Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, October 4, 2019

ఆపదలలో ఆదుకునే సాయిబాబా

Posted by tyagaraju on 9:04 AM

       Image result for images of shirdi saibaba smiling
           Image result for images of rose hd
04.10.2010  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ పుస్తక ప్రచురణకి బాబా వారి ఆశీర్వాదములతో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలపడానికి సంతోషిస్తున్నాను.  ఓమ్ సాయిరామ్

ఈ రోజు సాయిలీల మాసపత్రిక జూన్ 1985వ.సంవత్సరంలో ప్రచురించిన అధ్భుతమయిన బాబా లీల గురించి తెలుసుకుందాము.
తెలుగు అనువాదమ్  ః  ఆత్రేయపురపు త్యాగరాజు

ఆపదలలో ఆదుకునే  సాయిబాబా

అది 1984వ.సంవత్సరమ్, జనవరి నెల గురువారమ్ 19 వ.తారీకు.  నేను, నా స్నేహితుడు టి.ఆర్.సి.మీనన్, ఇద్దరమూ జలగావ్ జమోడ్ (మహారాష్ట్ర) లోని జడ్.పి. గెస్ట్ హౌస్ నుండి బయలుదేరాము. నదూరా రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి బయటనే సిధ్ధంగా ఉన్న ఖాళి టాక్సీలో ఎక్కి కూర్చున్నాము.  టాక్సి బయలుదేరడానికి ఇంకా అరగంట సమయం ఉండని డ్రైవర్ చెప్పాడు.  ఈ లోగా టీ త్రాగి వద్దామని మేమిద్దరం రోడ్డు దాటి ఎదురుగా ఒక చిన్న టీ కొట్టు దగ్గరకు వెళ్ళాము.  అప్పుడు సమయం ఉదయం గం.6.30 అయింది.


మేమిద్దరం టీ కొట్టులో కూర్చుని రొట్టె, టీ తెమ్మని టీషాపతనిని చెప్పాము.  టీ షాపు ప్రక్కనే ఒక కిళ్ళీ దుకాణం ఉంది.  ఆషాపులో ఉన్న సాయిబాబా ఫొటో మీద నాదృష్టి పడింది.  నా స్నేహితునికి కూడా ఆఫొటోను చూపిస్తూ ఈ రోజు గురువారమ్ పవిత్రమయిన రోజు.  ఉదయాన్నే మనకు సాయిబాబా దర్శన భాగ్యం కలిగింది అన్నాను. 

టీ షాపతను మా బల్లమీద, బ్రెడ్ తీసుకువచ్చి పెట్టాడు.  మాకోసం ప్రత్యేకంగా టీ చేసి తీసుకురావడానికి టీ తయారు చేస్తున్నతని దగ్గరకు వెళ్ళాడు.  నేను బ్రెడ్ పై ఉన్న కవరును విప్పుతూ మీనన్ ని కూడా తీసుకోమన్నాను.  తనకు బ్రెడ్ వద్దనీ, టీ ఒక్కటే చాలని చెప్పాడు .  ప్రక్కనే ఉన్న కిళ్ళీదుకాణంలో కనిపిస్తున్న బాబా ఫొటోనే చూస్తూ మౌనంగా కూర్చున్నాను.  నేను బాబా మీదనే మనసు నిలిపి ఆయననే ధ్యానిస్తూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాను. 
                    Image result for images of shirdi saibaba smiling

నేను కళ్ళు తెరవగానే నా ఎదురుగా టీ షాపు గుమ్మం వద్ద 28 సంవత్సరాల వయసుగల ముస్లిమ్ ఫకీరు కనిపించాడు.  అతను చిరునవ్వు నవ్వుతూ నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు.  అతను తలకు ఆకుపచ్చని గుడ్డ చుట్టుకుని ఉన్నాడు.  వదులుగా ఉన్న కుర్తా, లుంగీ ధరించాడు.  అతని చేతిలో నల్లరంగు భిక్షాపాత్ర ఉంది.  అది చూడగానే అతను భిక్షకోసం వచ్చినట్లుగా తెలుస్తూనే ఉంది.  కాని, విచిత్రమేమిటంటె ఆ యువఫకీరు ఎవరినీ భిక్షకోసం గాని, డబ్బుకోసం గాని యాచించడంలేదు.  నావైపే చిరునవ్వుతో ప్రశాంతంగా చూస్తూ నిలబడి ఉన్నాడు.
     Image result for images of shirdi saibaba smiling
ఆ ఫకీరు ఒక్కమాట కూడా మాట్లాడలేదు.  ప్రకాశవంతంగా ఉన్న అతని కళ్ళలోనుంచి ప్రసరిస్తున్న చూపులు నాపై ప్రేమను కురిపిస్తున్నాయి.  ఎంతో మనోహరంగా అతని పెదవులపై నాట్యమాడుతున్న చిరునవ్వు నాలో ఏదో తెలియని ఆనందాన్ని కలిగిస్తూ ఉంది.  పౌర్ణమినాటి చంద్రుడిని చూసి సముద్రంలోని తరంగాలు ఉవ్వెత్తున ఎగసి పడే రీతిలో ఆయువ ఫకీరును చూసినంతనే నాలో ఆనందతరంగాలు ఎగసి పడుతున్నాయి.  మా ఇద్దరిమధ్యా ఏదో తెలియని వింత అనుభూతి, ఏవో చెప్పలేని భావాలు కలుగుతూ ఉన్నాయి.  ఆ అనుభూతిని నేను మాటలలో వర్ణించలేను.

నేనా ఫకీరును నా దగ్గరకు రమ్మన్నట్లుగా మౌనంగా తల ఊపాను.  ఆ ఫకీరు నాదగ్గరకు వచ్చాడు మా ఇద్దరి మధ్య బల్ల ఉంది.  నేను భక్తిపూర్వకంగా రెండు బ్రెడ్ ముక్కలను అతనికి ఇచ్చాను.  ఆ ఫకీరు నేను ఇచ్చిన బ్రెడ్ ముక్కలను తీసుకుని ఇంక ఆలస్యం చేయకుండా చేయి ఊపి చాలా వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. ఇంక   నాకతను కనిపించలేదు.  ప్రకాశవంతంగా వెలుగుతున్న అతని వదనంలోనుంచి ఎంతో ప్రేమతో వెలువడిన ఆ సన్నని చిరునవ్వు నా మనసులో ఇంకా మెదలుతూనే ఉంది.  ఆఫకీరు సాయిబాబా తప్ప మరెవరూ కాదని నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది.

అప్పుడు నేను మీనన్ వైపు తిరిగి “ఆఫకీరు గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగాను.
“ఆ ఏముంది? అతను ఒక బిచ్చగాడు అంతే” అని చాలా తేలికగా కొట్టిపారేశాడు.
“కాదు, నువ్వు అన్నది తప్పు.  అతను బిచ్చగాడు కాదు.  మనిద్దరినీ ఆశీర్వదించడానికి మారురూపంలో వచ్చిన షిరిడీ సాయినాధులవారే” అని గట్టి నమ్మకంతో అన్నాను.

నేనన్న మాటలకు మీనన్ అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా నిర్లక్ష్య దోరణిలో ఒక నవ్వు నవ్వి, “కొన్ని నిమిషాలక్రితమే నువ్వు సాయిబాబా  ఫొటో చూసావు.  నువ్వు బాబా గురించే ఆలోచిస్తూ ఉన్నావు.  అదే సమయంలో ఈ బిచ్చగాడు నీకు కనపడ్డాడు.  అందువల్లనే ఆఫకీరు సాయిబాబాయే అనే భ్రమలో మునిగిపోయావు” అన్నాడు.

అది నా భ్రమకాదు.  ఆ ఫకీరు ఖచ్చితంగా సాయిబాబాయే అని అతనికి అర్ధమయేలా చెప్పాను.  నా వివరణకి సాక్ష్యంగా ఈ విషయాలు చెప్పాను.

“సరే, ఆ ఫకీరు తన చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని ధర్మంకోసం వచ్చాడనే అనుకుందాము.  మరి అటువంటప్పుడు అతను ఎవరినీ ధర్మం చేయమని యాచించలేదు.  ఎందుకని?  టీలు తయారుచేస్తున్న టీ షాపతనిని కూడా ఎందుకని ధర్మం చేయమని అడగలేదు?  మనం అతనికి ఇచ్చిన రొట్టె తీసుకుని, ఇంక ప్రక్కనున్న టీ షాపుల దగ్గరకు గాని, కిళ్ళీ దుకాణాలకు గాని ఎక్కడికీ వెళ్లలేదెందుకని?  ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అతను ఏదో కారణం చేతనే మనలని కలుసుకోవడానికి వచ్చినట్లుగా అనిపించడంలేదూ?  అందుచేత ఆ ఫకీరు సాయిబాబా తప్ప మరెవరూ కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను” అని వివరంగా చెప్పాను.

అధ్బుతమయిన ఆ సంఘటన ద్వారా సాయిబాబా మనకి దర్శన భాగ్యం కలిగించారని నేను ధృఢమయిన విశ్వాసంతో మీనన్ కి అర్ధమయేలా వివరించాను.

మా ప్రయాణం ముగించుకుని రెండు రోజుల తరవాత నేను ఔరంగాబాద్ కి తిరిగి వచ్చాను.  ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా అదిరిపడ్దాను.  వంటింట్లోని గోడలు, గదిపై కప్పు, కిటికీ అద్దాలు బాగా దెబ్బతిని ఉన్నాయి.  నా భార్య ఉష కొద్దిరోజుల క్రితమే జరిగిన భయంకర సంఘటన గురించి వివరంగా చెప్పింది.

1984, జనవరి, 19 వ.తారీకు గురువారమ్ ఉదయం 10 గంటలకు వంట చేయడానికి కుక్కర్ లో అన్ని పదార్ధాలు పెట్టి తయారుగా ఉంచింది.  గ్యాస్ అయిపోవడం వల్ల కుక్కర్ ని కరెంటు స్టవ్ మీద పెట్టింది.  కరెంటు స్టవ్ ఆన్ చేసి, తను హాలులోకి వెళ్ళి పుస్తకాలు చదువుతూ కూర్చుంది.  వంట చేసేటప్పుడు తను చాలా అప్రమత్తంగానే ఉంటుంది.  కాని ఆరోజు మాత్రం పుస్తకాలు చదవడంలో లీనమయిపోవడం వల్ల స్టౌ మీద కుక్కర్ పెట్టిన విషయం గుర్తుకు రాలేదు.  ఆ తరవాత టైమ్ చూస్తే గం.10.45 అయింది.  స్టౌ మీద కుక్కర్ పెట్టిన విషయం గుర్తుకు వచ్చి ఒక్క ఉదుటున సోపాలోంచి లేచింది.  45 నిమిషాలయినా కుక్కర్ విజిల్ ఎందుకని రాలేదోనని ఆశ్చర్యపోతూ వంట గదిలోకి ప్రవేశించడానికి ఇక కొద్ది అడుగుల దూరం మాత్రమే ఉండగా ఒక్కసారిగా బ్రహ్మాండం బ్రద్దలయేలా చెవులు చిల్లులు పడేంతగా పెద్ద శబ్దం వినపడింది.  ఆ శబ్దానికి గుమ్మందగ్గరే ఆగిపోయింది.  ఆ శబ్దానికి గుమ్మందగ్గరే ఆగిపోయిన ఆమె అదిరిపడింది.  ప్రెషర్ కుక్కర్ ప్రేలిపోయి పెద్ద ప్రమాదాన్ని సృష్టించింది.  అది ఊహించరాని ప్రమాదం.
కుక్కర్లో ఉన్న ఆవిరంతా బయటకు తన్నడంతో కుక్కరు పేలిపోయి పై మూత మొట్టమొదటగా వంటింటి పైకప్పుకు తగిలి, ఆ తరవాత ఫ్లైయింగ్ సాసర్ లా గిర్రున తిరుగుతూ వంట గదికి రెండు వైపులా ఉన్న గోడలని, కిటికీని గుద్దుకుంటూ క్రిందపడింది.  కిటికీకి ఉన్న గాజు అద్దాలు పగిలిపోయాయి.  గదిగోడలు, పైన కాంక్రీటు సీలింగు బాబా దెబ్బ తిన్నాయి.  ఆ అదురుకి భూకంపం వచ్చినట్లుగా షెల్పులో ఉన్న సామానులన్నీ క్రిందపడిపోయాయి.  ప్రెస్టిజ్ కంపెనీ వారి బాగా దళసరిగా  ఉన్న హిండాలియం కుక్కర్ పూర్తిగా మెలికలు తిరిగిపోయి అసలు దాని ఆకారం కనపడకుండా అయిపోయింది.  కరెంటు స్టౌ ముక్కలు ముక్కలుగా అయి చెల్లాచెదురుగా పడ్డాయి.  కరెంటువైరు తెగిపోయి ప్లగ్ లోనుంచి క్రిందకు వ్రేలాడుతూ ఉంది.  కుక్కర్ లో ఉన్న అన్నం, పప్పు, కూరగాయలు అన్నీ వంటింటి గోడలమీద, పైకప్పుమీద బాగా విరజిమ్మబడి అంతా మరకలు పడ్డాయి.

కుక్కర్ ప్రేలుడు శబ్దానికి చుట్టుప్రక్కల ఉండే ఆడవాళ్లందరూ, గ్యాస్ సిలిండర్ ప్రేలిందేమోనని భయపడుతూ మా అపార్ట్ మెంటుకు వచ్చారు.  గ్యాస్ సిలిండర్ ప్రేలితే ఎంత ప్రమాదం జరుగుతుందో, కుక్కర్ కూడా అంతే ప్రమాదాన్ని సృష్టించడంతో చాలా భయపడిపోయారు.  నాభార్యకు ఎటువంటి ప్రమాదం జరగనందుకు ఆమె ఎంతో అదృష్టవంతురాలని అందరూ ఓదార్చారు.

నా భార్య ఉషకు ఎటువంటి ప్రమాదం కలగకుండా సాయిబాబా రక్షించారు.  ప్రమాదం జరగడానికి ఒక్క సెకను ముందుగా వంట గదిలోకి వెళ్ళినట్లయితే నాభార్య మరణించి ఉండేది.  అటువంటిదేమీ జరగకుండా బాబా క్షణంలోనే స్పందించి కాపాడారు.  ఆ సమయంలో చిన్నపిల్లలయిన మా ఇద్దరు అబ్బాయిలు సాయినాద్, వంశీనాద్ లు స్కూలుకు వెళ్ళడంవల్ల ఆప్రమాదంనుంచి తప్పించుకునే అవకాశాన్ని బాబా కలిగించారు. 

ఔరంగాబాద్ లో ఉన్న నా ఇంటికి, ఎక్కడో దూరంగా జల్గావ్ జమోడ్ ప్రాంతంలో ఉన్న ప్రదేశంలో ఉదయం 7 గంటలకు సాయిబాబా నేను ఇచ్చిన రెండు బ్రెడ్ ముక్కలను స్వీకరించడం, అదేరోజున కొద్ది గంటలలో జరగబోయే భయంకరమయిన ప్రమాదాన్నుంచి నా భార్యను కాపాడటం, ఈ రెండు సంఘటనలకి సంబంధం ఉందని జాగ్రత్తగా గమనిస్తే మీకే తెలుస్తుంది.  ఇదంతా గురువారమునాడే జరిగింది.

సాయి తన భక్తులు ఎక్కడ ఉన్నా సరే ప్రతిక్షణం వారిని కంటికి రెప్పలా కాపాడుతారనడానికి, ఆయన సర్వాంతర్యామి అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేమి కావాలి?
                                                నరేంద్ర ముంగర
                                                  ఔరంగాబాద్

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List