04.09.2015 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 5
ఆంగ్లమూలం : ఆర్ధర్ ఆస్ బోర్న్
తెలుగు అనువాదం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
సంకలనం: ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీసాయి అనేకమందికి ఎన్నో విధాల సహాయం చేశారు. కొంతమందిని శిక్షించారు కూడా. చాలా మంది ఆయన చేత తిట్లు-చీవాట్లుతోపాటు దెబ్బలు కూడా తిన్నారు. శ్రీసాయి ఎదుటివాని మనసులోని ఆలోచనలు చెడ్డవైనపుడు అతడు వాటిని ఆచరణలో పెట్టడానికి సమయము యివ్వకుండానె అటువంటి వ్యక్తులను శిక్షించేవారు.
ఒకసారి ఒక భక్తుడు శ్రీసాయి ప్రక్కన కూర్చుని ఉండగా కొందరు శ్రీసాయికి మంచి సువాసన, రంగుగల అరటిపళ్ళు యిచ్చారు.
శ్రీసాయి వాటిని అక్కడ ఉన్న యితర భక్తులందరికీ పంచిపెటుతూండగా శ్రీసాయి ప్రక్కన కూర్చున్న భక్తుని మనసులో ఒక విధమైన అసూయతో కూడిన ఆలోచనలు ప్రారంభమై తనవంతు వచ్చేసరికి అరటిపళ్ళు దొరకవనే భావనతో దిగులుగా మాట్లాడకుండ కూర్చుని ఉన్నాడు. శ్రీసాయి ఆవ్యక్తి ఆలోచనలను గ్రహించి అరటిపండు బదులు అరటిపండు తొక్కను యిచ్చారు. ఈచర్యకు ఆభక్తుడు తన తప్పును గ్రహించి తనకు తగిన ప్రాయశ్చిత్తము జరిగిందని భావించి సంతోషముతో ఆ అరటిపండు తొక్కనే తిన్నాడు. శ్రీసాయి అతనిలో పశ్చాత్తాపమును గ్రహించి తిరిగి మంచి అరటిపండు అతనికి యిచ్చి అతనిని ఆశీర్వదించారు.
ఒక కుష్టురోగి నెమ్మదినెమ్మదిగా మశీదు మెట్లు ఎక్కడానికి ప్రయత్నించసాగాడు. అతని శరీరమునుండి విపరీతమైన దుర్గంధము వస్తూ ఉంది. చీము కారుతోంది. అతని కాళ్ళు కుష్టురోగముతో పూర్తిగా కృశించిపోయాయి. ఆప్రయత్నములో తను శ్రీసాయి ముందుకు వెళ్ళి సాష్ఠాంగనమస్కారము చేయలేననే తలపుతో వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయత్నించసాగాడు. ఇదంతా గమనించుతున్న శ్రీమతి మేనేజరుకు పెద్ద చికాకు తప్పిపోయిందికదా అని ఆలోచించసాగింది. సాయిబాబా ఆమె మనసులోని ఆలోచనను గ్రహించారు. ఒక భక్తుని పిలిచి ఆకుష్టురోగిని తనవద్దకు తీసుకొని రమ్మనమని ఆజ్ఞాపించారు. ఆకుష్టురోగి సంతోషముతో శ్రీసాయిదగ్గరకు వచ్చి సాష్ఠాంగ నమస్కారం చేశాడు. శ్రీసాయి ఆకుష్టురోగి దగ్గర ఉన్న బట్టలమూటను విప్పి అందులోని పాలకోవా బిళ్ళను సంతోషముగా తింటూ, అంతవరకు ఆకుష్టురోగిని చూసి చికాకు పడుతున్న శ్రీమతి మేనేజరుకిచ్చి ఆమె చేత ఆపాలకోవా బిళ్ళను తినిపించారు.
శ్రీసాయి అనుమతి లేనిదే శిరిడీ వదలి వెళ్ళరాదు అనే నమ్మకము విషయంపై ఆలోచిద్దాము. సాధారణంగా ప్రతి శిష్యుడు తన గురువు అనుమతి లేనిదే గురువునుండి దూరముగా వెళ్ళడు. అదే ఆచారము శ్రీసాయిబాబా విషయములో కూడా వర్తిస్తుంది. శ్రీసాయి భక్తులు షిరిడీ వదలివెళ్ళేముందు శ్రీసాయి అనుమతి తీసుకొని వెళ్ళేవారు. శ్రీసాయి చాలామందికి వెంటనే అనుమతి యిచ్చేవారు కాదు. భక్తులు ఆయనపైన నమ్మకంతోనే ఆయన అనుమతి పొందిన తర్వాతనే షిరిడీ వదిలి వెళ్ళేవారు. ఇటువంటి సందర్భములో ప్రయాణములలో ఆలస్యము జరిగినా అవి భక్తుల మేలుకొరకే జరిగేవి.
(అనుమతి లేకుండా వెళ్ళినవారి కష్టాలు, అనుభవాలు రేపు తెలుసుకుందాము)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment