22.06.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా
సమాధానాలు – 10 (5)
గురుభక్తి 5 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఏడు సముద్రములలో స్నానమాచరించుట వలన
లభించు ఫలము గురుదేవుని పవిత్ర చరణ తీర్ధములోని ఒక బొట్టులో వెయ్యవ వంతుకు సమానము.
గురుగీత శ్లో. 87
గురువుయొక్క పాద తీర్ధమును త్రాగి, శేషించిన తీర్ధమును ఎవడు శిరమున ధరించుచున్నాడో అట్టి పుణ్యాత్ముడు సర్వతీర్ధస్నాన
ఫలమును పొందుచున్నాడు.
గురుగీత శ్లో.
28
అజ్ఞానమును అంతమొందించునదియు, జన్మకర్మలను నివారించునదియు, జ్ఞాన వైరాగ్యములను ప్రసాదించునట్టిదియు
నగు గురుపాద తీర్ధమును పానము చేయవలెను.
గురుగీత శ్లో.
31
గురుర్బ్రహ్మా గురువిష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షా త్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
గురుగీత శ్లో. 58
గురువే బ్రహ్మదేవుడు, గురువే విష్ణుదేవుడు, గురువే దేవదేవుడైన మహేశ్వరుడు. గురువే అవ్యక్త పరబ్రహ్మము. అట్టి గురుదేవునకు నమస్కృతులు.
గురుస్వరూపము శ్రేష్టమైన తీర్ధము. ఇతర తీర్ధములు నిరర్ధకమైనవి. దేవీ! గురుదేవునియొక్క
పాదారవిందము సర్వతీర్ధ స్వరూపము.
గురుగీత శ్లో . 264
శ్రీ సాయి సత్ చరిత్ర అ.27 మానవుడు సముద్రములో మునుగగనే,
అన్ని తీర్ధములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల
నాశ్రయింపగనే, త్రిమూర్తులకు (బ్రహ్మ విష్ణు
మహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతోపాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన
ఫలితము కూడా లభించును.
ఏ మహాత్ముని దర్శింపగనే చిత్తము ప్రశాంతతను
పొందునో, ధైర్యము, శాంతి స్వయముగా లభించునో అట్టి
మహితాత్ముడు పరమ గురువు. -- గురుగీత – శ్లో. 292
శ్రీ
సాయి సత్ చరిత్ర అ. 32 బాబా చెప్పిన మాటలు. “నా గురువు తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా జూచునట్లు నన్ను కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా యభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని
తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలె ననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాలందు నిలువనప్పుడు
నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది.
అది యటువంటి బడి.
అందులో ప్రవేశించినవారెవరును రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు నా యాస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నియు
తమతమ స్థానములు విడచి, నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువుపైననే నిల్పితిని. నాకింకొకదాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు
నా బుధ్ధి స్తబ్ధమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే యాత్మజ్ఞానము
దానిమట్టుకది నాయందు ప్రకాశించెను.
నేను కోరుటకేమియు లేకుండెను. సర్వము దానిమట్టుకదియే పగటి ప్రకాశమువలె
బోధపడెను. )
ఎవరైనను గురువును నిందించినచో అతని మాటను
ఖండించవలెను. అలా చేయుటకు అసమర్ధుడయినచో
వానిని దూరముగా పంపవలెను. లేదా దూరముగా వెళ్లగొట్టవలెను.
అదియు వీలుగానిచో, అట్టి దుష్టునికి తానే
దూరముగా వెళ్లవలెను.
గురుగీత – శ్లో. -145
మన సద్గురువు చెప్పిన ఆదేశాలను, బోధనలను ఆచరణలో పెట్టినట్లయితే మన గురుభక్తి పూర్తిగా విధేయతతో కూడినదయి ఉంటుంది.
మన గురువు ఆదేశాలను ఎప్పుడయితే మరొక ఆలోచన లేక పాటిస్తామో అపుడే మన గురుభక్తికి
సార్ధకత ఏర్పడుతుంది.
( శ్రీ సాయి సత్ చరిత్ర అ. 6 అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను
తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును ధృఢముగా నమ్ముడని శ్రీసాయిబాబా
నొక్కి వక్కాణించెడివారు.)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment