18.12.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 15 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985
నా డైరీలో వ్రాసుకున్న విషయాలు
ప్రశ్న --- బాబా సమాధి చెందిన తరువాత ఏమి జరిగింది?
జవాబు --- బాబా తన శరీరాన్ని విడిచిన వెంటనే షిరిడీలో ముస్లిమ్స్, హిందూ వర్గాలమధ్య చాలా వాదోపవాదాలు జరిగాయి. హిందువులు, ముస్లిమ్ లు బాబా శరీరం తమదంటే తమదని, ఆయన వాస్తవంగా తమకు సంబంధించినవారేనని ఎవరికి వారే వాదులాడుకోసాగారు. “బాబా హిందువు అందుచేత ఆయన శరీరం తమకే ఇవ్వాలని’ హిందువులు అన్నారు. “బాబా ముస్లిమ్ ఆయన శరీరం మాది” అని ముస్లిమ్ లు అన్నారు. ఈవిధంగా వాదనలు జరిగాయి. అపుడు హరిసీతారామ్ దీక్షిత్ అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ గారికి తంతి (టెలిగ్రామ్) పంపించారు.
మూడురోజులపాటు
బాబా శరీరాన్ని చావడిలో ఒక చెక్కబల్లపైన ఉంచారు. జిల్లా కలెక్టర్ వచ్చిన తరువాత ఆయనే
నిర్ణయిస్తారని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఆ సమస్యను పరిష్కరించారు. ఆయన బాబా శరీరాన్ని పరీక్షించి బాబా
లంగోటీ ధరించారని, ఆయన దుస్తులు ఆయన పద్దతి అంతా హిందూసాంప్రదాయం
ప్రకారమే ఉన్న కారణంగా ఆయన ముస్లిమ్ కాదని నిర్ణయించి హిందువే అని తేల్చారు. లంగోటీ ధరించడం హిందూసాంప్రదాయమని
అన్నారు. ఈవిధంగా నిర్ణయం
అయిన తరువాత ఆయన దేహాన్ని హిందువులకు అప్పగించారు. బాబా సమాధి చెందిన మూడురోజుల తరువాత
ఆయన అంతిమయాత్ర జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఆయన శరీరాన్ని బూటీవాడాలో ఉంచారు. అప్పటికే బూటీవాడా నిర్మాణం పూర్తయింది. బాబా కోరిక కూడా తనను బూటీవాడాలో
ఉంచాలన్నదే అని బూటీ చెప్పారు. బూటీవాడాలో కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని అది కృష్ణమందిరం కోసమే ప్రత్యేకంగా
నిర్మించారు. కాని బాబా
కోరిక ప్రకారం అదే సాయిబాబా సమాధిమందిరమయింది.
ప్రశ్న --- సాయిబాబా హిందువు అని మీరు నమ్ముతున్నారా?
జవాబు. అవును. బాబా
హిందువే అని నేను నమ్ముతున్నాను.
తుకారామ్ --- ఏమయినప్పటికీ బాబా ఎప్పుడూ అల్లామాలిక్ అని అంటూ ఉండేవారు. ఆవిధంగా ఎందుకనేవారో ఎవరికీ తెలియదు.
(నవ్వుతూ). అది ఆయనకే తెలుసు. అదంతా ఒక రహస్యం. ఎప్పుడయినా ముస్లిమ్ భక్తులు మసీదుకు
వచ్చినపుడు బాబా వారికి ‘అల్లామాలిక్’ అనమని
సలహా ఇచ్చేవారు. మసీదులో
హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని ఉండేవి.
ఉదాహరణకు మసీదులో ఒక గంట ఉండేది. అది ముస్లిమ్ సాంప్రదాయానికి విరుధ్ధం. అదే విధంగా మసీదులో ధుని వెలుగుతూ
ఉండేది.
ప్రశ్న --- మసీదులో బాబా దినచర్య ఏవిధంగా ఉండేది?
జవాబు --- మధ్యాహ్న ఆరతికి బాబాకు సమర్పించడానికి ఎన్నో నైవేద్యాలు ఆహారపదార్ధాలు భక్తులు
ఎప్పుడూ తీసుకువస్తూ ఉండేవారు. వచ్చినవాటినన్నిటినీ బాబా భక్తులందరికీ, బీదవారికి పంచేస్తూ
ఉండేవారు. ఈవిధంగా ప్రతిరోజూ
జరిగేది. బాబా ద్వారకామాయిలో
ఎప్పుడూ తమ గద్దె పైనే కూర్చొనేవారు.
ప్రశ్న --- బాబా ముఖ్యంగా బోధించినదేమిటి?
జవాబు --- బాబా ఏవిధమయిన మంత్రాలను గాని, ఉపదేశాలను గాని ఎవ్వరికీ
ఇవ్వలేదు. ఆయన భక్తులందరికీ
ఊదీనిచ్చి ఆశీర్వదించేవారు అంతే.
ప్రశ్న --- భగవంతుని మీద, వారి గురువు మీద భక్తిని నిలుపుకోమని ఆవిధంగా
అలవాటు చేసుకోమని అదే ప్రాధమిక ధర్మం అని బాబా ప్రతివారితోనూ చెప్పేవారా?
జవాబు --- ఒకసారి హిమాలయాలనుండి ఒక సాధువు బాబాను దర్శించుకోవడానికి వచ్చాడు. ఆ సాధువు బాబాని ఈ విధంగా అడిగాడు. “నాకు భగవంతుడిని, బ్రహ్మం చూపించండి”
అపుడు బాబా “భగవంతుడు అన్నిచోట్లా వ్యాపించి ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడు. నువ్వు ఆయనను అన్ని ప్రాణులలోను,
అన్ని ప్రదేశాలలోను దర్శించుకోవచ్చు. ఆయన ప్రపంచమంతటా నిండి ఉన్నాడు,
భగావంతుడు పర్వర్ధిగార్” అన్నారు. బాబా ఇంకా ఆసాధువుతో,”భగవంతుని విషయంలో నువ్వు పొరబాటు చేస్తున్నావు. బ్రహ్మమును గుర్తించడంలో గల వాస్తవాన్ని
తప్పుగా అర్ధం చేసుకొన్నావు. నీకు ఇష్టమయిన ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఆయన అన్నీ చోట్లా ఉన్నాడు”.
ప్రశ్న --- కాని ఎవరయినా బ్రహ్మమును గురించి తెలుసుకోవడం ఎలా? ఆ బ్రహ్మానుభూతిని పొందడానికి తగిన
మార్గమేదయినా బాబా ఉపదేశించారా?
జవాబు --- బాబా ఆసాధువుతో “ప్రాపంచిక విషయాలు, కోరికలను త్యజించి మనస్సును
బుధ్ధిని కోరికలవైపు మళ్ళనీయకుండా స్వఛ్చంగా ఉంచుకున్నట్లయితే
బ్రహ్మమును తప్పక దర్శించగలవు. మనస్సును నిర్మలంగా ఉంఛుకోవడమే అత్యంత ముఖ్యమయినది. అదే శుధ్ధాంతఃకరణ” అని బోధించారు.
ప్రశ్న --- సాయిబాబావారి అలవాట్లు ఏమిటి? గుర్తు చేసుకొని చెప్పండి?
జవాబు --- ద్వారకామాయిలో చదునుగానున్న పెద్దరాయి ఉంది. బాబా ఎప్పుడూ ఆరాతిమీదనే కూర్చొనేవారు. దానిమీద కూర్చొనే ఆయన స్నానం చేసేవారు. లెండీబాగ్ లో ఉన్న బావినుండి నీళ్ళు
తీసుకుని వచ్చేవారు. ప్రతిరోజు ఉదయాన్నే బాబా స్నానం చేసేవారు. ఉదయాన్నే నిద్రనుండి లేచినవెంటనే
స్నానానికి ముందు ధుని ముందు కూర్చొనేవారు. ధుని ముందు కనీసం ఒక గంట సేపయినా
కూర్చొనేవారు. ఆతరువాతనే
స్నానం చేసేవారు.
ప్రశ్న --- ఆతరువాత ఏమి చేసేవారు?
జవాబు --- స్నానం చేసిన తరువాత 8 గంటలకు ఉదయం నడకకి వెళ్ళేవారు. ఆతరువాత లెండీబాగ్ లోని కాలువ దగ్గరకు వెళ్ళి అక్కడ వేప, ఔదుంబర, రావి చెట్లకి, ఇంకా అన్ని మొక్కలకి నీళ్ళు పెట్టేవారు.
ఆ తరువాత ద్వారకామాయికి తిరిగి
వచ్చి భిక్షకు వెళ్ళేవారు. భిక్ష పూర్తయిన తరువాత ద్వారకామాయికి వచ్చి గద్దె మీద కూర్చొనేవారు. ఆయనను చూడటానికి వచ్చినవారు ఆయనతో
సంభాషిస్తూ ఉండేవారు. ఆతరువాత మధ్యాహ్న ఆరతి జరిగేది.
ఆరతి పూర్తయిన తరువాత తనకు సమర్పింపబడిన నైవేద్యాలను అందరికీ
పంచెపెట్టిన తరువాత భోజనం చేసేవారు.
ప్రశ్న --- బాబా చూపించిన చమత్కారాలు గాని అధ్భుతాలను ఏమయినా మీరు ప్రత్యక్షంగా ఎప్పుడయినా
చూసారా?
జవాబు --- అధ్బుతాల విషయానికి వస్తే నేనేమి చెప్పగలను. ద్వారకామాయిలో సమావేశమయిన భక్తులందరికీ
ముందు జరగబోయే ముఖ్యమయిన సంఘటనలను చెప్పేవారు. అంతేకాకుండా షిరిడీకి ఎక్కడో దూరంలో
ఉన్న భక్తులకు అపుడే జరిగిన సంఘటనలను చెప్పేవారు. ఆతరువాత ఆ భక్తులు షిరిడీకి వచ్చి
బాబాను దర్శించుకున్నపుడు వారు చెప్పిన విషయాలను అంతముకుందే బాబా చెప్పి ఉండటం
చాలా ఆశ్ఛర్యాన్ని కలిగించేవి. బాబాకు భవిష్యత్తు ముందుగానే తెలిసేది. భక్తుడు ఎవరయినా షిరిడీకి వచ్చిన
వెంటనే తరచుగా బాబా అతనిని అడుగుతూ ఉండేవారు, “ నువ్వు ఆ ప్రదేశానికి
ఎందుకు వెళ్ళావు, నువ్వు ఆవ్యక్తితో ఆవిధంగా ఎందుకు అనుచితంగా
ప్రవర్తించావు, అతనితో ఆవిధంగా ఎందుకు మాట్లాడావు?” ఈవిధంగా ప్రశ్నిస్తూండేవారు.
బాబా ప్రశ్నించినదానిని బట్టి బాబాగారికి తమ ప్రవర్తన గురించి
పూర్తిగా తెలుసుకునే శక్తి ఉందని అన్ని విషయాలు ఆయనకు అవగతమేనని గ్రహించుకునేవారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment