Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, October 13, 2020

నన్ను గుర్తించలేవా???

Posted by tyagaraju on 7:59 AM

 

13.10.2020  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్భుతమయిన సాయి లీల ప్రచురిస్తున్నాను.  సాయిసాగర్ మాసపత్రిక 1996 వ.సంవత్సరం దీపావళి సంచికలో ప్రచురింపబడిన ఈ భాగాన్ని ముంబాయినుండి సాయిభక్తురాలు శ్రీమతి శారద గారు పంపించారు.

తెలుగు అనువాదమ్ ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

నన్ను గుర్తించలేవా???

1995వ.సంవత్సరం దీపావళిరోజు.  రేఖా వి.పాటిల్ తన భర్త, అతని స్నేహితుడు అరుణ్ చౌదరిల రాక కోసం ఇంటి గుమ్మం వైపే దృష్టిని నిలిపి ఎదురు చూస్తూ ఉంది.  వారిద్దరూ క్రొత్తగా మోటార్ బైక్ కొనడానికి షోరూముకు వెళ్ళారు.  ఇద్దరూ కొత్త బండితో వస్తారని ఎంతో సేపటినుంచి ఎదురు చూస్తూ ఉంది.  క్రొత్తబండి వస్తున్న శుభసందర్భంలో శ్రీఖండ్ (తీపి పదార్ధం), పూరీలు తయారుచేసింది.  అప్పటికే మధ్యాహ్నం 12 గంటలయింది.  అయినా ఇద్దరూ ఇంకా రాకపోవడంతో చాలా ఆందోళనపడుతూ ఇద్దరూ క్షేమంగా ఇల్లుచేరాలని మనసులోనే దేవుడిని ప్రార్ధించుకోసాగింది.


సరిగ్గ అదే సమయంలో వయసుమళ్ళిన ఒక వ్యక్తి ఆమె గుమ్మంముందుకు వచ్చి నిలుచున్నాడు.  అతను తలకి ఎర్ఱరంగు గుడ్డను చుట్టుకుని పంచె ధరించి ఉన్నాడు చేతిలో బాబా ఫొటో ఉంది.  ఆమెను భిక్ష అడిగాడు.  ఆమె అతనికి రూ.1.25పై. ఇచ్చింది.  అపుడా వ్యక్తి “అమ్మా నాకు దక్షిణ మాత్రమే ఇవ్వకు.  ఈరోజు నీఇంటిముందుకు క్తొత్తవాహనం వస్తున్నది.  ఆసందర్భంగా నాకు తినడానికి ఏదయినా తీపిపదార్ధం సమర్పించు” అన్నాడు. 


తన భర్త, అతని స్నేహితుడు ఇంకా రాకపోవడం వల్ల ఆమె మనసంతా అస్థిమితంగ ఉంది.  ఆకారణంచేత ఆవ్యక్తి అన్నమాటలు పెద్దగా పట్టించుకోలేదు.  కొత్తవాహనాన్ని ఇంటికి తీసుకురాగానే మొట్టమొదటగా దానికి పూజకార్యక్రమాలు నిర్వహించాలి.  ఇప్పుడు ఆవిధంగా చేసిన తరువాత బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ బాబాకు ఆరతి ఇవ్వాలి. ఆరతి ఇచ్చిన తరవాతే తను తయారుచేసిన పదార్ధాలను మొదటగా బాబాకు నైవేద్యం పెట్టాలి.  ఆయనకు నైవేద్యం పెట్టిన తరవాతనే అందరూ తినాలి.  అలా కాకుండా ఈ వ్యక్తి అడిగిన వెంటనే వాటిని పెట్టడం ఎలా అని అనుకుంది. ఆకలితో ఉన్నవానికి తృప్తిగా భోజనం పెట్టినట్లయితే అది భగవంతునికి సమర్పించినట్లె అని  తనకు తానే సమాధానం చెప్పుకుంది.  ఈ విధమయిన ఆలోచన రాగానే మెల్లగా ఆమెలో కాస్త వివేకం కలిగి ఒక ముఖ్యమయిన విషయం స్ఫురించింది.  “ఈరోజే కొత్తగా కొంటున్న వాహనం ఇంటికి తెస్తున్నారనే విషయం ఈవ్యక్తికి ఎలా తెలుసు?”


                                                 (శ్రీ ఖండ్)

వెంటనే ఆమె అతనిని లోపలికి రమ్మని ప్లేటునిండా నాలుగు పూరీలు, శ్రీఖండం పెట్టి ఇచ్చింది. అతిధులకు ఫలహారాలు గాని ఇంకేమన్నా పెట్టినపుడు ఇంకా కావాలా, చాలా అని ఆమె ఆడుగుతూ ఉంటుంది.  కాని ఈసారి మాత్రం అతనికి ఇంకా కావాలా సరిపోయిందా అని కూడా అడగలేదు.  ఆమె దృష్టంతా తన భర్త రాకకోసం గుమ్మంవైపే ఉంది.  ఆవ్యక్తి ఆమె పెట్టిన పదార్ధాలను తిన్న తరువాత ఆమెను దీవించి వెళ్ళిపోయాడు. ఖాళీ అయిన ప్లేటును తీస్తుండగా ఆమె భర్త అతని స్నేహితుడు ఇద్దరూ ఇంటికి చేరుకొన్నారు.  వారు వస్తూవస్తూ వాహనానికి బాబా మందిరంవద్ద పూజచేయించి రావడం వల్ల ఆలస్యమయింది.  పూజ చేయించారు కాని, బాబాకు దక్షిణగాని, ప్రసాదం గానీ ఏమీ సమర్పించకుండానే వచ్చేశారు.

వారు లేని సమయంలో ఇంటిలో జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది రేఖ.  అది వినగానే అరుణ్ “బాబా దక్షిణ తీసుకోవడానికి, ప్రసాదం తీసుకోవడానికి మీఇంటికి వచ్చారు.  కాని నీవు ఆయనను గుర్తించలేదు.  కనీసం ఆయనకు తృప్తిగా కడుపునిండా భోజనం పెట్టి ఉండాల్సింది.  కాని నీదృష్టంతా మేము తీసుకువచ్చే కొత్తబండిమీద, దానికి చేయవలసిన పూజలమీద ఉంది.  మేము రావడంకూడా ఆలస్యం అవడంవల్ల నీమనసు కూడా స్థిరంగా లేదు.  ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అది నా ఆకలి తీర్చినట్లే అని బాబాయే చెప్పారు.  ఇక ఎప్పుడూ ఇటువంటి పొరబాటు చెయ్యకు” అన్నాడు.  వెంటనే ఆమె భర్త అతని స్నేహితుడు ఇద్దరూ ఆవ్యక్తి ఎక్కడయినా కనబడతాడేమోఅని బయటకు వెళ్ళి చూసారు.  కాని అతను ఎక్కడా కనిపించలేదు.`

పొరుగింటామె తన ఇంటి గుమ్మంబయటే కూర్చుని ఉంది.  కాని ఆమెకు వీరింటికి ఆవ్యక్తి రావడం కనబడలేదు.  భిక్ష అడగడం కూడా ఆమెకు ఏమీ వినిపించలేదు.   ఆవ్యక్తి ఈమె ఇంటివద్దకు భిక్షకోసం కూడా రాలేదు.

బాబా మన ఎదుట ఏదోరూపంలో వస్తారు.  కాని మనం ఆయనను గుర్తించాలంటే మనకు అంతరదృష్టి ఉండాలి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment