21.12.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 16 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985
నా డైరీలో వ్రాసుకున్న విషయాలు
బప్పా బాబా నవ్వుతూ….
బాబా గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. కాని ఇపుడు సమయం లేదు. నేను స్నానం చేయాలి. అందుచేత ప్రస్తుతానికి మన సంభాషణ
ఇంతటితో ఆపుదాము.
ముగించేముందు మరొక ముఖ్యమయిన విషయం గుర్తుకు
వచ్చింది చెబుతాను. బాబా
ప్రతిరోజు ద్వారకామాయిలో ఉన్నవారందరికీ చాలా ఘనంగా డబ్బు పంచిపెట్టేస్తూ ఉండేవారు. ఒక రూపాయినుండి రెండువందల వరకు నాణాలను
పంచిపెట్టేవారు. ఈ ధనమంతా
ఆయనకి ఆరోజు దక్షిణగా భక్తులు సమర్పించినది. సాయంత్రమయ్యేసరికి వచ్చిన మొత్తమంతా
ఆవిధంగా బీదలకు పంచేసేవారు. రాత్రి అయేసరికి ఆయన జేబులు ఖాళీ
అయిపోయేవి. ఇదే ఆయన పధ్ధతి.
ధన్యవాదాలు. మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు
అది నాకెంతో గౌరవంగా భావిస్తున్నాను.
(బయలుదేరేముందు బప్పాబాబాతో ఫోటో తీయించుకున్నారు.)
(బప్పాబాబా 1987 వ.సంవత్సరంలో షిరిడిలో మరణించారు)
కర్ణాటకనుంచి వచ్చిన స్వామి శేఖరరావుతో
నా మొట్టమొదటి సంభాషణ. ఇతనే
నాకు దుబాసీగా వ్యవహరించాడు.
స్వామి శేఖరరావు…
నేను ఇక్కడికి 1978వ.సంవత్సరంలో వచ్చాను. షిరిడిలో 7సంవత్సరాలుగా
ఉంటున్నాను. ఒక్కసారి
మాత్రం 5 లేక 6 నెలలక్రితం ఒక
20 రోజులు మాత్రం షిరిడీ విడిచి వెళ్లాను.
ప్రశ్న --- ఇపుడు మీ వయసెంత?
జవాబు --- నాకు 56సంవత్సరాలు
ప్రశ్న --- మీరు షిరిడీకి వచ్చి ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఏమిటి?
జవాబు --- ఒకసారి మధ్యప్రదేశ్ నుండి వచ్చిన ఒక మాహాత్ముడు నన్ను షిరిడికి తీసుకువచ్చాడు. అపుడు నేను బాబా దర్శనం చేసుకొన్నాను. ఇది నా జీవితంలో జరిగిన ఎంతో ముఖ్యమయిన సంఘటన. అప్పటినుండి ప్రతి సంవత్సరం నేను
షిరిడికి వస్తూ ఉండేవాడిని. ఆ తరువాత 1978 వ.సంవత్సరంలో నేను
షిరిడిలో ఉన్నపుడు ఇక్కడే ఉండిపోవాలని ఏదో తెలియని ప్రేరణ నాలో కలిగింది. అప్పటి నుండి ఇక్కడ షిరిడిలోనే ఉండిపోయాను. బాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చి
షిరిడి విడిచి వెళ్లవద్దని చెప్పారు.
నా అనుభవంలో బాబా భగవంతుడె. అది యదార్ధం. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే,
నమ్మకంతో, ప్రేమతో బాబా నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే
సమస్యలన్నీ నామస్మరణ వల్ల పరిష్కారమవుతాయి.
గత ఏడు సంవత్సరాలుగా నాకిది అనుభవమే. సుమారు ఏడు, ఎనిమిది నెలల క్రితం నాకు శివలింగం ప్రతిష్టింపబడిన పుణ్యక్షేత్రానికి యాత్రకు
వెళ్ళాలనిపించింది. బయలుదేరే
ముందు రోజు రాత్రి బాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చి షిరిడి విడిచి వెళ్లవద్దని అన్నారు. నేను ఆయన ఆదేశాన్ని పాటించాను.
ప్రశ్న --- బాబా మీకు తరచూ దర్శనమిస్తూ ఉంటారా?
జవాబు --- లేదు, రెండుసార్లు నేను ముందుగా చెప్పిన సందర్బాలలో మాత్రమే
ఆయన దర్శనమిచ్చారు.
ప్రశ్న --- ఇక్కడ షిరిడీలో మీరు ఏమి చేస్తూ ఉంటారు?
జవాబు --- మొదట నాలుగయిదు సంవత్సరాలు సంస్థానంలో తోటమాలిగా పనిచేసాను. ఆతరువాత కొన్ని సమస్యలవల్ల ఆపని మానేశాను. ఇపుడు బాబా దయవల్ల భక్తులు ఇచ్చే
దక్షిణమీదనే ఆధారపడి జీవిస్తున్నాను. గతమూడు సంవత్సరాలనుండి అంటే
1982వ.సం.నుండి నా మనస్సు
ప్రశాంతంగా ఉంది. ఒక
చిన్నపిల్లవాడి మాదిరిగా అనుకోకుండా యాదృఛ్చికంగా నామనసు తనంతటతానే మనశ్శాంతిని పొందింది. ఎదుటపడే మగవారినందరినీ నాస్నేహితులు,
మరియు నా సహచరులుగాను భావించసాగాను. స్త్రీలను చూసినపుడు నాలో వారిపై
మాతృభావం కలిగేది. ఈవిధంగా
అనుకోకుండా ఆకస్మికంగా ఇటువంటి భావాలు ఉత్పన్నమవడం సన్యాస లక్షణాలు పొడచూపుతున్నాయని
అనడానికి సంకేతం.
ప్రశ్న --- భక్తుడు సాయిబాబాకు అత్యంత సన్నిహితంగా ఉండాలంటె ఏమిచేయాలని మీ అభిప్రాయం?
జవాబు --- నేను శ్రీసాయి సత్ చరిత్రను 5 సార్లకన్న ఎక్కువగానే పారాయణ
చేసాను. చదివినదానిని
బాగా అర్ధం చేసుకొన్న తరువాత బాబా గారి స్వబావాన్ని ఆయన బోధనలను అర్ధం చేసుకొన్నాను.
ప్రశ్న --- ఇక్కడ షిరిడీలో మీ జీవనవిధానం మీకు ఏమనిపిస్తోంది?
జవాబు --- నేను సంస్థానంలో తోటమాలిగా పనిచేసాను. నేను చేసే సేవకి సంస్థానంవారు నాకు
రెండుపూటలా ప్రతిరోజు భోజనం పెట్టేవారు.
దీనినే జీతం ఆశించకుండా గౌరవభావంతో చేసే సేవ అంటారు. ఇపుడు నేను భక్తులు ఇస్తున్న దక్షిణ
మీదనే ఆధారపడి జీవిస్తున్నాను.
ప్రశ్న --- షిరిడీలో ప్రతిరోజు నియమానుసారంగా ఏవిధంగా జరుగుతూ ఉంటుందో చెబుతారా?
జవాబు --- ఉదయం గం.5 లకు మందిరం తెరుస్తారు. గం.5.15కు ఉదయం
కాకడ ఆరతి ప్రారంభమవుతుంది. ఆరతి గం.5.45కు పూర్తవుతుంది. ఆతరువాత 6 గంటలకు
బాబా విగ్రహానికి అభిషేకం జరుపుతారు.
ఆతరువాత గం.6.45 కు చిన్న ఆరతి ఉంటుంది. తరువాత పూజా, దర్శనం. అభిషేకం
ఉదయం గం.7 నుండి గం.11 వరకు ఉంటుందని చెప్పగలను. తరువాత మధ్యాహ్నం ఆరతి ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు మరొక ఆరతి, రాత్రి 10 గంటలకు
చివరిగా మరొక ఆరతి. మొత్తం
నాలుగు ఆరతులు జరుగుతాయి. మధ్యాహ్నం ఎన్నో పూజలు, ఆరతులు జరుగుతూ ఉంటాయి. భక్తుల రాకపోకలు కూడా బాగా ఎక్కువగానే
ఉంటాయి. ప్రతిరోజు షిరిడీకి
అన్ని మతాలవారూ వస్తూ ఉంటారు. ముస్లిమ్స్, శిక్కులు, పంజాబీలు,
సింధీలు, మరాఠీవారు, గుజరాతీలు,
మద్రాసునుండి, ఆంధ్రానుండి, బెంగాల్, నేపాల్ మొత్తం భారతదేశం నుండి భక్తులు వస్తూ
ఉంటారు. ఒక్కోసారి విదేశీయులు
కూడా వస్తూంటారు.
ప్రశ్న --- విదేశీయులు తరచూ వస్తూ ఉంటారా?
జవాబు --- వస్తుంటారు. కాని ఈకాలంలో చాలా తక్కువగా వస్తారు. అమెరికాలో ప్రత్యేకించి సాయిబాబా
మందిరం ఉందని విన్నాను.
ప్రశ్న --- ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహింపబడిన పండుగలు ఏమిటి?
జవాబు --- బాబాగారి
కాలంలో రామనవమి ఒక్కటే అత్యంత వైభవంగా జరిగేది.
1919వ.సం.లో పుణ్యతిధిని జరపడం ప్రారంభించారు. మరొక ముఖ్యమయిన పండుగ గురుపూర్ణిమ. నేను ఆరు రామనవమి, ఆరు గురుపూర్ణిమలు, ఆరు పుణ్యతిధులను
చూసాను. ఉత్సవాల సమయంలో మూడురోజులపాటు సంస్థానంవారు
ప్రత్యేకమయిన భోజనాలు పెడతారు. వేలాదిమంది
భక్తులు వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
ప్రశ్న --- మీరు 1978వ.సం.లో షిరిడికి వచ్చిననాటినుండి అధిక
సంఖ్యలో భక్తులు వస్తున్న కారణంగా వారి వసతికోసం క్రొత్తగా భవనాలను ఏమయినా నిర్మించారా?
జవాబు --- నేను వచ్చినపుడు ఇక్కడ శాంతినివాస్ ఒక్కటే ఉంది. 1978వ.సం. లో సాయివాడా లేదు. భక్తవాడా 30 సంవత్సరాల క్రితమే కట్టారు. 1918 వ.సం. నుండి ఎన్నో భవనాలను నిర్మించారు.
ప్రశ్న --- అయితే ఆవిధంగా సాయిబాబా మీద భక్తి ఒక ఉద్యమంలో
పెరుగుతూ వస్తోందా?
జవాబు --- ఖచ్చితంగా అవుననే చెప్పాలి.
ప్రశ్న --- భవిష్యత్తులో సంస్థానంవారు భక్తుల కోసం మరిన్ని
భవనాలను నిర్మిస్తారని మీరు భావిస్తున్నారా?
జవాబు --- అవును, ఈ మధ్యనే సంస్థానం వారు చాలా స్థలాలు కొన్నారు. భోజనాలయాన్ని ఇంకా విశాలంగా నిర్మించారు. ఇంతకుముందు అది మందిరం ఎదురుగా చాలా చిన్నదిగా ఉండేది. 1981వ.సం. లో ఈ భోజనాలయాన్ని భక్తులు భోజనాలు చేయడానికి
వీలుగా బల్లలను ఇంకా ఎన్నో సౌకర్యాలను కల్పించారు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment