Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, October 16, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 40 వ, భాగమ్

Posted by tyagaraju on 4:50 AM

 



16.10.2022 ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 40 వ, భాగమ్

అధ్యాయమ్ – 38

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 814362674

అనూహ్య సంఘటన

అక్టోబర్, 18, సోమవారమ్, 2021, ఉదయం గం. 8.59

అది 1986 వ.సంవత్సరం.  నాకు ఇద్దరమ్మాయిలు.  ఇద్దరూ చిన్నవాళ్ళే.  వాళ్ళిద్దరినీ చూసేవాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసాను.  ఇంటిలోనే ఉండి పనులన్నీ చేసుకోసాగాను.  అమ్మాయిలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయి పాఠశాలకు వెళ్ళివస్తూ ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోయారు.  ఇక నేను ఇంటిలో ఖాళీగా ఉండలేక ఇంటిలోనే ఉంటూ, ఏదయినా పని చేద్దామని నిర్ణయించుకున్నాను.  కంపెనీలకి డిపాజిట్లు సేకరించే పని ప్రారంభించాను.  అది నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది.  నేను చాలా కష్టపడి పని చేస్తూండటం వల్ల వ్యాపార వర్గాలవారిలో కొద్దికాలంలోనే నాకు మంచి పేరు వచ్చింది. 


పని కూడా ఎక్కువవడం వల్ల నాకు సహాయంగా ఇద్దరు కుఱ్ఱవాళ్ళని కూడా నియమించుకున్నాను.  అనుభవం ఉన్న ఇంకొక వ్యక్తిని కూడా నియమించుకున్నాను.  అతనికి నేను సేకరించిన డిపాజిట్స్ వాటి తాలూకు ఎకౌంట్స్ వ్రాసే పనిని పురమాయించాను.  ఇద్దరు కుఱ్ఱవాళ్ళూ బజారులో తిరిగి డిపాజిట్లు సేకరించుకుని వస్తారు.  కాకా అనే అతను ప్రతిరోజు సాయంత్రం అయేటప్పటికి ఆరోజు జరిగిన అన్ని వివరాలు తయారు చేసి ఇస్తాడు.

1998 వ.సం. డిసెంబరు నెలలో ఒక శనివారమునాడు మధ్యాహ్నం గం. 1.30 కి, కాకా నేను చెప్పిన పని చేసుకురావడానికి బయటకి వెళ్ళాడు.  కాసేపటికి కాకా నాకు ఫోన్ చేసి లోకల్ రైలులో బాగ్ పోయిందని చెప్పాడు.  అది వినగానే ఒక్కసారిగా అదిరిపోయాను. ఎలా జరిగింది అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు అంటూ కాకాని బాగా కేకలేయడం మొదలుపెట్టాను.  ఆ పోయిన బాగ్ లో ముఖ్యమయిన కాగితాలతోపాటు డిపాజిట్లు వేయమని కొంతమంది ఇచ్చిన చెక్కులు కూడా ఉన్నాయి.  ఇక నా పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళనతో ఏడుపు వచ్చేస్తోంది.  జరిగినదంతా నా భర్తకు చెప్పాను.  ఆరోజు రాత్రి తిండి తినలేదు.  నిద్ర పట్టలేదు.  మనసంతా చాలా అస్థిమితంగా ఉంది.  కష్టమర్స్ కి నేనేమని సమాధానం చెప్పాలి.  వాళ్ళకి నా మొహం ఎలా చూపించగలను?  నా పరువంతా ఏంకావాలి?  దాదాపుగా 12 లక్షల రూపాయల చెక్కులు అందులోనే ఉన్నాయి.  అదంతా వ్యాపారానికి సంబంధించిన వ్యవహారం.  24 – 25 కంపెనీలవారు ఇచ్చిన చెక్కులు ఉన్నాయి.  నేను డిపాజిట్లు సేకరించిన వాటి తాలూకు చెక్కులు.  అవన్నీ మోసగాళ్ల చేతిలో పడితే నేనేమవాలి?  ఎన్నెన్నో ప్రశ్నలు నా మదిని తొలిచేస్తున్నాయి. 


తెల్లవారుఝాము 4 గంటలకే లేచి స్నానం చేసి బాబా ఫోటో ముందు కూర్చున్నాను.  కన్నీటితో బాబాకి నా వేదననంతా విన్నవించుకున్నాను.  బాబా! నా జీవితంలో ఏదయినా మంచిపని చేసి ఉన్నట్లయితే నా బాగ్ నాకు తిరిగి దొరికేలా చేయి అని మనఃస్ఫూర్తిగా ఆర్తితో అర్ధిస్తూ బాబా ఫోటో ముందరే కూర్చుని ఉన్నాను.

ఇంతలో తలుపు మీద టక్... టక్... టక్...  చప్పుడు వినిపించింది.  ఆ చప్పుడికి లేచి గడియారం వంక చూసాను.  సమయం 5 గంటలయింది.  ఇంత పొద్దుటె ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటు తలుపు తీసాను.  గుమ్మంముందు ఒక వ్యక్తి నిలుచుని ఉన్నాడు.  అతని చేతిలో పోయిన నా బాగ్, నావిజిటింగ్ కార్డు ఉన్నాయి.  నేను నా భర్తను పిలిచాను.  అతను నా బాగ్ నాకందజేసి అందులో అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోమని అన్నాడు.

ఆవ్యక్తి జరిగిన కధంతా చెప్పాడు.

“నాపేరు మనోహర్ పాటిల్.  నేను మధ్యాహ్నం గం.3.30 కి లోకల్ రైలులో భయాందర్ నుండి చర్చ్ గేట్ కి వెడుతున్నాను.  శనివారం కావడం వల్ల రైలులో కూడా అంతగా జనం లేరు.  ఒక మూల ఒక బాగ్ కనిపించింది నాకు.  నేను నావల్ ఆఫీసర్ ని.  బాగ్ చూసి ఈ బాగ్ ఎవరిది అని అక్కడ ఉన్న ప్రయాణీకులందరినీ అడిగాను.  కాని ఎవరూ తమది కాదన్నారు.  ప్రస్తుతం ముంబాయిలో బాంబ్  బ్లాస్టులు జరిగిన  రోజులు కూడా కావడంతో ప్రయాణీకులు కూడా తమవి కాని ఎవస్తువునయినా తాకడానికి కూడ  భయపడుతున్న రోజులివి.  అందుచేత నేనే ఆ బాగ్ తీసి చూసాను.  ఇందులో చెక్కులు, ఇంకా కొన్ని ముఖ్యమయిన కాగితాలు ఉన్నాయి.  మా గురువు మహరాజ్ గారయిన ఘట్ కోపర్ గారు హిమాలయాలనుంచి వచ్చారు.  నేను ఆయనను కలుసుకోవడానికి వెళ్లాలనే తొందరలో ఉన్నాను.  సాయత్రం నేను స్వామిగారి వద్దకు వెళ్ళి ఆయన సేవలో మునిగిపోయాను.  సత్సంగం పూర్తయిన తరువాత ఆయన రాత్రి చాలా పొద్దుపోయాక విశ్రమించారు. నేను తెల్లవారు ఝాము 4 గంటలకే లేచి.   గురు మహరాజ్ గారు స్నానం చేయడానికి, తరువాత పూజా కార్యక్రమాలకి అన్ని ఏర్పాట్లు చేసాను.  స్వామి స్నానం చేసినతరువాత  ధ్యానంలో కూర్చున్నారు.  అపుడు స్వామి “పాటిల్, ఈ సంచి ఎవరిది? “ అని అడిగారు.  నేను ఆయనకు జరిగినదంతా చెప్పాను. స్వామిగారు బాగ్ లో ఉన్న కాగితాలు చూసి అందులోనుండి ఒక విజిటింగ్ కార్డు తీసారు.  దానిని నా చేతిలో పెట్టి “ఆమె ఈ బాగ్ కోసం ఎదురు చూస్తూ ఉంది.  వెంటనే దీనిని తీసుకువెళ్ళి ఆమెకు అందజేయి” అని బాగ్ నా చేతికిచ్చారు. వెంటనే నేను బాగ్ తీసుకుని పార్లేకి బయలుదేరి 5 గంటలకల్లా చేరుకున్నాను.  ఈ కార్డులో చిరునామా ఎక్కడో అడుగుదామంటే ఎవరూ కనిపించలేదు.  కొంతదూరంలో ఒక చిన్న దుకాణం కనిపించింది.  అందులో ఉన్న వ్యక్తిని అడిగితే మీ ఇల్లు చిరునామా చెప్పాడు.  అతను చెప్పిన గుర్తులను బట్టి మీ ఇల్లు వెతుకుకుంటూ వచ్చాను.  అని జరిగినదంతా పాటిల్ వివరించాడు.

పాటిల్ చెప్పినదంతా వినగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.  చాలా అధ్బుతంగా అనిపించింది.  నాలో ఒక విధమయిన ఉద్వేగం, ఆనందం రెండూ ఒక్కసారే కలిగాయి.

‘సరిగా వేకువఝాము నాలుగు గంటలకే నేను సాయిబాబాని నా బాగ్ దొరికేలా చేయమని ప్రార్ధిస్తూ ఉన్నాను.  అదే సమయానికి స్వామిగారు ఈ బాగ్ గురించి అడిగారు.’  ఎంత అధ్బుతమయిన సంఘటనో కదా అని పాటిల్ తో అన్నాను.  బాగ్ లో ఎన్నో విజిటింగ్ కార్డులున్నాయి.  కాని స్వామి అన్ని కార్డులలోనుండి  నా కార్డు మాత్రమే తీసి ఎవరిదో ఏమిటో కూడా చూడకుండా మనోహర్ పాటిల్  కు ఇచ్చారు  ఆ కార్డు మీద ఉన్న చిరునామకు వెళ్ళి బాగ్ అందజేయమని చెప్పారు.  ఈ సంఘటనలన్నీ గమనిస్తే మనం ఏమని చెప్పగలం?  ఇదంతా సాయి నామీద కురిపించిన దయాసాగరం అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.

నీలం శశికాంత్ వరద్కర్

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

1 comments:

M.Vijaya on October 16, 2022 at 8:47 PM said...

అద్భుతమైన సాయి లీల. చాలా బాగుంది. 🙏🙏🙏

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List