05.09.2015 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 6
ఆంగ్లమూలం : ఆర్థర్ ఆస్ బోర్న్
తెలుగు అనువాదం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు
(నిన్నటి సంచిక తరువాయి)
ఇటువంటి సందర్భంలో భక్తులకు తిరుగు లేని నమ్మకం ఉండవలసిఉండేది. శ్రీ హెచ్.వి. సాఠే గారి అనుభవాలను ఒకసారి పరిశీలిద్దాము. శ్రీ సాఠేగారు రెవెన్యూ కమీషనరు దగ్గిర ఉద్యోగస్థులు. శ్రీ సాఠేగారు తన కుటుంబసభ్యులతో షిరిడీలో ఉండగా అత్యవసర పనిమీద రెవెన్యూ కమీషనర్ ను మరియు జిల్లా కలెక్టరును మన్ మాడులో కలవవవలసిన పని బడింది. శ్రీ సాఠే తను షిరిడీని వదలి వెళ్ళటానికి శ్రీసాయి బాబాను అనుమతి అడగవలసినదని తన కుటుంబ సభ్యులతో పెద్దవారయిన తన మామగార్ని శ్రీసాయి వద్దకు పంపించారు. శ్రీసాయి అనుమతిని నిరాకరించారు. శ్రీసాఠే చికాకుతో తన ఉద్యోగము పోవచ్చుననే భయాన్ని తన మామగారి వద్ద తెలియపర్చి, తిరిగి శ్రీసాయిబాబా అనుమతిని స్వీకరించమని తన మామగార్ని శ్రీసాయిబాబా దగ్గరకు పంపించారు. ఈసారి శ్రీసాయి, శ్రీసాఠేను గదిలో ఉంచి తాళము వేయమని, షిరిడీ వదలివెళ్ళకుండ చూడమని శ్రీసాఠే మామగారితో చెప్పారు.
మూడురోజుల తర్వాత శ్రీసాఠేకు అనుమతి ప్రసాదించారు. శ్రీసాఠే కంగారుగా మన్ మాడ్ వెళ్ళినప్పుడు తెలిసిన విషయమేమంటే ఉన్నతాధికారులు (జిల్లా కలెక్టరు, రెవెన్యూ కమీషనరు) తమ కార్యక్రమాన్ని వాయిదా వేశారనే విషయము.
శ్రీ సాఠే తనకు మన్ మాడ్ వెళ్ళటానికి అనుమతి దొరుకుతుందనే ధైర్యముతో తన సామనులు, తను నివసించటానికి పనికివచ్చే టార్పాలిన్ గుడారము ముందుగా పంపించినా గాని అవి విచిత్ర పరిస్థితిలో మన్ మాడ్ చేరలేదు. ఈపరిస్థితిలో శ్రీసాఠేగారు అన్న మాటలు " నేను షిరిడీలో ఉండిపోవలసివచ్చినందులకు కొంచము మానసిక ఆందోళన తప్పలేదు కాని, నా కుటుంబసభ్యులతో శ్రీసాయి సన్నిధిలో ఎక్కువకాలము గడపగలిగాను అనే తృప్తి మిగిలింది. శ్రీసాయికి అన్నీ తెలుసు. ఆయన ఏమిచేసినా తన భక్తుల మంచికొరకే చేసేవారు. నేను అనవసరముగా మానసిక ఆందోళనకు గురయ్యాను. ఈఅనుభవంతో శ్రీసాయిపై నాకు నమ్మకము ఎక్కువయింది."
ఇక్కడ ఒక్క విషయం చెప్పకతప్పదు. శ్రీసాఠేగారికి శ్రీసాయిపై ముందునుండి నమ్మకము ఉండిఉంటే ఆయన షిరిడీలొ ఉన్నకాలంలో మానసిక ఆందోళన పడేవారే కాదు.
శ్రీసాయి తన భక్తులను షిరిడీలో ఉండమని ఆదేశించటం ఆభక్తులపాలిట వరం. ఎవరైన శ్రీసాయి ఆదేశమునకు వ్యతిరేకముగా షిరిడీని వదలివెళ్ళిన ఆవ్యక్తి ఆపదలను కొని తెచ్చుకొన్నవాడయేవాడు.
బాబా చేసే వింతలు, చమత్కారాలు చాలామందిని ఆకర్షించాయి. కాని కొద్దిమంది శాశ్వత భక్తులు శ్రీసాయినుండి ఆధ్యాత్మిక శక్తిని పొందటానికే వేచిఉండేవారు ఆరోజుల్లో. అటువంటి శాశ్వత భక్తులతో సాయి అంటూ ఉండేవారు "నేను షిరిడీకి మరియు ఈశరీరానికే పరిమితం అయినవాడిని కాను. నేను సర్వాంతర్యామిని. నన్ను తలుచుకొనే ప్రతిక్షణంలోను నీతో ఉండేవాడినే".
శారీరకముగా శ్రీసాయి షిరిడీ వదిలి బయటప్రాంతాలకు వెళ్ళేవారు కాదు. ఈవిషయములో ఒక భక్తుని అనుభవాలను పరిశీలిద్దాము. ఆభక్తుని వివాహ సందర్భంలో ఆభక్తుని తండ్రి శ్రీసాయి దగ్గరకు వెళ్ళి తన కుమారుని వివాహానికి రమ్మనమని వేడుకుంటారు. అప్పుడు బాబా "నీవు ఏమిగాబరాపడకు. నేను ఎల్లపుడు నీతోనే ఉంటాను. నీవు ఎక్కడ ఉన్నా నన్ను తలచుకున్న మరుక్షణములో నీతోనే ఉంటాను" అన్నారు. ఆయినా ఆభక్తుడు శ్రీసాయి మాటలకు తృప్తిచెందకపోవటంతో మళ్ళీ శ్రీసాయి అంటారు "భగవంతుని ఆజ్ఞలేనిదే నేను ఏమీచేయలేను. నేను నిమిత్తమాత్రుడినే".
(రేపు మరికొన్ని సంఘటనలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
om sai ram
Post a Comment