15.09.2016 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
13.
బ్రహ్మానందము (పరమసుఖము) – 1వ.భాగమ్
సాయిబాబా
తానే స్వయంగా అవతరించిన బ్రహానందమూర్తి. సముద్రపు
అంచువరకు నీరు నిండి ఉన్నట్లుగా ఆయన ఎప్పుడూ బ్రహ్మానందములో మునిగి ఉండేవారు. బ్రహ్మానందమంతా ఆయనలోనే నిండి ఉందా అన్నట్లుగా కనిపించేవారు. అదృష్టము కలిగిన భక్తునికి అటువంటి పరమసుఖానికి
లోటు ఉండదు.
అధ్యాయము
– ఓ.వి. 66
సాయిబాబావారి
స్థితి నిరంతరం బ్రహ్మముతో ఏకమయి ఉన్నట్లుగా ఉండేది. ఈప్రాపంచిక జీవితంలోని సమస్యలను, సుఖ దుఃఖాలను లెక్క
చేసేవారు కాదు. సచ్చిదానంద స్వరూపమే సాయిబాబా
అవతారము. శ్రుతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా
వర్ణిస్తున్నాయి. (తైత్తిరీయ ఉపనిషత్తు). ఈవిషయాన్ని
శ్రోతలు గ్రహిస్తే, పండితులు శాస్త్రాలద్వారా చదివి తెలుసుకున్నారు. ఈ ఆనంద స్వరూపాన్ని ఆ అనుభవాన్ని భక్తులు షిరిడీలోనే
ప్రత్యక్షంగా పొందుతారు.
అధ్యాయము – 11 ఓ.వి. 37-38
అది
నూటికి నూరు పాళ్ళు యదార్ధమే. సాయిబాబా స్వభావం
ఎల్లప్పుడూ ఉల్లాసంగాను. వేడుకగాను, సరసంగాను ఉండేది. యుక్తవయసులో ఉన్నపుడు ఆయన కాళ్ళకు గజ్జెలు కట్టుకొని
కంజీరా వాయిస్తూ సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకంగా పాటలు పాడేవారు.
ఆయన
ధ్యాననిమమగ్నులయి ఉన్న స్థితిలో కూడా దేవదాసీలు చేసే (శివుని
అవతారమయిన ఖండోబాను పెండ్లాడిన లేక తమను తాము అర్పించుకున్న స్త్రీలు) చేసే నృత్యానికి,
వారు పాడే పాటలను వింటూ ఆనందంగా తల ఊపుతూ ఉండేవారు. దీపావళినాడు ద్వారకామాయిలో ప్రమిదలలో నూనె పోసి
దీపాలను వెలిగించేవారు.
సాయిబాబాకు
చతురోక్తులతో హాస్యమాడటమంటే ఎంతో ఇష్టం. శ్రీసాయి
సత్ చరిత్ర 24వ.అధ్యాయంలో శ్రీధబోల్కర్ ధరించిన కోటు మడతలలోనుండి శనగగింజలు రాలిపడుతున్నాయని
వాటిని చూపించి హాస్యమాడారు. అలాగే ఇదే అధ్యాయంలో
అణ్ణచించణీకర్ కు మావిసీబాయికి మద్య జరిగిన కలహాన్ని హాస్యపూర్వకంగా పరిష్కరించారు
బాబా. “అణ్ణా! ఎందుకనవసరంగా తగవులాడుతున్నావు? తల్లిని ముద్దుపెట్టుకొనినచో అందులో అనౌచిత్యమేమి?”
అని సందర్భానికి తగినట్లుగా వారిని సమాధానపరిచారు. బాబా షిరిడీలోకి అడుగుపెట్టగానే “ఆవో సాయీ” అని
సంబోధించిన అనుభవజ్ఞుడు భక్తుడు అయిన మహల్సాపతి మీద, షిరిడీ వచ్చిన రోజులలో ఆయనకు ప్రతిరోజు
భోజనము పెట్టిన బాయిజాబాయి కుమారుడయిన తాత్యాకోటే పాటిల్ మీద ప్రత్యేకమయిన బాంధవ్యం
కలిగి ఉండేవారు బాబా.
వీరిద్దరూ ద్వారకామాయిలో
బాబాతో కలిసి ఒకరి పాదాలను ఒకరికి తగిలేటట్లుగా మూడు దిక్కులకు తమ తమ శిరసులనుంచి నిద్రించేవారు. వీరిద్దరికి బాబాతో కలిసి నిదురించే మహద్భాగ్యం
కలిగింది. అప్పుడప్పుడు మధ్యరాత్రిలో బాబా
లేచి ఒకరి కాళ్ళను మరొకరి మీద ఉంచి, మరొకరి కాళ్ళను తన మీద ఉంచుకొనేవారు. మరునాడు ఉదయాన్నే మహల్సాపతి, తాత్యా ఈవిధంగా ఎవరు
చేశారని ప్రశ్నించేవారు. అప్పుడూ బాబా చాలా
వేడుకగా నవ్వేవారు. తాత్యా బాబాని మామా (మేనమామ)
అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండేవాడు. దానివల్ల
వారిద్దరి మధ్యా సరదాగా చిలిపి తగాదాలు జరిగేవి.
సాయిబాబాకు మరొక సన్నిహిత భక్తుడు శ్యామా అనబడే మాధవరావు దేశ్ పాండే. బాబా, శ్యామా బుగ్గమీద చిలిపిగా గిల్లిన సంఘటన కూడా
మనం శ్రీసాయి సత్ చరిత్ర 36వ. అధ్యాయంలో గ్రహంచగలం.
ఈప్రాపంచిక
జీవితంలో కష్టాలు. ఉపద్రవాలు. దురదృష్టాలు సర్వ సాధారణం. అందుచేతనే ఎల్లప్పుడూ పరమానంద స్థితిలోనే ఉండాలనే
విషయాన్ని బహుశ బాబా మనకందరికీ తెలియచెప్పడమే ఆయన ఉద్దేశ్యం. అందుచేత మనం ఎందుకని వ్యాకులతతోను, దుఃఖంతోను ఉండాలి? ఎల్లప్పుడు మనం సంతోషంగాను, నవ్వుతూ తుళ్ళుతూ ఉండలేమా? ఈ విషయం మీద బాబా మనకి ఏమని హితబోధ చేశారో చూడండి – “మొదటినుంచి చివరి వరకూ ఒక్కలాగే ఉండాలి.
దైవవశాత్తు ప్రాపించినదానితో తృప్తిగా జీవించాలి. సదా సంతుష్టులై ఉండాలి. దేని గురించి చింతించకూడదు.” ***
“జీవితంలో
ఏక్షణంలో కూడా కలత చెందవద్దు. ఎప్పుడూ ఉల్లాసంగానే
ఉండు” అని బాబా బోధించారు.
అధ్యాయం – 17 ఓ.వి. 3
దాసగణు
మహరాజ్ కూడా తను రచించిన ‘భక్త లీలామృతం’ లో బాబావారు ఇచ్చిన ఇదే సందేశాన్ని మనకందించారు. “తెలివయినవాడు (జ్ఞాని) ఎటువంటి పరిస్థితులలోనయినా
సరే తన కర్మానుసారంగా తృప్తితో సంతోషంగా జీవించాలి. అశాంతితో ఉండరాదు.”
అధ్యాయము – 33 ఓ.వి. 66
(ఇంకా
ఉంది)
***
ఆరు సంవత్సరాల క్రితం మా ఇంటిలో దొంగలు పడి బంగారం, వెండి వస్తువులు దొంగిలించారు. విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుంది. హాలులో పెద్ద బాబా ఫొటో కూడా ఉంది. ఎప్పుడూ ఆయనమీదే భారం వేసి వెడతాము. కాని ఎందుకనో ఆ విధంగా జరిగింది. కాని దానిని గురించి నేను బాధపడలేదు. మన అజాగ్రత్త అనుకున్నాను అంతే. రిపోర్ట్ ఇస్తే ఎదురు మన డబ్బులే ఇంకా వదులుతాయని,
నోరు మూసుకొని కూర్చోవడం ఉత్తమమని అనుభవంలోకి వచ్చింది. అంతకు ముందు ఒక పెద్ద షాపులో 8వేల రూపాయల విలువగల
గిఫ్ట్ చెక్కులు పోగొట్టుకొన్నాను. ఏమిటి బాబా
ఇలా చేసావు అని అనుకున్నానే గాని బాధ పడలేదు.
కాని దాని విలువకి పది రెట్లు నాకు లాభం చేకూర్చారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే బాధ పడి లాభంలేదు. ఆరోగ్యం పాడవటం తప్ప. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. కాని మన జాగ్రత్తలో మనం ఉండాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. కష్టమయినా, సుఖమయినా ఒకే రీతిగా ఉంటే దానికి మించినది
మరేమీ లేదు.
(ఇంకా ఉంది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment