Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, September 12, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 12. సత్ప్రవర్తన – 2వ.భాగమ్

Posted by tyagaraju on 8:50 AM
Image result for images of baba annadanam
               Image result for images of rose hd yellow

12.09.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
        Image result for images of m b nimbalkar
ఆంగ్ల అనువాదమ్ : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
12. సత్ప్రవర్తన – 2వ.భాగమ్
దుర్మార్గపు పనులనుండి బుధ్ధిని మరలించకుండా (మనసులో చెడు ఆలోచనలు నింపుకొని) బయటకు మాత్రం బ్రహ్మజ్ఞానాన్ని సిధ్ధించుకున్నవానిలా భేషజాన్ని ప్రదర్శిస్తూ, ప్రవర్తనా నియమావళికి విరుధ్ధంగా అవినీతిగా ప్రవర్తిస్తూ తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నవాడు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియని అజ్ఞాని అని చెప్పవచ్చు.
                                 అధ్యాయం – 17 ఓ.వి. 37 – 38


సత్ప్రవర్తన గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే శ్రీసాయి సత్ చరిత్ర 24వ.అధ్యాయాన్ని మనం ఒక్కసారి గమనించాలి. (సుదాముని కధ).
“శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, సుదాముడు వీరు ముగ్గురూ సాందీపముని ఆశ్రమంలో ఆయన వద్ద విద్య నేర్చుకుంటూ ఉన్నారు.  గురువుగారు శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు కొట్టి తీసుకొని రమ్మని పంపించారు.  సాందీపముని భార్య కూడా సుదాముడిని అదేపనిమీద పంపిస్తూ ముగ్గురికోసం వేయించిన శనగలనిచ్చింది.  కృష్ణుడు సుదాముడిని అడవిలో కలసికొని “అన్నా, దాహం వేస్తూ ఉంది.  మంచినీరు కావాలని” అడిగాడు.  అపుడు సుదాముడు ఏమీ తినకుండా పరగడుపున నీళ్ళు త్రాగరాదు కాసేపు పడుకో అని అన్నాడేగాని, తన వద్ద శనగలు ఉన్నాగాని వాటిని తిని మంచినీరు త్రాగమని కూడా అనలేదు.  కృష్ణుడు సుదాముడి వడిలో తలపెట్టుకొని పడుకొన్నాడు.  అది చూసి సుదాముడు శనగలు తినసాగాడు.  అపుడు కృష్ణుడు “అన్నా, ఏమిటి తింటున్నావు?  చప్పుడవుతూ ఉంది” అని అన్నాడు.  అప్పుడు సుదాముడు “ఇక్కడ తినడానికేముంది? చలికి వణుకు వచ్చి పళ్ళు పటపటమంటున్నాయి అంతే, అసలు విష్ణుసహస్రనామం స్పష్టంగా ఉఛ్ఛరించలేకపోతున్నాను” అని సమాధానమిచ్చాడు.  ఈమాటలు విని సర్వసాక్షియైన కృష్ణపరమాత్మ, “నాకొక స్వప్నం వచ్చింది.  అందులో ఒకరి వస్తువును మరొకడు తింటుండగా అతనిని ఏమిటి తింటున్నావని అడిగాను.” ఏముంది? తినడానికి మట్టి అన్నాడు.  అపుడు ఆప్రశ్న అడిగినవాడు ‘తధాస్తు’ అన్నాడు. ఇది వట్టి స్వప్నమే అయినా నాకు పెట్టకుండా నువ్వు తింటావా అని అన్నాడు.  సుదామునికి శ్రీకృష్ణుని లీలలు తెలియవు.  దాని పరిణామం తర్వాత పరమ దారిద్ర్యాన్ననుభవించాడు.  అందువల్ల ఒక్కరొక్కరే తినేవారు దీనినెప్పుడూ గుర్తుంచుకోవాలి.  శ్రీకృష్ణపరమాత్మునికి స్నేహితుడయినాగాని సుదామునివంటి భక్తుడు తను చేసిన పొరబాటుకు కష్టాలననుభవించాడు.  ఆతరువాత సుదాముడు తన భార్య చేసిన అటుకులను పిడెకెడు తెచ్చి ప్రేమతో శ్రీకృష్ణునకర్పిస్తే కృష్ణుడు ప్రసన్నుడై అతనికి ఐశ్వర్యాలనిచ్చి తృప్తి కలిగించాడు. “
                Image result for images of shri krishna sudama
అందువల్లనే సాయిబాబా అటువంటి చెడు ప్రవర్తన కలిగినవారి గురించి ఏవగింపుతో చెబుతూ ఉండేవారు.  అటువంటివారితో కలిసి ఎటువంటి పనులూ చేయవద్దనీ, వారితో సన్నిహితంగా ఉండవద్దనీ తన భక్తులను హెచ్చరించారు.  “మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తిస్తే అందులో తప్పేముంది” అనే వ్యక్తులు మూర్ఖులు.  మంచినడత లేనివారిని మొట్టమొదటగానే మననుండి దూరంగా ఉంచాలి.  వారితో కలిసిమెలిసి తిరగరాదు.

అటువంటివారు మనకు ఎదురు పడినప్పుడు వారు చాలా ప్రమాదకరమయినవారని గుర్తించి వారినుండి మనము ప్రక్కకు తొలగిపోవాలి.  వారినీడ కూడా మనమీద పడకుండా జాగ్రత్తవహించాలి.  అది మనకి మరొకవిధంగా కష్టాన్ని కలిగించినా సరే వారినుండి మనం తొలగిపోవాలి.
                                      ***

మనకున్నదానిని ఇతరులతో పంచుకోవాలి అన్న విషయం మనం మన పిల్లలకు చిన్నతనంనుండే నేర్పాలి.  పెద్దయిన తరువాత వారికి అలవాటు కాకపోవచ్చు.  ఉదాహరణకి పిల్లలకు మనం తినడానికి ఏదో ఒకటి పెడతాము.  ఇంతలో పిల్లల స్నేహితులు రావచ్చు.  అప్పుడు పెద్దలు కొంతమంది “అదుగో, నీన్నేహితులు వచ్చారు. వాళ్ళ ఎదురుకుండా తినకు. వాళ్ళకు పెట్టాల్సి వస్తుంది అని పిల్లలకు మెల్లగా చెప్పి వాళ్ళు తింటున్న చిరుతిండిని కాని మరొకటి గాని లోపల పెట్టేసి వచ్చేయి అన్నారనుకోండి. అప్పుడాపిల్లలు తను ఏదో తింటున్నాడని తన స్నేహితులకి తెలియకూడదని   గబ గబా మూతి తుడిచేసుకుని వస్తారు. ఆ విధంగా పిల్లలు కూడా ఇతరులకు పెట్టకుండా తను ఒక్కడే తినే స్వభావాన్ని అలవరచుకొంటారు. అలా కాక, కాస్త వాళ్ళకు కూడా పెట్టు అని పిల్లలకు పెద్దలు చెప్పగలిగితే, ఇతరులకు కూడా మనకున్నదానిలో పెట్టాలనే మంచి ఆలోచన పిల్లలలో కలుగుతుంది. చిన్నతనంనుండే పిల్లలకు రామాయణ, భారత భాగవత కధలు చెబితే వాళ్ళు సన్మార్గంలో పయనించడానికి మనం సహాయం చేసినవాళ్ళమవుతాము.
(తరువాత అధ్యాయం  బ్రహ్మానందము)
(రేపటి సంచికలో “తన కన్నునిచ్చి పాప కన్ను కాపాడిన సాయి గణేష్ లీల)
(నిన్ననే ఒక సాయిభక్తురాలు పంపించారు. ఈ అధ్భుతమయిన లీల ఈ మధ్యనే గణపతి నవరాత్రులలో జరిగింది కాబట్టి, సాయి తత్వమ్ మొత్తం పూర్తి అయిన తరువాత ప్రచురించడమ్ భావ్యం కాదనే ఉద్దేశ్యంతో ప్రచురిస్తున్నాను. )


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

1 comments:

Unknown on September 12, 2016 at 11:53 PM said...

https://play.google.com/store/apps/details?id=tones.latchiyam.com.saibaba

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List