత్ చరిత్ర మరాఠీమూల గ్రంధమునుండి అనువదింపబడింది. అధ్యాయం 10- ఓ.వీ. 126 – 128)
భక్తిలో రకాలు
:
భగవంతుడు లేక బ్రహ్మమునకు సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి. నిర్గుణ (అవ్యక్తము), సగుణ (వ్యక్తము). నిర్గుణమంటే రూపంలేనిది. సగుణమంటే రూపంతో ఉన్నది. రెండూ కూడా బ్రహ్మము గురించే తెలియచేస్తాయి. కొంతమందికి మొదటిది, కొంతమందికి రెండవది ఇష్టం. భగవద్గీత (12వ.అధ్యాయం ) లో సగుణ రూపాన్ని ధ్యానించడమే సులభమైనదని శ్రేష్ఠమయినదని చెప్పబడింది. మానవునికి (శరీరం, ఇంద్రియాలు మొ.) ఒక రూపమంటూ / ఆకారమంటూ ఉంది కనుక భగవంతుని కూడా ఆరూపంలోనే ధ్యానించడం సులభంగా ఉంటుంది. కొంతకాలం వరకు మనం సగుణ రూపం మీదనే ధ్యానం చేయకపోతే మన ప్రేమ భక్తి వృధ్ది పొందవు. కాలం గడిచేకొద్దీ ఆ ధ్యానంలో మనం ఉన్నతిని సాధించేకొద్దీ మనం నిర్గుణ రూపాన్ని ధ్యానించే స్థితికి చేరతాము.
సగుణరూపం ధ్యానంలో పురోగతి సాధించేకొద్దీ ఆయన రూపం మన మనసులో బలంగా ముద్రించుకొని ఉండటంవల్ల ఆయన రూపమే మన కనులముందు సాక్షాత్కరిస్తుంది.
సాయిబాబా తన భక్తులకి సగుణభక్తిని గురించి బోధించడమే కాదు, వారికి వ్యక్తిగత అనుభవాలను కలిగించడం ద్వారా, భక్తియొక్క ప్రభావం ఎటువంటిదో వారికి నిదర్శనం చూపించి వారికి నమ్మకం కలిగేలా చేశారు. నిజానికి అటువంటి అనుభవాలనిచ్చి సగుణభక్తిని వ్యాపింపచేసినది బహుశ సాయిబాబా ఒక్కరే.
బొంబాయి నివాసి
బాలబువా ఎంతో భక్తి కలవాడు. అతనికున్న భక్తి,
పూజలవల్ల అందరూ అతనిని 'అభినవ తుకారామ్' అని పిలిచేవారు. 1917వ.సంవత్సరంలో మొదటిసారిగా
అతను షిరిడీ వచ్చాడు. అతను బాబా ముందు శిరసు
వంచి నమస్కరించగానే బాబా “ఇతను నాకు నాలుగు సంవత్సరాలనుండి తెలుసు” అన్నారు. బాలబువా ఆశ్చర్యపడి ఆలోచించాడు. ‘ఇప్పుడే కదా నేను మొదటిసారిగా షిరిడీ రావడం. మరి ఇదెలా సాధ్యం?’ కాని బాగా తీవ్రంగా ఆలోచించిన
తరువాత తాను బొంబాయిలో బాబా పటం ముందు సాష్టాంగ నమస్కారం చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. అప్పుడతనికి బాబా అన్న మాటలలోని భావాన్ని అర్ధం
చేసుకొన్నాడు. యోగులెంత సర్వజ్ఞులు? సర్వత్రా
నిండి వుండి తమ భక్తులయందు ఎంత దయగా ఉంటారో కదా! అని ఆలోచించాడు. నేనాయన పటానికి నమస్కారం మాత్రమే పెట్టాను. ఈ విషయం బాబా గ్రహించారు. నేను వారి పటాన్ని చూడటం, వారిని స్వయంగా చూసినదానితో
సమానమని నాకు సమయానుకూలంగా తెలియచేశారు అని అర్ధం చేసుకొన్నాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment