29.11.2012 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 10 వ. శ్లోకం, ప్రతిపదార్ధం
శ్లోకం: సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ||
పరమాత్మ దేవతలకు అధిపతిగను, శరణ్యముగను, సహనముగను, అయిఉన్నాడు. విశ్వమునకు బీజమువంటివాడు. జీవుల పుట్టుకకు కారణమైనవాడు. అట్లే దినము, సంవత్సరము మరియు నర్వమువంటి కాలము తానేయున్నాడు. విశ్వాసమునకు మూలము మరియు సమస్తమును దర్శింపచేయువాడు.
ఇప్పుడు మరలా శ్రీసాయితో మధురక్షణాలను మధురంగా అనుభవిద్దాము. మరలా మరలా అనుక్షణం గుర్తు చేసుకొందాము.
శ్రీసాయితో మధుర క్షణాలు - 7
పేరు చెప్పడానికిష్టపడని భక్తుల అనుభవాలు - 2
1946 వ. సంవత్సరంలో నేను, బొంబాయిలోని మద్రాసీ హిందూ హొటల్ లో మరొక ప్రముఖజ్యోతిష్కుడు హస్తసాముద్రికునితో ఒకే గదిలొ కలసి ఉన్నాను. ఆగదిలోకి ఆయన కోసం ఎంతో మంది సందర్శకులు వస్తూ ఉండేవారు. మొదట్లో ఆయనకు సాయిబాబా అంటే నమ్మకం లేదు. ఎప్పుడో సమాధి పొందిన గురువు గురించి, శక్తిని వృధాగా ఖర్చు చేస్తూ, కాలాన్ని వెచ్చిస్తున్నావని నాతో తరచూ అంటూ ఉండేవాడు. సాయి, నేడు జీవించి ఉన్న ఏ గురువుకన్నాకూడా ఇప్పటికీ చాలా శక్తిమంతుడని నేను చెప్పినపుడు, అంతకన్నా ఎక్కువ శక్తిమంతుడు కాకాపోతే నేను చెప్పినదానిని నమ్మనని చెప్పాడు. ఒకరోజున ఆయన వద్దకు జ్యోతిష్య సంబంధమయిన విషయాలు అడగటానికి వచ్చిన సందర్శకులు ఉన్నప్పటికీ, ఆయనకు బాబా తన శక్తివంతమైన కళ్ళతో తనవైపు చూస్తూ నిలుచుని ఉండటం కనిపించింది. ఆయన ఆశ్చర్యంతో బాబాను చూడటానికి బయటకు వెళ్ళారు. బాబా నన్ను ఉద్దేశ్యించి, గదిలో గోడకు నేను తగిలించిన బాబా పటం గురించి (నా ముఖానికి ఎదురుగా నా పాదాలకు ఎత్తులో ఉంది బాబా పటం) ఇలా చెప్పారు.
"చూడు ఈ మనిషి. వాడు నాభక్తుడినని చెప్పుకొంటాడు. వాడి పాదాలు నాపటానికి ఎదురుగా కనిపించేలా పెట్టుకుని పడుకుంటున్నాడు. నాపటానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని పడుకోవద్దని వాడికి చెప్పు. ఇలా చెప్పి బాబా అదృశ్యమయారు.
బాబా అక్కడ ప్రత్యక్షమయి తనతో మనోహరంగా మనసుకు నాటేటట్లు మాట్లాడటం ఆయనను చాలా ఆశ్చర్యచకితుడిని చేసింది. బాబా జీవించి లేరు అనే అర్ధరహితమైన భావన ఆయన మదిలోనించి తొలగించుకొన్నారు. తాను ప్రత్యక్షంగా బాబాను చూశారు. నన్ను తన భక్తునిగా నామీద ఎంతో మక్కువ కనపరచారు.
ఆ జ్యోతిష్కుడు తనకోసం వచ్చినవారినందరినీ పంపి వేశారు. నేను గదిలోకి రాగానె ఆయన చాలా ఉద్విగ్నతతో జరిగిన యదార్ధాలన్నిటినీ వివరంగా చెప్పారు. గోడమీద బాబా పటం ఎక్కడ ఉన్నదో అక్కడనె ఉంచి, నా పాదాలు ఆయనవైపు ఉండకుండా వుండేటట్లుగా మంచం దిశను మార్చేయమని ఆయన నన్ను పట్టుబట్టారు. వెంటనె మేము మంచం దిశను మార్చి పెట్టాము. ఈ సంఘటనతో ఆయనకూడా బాబాకు అంకిత భక్తుడయారు.
శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీగారి వివరణ.
తన పేరు చెప్పడానికిష్టపడని, బొంబాయిలో నివసిస్తున్న సాయిభక్తుడు చెప్పినదంతా యదార్ధమని నేను నమ్ముతున్నాను..
సాయిసుధ.
మార్చ్, 1950, ఏప్రిల్, 1950
సౌజన్యంతో.
మరికొన్ని మధురక్షణాలకై ఎదురు చూడండి.......
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment