Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, June 22, 2017

శ్రీసాయి తత్త్వసందేశములు –17 వ.భాగమ్

Posted by tyagaraju on 6:45 AM
Image result for images of shirdi saibaba smiling face
Image result for images of rose hd
22.06.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)

శ్రీసాయి తత్త్వసందేశములు –17 .భాగమ్

62.  19.01.1994 తెల్లవారుఝాము 3.30 గంటలకు పూజామందిరములో శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము

విశ్వశక్తిని లీనము చేసుకొనుటకు, విశ్వచైతన్యాన్ని ప్రకటించుటకు, విశ్వరహస్యాలను తెలుసుకొనగోరి, సత్యశోధనకై పరమాత్మ యోగప్రాప్తికై జ్ఞానకర్మ భక్తియోగముల ద్వారా సాధన చేయు జిజ్ఞాసులకు, మోక్షగాములకు భగవత్ సాక్షాత్కారము పొందగోరు ఆధ్యాత్మచింతనాపరులకు, ఆప్తుడనై జ్ఞానబంధువునై, మార్గదర్శకుడనై, సాధన చేయించుకొనువాడను నేనే.  విశ్వచైతన్యాన్ని అవలీలగా నాకృపతో భక్తులకు అందించు పరిపూర్ణయోగీశ్వరుడను, యోగి చక్రవర్తిని నేనే.
         


     Image result for images of shirdi saibaba smiling face
జ్ఞానులు, పరమహంసలు, అవధూతలు, సిధ్ధపురుషులు, యోగులు సాధువులు సాధకులు, భక్తులు, జిజ్ఞాసువులు, మోక్షగాములు, ఆత్రులు, అర్ధార్ధులు ఎందరో నన్ను స్థుతించి పూజిస్తూంటారు.  నన్ను నమ్మి నాకు పూర్తి శరణాగతులైనవారికి నేను ఆపద్భాంధవుడను, పతితోధ్ధారకుడను, ఆర్తత్రాణ పరాయణుడను, జీవిత సలహాదారుడను, కుటుంబ యజమానిని, తల్లి, తండ్రి గురువు దైవము, ప్రాణము ఊపిరి అన్నీ కూడా నేనే.  నాలీలాస్రవంతిని మనోగతముగా ప్రత్యక్షముగా, పరోక్షముగా అంతరాత్మ సాక్షిగా అనుభవించినవారే నా అవతారమును అర్ధము చేసుకొనగలరు.  నా అనుగ్రహ లీలా మహిమలు వర్ణించుట ఎవరికి సాధ్యము కాదు.

దేహానికి, మనస్సునకు వైద్యుడను.  మానవ జీవన మానవతకు మార్గదర్శకుడను నేనే.  నన్ను నమ్మినవారికి అజ్ఞానమునుండి తొలగించి జ్ఞానసాధన చేయించి, ఆత్మశక్తిని పెంపొందెంచెదను.  మనిషిని మహాత్మునిగా మలచు సద్గురువును నేనే.  పామరుడను పండితునిగాను, నిస్సహాయుడను అసహాయశూరుడుగాను, అజ్ఞానిని జ్ఞానిగాను, అశాంతితో అలమటించు బాధామయ జీవులను సుఖశాంతిపరులుగాను మార్చగలను.  పూజలు పునస్కారములు, ఉపవాసములు, వ్రతములు, భజనలు, సంకీర్తనలు, నివేదనలు, ప్రార్ధనలు, ధ్యానములు, నాకు అవసరము లేదు. నాకు నిశ్చలమైన భక్తియే ముఖ్యము.
             Image result for images of shirdisaibaba book and woman
ఎవరైతే నాకు పూర్తి శరణాగతులయ్యెదరో, వారికి అభయమిచ్చే అమృతమూర్తిని.  ఆధ్యాత్మిక చింతన సత్ ప్రవర్తన, సాధనాక్రమము, నా భక్తులలో కలిగించుటకు భౌతిక శరీరములో వున్నప్పుడు నేనొక పత్రికను నా భక్తునిచే నడిపించినాను.  నా తదనంతరము నిర్వాహకుల లోపము వలన ఆ పత్రిక నడుపుట ఆగిపోయినది.

భక్తుల అంకిత భావము శ్రధ్ధ అన్నీ కలసి వున్నప్పుడే సద్గ్రంధ రచనకు రూపము లభిస్తుంది.  నా తత్త్వప్రచారము పత్రిక ద్వారా జరగవలసియున్నది.  సంఘజీవులైన మీలో ఐక్యత లోపించి కార్యరూపములో అహంకారములు కలిగి మిత్రుల మధ్య అవగాహన ఆత్మీయత విశ్వాసము లోపించినందున భేదాభిప్రాయములు పొడచూపుచున్నవి.  వీటి అన్నిటికి మూలకారణము అహంకార భావమనే మాయలోపడి అహాన్ని వదలుకోలేకపోవుచున్నారు.  ఎవరికి వారు ఆత్మవిమర్శన చేసికొని నాదయా భిక్ష కొరకు పరితపించిన మీ మధ్య వున్న స్పర్ధలుపోయి నిజమైన మిత్రులు అయ్యెదరు.  నా నామమే మీ ఉఛ్వాస నిశ్వాసములు అనే సత్యాన్ని తెలుసుకొనండి.

63.  20.01.1994 ఉదయం 6 గంటలకు శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము

మీలో చాలా మంది సాధన ఎందుకు చేయుచున్నారో మీకే తెలియదు.  దైవంపై మీ భావం చాలా మితమైనది.  సంకుచితమైనదిగా యున్నది.  భగవద్దర్శనము పొందే ముందు దైవము గురించి సరియైన భావము కలిగియుండాలి.  భగవంతుడు ప్రపంచమంతా వ్యాపించినవాడు గాను. అతీతుడని తెలుసుకొనవలయును.  ఈ విషయము తెలిసికొనవలయునంటే, మీలో వున్న అహంకారము పోవాలి.  మీ యిఛ్ఛ దైవేఛ్ఛతో, మీ చైతన్యం భగవత్ చైతన్యంతో మీ జీవితం విశ్వజీవితంతో ఏకం చేసిన, అనంత శాంతిని అనందాన్ని అనుభవిస్తారు.

మీరు రూప నామాలు లేని, మార్పులేని, చావు పుట్టుకలు లేని, అనంతమైన శాశ్వత సత్యమే మీరని తెలిసికొన్నప్పుడే మీ వ్యక్తిత్వమునుండి అవ్యక్తములోనికి, మార్పుగల స్థితినుండి సత్యానికి, నామ రూప స్థితినుండి నామరూప అతీత స్థితికి వెళ్ళగలరు.

ఎప్పుడు మీరు పరమాత్మను శరణుపొంది పూర్తిగా అధీనులై అహంకారాన్ని సంపూర్ణంగా వదలుకొని, భగవంతుని అంతటా కనుగొన్నంత వరకు, వాసనలు మిమ్ములను వదలిపెట్టవు.  సర్వాత్మ భావం అంతా భగవంతుడె అనే దృష్టి అనుభవం కలిగినప్పుడు, వాసనలు పూర్తిగా ధ్వంసమయిపోతాయి.  అప్పుడే మీ ఇంద్రియాలు, మనస్సు, శరీరం అంతా దివ్యత్వం పొందుతుంది.  వ్యక్తిత్వ భావం వలన వచ్చే వాసనలకు స్థానం లేదు.  ఎప్పుడైతే వ్యక్తిత్వం భావం పోతుందో, అప్పుడే స్వాభావిక వాసనలు పోయి తీరుతాయి.  వాటి మూలస్థానం అయిన అహంకారభావాన్ని పోగొట్టుకోగలిగితే తప్ప వాసనలు పూర్తిగా ధ్వంసం కావు. 
ఆధ్యాత్మిక ఉన్నతి లేక, ఎన్ని సంవత్సరములు సాధన చేసినను లాభము లేదని గ్రహించండి.


64.  04.02.1994 మధ్యాహ్నం 1.30 గంటలకు వాశిరెడ్డి ప్రెస్ లోని పూజామందిరములో వచ్చిన సందేశము.

మీలో అహంకారము పోనంతవరకు ఆధ్యాత్మికముగా వృధ్ధి చెందలేరు.  అహంకారము మచ్చుకైనా లేనప్పుడే నా లీలలు, నా బోధలు ప్రచారము చేసే శక్తిని పొందగలరు.  నేను ఎవరో నా అవతారము ఏమిటో తెలుసుకొనలేని అజ్ఞానస్థితిలో మీరు పడియున్నారు.  నన్ను పూర్తి విశ్వాసముతో ధ్యానించేటప్పుడు కలిగే అనుభవములే నా వేదాంతము.  నా వేదాంతమనేది మరియొకటి లేదు.  నా బోధలలోని అంతరార్ధము తెలుసుకొనలేక తేలికభావనతో ప్రవర్తించుచున్నారు.  నా సందేశములలోని భావమును గ్రహించి ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించిన మీ జన్మకు సాఫల్యము కలుగును.  
         Image result for images of shirdisaibaba book and woman
మేఘమునుంచి వర్షపు జల్లులు ఏవిధముగా విస్తరించునో అట్లే నా అనుభూతులు, లీలలు వాడవాడలలో ప్రచారము చేసి సామాన్య ప్రజలలో చైతన్యము కలిగించండి.  నేను సర్వాంతర్యామిని.  మీకు మీరు ఆత్మ విమర్శన చేసుకొని మీలోపములు సవరించుకొనండి.  మీ స్వయం కృషితో భగవంతుని కరుణకు దగ్గరకండి.  వ్యక్తిగత శాంతియే విశ్వశాంతి.  మహిమలు, సిధ్ధులు జ్ఞానానికి అవరోధాలు.  చిత్తశుధ్ధి వుంటేనే శాంతి.  అదే దైవ సాక్షాత్కారం.  చిత్తశుధ్ధి సాధించవలయునంటే అభిమానం లేకపోవడం, డంభము వదలటం, హింస తొలగించడము, ఓర్పుకలిగి యుండుట, స్థైర్యం, శుచి, మనోనిగ్రహం, అహంకార రాహిత్యము, భోగాలలో నిరాసక్తత, సమబుధ్ధి, సుఖదుఃఖాలలో సమత్వం, రాగద్వేషాలు లేకుండా యుండుట. నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి యుండవలయును.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List