Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, September 3, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 10. అహంకారమ్ – 2వ.భాగమ్

Posted by tyagaraju on 6:31 AM
Image result for images of shirdisaibaba
              Image result for images of rose hd

03.09.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
      Image result for images of m b nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
10. అహంకారమ్ – 2వ.భాగమ్
శ్రీసాయి సత్ చరిత్ర 34వ. అధ్యాయంలో బాబా, శ్యామాతో అన్నమాటలను ఒక్కసారి గమనిద్దాము. “నేనేమి చేయకున్నను, నన్నే సర్వమునకు కారణభూతునిగానెంచెదరు.  కర్మయొక్క మార్గము చిత్రమయినది.  కర్మకొద్ది, అదృష్టవశాత్తు ఏది సంభవించినా, దానికి నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే.  చేసే కర్త, చేయించేవాడు ఆ అనంత పరమాత్మ ఒక్కడే. 


నేను భగవంతుడను  కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. నేను నిరంతరం భగవంతుడిని స్మరించేవాడిని.  భగవంతుని సేవకుడిని.  ఎవరయితే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు.”
                                            అధ్యాయం – 34
సాయిబాబా తన భక్తులకు సహాయం చేసే అదృష్టం కలిగినందులకు, వారు తనకు ఆ అవకాశం ఇచ్చినందుకు తానెంతో వారికి ఋణపడి ఉన్నానని ఎంతో అణకువతో చెప్పారు.  దానికి ఉదాహరణ.

బాబా ఒకసారి ఎంతో వినయంగా అన్న మాటలు. “బానిసలకు బానిసనగు నేను మీకు ఋణగ్రస్తుడను.  మీ యశుధ్ధములో నేనొక పురుగును.  అట్లగుట వలన నేను ధన్యుడను”.  బాబా ఎంత అణకువతో చెప్పారో చూడండి.
                                               అధ్యాయం – 10
ఎంతటి వినయం!
ఈ ప్రాపంచిక జీవితంలో మనకి మనం  ప్రతిరోజూ గమనించుకుంటూ  ఉంటే మనలో అహంకారం ఉన్నదీ లేనిదీ గ్రహించుకోవచ్చు.  కాని, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కూడా అహంకారాన్ని, గర్వాన్ని విడనాడాలని బాబా తన భక్తులకు పదేపదే ఉద్భోధిస్తూ ఉండేవారు.

గొప్ప విద్యావంతుడయిన జవహర్ అలీ అనే ఫకీరు (1880 – 1890) లో షిరిడి వచ్చాడు.  అతడు బాబా తన శిష్యుడని అందరికీ ప్రకటించి, బాబాను తనతో కూడా రహతాకు రమ్మని అజ్ఞాపించాడు.  అప్పటికే బాబాను పూజిస్తూ, ఆరాధిస్తూ ఉన్న భక్తులెందరో ఉన్నారు.  జవహర్ అలీ తనను రహతాకు పిలవగానే మారుమాటాడకుండా అతనితో కూడా రహతా వెళ్ళి, 2-3 నెలలు అతనిని సేవిస్తూ ఉండిపోయారు.  ఆ తరువాత షిరిడీలోని భక్తులు ఆయనను అతి కష్టంమీద జవహర్ ఆలీతో సహా షిరిడీకి తీసుకొని వచ్చారు.  బాబా ఎంతటి మహాపురుషుడో మనకందరికీ తెలుసు.  అప్పటి ప్రజలు ఆయనను ఎంతగానో భగవంతునిగా భావించి ఆరాధిస్తూన్నా కూడా బాబాలో కించిత్తు గర్వం గాని, అహంకారంగాని లేవు.  అందువల్లనే ఆయన జవహర్ ఆలీతో కూడా ఆయనకు ఒక శిష్యునివలే అనుసరించి వెళ్ళారు.

ఆవిధంగా బాబా, మానవుడు ఏవిధంగా అహంకారాన్ని వదలి అణకువగా ప్రవర్తించాలో, ఆత్మ  సాక్షాత్కారాన్ని పొందగోరేవారు ఒక గురువుకు శిష్యునిగా ఏవిధంగా నడచుకోవాలో తాను స్వయంగా ఆచరించి చూపారు. 
భగవంతుని అన్వేషిస్తూ అడవిలో తిరుగుతున్న తనకు ఒక బంజారా ఎదురుపడి ఉత్తకడుపుతో అన్వేషణ ఫలించదని కాస్త రొట్టితిని మంచినీళ్ళు త్రాగమని ఇచ్చిన సలహాను పాటించి, తన అన్వేషణలో విజయాన్ని సాధించానని సాయిబాబా ఒక సారి వివరంగా చెప్పారు.  తాను తన గురువుకు సర్వస్య శరణాగతి చేసి ఏవిధంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందారో వివరంగా చెప్పారు.
“నాకు ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి అన్నీ నాగురువే.  నాగురువే నా సర్వస్వం.  నాసర్వేంద్రియాలు నామనసుతో సహా తమతమ స్థానాలను వదలి ధ్యానావధానాలు చేస్తూ నాకళ్ళలో ఉండిపోయాయి.  నాదృష్టియొక్క ధ్యానమంతా ఒక్క గురువుపైనే.  అంతా గురువుకు సమానం.  గురువు తప్ప రెండవవారెవ్వరూ లేరు అన్న భావనకు ‘అనన్య అవధాన’మని పేరు.  మనస్సును పావనము చేయందే ఆత్మసాక్షాత్కారమును పొందలేము.  ఇంద్రియములు గాని, బుధ్ధిగాని, మనస్సుగాని, ఆత్మను చేరలేవు.  గురువుయొక్క కటాక్షమే మనకు తోడ్పడును.  ధర్మము, అర్ధము, కామము మన కృషివల్ల లభించును. కాని, నాలుగవదైన మోక్షము గురువు సహాయము వల్లనే లభిస్తుంది.”
                                                అధ్యాయము – 32
ఒకసారి నాందేడ్ నివాసి అయిన పుండలీకరావుకు శ్రీవాసుదేవానంద స్వామి (టెంబేస్వామి)  కొబ్బరికాయనిచ్చి సాయిబాబాకు తన తరఫున సమర్పించమని చెప్పారు.  పుండలీకరావు షిరిడీకి వెడుతూ దారిలో ఆయన ఇచ్చిన టెంకాయను పగులగొట్టి కోరును అటుకులలో కలిపి తిన్నాడు.  ఆతరువాత షిరిడీలో బాబాను దర్శించుకున్నపుడు జరిగిన పొరబాటుకు ఎంతో చింతించాడు. పశ్చాత్తాపంతో బాబాను శరణువేడుకొన్నాడు.  అపుడు బాబా అతనితో ఈవిధంగా అన్నారు. “వ్యర్ధంగా ఎదుకు చింతిస్తావు?  స్వామి నీచేతికి టెంకాయనివ్వడం నాసంకల్పం.  దానిని పగలకొట్టడం కూడా నాసంకల్పమే.  అనవసరంగా అభిమానంతో అహంభావ బుధ్ధితో నేను చేశాను, నేను అపరాధినని ఎందుకనుకుంటున్నావు?   పుణ్యకార్యాలు గాని పాపకార్యాలుగాని రెండిటి ప్రభావం ఒక్కటే.
                                                  అధ్యాయం – 50
బాబా ఎంత చక్కటి ఆధ్యాత్మిక ఉపదేశాన్నిచ్చారో చూడండి.
ఆ విధంగా ఈ ప్రాపంచిక   రంగంలో ప్రతిరోజూగాని, లేక ఆత్మ సాక్షాత్కారానికి చేసే ప్రయత్నాలలో గాని అహంకారాన్ని వదలిపెట్టి అణకువగా ఉండవలసిన అవసరాన్ని బాబా  మనకందరికీ నొక్కి వక్కాణించారు.  అందువల్లనే హేమాద్రిపంత్ శ్రీసాయి సత్ చరిత్రలో ఉత్తముడయిన భక్తుడు ఏవిధంగా ఉండాలో వర్ణించి చెప్పారంటే అందులో ఆశ్చర్యం లేదు.  “తన శరీరమందభిమానము ఉన్నవానికి ‘భక్తుడు’ అని పిలిపించుకోవడానికి అర్హత లేదు.  తానే పండితుడిననీ, అన్నీ తనకే తెలుసుననీ విఱ్ఱవీగుతూ అహంకారంతోను, గర్వంతోను తనకు తానే అందరికన్నా గొప్పవాడినని భావించుకునే వ్యక్తి కూడా భక్తునిగా గుర్తింపతగడు.  నిగర్విగా నిరాడంబరంగా ఉన్నవానిలో స్వచ్చమయిన భక్తి ఉంటుంది.
                                     అధ్యాయం – 49 ఓ.వీ. 13-14  
(అహంకారం సమాప్తం)
(రేపు అహింస)
                             



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List