09.11.2012 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి సత్ చరిత్ర చదవడం ఒక ఎత్తయితే దానిని అర్ధం చేసుకోవడం మరొక ఎత్తు. అందుకనే సత్ చరిత్ర పారాయణ అన్నది ఏదో మొక్కుబడిగా అమ్మయ్య ఇవాళ్టికి పారాయణ అయిపోయింది అనుకుని చదివితే ఏవిధమైన లాభము ఉండదు. చదివినదాన్ని బాగా జీర్ణించుకోవాలి. అర్ధంచేసుకోవాలి.
ఒక వారం పారాయణ చేద్దాము, ఎప్పుడు పూర్తవుతుందో అని చూడకుండా ప్రతీరోజు వీలయితే ఒక అధ్యాయంగాని, కుదరకపోతే ఒకపేజీ గాని మరీ వీలు కానప్పుడు ఒకటి రెండు పేరాలు చదువుకోవాలి. చదివినదాన్ని బాగా అర్ధం చేసుకోవాలి.
బాబా వారు మనకు సాయి.బా.ని.స. ద్వారా సాయి తత్వాన్ని, సాయి ఈ కలియుగంలోనే కాదు, యుగ యుగాలలోనూ ఉన్నారు అనే సత్యాన్ని మనకందరకూ అర్ధమయేలా చాలా సరళంగా చెపుతున్నారు. ఇది బాబా మన సాయి బంధువులందరకూ ఇచ్చిన అదృష్టమనే చెప్పాలి. సత్ చరిత్రలో బాబా చెప్పారు. నా వయసు లక్షల సంవత్సరాలు అని. ఈ విధంగా మనకు బాబా చెప్పిన మాటలను ఋజువుచేస్తూ సాయి.బా.ని.స. రామాయణంలో సాయి, భాగవతంలో సాయి పోలికలను మనందరము గ్రహించుకొనేలా చక్కగా చెపుతున్నారు.
ఇక ఈరోజు సాయి.బా.ని.స చెపుతున్న శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 7వ.భాగము వినండి.
ఓం సాయిరాం
శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 7వ. భాగము
ఇక ఇప్పుడు భాగవతం విషయానికి వస్తే దేవతలు ధర్మాన్ని తప్పి అధర్మ మార్గాన్ని అనుసరించి ప్రవర్తించడం మొదలుపెట్టారు. రాక్షసులు దీనిని అవకాశంగా తీసుకొని దేవతలనందరినీ ఇంద్రలోకం నుండి వెళ్ళగొట్టి దానిని ఆక్రమించారు. దేవతలందరూ వీధినపడ్డారు. దేవమాత భర్త కశ్యప, కుమారులందరూ ఎందుకలా తయారయ్యారని ఆమెను ప్రశ్నించాడు.
వారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారా? అతిధులను గౌరవభావంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారా? సాధువులకు ఆతిధ్యమిచ్చి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారా? ఆవిధంగా కశ్యపుడు దేవమాతకు అన్నీ వివరంగా చెప్పి దేవతలు ధర్మాన్ని తప్పినందువల్లే రాక్షసులు వారిని సులభంగా జయించారని చెప్పాడు.
మన సాయినాధులవారు కూడా ఇదేవిషయాన్ని చాలా సరళంగా తనభక్తులందరికీ వివరించారు. ఆయన తనభక్తులందరకూ స్వయంగా వండి వడ్డించేవారు.
"భోజనము వేళ మనయింటికి అతిధులు ఎవరువచ్చినా వారికి ఆతిధ్యమివ్వడం మన సాంప్రదాయం. వయసుమళ్ళినవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి ముందర భోజనం పెట్టవలెననీ, ఆకలిగొన్నవారికి ఇచ్చే ఆతిధ్యం ఎంతో సత్ఫలితాలనిస్తుంది" అని బాబా చెప్పారు.
ఇప్పుడు భాగవతంలోనికి వద్దాము. దూర్వాస మహర్షి వల్ల అంబరీషుడు కష్టాలనెదుర్కొన్నాడు.
అంబరీషుడిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని దూర్వాసుని మీద ప్రయోగించాడు.
దూర్వాసుడు పరిగెడుతూ ఇక ఆఖరికి పరుగెత్తలేక ఆగిపోయి, తనను రక్షించమని శ్రీమహావిష్ణువు శరణు వేడుకొన్నాడు. రక్షించడం తనవల్ల కాదని చెప్పి అంబరీషుని వద్దకు వెళ్ళమని చెప్పాడు శ్రీమహావిష్ణువు. తాను తన భక్తులకు సేవకుడిననీ, వారిని రక్షించడానికి తాను ఎక్కడికయినా సరే ఎంతవరకయినా సరే వెడతానని, ఆవుదూడ తనతల్లిని ఎలాగయితే అనుసరిస్తూ వెడుతుందో
తాను కూడా తనభక్తులను అనుసరించే వుంటాననీ, తాను చేయగలిగిందేమీ లేదనీ అంబరీషుడు ఒక్కడే నిన్ను రక్షించగలవాడు" అని శ్రీమహావిష్ణువు చెప్పాడు. ఆఖరికి దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళగా అంబరీషుడు ఆయనను రక్షించాడు.
శ్రీమహావిష్ణువు ఏమాటలయితే చెప్పారో, బాబా కూడా శ్రీసాయి సత్చరిత్ర 15వ. అధ్యాయంలో చెప్పారు. "చేతులు చాచి పిలచినంతనే తాను తన భక్తులవద్ద రేయింబవళ్ళు ఉంటానని బాబా చోల్ కర్ తో చెప్పారు. మీహృదయంలోనే నానివాసం,
నేను మిమ్మలిని సదా కాపాడుతూ ఉంటాను. భక్తుల కష్ట సుఖాలలో తాను కూడా భాగం పంచుకుంటానని చెప్పారు.
లక్ష్మీ కాపర్దే కుమారుడు ప్లేగు వ్యాధితో బాధపడుతున్నపుడు, బాబా తన కఫ్నీని ఎత్తి తన చంకలఓ ఉన్న బొబ్బలను చూపించి, తనను ఆర్తితో రక్షించమని వేడుకొన్న తన భక్తుల బాధలను తాను అనుభవిస్తానని చెప్పారు. "తొందరలోనే మబ్బులు మాయమయి ఆకాశం నిర్మలంగా ఉంటుంది." అన్నారు. అనగా దాని అర్ధం ఆమె కుమారునికి త్వరలోనే నయమవుతుందనీ, అమరావతికి వెళ్ళవలసిన అవసరం లేదనీ చెప్పారు. శ్రీమహావిష్ణువు తనభక్తులకు చెప్పినదానిని బాబా ప్రత్యక్షంగా చూపించారు.
నేనిప్పుడు ఒక ఆసక్తికరమయిన విషయాన్ని వివరిస్తాను. గంగ శ్రీమహావిష్ణువు పాదాల వద్ద పుట్టి భూమిని చేరేముందు పరమశివుని శిరసుపై చేరింది.
గంగ శ్రీమహావిష్ణువుయొక్క చరణకమలాల వద్ద పుట్టినదనే ముఖ్యమయిన విషయం చెప్పబడింది. దాసగణు తాను హరిద్వార్ వెళ్ళి గంగలోమునిగి తన మొక్కును తీర్చుకుని వస్తానని బాబా అనుమతిని అడిగినట్లు మనకు 4వ అధ్యాయములో కనపడుతుంది. అంత దూరము వెళ్ళడమెందుకు, గంగా యమునలు ఇక్కడనే ఉన్నవి అని బాబా చెప్పి తన పాదాల బొటనవేళ్ళనుండి గంగా యమునలను స్రవింపచేశారు.
దాసగణు ఆనీటిని తన శిరసుపై జల్లుకున్నాడు. తన అహంకారం వల్ల దానిని తీర్ధంగా తీసుకొనలేకపోయానే అని తన విచారాన్ని స్తవనమంజరిలో వ్యక్తం చేశారు దాసగణు.
గంగ శ్రీమహావిష్ణువు పాదాల చెంత పుట్టింది అదే అద్భుతాన్ని బాబా ద్వారకామాయిలో చూపించారు.
(మరికొన్ని పోలికలకు ఎదురు చూడండి...)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment