Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, April 3, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 6 వ, భాగమ్

Posted by tyagaraju on 8:51 AM

 



03.04.2022  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి



శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 6 వ, భాగమ్

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

అధ్యాయమ్ – 2

మా అత్తగారు కీ.శే. శ్రీమతి చంద్రాబాయి, బాబా సాన్నిహిత్యాన్ని పొందిన అదృష్టవంతురాలు.  బాబా చివరి దశలో ఆయన నోటిలో తులసీ పత్రాన్ని ఉంచిన భాగ్యశాలి.  మా మామగారు రైల్వేలో ఇంజనీరు గా పని చేస్తున్నారు.  ఉద్యోగ రీత్యా అనేక ఊళ్ళలో ఉండాల్సి వస్తూ ఉండేది.  ఆరోజుల్లో బాబా గురించి చాలా మందికి తెలియదు.


బాబా ఆదేశానుసారం నాగపూర్ నివాసి బూటీ ఒక వాడాను నిర్మించాడు.  బాబా చివరి వరకు అందులోనే నివశించారు.  అదే “ద్వారకామాయి”.  మా మామగారు విలేపార్లే (ఈస్ట్) లో కొంత స్థలం కొన్నారు.  మా అత్తగారికి సంతానం కలిగిన తరువాత ఆయన ఒకచోట స్థిరంగా ఉందామని నిర్ణయించుకొన్నారు.

మా మామగారే స్వయంగా కట్టబోయే ఇల్లు ఎలా ఉండాలన్నది ఒక నమూనా తయారు చేసి, స్వీయ పర్యవేక్షణలో ఇల్లు కట్టి దానికి “శ్రీ సాయినివాస్” అని పేరు పెట్టారు.  ఈ 80 సం. పాత విల్లా ముంబాయిలోని విలేపార్లే (ఈస్ట్) తిలక్ మందిర్ రోడ్ లో ఉంది.  మా ఇంటిలో శ్యామ రావ్ జయకర్ చిత్రించిన శ్రీసాయి బాబావారి పెద్ద తైలవర్ణ చిత్రం ఉంది. జయకర్ ఏ ఆర్ట్స్ కాలేజీలోను చిత్రకళను అభ్యసించినవాడు కాదు.  కాని బాబా అనుగ్రహం వల్ల చిత్రకళను నేర్చుకున్నాడు.

మా అత్తగారికి మా స్వంత ఇంటిలోనే సాయిబాబా వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనే కోరిక బలీయంగా ఉండేది.  తనకు ఉన్న కోరిక ఏవిధంగా నెరవేరిందన్నదాని గురించి దీపావళి సంచికలో ఒక వ్యాసం కూడా ప్రచురింపబడింది.  మా అత్తగారు విజయదశమి, గురుపూర్ణిమలను ఎంతో ఆనందంగా సంబరంగా జరుపుతూ ఉండేవారు.  ఎంతో దూరంనుండి కూడా ప్రజలు వస్తూ ఉండేవారు.  ఒకసారి వసంతరావు గోరక్షక్ అనే ఆయన మా ఇంటికి వచ్చారు.  మా ఇంటిలో ఒక విధమయిన శక్తి ఉన్నదని ఆయన మా అత్తగారితో అన్నారు.  ఆయన ఆవిధంగా అన్న తరువాత మా అత్తగారికి మా ఇంటిలో బాబా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మరలా వచ్చింది.  అనుకున్న ప్రకారం పని మొదలు పెట్టాము.  ఆ సమయంలో షిరిడీలో కూడా బాబా విగ్రహాన్ని ప్రతిష్టించారు.  


అదే మాదిరి విగ్రహం కాంగ్రెస్ హౌస్ లో పెట్టారు.  దానికి ‘సాయిధాం’ అని పేరు.  ‘సాయిధాం’ ట్రస్టీ మాల్ వేకర్ గారు మమ్మల్ని శిల్పి అయిన వసంత గోవెకర్ గారికి పరిచయం చేసారు.  ఆరోజుల్లో మేమంత ఆర్ధికస్థోమత కలవారం కాదు.  అందువల్లనే బాబాకు మందిరం కట్టలేక బాబా విగ్రహాన్ని మాఇంటి అవుట్ హౌస్ లో ఏర్పాటు చేసాము.

రెండు అడుగుల ఎత్తులో బాబా విగ్రహాన్ని చెక్కమని గోవేకర్ గారికి పురమాయించి దానికి తగ్గ డబ్బు కూడా ఇచ్చాము. ఆయన రాజ్ కమల్ దగ్గర పని ప్రారంభించారు.  ఆతరువాత విగ్రహాన్ని చూడటానికి వెళ్ళాము.  చూడగానే ఆశ్చర్యపోయాము.  విగ్రహం ఎత్తు సజీవ రూపం కన్నా ఎక్కువగా ఉంది.  గోవేకర్ గారు ఇంకా అధికంగా డబ్బు అడుగుతారేమోనని భయపడ్డాము.  కాని ఆయన అలా అడగలేదు.  విగ్రహం తెల్ల సిమెంటు, పాలరాయి పొడి కలిపి తయారు చేసారు.  అది ఎంత అందంగా ఉందంటే అచ్చం శ్రీసాయిని చూస్తున్నట్లుగానే ఉంది.

విగ్రహాన్ని పార్లేకి తీసుకువచ్చి, ‘దేశస్థ ఋగ్వేది సంఘ కార్యాలయం’ లో ఉంచాము.  ఆతరువాత మేళతాళాలతో ఊరేగిస్తూ మా ఇంటికి తీసుకువచ్చాము.  చంద్రాబాయి గారు చాలా సంతోషించారు.  నా సోదరుడు సుధాకర్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి వేదికను కట్టించాడు.  శాస్త్రోక్తంగా విధివిధాన పూర్వకంగా శాస్త్రిగారు బాబా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసారు.

దీని తరువాత కొద్దికాలానికే మా అత్తగారు చంద్రాబాయి గారు కాలం చేసారు.  ఆమె ఆఖరి కోరిక నెరవేరింది.  నాకు కూడా ఎంతో సంతృప్తిగా ఉంది.  మనఃస్ఫూర్తిగా నిశ్చలమయిన మనసుతో బాబాను పూజించసాగాము.  మేము మాయింటి క్రింద అంతస్థులో మందిరాన్ని నిర్మించుకున్నాము.

1987 వ.సం. లో పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించాలనిపించింది.  నేను నా కోరికను గోవేకర్ గారికి చెప్పాను.  చాలా తొందరలోనే అక్షయతృతీయ పర్వదినంనాడు మా మందిరంలో సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టింపచేశాము.  ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంతటినీ మా అబ్బాయి బాలకృష్ణ బోర్కర్, కోడలు ఉజ్వలా బోర్కర్ ఇద్దరూ నిర్వహించారు.


(గ్రేట్ చంద్రాబాయి బోర్కర్, కుమారుడు రాజారాం పంత్, కోడలు మంగళతాయి బోర్కర్, మనవడు బాలకృష్ణ్ బోర్కర్)

ఇంతవరకు విజయదశమి, గురుపూర్ణిమలనే జరుపుతూ వచ్చాము.  ఇకనుండి అక్షయతృతీయను కూడా జరుపుకోవడం ప్రారంభించాము.  మెల్లగా మందిరంలో అభివృధ్ధి కార్యక్రమాలు జరగసాగాయి.  నాకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల నా కోడలు ఉజ్వల మందిర వ్యవహారాలు ఇంకా బాగా నడిపిస్తూ ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంది.  నేనొక సామాన్య స్త్రీని.  కాని అసాధారణమయిన సేవ ఏమీ చేయలేను.  కాని అంతా సాయిబాబావారి దయ, అనుగ్రహం వల్లనే సాధ్యమయింది.

ఆరతి చూడటానికి భక్తులెందరో వస్తున్నారు.  రోజు రోజుకి భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.  మందిరం ఉన్న ప్రదేశం ప్రముఖంగా ఖ్యాతి పొంది అందరికీ దాని గురించి తెలిసింది.  మందిరం నిర్మించడానికి గల ముఖ్య కారణం నేనెప్పటికీ మర్చిపోలేను.

బాబాకు సంబంధించిన పుస్తకాలను చదవడం, మందిర ఆవరణంతటినీ పరిశుభ్రంగా ఉంచడం, అవసరంలో ఉన్నవారికి ఏవిధంగా సహాయపడాలా అని వివిధ రకాలుగా ఆలోచించడం, ఈ విధమయిన కార్యక్రమాలన్నిటినీ చేపడుతూ శ్రీ సాయి సూచించిన సూత్రాలననుసరించి    మందిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాము.  ఇటువంటి కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తూ నేనెంతో సంతోషాన్ని, తృప్తినీ పొందుతున్నాను.

                                  కీ.శే. మంగళతాయి బోర్కర్


(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List