ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 12 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకోరీ – షిరిడి - గురువారము, అక్టోబరు, 17, 1985
అప్పా చెబుతున్న మరికొన్ని వివరాలు ---
సాయంత్రం గం.7.30 ని. అయేటప్పటికి ఆరోజులో దక్షిణగా వచ్చిన సొమ్ము ఎంత
వస్తే అంతా సాయిబాబా పంచిపెట్టేస్తూ ఉండేవారు. తను స్వంతంగా ధనం కూడబెట్టుకోవడానికి
బాబా దక్షిణ అడిగేవారు కాదు. తన జేబులో చేయిపెట్టి డబ్బుతీసి ఇవ్వగలిగే గొప్ప శక్తులు సాయిబాబాకు ఉన్నాయి.
తారక్ --- తనకు అధ్బుతాలను చేయగలిగే శక్తి ఉందని అందరి ఎదుట ప్రదర్శించడం ఆయనకు ఇష్టముండేది
కాదు. అందువల్లనే ఆయన
ప్రజలవద్దనుంచి దక్షిణ స్వీకరిస్తూ ఉండేవారు.
ప్రశ్న --- అయితే దక్షిణ స్వీకరించి మరలా పంచిపెట్టడం కేవలం లాంఛనమా?
జవాబు --- అవును అది కేవలం ఒక లాంఛనం మాత్రమే. తాను అధ్భుతాలను చేస్తున్నట్లుగా
ప్రజలందరికీ తెలియకూడదనే ఉద్దేశ్యంతోనే బాబా ఆవిధంగా చేసేవారు.
ప్రశ్న --- అయితే బాబా దానిని చాలా గోప్యంగా ఉంచాలనుకొన్నారా?
తారక్ --- నిజమే ఆయన అంతా గోప్యంగా ఉంచాలనుకొన్నారు. ఇది సరైన పదం.
ప్రశ్న --- షిరిడీ బాబా గారి పుట్టుపూర్వోత్తరాలను గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ముస్లిమ్ కుటుంబంనుండి వచ్చారా
లేక హిందూ కుటుంబంనుండి వచ్చారా అన్న విషయం ఎవరికీ తెలియదు.
తారక్ --- అప్పాగారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేరు. అది చాలా క్లిష్టమయిన ప్రశ్న. ఎవ్వరూ కూడా ఈ ప్రశ్నకు మిమ్మల్ని సంతృప్తిపరచలేరని
నేననుకుంటున్నాను.
ప్రశ్న --- సరే ఎలాగయినా ఆయనను ఈ ప్రశ్న
అడిగి చూద్దాము. సరళమయిన
పదాలతో .. సాయిబాబా ముస్లిమా? లేక హిందువా?
తారక్ --- ఇదే ప్రశ్న బాబాను అడిగినపుడు ఆయన ఆగ్రహంతో తన దుస్తులను చింపుకొని నగ్నంగా
నిలబడ్డారన్న విషయం మీరు పుస్తకాలలో చదివే ఉంటారు.
నేను (ఆంటోనియో) --- తెలుసు, తెలుసు. జన్మవృత్తాంతం గురించి ముఖ్యంగా బోధించినది ఏమిటంటే దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వనక్కరలేదని. ఎవ్వరూ ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడరని కూడా నాకు తెలుసు.
తుకారామ్ --- అవును సరిగ్గ చెప్పారు.
నేను
(ఆంటోనియో)
--- కాబట్టి,
ఆయన చెప్పినదానిని బట్టి సాయిబాబా ఆయనను సర్వశక్తిమంతుడని, భగవంతుడని నాకర్ధమయింది. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను బట్టి ఆవిషయం స్పష్టమవుతుంది.
తుకారామ్ --- అవును, అంతే.
ప్రశ్న --- మీరు ఎప్పుడయినా మెహర్ బాబా గురించి విన్నారా? ఆయన సాకోరిలో ఉపాసనీ మహరాజ్ శిష్యులు.
జవాబు --- లేదు, మెహర్ బాబా గురించి నాకేమీ తెలియదు.
ప్రశ్న--- భక్తులు షిరిడీనుండి తిరిగి వెళ్ళేముందు
బాబా వారికి ఊదీనిచ్చేవారా? అవిధంగా ఊదీ ఇవ్వడంలోని భావం ఏమిటి?
జవాబు ---
(కాఫీ త్రాగిన తరువాత) ఊదీలోనే అధ్బుతమయిన శక్తి నిండి ఉంది. ఎవరికయినా సుస్తీ చేసినపుడు మేము
బాబా వారు ప్రసాదించిన ఊదీని ఇస్తూ ఉంటాము. బాబా ఇచ్చే ఊదీని అలాగే మేము కూడా
రోగులకి, కుటుంబంలో ఎవరయినా అస్వస్థతగా ఉన్నవారికి ఊదీని ఇచ్చేవాళ్ళము. జ్వరంతో బాధపడుతున్న రోగికి ఊదీని
ఇచ్చిన వెంటనే ఆజ్వరం తగ్గిపోయేది.
నేను (ఆంటోనియో) --- అయితే ఊదీలోనే అంతటి శక్తి ఉందన్నమాట…
జవాబు --- అవును.
ప్రశ్న --- బాబా అనుగ్రహం వల్లనా?
తారక్ --- అవును, అవును, బాబా అనుగ్రహం వల్లనే
ఊదీకి అంతటి శక్తి వచ్చింది.
ప్రశ్న --- అత్యంత సాధారణంగా జరిగిన అధ్బుతాలు ఏమిటో నేనడగవచ్చా?
జవాబు --- అది ప్రశ్న కాదు. చెప్పాలంటే ఎన్నో అధ్బుతాలు ఉన్నాయి.
ప్రశ్న --- సాయిబాబా గురించి అవగాహన చేసుకోవడానికి మీరు ముఖ్యమయినదిగా భావించే ఒక ప్రత్యేకమయిన
అధ్భుతమయిన సంఘటన ఏదయినా మీకు గుర్తుందా?
జవాబు --- సాయిబాబా సర్వశక్తిమంతుడు, ఈశ్వరుడు, మహాసత్పురుషుషులు.
తుకారామ్ --- మీరు స్వామిరామ్ బాబా గారిని కలుసుకొన్నపుడు అప్పా బొరావకేగారిని మీరు ఇంటర్వ్యూ
చేసినట్లుగా చెప్పండి. ఆయన చాలా సంతోషిస్తారు.
ప్రశ్న --- ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమయినా ఉన్నాయా?
జవాబు --- సాయిబాబా గురించి మీరు నన్నడిగినట్లయితే బాబా ప్రధానంగా బోధించిన శ్రద్ధ,
సబూరీల గురించే చెబుతాను.
ఆయన బోధించిన ఈ రెండు ముఖ్యమయిన సూత్రాలకు నేను నాపూర్తి అంగీకారాన్ని
తెలుపుతున్నాను. ఈ రోజుల్లో
ప్రజలందరూ ఎలా ఉన్నారంటే వారికి వెంటనే ఫలితం కనపడాలి. వారు బాబా దగ్గరకు ఒకసారి వెళ్ళినంతనే
తామేది కోరుకుంటె అది తీరాలి అనే ఉద్దేశ్యంతో ఉంటారు. కాని, నేను
దానికి అంగీకరించను. నమ్మకము, ఓర్పు ఉండాలి. ఆఖరికి చర్చికి వెళ్ళినా సరే జీసస్
ని “నేను నిన్ను ప్రార్ధిస్తున్నాను, నాకు ఈ కోరిక తీర్చు” అని ప్రార్ధిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలను ప్రాపంచిక
రంగంలోకి, భౌతికరంగంలోనికి, పూర్తిగా వ్యాపార
రంగంలోకి తీసుకురాకూడదు.
ప్రశ్న --- బాబా మహాసమాధి సమయంలో మీరు అక్కడే ఉన్నారా?
జవాబు --- నేనక్కడలేను. ఆసమయంలో నేను సాసుర్ లో ఉన్న పాఠశాలలో ఉన్నాను. పాఠశాలకు సెలవులు ఇచ్చిన తరువాత నేను
షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవాడిని.
తుకారామ్ --- అప్పాగారు చెప్పదలచుకుంటున్నదేమిటంటే బాబాగారు మహాసమాధి చెందిన తరువాత మాత్రమే,
1943 – 1944 సంవత్సరాలలో ఆయనకు కష్టాలు ప్రాప్తించిన సమయంలో ఆయన బాబాను
దర్శించుకొన్నారు. బాబా
పాదాలను స్పృశించగానే ఆయనకు బాబా ఇంకా ఉన్నారని, ఆయన శక్తి గురించి
అర్ధమయింది.
ప్రశ్న --- మరొకమాటలో చెప్పాలంటె ఆయనకు బాబా అంతటా నిండి ఉన్నారనే అనుభూతి కలిగిందని మీరు
చెప్పదలచుకొన్నారా?
జవాబు --- అవును, బాబా ఎప్పటికీ సజీవులే. ఇదే అప్పా చెప్పదలచుకొన్నది.
ప్రశ్న --- మీకు కూడా బాబా ఎప్పుడూ ఎల్లవేళలా ఉన్నారనే అనుభూతి కలుగుతుందా?
జవాబు --- అవును. ఆయన ఉన్నారనే
అనుభూతి నాకు కలుగుతుంది.
ప్రశ్న --- ఆవిధింగా అప్పా బాబాను ఒక సాధువుగా భావిస్తున్నారా?
జవాబు --- అందరూ ఆయనను ఆవిధంగా పూజిస్తున్నప్పటికీ బాబా తనను తాను ఆవిధంగా ఎప్పుడు చెప్పుకోలేదు. నాకన్నా స్వామి రామ్ బాబా గారు ఆయన
గురించి మీకు బాగా వివరంగా చెబుతారు.
ప్రశ్న --- ఇక్కడ అందరికీ అప్పాగురించి తెలుసా?
జవాబు --- ఆయన ఇక్కడ అందరికీ తెలుసు.
సాయిసంస్థాన్ ట్రస్టీ సభ్యులలో ఆయన కూడా ఒకరు.
ప్రశ్న --- నేనాయన ఫొటో తీసుకోవాలనుకుంటున్నాను. ఆయనను అడిగి చెబుతారా?
తుకారామ్ … ఆయన ప్రతిరోజూ ఉదయం పదిగంటలకు సమాధి మందిరానికి వస్తారు. మీరు ఆయనను అక్కడ కలుసుకొని ఆయన ఫోటో
తీసుకోవచ్చు.
ప్రశ్న --- ధన్యవాదాలు. అప్పాగారు కూడా షిరిడి బాబా లాగే కనిపిస్తారు, అవునా?
జవాబు --- మీకలా అనిపించవచ్చు (అందరూ నవ్వులు) టోనీ గారూ, మీకొక విషయం చెబుతాను. మీరు ప్రజలందరి దగ్గరకు వెళ్ళి వాళ్లను అడగవలసిన అవసరం లేకుండా సాయిబాబా వ్యక్తిగతంగా
మీకే అనుభవాన్నిస్తారు. ఇది నా అభిప్రాయం. సాయిబాబా మీకోసం ఏదోకటి చేస్తారని అనుకొంటున్నాను. ఎందుకనో నామనసుకు ఆవిధంగా ముందు జరగబోయేది
తెలుస్తూ ఉంది. నాభావం
కూడా అదే.
నేను
--- (ఆంటోనియో) --- ఆధ్యాత్మిక రంగంలో మాటలు, చేతలు ఎక్కువ లేక తక్కువ అన్నీ
ఉపయయోగంలేనివని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కారణం అవన్నీ వ్యక్తిగతంగాను,
సన్నిహితంగాను మనకు కలిగే అనుభవాలు. అన్ని మతాలలో గాని ఆధ్యాత్మిక విషయాలలో
గాని.
తారక్ --- అవును నిజమే
నేను
(ఆంటోనియో)
--- నేనడుగుతున్న ప్రశ్నలన్నీ
అసంబధ్ధంగా అనిపించవచ్చు. కాని ఇంకా మరికొంత సమాచారం సేకరించడానికి ఒక్కోసారి బాగా ఆసక్తి కలిగించి సమాధానం
రాబట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాను.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment