Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, October 27, 2020

బాబా నేటికీ సజీవంగా ఉండి సహాయం చేస్తున్నారా? - 1

Posted by tyagaraju on 6:56 AM

 

              (ఒరిజినల్ గ్లాస్ నెగిటివ్ నుండి రూపుదిద్దుకున్న శ్రీ సాయి సహజ చాయా చిత్రం)


( సాయిబానిస గారు తమ ఇంటిలో ఉన్న   ఇదే సహజ చాయా చిత్రాన్ని నాకు నాలుగు సంవత్సరాల క్రిందట ఇచ్చారు.  దానిని మా యింటి హాలులో గోడకు ఏర్పాటు చేసాను.  వారికి బాబా గారికి నా కృతజ్ఞతలు) 

27.10.2020  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

బాబా నేటికీ సజీవంగా ఉండి సహాయం చేస్తున్నారా?  - 1

(సమాధి అనంతరం కూడా బాబా భక్తుల అనుభవాలు)

ఆంగ్ల మూలం  శ్రీ జ్యోతి రంజన్

తెలుగు అనువారమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

శ్రీసాయి లీల ద్వైమాసపత్రిక మార్చ్ఏప్రిల్, 2005 .సంవత్సరంలో ప్రచురింపబడిన కొన్ని లీలలను రోజు ప్రచురిస్తున్నాను.  ఇవి చిన్న చిన్నవే కావచ్చు.  కాని వీటిలో బాబా యొక్క అధ్బుతమయిన లీలలు దాగి ఉన్నాయి.  మనం ఎవరికయినా మాట ఇచ్చామంటే దానిని నిలబెట్టుకోవాలి.  భగవంతునికి మొక్కుకున్నా సరే.  మనకోరిక తీరినట్లయితె భగవంతుని మొక్కును పూర్తిగా చెల్లించాల్సిందే.  భగవంతుడు మనతో ఏమీ మాట్లాడడు కదా, ఆయనేమీ అనుకోరులే, మన పని అయిపోయింది కదా అని సగం సగం మొక్కును తీర్చినట్లయితే దాని పరిణామం ఏవిధంగా ఉంటుందో ఇప్పుడు మనం చదవబోయే వాటివల్ల గ్రహించుకోగలము. ఇక చదవండి.


78.  ఠక్కర్ గారు బాబాకు ఇచ్చిన మాట

బొంబాయి వాస్తవ్యుడయిన సాయిభక్తుడు ఠక్కర్ ఒకసారి తనకు వచ్చిన కష్టాలను తొలగించినట్లయితే బాబాకు రూ.55/- సమర్పించుకుంటానని మొక్కుకొన్నాడు.

బాబా అతని ప్రార్ధనలకు స్పందించి అతని కష్టాలను దూరం చేసారు.  తన కష్టాలు తీరిపోవడంతో ఠక్కర్ షిరిడీ వెళ్ళి బాబా సమాధిని దర్శించుకొని సమాధి మందిరంలో ఉన్న హుండీలో రూ.5/- దక్షిణ వేసాడు.  కాని, తను బాబాకు మొక్కుకున్న రూ.55/-  మాత్రం హుండీలో వేయలేదు.  ఆతరువాత ముంబాయికి తిరిగి వచ్చేసాడు.

ముంబాయిలో ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన ఇంటిమెట్లు ఎక్కుతుండగా ఆశ్చర్యంగానా మిగిలిన రూ.50?- ఏవి?” అని  బాబా అదృశ్యంగా తనను దండిస్తున్నట్లుగా స్వరం వినిపించింది.  అపుడు ఠక్కర్ కి తాను బాబాను మోసం చేయలేననే విషయం అర్ధమయింది.  మరలా షిరిడీ వెళ్ళి హుండీలో రూ.50/- వేసి బాబాకు క్షమాపణలు చెప్పుకుని ముంబాయికి తిరిగి వచ్చాడు.

80. పరశురామ్ కృష్ణ గోరె, జమ్ షెడ్ పూర్ , ఆయనకు వచ్చిన పక్షవాతాన్ని బాబా నయం చేయుట.

శ్రీ పరశురామ్ కృష్ణ గోరె గారు జమ్ షెడ్ పూర్ లోని టాటా ఫ్యాక్టరీలో ఉద్యోగి.  1966.సంవత్సరం జూలై 9 .తారీకున ఆయన ఫ్యాక్టరీనుండి సాయంత్రం ఇంటికి బయలుదేరారు.  దారిలో హటాత్తుగా ఆయనకు శరీరంలో ఒకవైపు పక్షవాతం వచ్చింది.  వైద్యుడు ఆయనను పరీక్షించి మరుసటిరోజు ఆస్పత్రిలో చేరమని చెప్పాడు.

మరునాడు పక్షవాతంతోపాటు ఆయనకు మతిస్థిమితం కూడా తప్పింది.  ఆయనను ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్పత్రిలో చేర్చారు.  చేరిన తరువాత మొదటి రెండు రోజులు చాలా బాధపడ్డారు.  ఆయనకు వెంటనే నయమవుతే షిరిడీ సాయి సంస్థానానికి రూ.10/- పంపిస్తామని కుటుంబసభ్యులందరూ బాబాకు మొక్కుకొన్నారు.  కాని ఆయనకు నయమవకపోయినా 20 రోజులు గడిచాక ఆయనకు ఇంటికీ పంపించేసారు.

ఆయనకు ఇంటిలోనే వైద్యం చేయించారు.  బాబా దయవల్ల ఆయనకు నయమయింది.  వారి కుటుంబంవారు షిరిడీసాయి సంస్థానానికి పదిరూపాయలు పంపించడానికి బదులు రూ.5.50 పై. మాత్రమే పంపించారు.  సంస్థానం వారు దాసగణు వ్రాసిన నాలుగు అధ్యాయాల పుస్తకాన్ని వారికి పంపించారు.  కాని బాబా ఊదీ మాత్రం రాలేదు.

ఆయనకు పూర్తిగా నయమయిన తరువాత తిరిగి ఉద్యోగంలో చేరడానికి వెళ్లారు. మరలా ఉద్యోగం చేయాలంటే వైద్య పరీక్ష తప్పనిసరి. ప్రతినెల ఆయన వెళ్ళడం,  వెళ్ళిన ప్రతిసారి వైద్యుడు ఆయన ఉద్యోగానికి అనర్హుడు అని చెప్పడం జరిగేది.  విధంగా మూడులలపాటు జరిగింది.

ఇక కుటుంబంమంతా ఎందుకని ఈవిధంగా జరుగుతోందని తీవ్రంగా ఆలోచించిన తరువాత వారి తప్పేమిటో వారికి తెలిసివచ్చింది.  వెంటనే బాబా సంస్థానానికి రూ.10 /- పంపించారు.

24.11.1966 .సంవత్సరం బాబా ఒక వృధ్ధుని రూపంలో వారి ఇంటిముందుకు వచ్చారు.  ఆసమయంలో పరశురామ్ గారి కుమార్తె బియ్యం బాగుచేస్తూ ఉంది.  అజ్ఞానం వల్ల ఆమె ఆవృధ్దునికి నమస్కరించడం మర్చిపోయింది.  ఆమె తల్లి మాత్రం ఆవృధ్దునికి రెండు నయాపైసలు దక్షిణ ఇచ్చింది.  అది తీసుకుని ఆవృధ్ధుడు ఆమెతోనీ భర్తకు నయమవుతుందిఅని దీవించాడు.  25.11.1966 (మరుసటి రోజు) పరశురామ్ గారు మరలా ఫ్యాక్టరీకి వెళ్ళారు.  ఈసారి వైద్యుడు పరీక్షించి ఆయన ఉద్యోగం చేయడానికి అర్హుడు అని ధృవీకరించాడు.

ఇది శ్రీసాయిబాబా వారి లీల కాదా?

(నేటి తరం పాఠకులకు నయాపైసలు, అయిదురూపాయలు, పదిరూపాయలు చాలా చిన్న మొత్తంగా అనిపిస్తుంది.  కాని 1960 ప్రాతంలో ఒక నయాపైసకు కూడా విలువ ఎక్కువే.  1965, 1966 .సంవత్సరాలలో నేను అయిదవ తరగతి, ఫస్టు ఫారం చదివే రోజులలో, త్రాగే షోడా మూడు నయాపైసలనుండి అయిదు నయాపైసల వరకు కొన్న సందర్భాలు ఉన్నాయి.  ఒక ఇడ్లీ ఖరీదు, ఒక అణా.  ఇక 1966, 1967 ప్రాంతంలో వీశ ( అనగా 1400 గ్రాములు ) వంకాయలు ఒక పావలా (అనగా 25 పైసలు).)  అందువల్ల అయిదురూపాయలు, పదిరూపాయలు అప్పట్లో చాలా పెద్ద మొత్తమని చెప్పడానికే దీనిని వివరించాను.)

79.  1963.సంవత్సరం ఆగస్ఠు నెలలో శ్రీమతి అహల్యాబాయికి కాలిలో మేకు గుచ్చుకొని రక్తం వచ్చింది.  కాలికి నొప్పి ఏమీ లేకపోవడం చేత ఆమె దానిని పట్టించుకోలేదు.  ఆగస్టు 24.తారీకున కాలికి సెప్టిక్ అయి జ్వరం వచ్చింది. 

డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుని వైద్యం చేయించుకోమని కొడుకులు చెప్పారు.  కాని ఆమె ఒప్పుకోలేదు.

దీని తరువాత బాబా ఒక అపరిచిత వ్యక్తి రూపంలో వచ్చి ఆమె ఇంటిముందు ఉన్న మిలటరీవాళ్లకు సంబంధించిన డిపోనుండి ఆమె కాలుకు మందు తీసుకువస్తానని చెప్పాడు.

ఆవ్యక్తి డిపోవారి అనుమతితో లోపలకు వెళ్ళి మందు తీసుకు వచ్చాడు.  ఆమందును దెబ్బ తగిలిన కాలుమీద రాయమని ఆమెతో చెప్పాడు.  ఆమె అతను చెప్పినట్లే చేసింది.  మందును తన కాలుకు రాసుకున్న వెంటనే కాలువాపు తగ్గిపోయి నెప్పికూడా నెమ్మదించింది.

ఒక రోజు రాత్రి ఒక నర్సు ఆమెకు కలలో కన్పించి ఇంజక్షన్ చేసింది.  ఇంకొక రోజు రాత్రి బాబా ఆమెకు స్వప్నంలో కనిపించి కాలికి మేకు గుచ్చుకున్నచోట రంధ్రం చేస్తానని, దానివల్ల పుండు మానిపోయి కాలుకి నొప్పితగ్గి పూర్వస్థితికి వస్తుందని చెప్పారు.

ఒకరోజు ఆమె నిద్రపోతున్న సమయంలో ఒక ఎలుక వచ్చి కాలికి ఉన్న పుండుకు పెద్ద రంధ్రం చేసింది.  పుండులోనుంచి చీము, పురుగులు బయటకు వచ్చేసాయి.  ఆమె తన కొడుకులను లేపి బాబా తన కాలును ఏవిధంగా నయం చేసారో చూపించింది.  కొన్ని రోజుల తరువాత బాబా ఊదీ రాయడం వల్ల ఆమె కాలు పూర్తిగా నయమయింది.

(దసరా రోజులలో ఒక భక్తురాలి ఇంటికి బాబా ఏవిధంగా వచ్చారో ఫోటోలతో సహా త్వరలోనే ప్రచురిస్తాను. మరికొన్ని వివరాల కోసం ఎదురు చూస్తున్నాను. )

(మరలా మరికొన్ని)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List