Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, January 26, 2013

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 5

Posted by tyagaraju on 11:18 PM



                                                 

27.01.2013  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత నాలుగురోజులుగా ఊరిలో లేకపోవడం వల్ల కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ అందించలేకపోయాను.  ఈ రోజునుండి యధావిధిగా ప్రచురణ కొనసాగిస్తున్నాను.  

పాఠకులందరికీ ఒక గమనిక.  ఇంతవరకు మన బ్లాగులో జాయిన్ అవనివారు ఎవరైనా ఉంటే బ్లాగులో జాయిన్ అవండి.  బ్లాగులో ప్రచురణ అయినవెంటనే మీ మైల్ కి సందేశం వస్తుంది.  

                                      

ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 27 వ.శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం:  వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వో వృషోధరః 

         వర్ధనో వర్ధమానశ్చ వివిక్తిశ్శ్రుతి సాగరః  ||

తాత్పర్యం: పరమాత్మను, వృషభాసురుని సం హరించినవానిగా, గొప్ప వృషభముగా, అంతటనూ వ్యాపించువానిగా, భూమిని ఫలవంతము చేయు నైసర్గిక బీజములు గలవానిగా, వృషభము వంటి ఉదరము గలవానిగా, అభివృధ్ధియైనవానిగా, మరియు జీవులలో అభివృధ్ధి పొందువానిగా, సృష్టియందు ఉన్ననూ దానినంటక వేరుగానున్నవానిగా, అంతటనూ వ్యాపించి యున్నవానిగా, వేదముల సారము తెలిసినవానిగా ధ్యానము చేయుము.   

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 5 


వాడా నిర్మాణం: 

షిరిడీలో ఆయన ఉన్న కొద్దికాలం సాఠేవాడాలో బస చేశారు.  కాని అక్కడ చాలా అసౌకర్యంగా ఉండటంతో, భగవంతుడు తనకు అంతులేని సంపదనిచ్చాడని దానిని ఆ భగవంతునికే ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు.



కాకా సాహెబ్ తన మనసులో ఉన్న కోరికను శ్రీసాయిబాబాకు విన్నవించుకొని, తాను చేసే సత్కార్యానికి బాబావారి అనుమతి కోరాడు. సరిగా సాఠేవాడాకి ఎదురుగా నున్న చిన్న స్థలాన్ని కొన్నాడు.  బాబావారి అనుమతితో, డిసెంబరు 10, 1910సంవత్సరంలో సాఠేవాడా నిర్మాణం ప్రారంభమయి, నాలుగు నెలల తరువాత పూర్తి అయింది. 

   

మార్చి  12, 1911 సం. కాకా సాహెబ్ గారి గుండె గుడిలో, బాబా వారు తన సమస్త శక్తులతో ఆశీనులై ఉన్నారు. 
                                       

 ఆకారణం చేత ఆయన ఐహిక సంబంధమయిన బంధాలను, అనుబంధాలను క్రమక్రమంగా తగ్గించుకోవడం ప్రారంభించారు.  షిరిడీయే ఆయన నివాసస్థానం.

బాబావారి ఆశ్రయంలో పొందిన మనశ్శాంతి, శక్తివల్ల, కాకా సాహెబ్ గారికి ప్రాపంచిక విషయాల మీద బంధాలమీద ఆసక్తి తగ్గిపోవడం మొదలయి షిర్దీనే  తన ఆవాసంగా చేసుకున్నారు.  ఒకరోజు ఆయన బాబాతో, బాబా, భగవంతుడు నాకు తిండికి లోటు లేకుండా సంపదనిచ్చాడు.  అటువంటపుడు నేను ఈ భవబంధాలలో ఎందుకు చిక్కుకోవాలి?  నా అదృష్టం కొద్దీ నాకు షిరిడీలో ఉండే అవకాశం వచ్చింది.  స్వర్గంలాంటి ఈ షిరిడీని నాకు వదలి వెళ్ళాలనిపించటము లేదు.  నాకింక ఏ నరకమూ వద్దు.  నేను నా న్యాయవాది వృత్తిని వదలివేసి ఇక ఎప్పటికీ షిరిడీలోనే ఉండిపోదల్చుకున్నాను అన్నారు.

శ్రీసాయిబాబా మృదుమధురమైన స్వరంతో అన్నారు, "కాకా, నువ్వు నీన్యాయవాద వృత్తిని వదలుకోవలసిన అవసరమేముంది"

"బాబా నేను నావృత్తిలో సత్యాలని అసత్యాలుగా, అసత్యాలని సత్యాలుగా నిరూపణ చేయాల్సి ఉంటుంది" అని జవాబిచ్చారు.

శ్రీసాయిబాబా, ఇతరులని వారికేదిష్టమయితే వారిని అది చేయనీ, కాని మనమెందుకు చేయాలి.  నువ్వు నీవృత్తిని నిజాయితీతో నిర్వహించు.  కాని నీవృత్తిని వదలి పెట్టాల్సిన అవసరం లేదు అన్నారు. ఈవిధమయిన సలహాతో కాకాసాహెబ్ తన వృత్తిని కొనసాగించారు.  కాని సంవత్సరంలో ఎక్కువ సమయం షిరిడీలోనే గడిపి శ్రీసాయిని మనస్ఫూర్తిగా సేవించారు.

శ్రీసాయిబాబా ఆయనను ప్రతిరోజూ ఉదయం ఏకనాధ భాగవంతం, రాత్రి రామాయణం చదవమని ఉపదేశించారు.  యిది ఆయనకు 62 సం.వయసు వరకూ దినచర్యగా మారిపోయి ఆతరువాత ఆయన ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళిపోయారు.

1926 స.లో కాకా సాహెబ్ దీక్షిత్ కుమారుడు రామకృష్ణకు జబ్బు చేసింది.  అతనిని డా.దేశ్ ముఖ్ గారి ఆస్పత్రిలో చేర్పించారు.  కాక సాహెబ్ తన కొడుకుని చూడటానికి విలే పార్లే నుంచి కొలాబాలో ఉన్న గోవిందరావు ఆర్.దబోల్కర్ గారిని కలుసుకోవడానికి వెళ్ళారు.  ఆస్పత్రికి వెళ్ళేముందు ఆయన పరిమళ భరితమైన అగరువత్తులు వెలిగించి, దాసగణు వ్రాసిన మధురమయిన ఈక్రింది కీర్తనను ఆలపించారు.

"సాయి రహం నజర్ కర్ నా   బచ్చోం కా పాలన్ కర్ నా - జానా తుమ్  నే జగత్ పసారా - సబ్ హీ ఝూట్ జమానా- సాయి  రహం నజర్ కర్ నా - బచ్చోం కా పాలన్ కర్ నా - మై అంధాహూ బందా అప్ కా ముఝసే ప్రభు దిఖలానా - సాయి  రహం నజర్ కర్ నా - బచ్చోం కా పాలన్ కర్ నా - దాసగణు కహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రస్ నా - సాయి  రహం నజర్ కర్ నా - బచ్చోం కా పాలన్ కర్ నా - సాయి రహం నజర్ కర్ నా - బచ్చోం కా పాలన్ కర్ నా -"

తరువాత ఆయన ధబోల్కర్  గారితో కలిసి మాహిం స్టేషన్ కి చేరుకున్నారు.  ఆక్కడ ఆయన శ్రీసాయిబాబా అంకిత భక్తుడయిన రఘునాధ్ పురందరే గార్ని కలుసుకున్నారు.  రామకృష్ణ అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకొని తాను కూడా ఆస్పత్రికి వస్తానని చెప్పారు.  వారు మాహిం స్టేషన్ కి మూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు.  కాని బాబా దయ వల్ల వారు రైలు అందుకోగలిగారు. 

రైలు ఎక్కిన  తరువాత కాకాసాహెబ్ "బాబా ఎంత దయామయులు? ఆయన తన భక్తుల అతి చిన్న కోరికలను కూడా తీరుస్తారు.  మనకి ఈ రైలు తప్పిపోయి వుంటే మనకి ఈరోజంతా వ్యర్ధమయిపోయి రాత్రంతా కొలాబాలోనే గడపాల్సి వచ్చేది" ఇలా అంటూ కాకా సాహెబ్ కళ్ళు మూసుకున్నారు.  కాకా సాహెబ్ శ్రీసాయిబాబాని ధ్యానిస్తూ ఆనందంలో మునిగిపోయారని పురందరే గారు, ధబోల్కర్ గారు ఊహించుకున్నారు.

నాలుగయిదు స్టేషన్ లు దాటిన తరువాత ధబోల్కర్ గారు మెల్లగా "భావూ ! మెలకువగానె ఉన్నారా?" అన్నారు.  ఆయన తన ప్రశ్నని మూడు మార్లు అడిగారు. కాని కాకా సాహెబ్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.  మాహిం స్టేషన్ నుంచి రైల్వే డాక్టర్ గారిని పిలిపించారు.  డాక్టర్ పరీక్షించి, కాకాసాహెబ్ ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళిపోయారని చెప్పాడు.
                                    

కాకా సాహెబ్ గారి శరీరాన్నివిలే పార్లేలోని ఆయన యింటికి తీసుకుని వచ్చారు.  1926 వ.సం. జూలై 5వ. తారీకు ఏకాదశి సోమవారమునాడు 62.సం.వయసులో కాకాసాహెబ్ శ్రీసాయిబాబాలో ఐక్యమయిపోయారు (స్వర్గం).  శ్రీసాయి బాబా ఆయనతో ఎప్పుడూ అంటూ ఉండేవారు "కాకా నేను నిన్ను విమానంలో తీసుకుని వెడతాను."

ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఆయన మరణం సద్గురువుయొక్క దీవెన అనే భావించవచ్చు.

భగవద్గీతలో కూడా "మానవుడు అంత్యకాలమున దేనినయితే స్మరిస్తాడో వాడు దానినే పొందుతున్నాడు" అని చెప్పబడింది.

ఇక్కడ ఈ సంఘటనలో కాకా సాహెబ్ శ్రీసాయిబాబా వారి యశస్సుని, దయార్ద్ర హృదయాన్ని గురించి మాటలాడుతూ ఆఖరి శ్వాసను తీసుకున్నారు.  ఆవిధంగా ఆయనకు సద్గతి లభించింది.  మానవుడు మరణించేముందు నోటితో భగవన్నామాన్ని ఉచ్చరించడం చాలా అరుదు.  కాకా సాహెబ్ లాంటి గొప్పవారు మాత్రమే ఆఖరి చరమాంకంలో భగవంతుని స్మరించడం మరువరు.

(ఇంకాఉంది - రేపు మొదటి అధ్యాయం)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List