15. 12. 2015 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్. ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
డైరీ – 12
23.11.1911 శనివారం
ఈ రోజు కాస్త
పెందరాడే లేచాను. కాని మళ్ళీ పడుకుండిపోయాను.
దాంతో చాలా ఆలస్యంగా లేచాను. క్రిందకు
వెళ్ళేటప్పటికి షింగ్లే కి , అతని భార్యకి, దర్వేష్ సాహెబ్ కి వారి ఇళ్ళకు వెళ్ళడానికి
అనుమతి లభించిందని తెలిసింది. అందుచేత షింగ్లే
బొంబాయికి, దర్వేష్, కళ్యాణ్ కి వెళ్ళిపోయారు.
దర్వేష్ సాహెబ్ ఆధ్యాత్మికంగా చాలా ముందున్నాడు. అందువల్లనే సాయి మహరాజ్ అతనికి వీడ్కోలు పలకడానికి
గోడకున్న సందు దాకా వచ్చారు.
అతను వెళ్ళిపోవడం
నాకు చాలా వెలితిగా అనిపించింది కారణం మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బొంబాయిలో న్యాయవాది మారుతి తన నలుగురు
సోదరులు, భార్య, ఇంకా చాలా మంది పిల్లలు కుటుంబంతో సహా నిన్ననే వచ్చాడు. ఆయన చాలా మంచి మనిషి. మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాము. క్రిందటి సంవత్సరం నాకు పరిచయమయిన మహాజని ఈరోజు
వచ్చాడు. అతను మంచి మంచి పళ్ళు, సాయిబాబాగారి
దీపాలకి గాజు బుడ్లు, తీసుకుని వచ్చాడు. థానా నుండి గోవర్ధన దాస్ కూడా వచ్చాడు. అతను మంచి పళ్ళు, చావడిలో సాయి మహరాజ్ కోసం తయారయిన గదికి సిల్కు తెరలు, అక్కడ చత్రాలు, చామరాలు పంఖాలు పట్టుకుని స్వచ్చంద సేవ
చేసే వారికోసం కొత్త బట్టలు తీసుకుని వచ్చాడు.
అతను చాలా ధనికుడని అంటారు. దీక్షిత్
వాడాలో నివసించడం గురించి మాధవరావ్ దేశ్ పాండే, నా భార్య, మా అబ్బాయి వీరి మధ్య అర్ధం
పర్ధం లేని అభిప్రాయ భేదం వచ్చింది. వాడా దీక్షిత్
ది కాదు, మాధవరావుది కాదు తమదేనన్నారు సాయి మహరాజ్.
అందుచేత ఆవిషయం అంతటితో ముగిసింది. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు నేను చూడలేదు. కాని ఆయన తిరిగి మసీదుకు వచ్చేటప్పుడు ఆయనకు నమస్కరించుకున్నాను. ఆయన నాకు ఒక పండు. చిలుము ఇచ్చారు. మధాహ్నం భోజనం అయిన తరువాత కాసేపు నిద్రపోయాను. తరువాత ఈ రోజు వచ్చిన వార్తాపత్రికలు చదువుతూ కూర్చున్నాను. తిలక్ విడుదల నిర్ణయమయిందని ప్రస్తావన వచ్చింది
కాని దాని గురించి ఎటువంటి సూచనలు ఇంతవరకు రాలేదు. బొంబాయినుండి వచ్చిన క్రొత్తవారెవరూ ఎటువంటి సమాచారం
ఇవ్వలేకపోయారు. వామన్ రావ్ పటేల్ ఎల్.ఎల్.బి.
పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. డా.హాటే కూడా ఉత్తీర్ణుడయ్యాడని
విన్నాను. సాయి మహరాజ్ అతనికి చాలా మంచి వార్త
వస్తుందన్నారు. టిప్నిస్ తన బసని మార్చుకున్నాడు. అతని భార్యకి కాస్త నయమయింది. ఆమె ఇంతకు ముందున్నంత అస్థిమితంగా లేదు. రామమారుతి బువా ఇంకా ఇక్కడే ఉన్నాడు. మేము శేజ్ ఆరతికి వెళ్ళాము. ఊరేగింపు చాలా మనోహరంగా ఉంది. క్రొత్త తెరలు, క్రొత్త బట్టలు చూడాటానికి చాలా
అందంగా ఉన్నాయి. నాకు చాలా ఆనందం కలిగింది. అటువంటి ఖరీదయిన కానుకలు ఇచ్చే శక్తి నాకు లేనందుకు
జాలి పడాల్సిన విషయం. రాత్రి భీష్మ భజన జరిగింది.
దీక్షిత్ రామాయణం చదివాడు.
24.12.1911 ఆదివారం
ఉదయం తొందరగా
లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు
ప్రార్ధించుకుని నడచుకుంటూ వచ్చాను. మారుతికి
తిరిగి వెళ్ళడానికి అనుమతి లభించింది. దాదాపు
ప్రతి ఒక్కరికీ వీడ్కోలు చెప్పి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు. అతను చాలా చాలా మంచి మనిషి. వామనరావు పటేల్ కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా మంది సందర్శకులు వచ్చారు. వారిలో అనసూయా బాయి అనే ఒకామె ఉంది. అధ్యాత్మికంగా ఆమె చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా
కన్పించింది. సాయిమహరాజ్ ఎంతో ఘనంగా గౌరవాదరణలతో
ఆమెకు నాలుగు పళ్ళు ఇచ్చారు. తరువాత సాయిమహరాజ్
నలుగురు కొడుకులున్న ఒక తండ్రి కధ చెప్పారు.
వాళ్ళలో నలుగురు కొడుకులు ఆస్థిలో తమ వాటా అడిగి మరీ తీసుకున్నారు. వారిలో ఇద్దరు మరలా తండ్రితో కలిసి ఉందామనుకొన్నారు. తరువాతివాడు ఈ ఇద్దరిలో ఒకరికి విషం పెట్టమని తల్లిని
ఆదేశించాడు. ఆమె కొడుకు చెప్పినట్లు చేసింది. మరొకడు పెద్ద చెట్టు మీదనుండి పడి బాగా గాయాలయి
చనిపోయే దశకు వచ్చాడు. కాని తండ్రి అతనిని
పన్నెండేళ్ళపాటు జాగ్రత్తగా కాపాడాడు. కొడుకుకి,
ఒక కొడుకు, కూతురు జన్మించిన తరువాత తండ్రి మరణించాడు. సాయి మహరాజ్ అయిదవవాని గురించి చెప్పలేదు ఈ కధ అసంపూర్ణంగా ఉందనిపించింది నాకు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కాసేపు పడుకుని తరువాత
రామాయణం చదివాను. టపా వచ్చింది. వార్తా పత్రికలు చదవడంలో సమయం గడిచిపోయింది. సాయంత్రం ఎప్పటిలాగే చావడి ఎదురుగా సాయిమహరాజు ను
దర్శించుకోవడానికి వెళ్ళాము. భీష్మ భజన, దీక్షిత్
రామాయణ పఠణం కార్యక్రమాలు జరిగాయి. డా.హాటే
ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఆయన చాలా చాలా మంచి మనిషి. మహాజని కూడా ఇక్కడే ఉన్నాడు.
(మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment