18.11.2012 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈరోజునుండి అలనాటి బాబా భక్తుల అనుభవాల మాలిక "శ్రీసాయితో మధుర క్షణాలు" అందిస్తున్నాను. ఈ అనుభవాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రచురించడానికి తగిన సమయం ఇమ్మని, సహాయం అందించమని బాబాని ప్రార్ధిస్తూ ప్రారంభిస్తున్నాను.
ఈ అనుభవాలను సంధ్యా ఉడ్ తా గారు ఆంగ్లంలో "Moments with Shree Sai" పుస్తకంగా వెలువరించారు. దీనికి కాపీ రైట్ లేనప్పటికీ, సాంప్రదాయ బధ్ధంగా మొదటగా వారికి చెప్పి అనుమతి తీసుకోవడం జరిగింది.
మొదటగా శ్రీసాయి ప్రార్ధన.
శ్రీసాయి ప్రార్ధన
(ప్రతిరోజు ఉదయం బాబా
విగ్రహం ముందుగాని, పటం ముందుగాని, దీపం వెలిగించి, బాబా అష్టొత్తర శతనామావళిని చదవండి.
తరువాత శ్రధ్ధా,భక్తులతో ఈ
ప్రార్ధన చేయండి. బాబా మీకు రోజంతా సుఖ
సంతోషాలను కలుగచేస్తారు.)
"సాయిబాబా నేను నీవద్దకు
వచ్చాను. నీపవిత్ర పాదాలవద్ద నాశిరసునుంచి నీకు సర్వశ్యశరణాగతి చేస్తున్నాను. మంచికి, చెడుకి భేదమెరుగలేను. నువ్వు సర్వత్రా నిండివున్నావు. సర్వ
శక్తిమంతుడవు. నన్నెల్లపుడూ సంతోషంగా
ఉంచేది, నాకు అర్హమైనది ఏదో అదే
అనుగ్రహించు. జీవితంలో దురదృష్టాన్ని,
విచారాన్ని భరించే శక్తి నాకులేదు. యిది మాత్రమే నాకుతెలుసు. నేను, నాకుటంబం, బంధుమిత్రులు, యింకా ఈ సమాజంలోని వారందరూ కూడా ఒకరిమీద ఒకరు
ప్రేమానురాగాలతో సుఖ సంతోషాలతో కలసిమెలసి జీవించాలి. ఇదే నేనెల్లప్పుడూ కోరేది. బాబా నన్నెల్లప్పుడు నీకంటికి రెప్పలా కాపాడు.
నా దైనందిన జీవితంలో
నేనెవరికీ హాని తలపెట్టకుండాను, నాకెవరూ హాని
తలపెట్టకుండాను వుండేలాగ అనుగ్రహించు.
రేయింబవళ్ళు సదా నీ సాయి మంత్రాన్నే జపించే వరమివ్వు. అహంకారం, పగ, ప్రతీకారం
యిటువంటి దుష్ట ఆలోచనలు నాదరి చేరకుండా అనుగ్రహించు. నామాటలు ఎవరినీ నొప్పించే విధంగా లేకుండా నన్ను
దీవించు.
నీపాదాల వద్ద
శరణువేడుకోవడం నేనెన్నటికీ మరువను. గతంలో
నేను, తెలిసి గాని తెలియకగాని
చేసిన తప్పులను దయచేసి మన్నించు.
సద్గురు సాయినాధా ! సుఖ
సంతోషాలతో జీవించేలా నన్ను దీవించు.
ఓం శ్రీసాయిరాం
శ్రీసాయితో మధుర క్షణాలు - 1
శ్రీసాయి మూగవారిని కూడా మాట్లాడించగలరు
కష్టాలలో ఉన్నపుడు ప్రతి భక్తునికి వర్ణించనలవికాని ఒక లీల అనుభవమౌతుంది. దాని గురించి వివరించేటప్పుడు అది తమకెంతో ప్రీతిపాత్రమైన అనుభూతిగా వర్ణిస్తారు. సంకటాలలో ఉన్న ప్రతిసారి శ్రీసాయి మహరాజ్ వారి అనుగ్రహానికి పాత్రులయిన కొద్ది మంది భక్తులు ఉన్నారు. శ్రీసాయినాదులవారు వారికొక్కరికే రక్షణ కలిపంచడమే కాదు, వారి కుటుంబానికంతటికీ రక్షణ కల్పిస్తూ ఉండేవారు. అలా జరిగినవాటిలో శ్రీ టీ.ఎల్.ఎస్. అయ్యర్, కుంభకోణంవారి జీవితంలో జరిగిన ఒక లీల.
ఆయనకొక కుమార్తె ఉంది. ఆమె పేరు రాజలక్ష్మి. పుట్టినతరువాత ఆమెకు 8 సంవత్సరముల వయసు వచ్చినా కూడా మాటలు రాలేదు. ఆమ్మ, అప్ప అని కేవలం రెండు మాటలను మాత్రమే పలకగలిగేది. శ్రీసాయినాధుల వారి ఆశీర్వాదముల వల్ల అమ్మాయికి మాటలాడే శక్తి వస్తుంది, ఆమెను షిరిడీ తీసుకొనివెళ్ళండని శ్రీ ఎస్.బీ.కేశవయ్య, శ్రీ జె.పీ.హరన్ (శ్రీసాయికి అంకిత భక్తుడు) సలహా యిచ్చారు. వారి సలహా ప్రకారం శ్రీఅయ్యర్ గారు తమ కుమార్తెను మార్చి, 28, 1942 లో షిరిడీ తీసుకొని వెళ్ళారు. అప్పుడక్కడ శ్రీదాసగణు మహరాజ్ ఉన్నారు. ఆయన ఆమ్మాయిని తన దగ్గర కూర్చోపెట్టుకొని, "సాయిబాబా" అను అన్నారు. రాజలక్ష్మి ఆరెండు పవిత్రమయిన నామములు "సాయి - బాబా" అని అంది. సాయినామములోని శక్తి అటువంటిది. ఆరోజునుంచి ఆ అమ్మాయి వివిధ రకాలయిన మాటలను ఒకదాని తరువాత మరొకటి నేర్చుకోవడం, మాట్లాడటం మొదలు పెట్టింది. యిక ఆమెకు మాట్లాడటం అలవాటయి స్కూలుకు కూడా వెళ్ళే అవకాశం కలిగింది. తన ఈడు పిల్లలలాగే జీవితం గడిపింది.
బాబా దర్శనంతో మూగ అమ్మాయికి మాటలు వచ్చుట లేక మూగతనం పోవుట.
పైన వివరించిన ఇదే వృత్తాంతము "స్వదేశ్ మిల్రన్" అనే తమిళ పత్రికలో 15.09.1944 లో ప్రచురింపబడింది.
శ్రీటీ.ఆర్.ఎస్.మణి అయ్యర్ గారిది కుంభకోణం. ఆయన శ్రీసాయిబాబాకు అంకిత భక్తుడు. ఆయన కూతురు రాజలక్ష్మి పుట్టుకనుంచి మూగది. ఆమెకు 9 సంవత్సరముల వయసప్పుడు సాయిబాబా వారి ప్రేరణతో షిరిడీలోని ఆయన సమాధిని దర్శించుకొన్నారు. అయ్యర్ గారు 28.03.1942 న తమ కుమార్తెను తీసుకొని షిరిడీ వెళ్ళారు. ఎంతో భక్తి శ్రధ్ధలతో బాబాను ఆయన సమాధి వద్ద పూజించారు. ఆ అమ్మాయి "సాయిబాబా, సాయిబాబా" అంటూ అరవడం మొదలుపెట్టింది. ఇవే ఆమె మొట్టమొదటగా మాట్లాడిన మాటలు. మేనెల 1944 లో అయ్యర్ గారు రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళి, బాబావారికి బెనారస్ శిల్క్ శాలువా, తన కుమార్తె ఎత్తుగల వెండి దీపాన్ని బాబావారికి బహూకరించారు.
(యింకా ఉన్నాయి మధుర క్షణాలు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment