23.01.2012 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బా ని స డైరీ 1994 12 వ భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 (12)
07.04.1994
నిన్నటిరోజున మనిషి పుట్టుక, చనిపోవటము జన్మ ఎత్తటములోని ముఖ్య ఉద్దేశము - గురువు యొక్క ఆవశ్యకతపై ఆలోచనలతో శ్రీ సాయికి నమస్కరించి నిద్ర పోయినాను. కలలో శ్రీ సాయి చూపించిన దృశ్య వివరాలు.
"నేను భగవత్ గీత, భాగవతము ఉన్న సంచితో ఓ బస్సు ఎక్కి ప్రయాణము చేయసాగినాను. ఒక చోట టీ త్రాగటానికి (కోరికలు తీర్చుకోవటానికి) బస్సు దిగినాను. నేను టీ త్రాగుతుంటే బస్సు టైము ప్రకారము వెళ్ళిపోయినది.
నాఆలస్యానికి నేను బాధపడుతు రోడ్డుమీద నిలబడినాను. నా బస్సును ఏవిధముగా చేరుకోగలను అనే ఆలోచనలతో ఉండగా ఒక చిన్న తెల్లని గెడ్డము తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి మోటార్ సైకిల్ మీద వచ్చి తనపై నమ్మకము ఉంటే మోటార్ సైకిల్ మీద వెనక కూర్చుంటే తనే నన్ను ఆ బస్సుకంటే ముందుగా గమ్యస్థానము చేరుకొనేలాగ చూడగలను అంటారు. ఆ వ్యక్తిలో శ్రీ సాయిని చూడగలిగినాను. ఆ వ్యక్తిపై నమ్మకము కలిగినది ఆ వ్యక్తి వెనకాల సీటుపై కూర్చుని ప్రయాణము సాగించినాను. ఆవ్యక్తి మోటార్ సైకిల్ చక్కగా నడపసాగినారు. రోడ్డుమీద గతుకులు, ఎత్తు పల్లాలు, బురద గుంటలు ఉన్నా నాకు ఏవిధమైన కష్ఠము లేకుండ గమ్య స్థానమునకు చేర్చినారు. ఆ గమ్యస్థానమునకు నేను ప్రయాణము చేస్తు టీ గ్రాగుతుంటే తప్పిపోయిన బస్సుకూడ చేరుకొన్నది. నన్ను నా గమ్య స్థానానికి చేర్చిన ఆ వ్యక్తికి (శ్రీ సాయికి) కృతజ్ఞతలు చెప్పుకొన్నాను.
08.04.1994
నిన్నటిరోజు (గురువారము) శ్రీ సాయిపై అనేక ఆలోచనలతో గడపినాను. శ్రీ సాయి శరీరముతో శిరిడీలో గడిపిన కాలములోని విశేషాలు చెప్పమని శ్రీ సాయిని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "ఆ రోజులలో భక్తులు తిరుగులేని నమ్మకముతో శిరిడీకి వచ్చి మేలు పొంది తిరిగి తమ స్వగృహాలకు వెళ్ళేవారు. కాని ఈనాడు ప్రజలు శిరిడీకి వెళితే ఏదైన మేలు జరుగుతుందా లేదా అని చూడటానికి వస్తున్నారేకాని నమ్మకముతో రావటములేదు. దాని వలన శిరిడీకి వచ్చిన ప్రతివాడు మేలు పొందలేక పోవుచున్నాడు."
09.04.1994
నిన్న రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "తల్లి తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలు శిక్ష అనుభవించిన రోజున యిది ఎక్కడి న్యాయము అని అడుగుతారే - మరి పిల్లల మీద అంత ప్రేమ యున్నపుడు చెడుపనులు ఎందుకు చేయాలి? ఆ తల్లితండ్రులుకు వారి పిల్లల మీద ప్రేమ యుంటే భగవంతునికి ప్రీతి కరమైన మంచి పనులు చేయవచ్చు కదా.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment