Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 9, 2014

శ్రీసాయితో మధురక్షణాలు - 39 బాబా చూపిన కృప - బాబా దివ్యదర్శనం

Posted by tyagaraju on 7:11 AM

                         

                  
09.05.2014 శుక్రవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

శ్రీసాయితో మధురక్షణాలు - 39

బాబా చూపిన కృప - బాబా దివ్యదర్శనం 

సాయిబంధువులకు ఈ రోజు మరొక అద్భుతమైన బాబా లీలను అందిస్తున్నాను.  పిలిచిన వెంటనే నేనున్నను నీచెంత, నీకెందుకా బెంగ అనిపించేలా తక్ష్ణం వచ్చి ఆదుకునే బాబా.  అనుకోకుండా ఆయన చేసే అధ్బుతమైన లీలలు జన్మ జన్మలకూ మరపురాని మధురానుభూతులుగానే మిగిలిపోతాయి.  అటువంటి అత్యధ్బుతమైన ఒక లీలను ఈ రోజు తెలుసుకొందాము.  ఇక చదవండి.  ఆనందాన్ని పొందండి.


దయగల సాయికి మొట్టమొదటగా నా వినమ్రపూర్వకమైన ప్రణామములు సమర్పించుకుంటున్నాను.  1960వ.సంవత్సరంలో నెల్లూరు లో మా పొరుగింటివారి ద్వారా నాకు సాయిబాబా గురించి తెలిసింది.  వారు నాకు సాయిబాబాను ఆశ్రయించమని సలహానిచ్చారు.  క్రమం తప్పకుండా సాయంత్రం వేళల్లో నెల్లూరులో ఉన్న సాయిబాబా గుడికి వెడుతూ ఉండేవాడిని.  ముఖ్యంగా గురువారాలప్పుడు మాత్రం అస్సలు మానకుండా వెడుతూ ఉండేవాడిని.  1974వ.సంవత్సరం వరకు బాబా గురించి ఆయన బోధల గురించి తెలుసుకొనే భాగ్యం కలగలేదు.  హైదరాబాదులో నా సహోద్యోగి, సాయిబాబా భక్తుడయిన శ్రీ వై.వీ.సుబ్బాయ్య తో నాకు సన్నిహిత సాంగత్యం కలగడం, అది నాకు గొప్ప అదృష్టమనే చెప్పాలి.  ఆయన వల్లనే నాకు షిరిడీ దర్సించాలనే కోరిక కలిగిందంటే దానికి ఆయన ప్రేరణే కారణం.  షిరిడీ వెళ్ళడానికి అయ్యే ఖర్చులను కూడా నాకు ముందుగానే ఇచ్చారు.  అక్టోబరు 1975వ.సంవత్సరంలో నాకు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునే భాగ్యం కలిగింది.  ఈ షిరిడీ యాత్ర చాలా అద్భుతంగా జరిగింది.  అప్పటినుండి నేను శ్రీ సాయినాధులవారినే ఆశ్రయించాను.  నిజం చెప్పాలంటే ఆయననే మా కులదైవంగా పూజిస్తూ వంచ్చాను.  నా మితృడు శ్రీ సుబ్బయ్య ని చూసే నేను కూడా సాయినాధులవారిని నా దైవంగా ఆరాధించడం ప్రారంభించాను.

సాయిబాబా అనుగ్రహం వల్ల 1975 సంవత్సరం నుండి నాకెన్నో అనుభవాలు కలిగాయి.  అన్నీ ఆయనే నాకు.  ఆయన  ఎప్పుడూ నాతోనే   ఉంటూ ప్రతీ విషయంలోనూ నాకు మార్గదర్శకుడిగా ఉన్నారన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది.  ఆయన అనుగ్రహం నామీద విస్తారంగా కురిపించమని,  ఆధ్యాత్మిక  మార్గంలోకి నన్నులాగుకొని నన్ను అభివృద్ధిపధంలో నడిపించమని నా హృదయపూర్వకంగా బాబాని ప్రార్ధిస్తున్నాను.  సాయి లీల పత్రికలో భక్తుల అనుభవాలను చదివిన తరువాత నాకు కూడా నాకు కలిగిన కొన్ని అనుభవాలను సాయిలీల పత్రిక పాఠకులకి, భక్తులకి వివరంగా చెప్పాలనిపించింది.  1975వ.సంవత్సరం ఆగస్టు నెలలో మొట్టమొదటిసారిగా నేను షిరిడీ యాత్రకు వెడదామని చెప్పడంతో  నా భార్య ఇద్దరు అమ్మాయిలు ఎంతగానో సంతోషించారు.  కాని జూలై నెల మొదటివారంలో నాభార్యకు అనారోగ్యం చేసి వారం రోజులపాటు విపరీతమయిన జ్వరంతో బాధపడింది.  అది మెల్లగా టైఫాయిడ్ లోకి దింపింది.  టైఫాయిడ్ వచ్చి రెండు వారాలయింది.  ఆకుపచ్చని విరోచనాలు మొదలయి దానితో కొన్ని  సమస్యలు ప్రారంభమయ్యాయి. మధ్య మధ్యలో స్పృహతప్పిపోతూ ఉండేది.  దాంతో మాకు చాలా ఆందోళన కలిగింది.  1975 జూలై 22వ.తేదీన సాయంత్రం 3 గంటలకు నా భార్య గట్టిగా అరుస్తూ నామీదకు విరుచుకు పడుతూ, "నాముందు గోడ మీద వేళ్ళడుతున్న బాబా ఫోటోను తీసి బయటకు విసరివేయండి" అంది .  "బాబా అస్సలు స్పందించటంలేదు.  మీరు చేసే పూజలన్నీ వ్యర్ధం. ఫొటోని బయటకు విసిరేయండి" అంది వెక్కుతూ ఏడుస్తూ.  
                

ఆవిడ అలా విరుచుకుని పడటంతో నాకు చాలా దిగ్భ్రమ కలిగింది.  ఏంచేయాలో నాకు పాలుపోలేదు. అది ఒక భయంకరమైన పరిస్థితి.  అందులో సందేహం లేదు.  అనునయంగా ఆమెను సముదాయిస్తూ మెల్లని స్వరంతో ఇలా అన్నాను, " చూడు, నీ గతజన్మల కర్మలను తొలగించుకోవడానికి ఈ విపత్కర పరిస్థితిని తట్టుకునే ధైర్యాన్ని, శక్తిని నీకు యిమ్మనమని,  నేను అన్నివిధాలుగాను బాబాని ప్రార్ధిస్తూ ఉన్నాను.    నీకు వచ్చిన ఈ వ్యాధిని తొలగించమని గాని, లేక మరొక సందర్భానికి వాయిదా వేయమని గాని ప్రార్ధించడంలేదు.  బాబాకి నీమీద దయ లేదని భావించకు.  నిన్ను కాపాడటానికి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు ఆయన". నామాటలు ఆమె మీద తగినంత ప్రభావాన్ని చూపాయో లేదో నాకు తెలీదు.  కొంతసేపటి వరకూ అలా వెక్కుతూ ఏదుస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకొంది.  అదే రోజు రాత్రి 10 లేక 11గంటలకు, పడక కుర్చీలో పడుకొని జ్వరంతో బాధపడుతున్న నా భార్యమీద దయ చూపమనీ, బలహీన పడిపోయి ఈ పరిస్థితిని ఆమె యిక తట్టుకోలేదని ఈ కష్టాన్నించి ఆమెని గట్టెక్కించమని కళ్ళు మూసుకొని బాబాని ప్రార్ధిస్తూ ధ్యానంలో ఉన్నాను. మెల్లగా నేను కళ్ళు తెరిచి చూశాను.  నా ఎదుట కనిపించిన దృశ్యాన్ని చూసి ఉలిక్కి పడ్డాను.  మంచం మీద ఒక మూలగా బాబా కూర్చొని ఉన్నారు.  ఆయన నా భార్య నుదుటి మీద చేయి వేసి మృదువుగా రాస్తున్నారు. గాలిలో  బాబా రూపం కనిపించింది.  ద్వారకామాయి లో ఉన్న ఫొటోలో బాబా ఎలా ఉన్నారో ఆ విధంగా అంత స్పష్టంగాను నాకు కనిపిస్తున్నారు.  
                      

బాబాని యింకా స్పష్టంగా చూడటానికి ఆయనని స్పృశిద్దామని ఒక్క ఉదుటున కుర్చీని తన్ని నాభార్య పడుకున్న మంచం దగ్గిరకి పరిగెత్తాను.  అబ్బా!  ఆ దృశ్యం కరిగిపోయింది.  అది ఒక ఉత్కంఠభరితమైన, సంతోషకరమైన క్షణం.  నేను వేగంగా కదిలిన చప్పుడుకి నా భార్యకు మెలకువ వచ్చింది. ఆనంద పరవశంతో మైమరచిపోయి గద్గద స్వరంతో "బాబాకు దయలేదని అనడానికి నీకెంత ధైర్యం.  చూడు, ఆయన నీ నుదుటి మీద మృదువుగా రాస్తూ ఇక్కడే ఉన్నారు.  ఆయనను గుర్తించలేవా?  గుడ్డిదానివా?" అన్నాను.  అతికీ అతకనట్లుగా మాట్లాడిన నామాటలను నా స్వరాన్ని ఆమె అర్ధం చేసుకొందో లేదో నాకు తెలీదు. మళ్ళీ నిద్రలోకి జారుకొంది.  ఆ క్షణంలో నాకెంతగానో ఉపశమనం కలిగింది.  బాబా ఆమెని కాపాడటానికి వచ్చారని నాకు తెలుసు.  గత 20 రోజులుగా నేను నిద్రలేని రాత్రులు గడిపాను.  ఈ రోజు కంటినిండా హాయిగా తనివితీరా నిద్రపోయాను. 

తెల్లవారుజాము 4 గంటలకు నా భార్య లేచి 'బాబా బాబా' అని గట్టిగా అరుస్తూ మంచం చుట్టూ చూస్తూ ఉండటంతో నాకు హటాత్తుగా మెలకువ వచ్చింది. ఆమెని నెమ్మదిగా మంచం మీద ప్రశాంతంగా కూర్చోమని చెప్పాను.  ఆమె తనకు వచ్చిన కల గురించి వివరించి చెప్పడం మొదలుపెట్టింది. 

 "నేను ఎక్కడ ఉన్నానో  తెలియని పరిస్థితులలో అడవులు, పర్వతాలు, పట్టణాలలో తిరుగుతూ ఉన్నాను.  భయంతో గట్టిగా అరుస్తూ ఉన్నాను.  అప్పుడే నావెనుకనించి ఒక స్వరం వినపడింది. దూరంగా ఒక మూలన ఒక వృధ్ధుడు కూర్చొని నన్ను తనదగ్గరకు రమ్మని సైగ చేశాడు.  భయంతో నేను అతని వద్దకు పరిగెత్తుకొని వెళ్ళాను.  ఆశ్చర్యం ఆయన బాబా.  ద్వారకామాయిలో బాబా కూర్చున్న రూపంలోనే ఉన్నారు ఆయన.  నాకు సహాయం చేయమని ఏదుస్తూ బాబా పాదాలముందు సాష్టాంగపడి ప్రార్ధించాను.  ఆందోళనపడవద్దని మృదుస్వరంతో అన్నారు.  తీర్ధం తీసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పారు.  కలలోనే తీర్ధం తీసుకొన్నాను అంతలోనే కల కరిగిపోయింది."   

కల గురించి అంతా విన్నాక మా ఆనందానికి అవధులు లేవు.  బాబా దీవించారనీ, షిరిడీకి రమ్మని ఆయన పిలుస్తున్నారని యిది శుభ సూచకమనీ నా భార్యతో చెప్పాను.  ఆరోజు రాత్రినించి టైఫాయిడ్ జ్వరం తగ్గుముఖం పట్టి తొందరలోనే తగ్గిపోయింది.  మేమంతా అక్టోబరు 1975 వసంవత్సరం లో షిరిడీ వెళ్ళి దసరా వుత్సవాలలో కూడా పాల్గొన్నాము. 

షిరిడీలో నాకు మరొక గొప్ప అనుభూతి కలిగింది.  అది అంతుపట్టనిది. బహుశా నవమినాడు జరిగింది అనుకుంటాను.  ఆరోజు బాగా రద్దీగా ఉంది.  నేను సంస్థానం  వారు నడుపుతున్న కాంటీన్ లో ఉండిపోయాను. మధ్యాహ్న్న హారతి కి వెళ్ళే తొందరలో ఉన్నాను.  ఆరతి ప్రారంభమయిపోయింది.  మందిరమంతా విపరీతమయిన భక్తులతో కిటకిటలాడుతూ ఉంది.  ఎలాగో నేను సెంట్రల్ హాలులోకి ప్రవేశించాను.  కాని అక్కడ నేను బాగా ఎడమవైపుకి ఒక మూలకి తోసివేయబడ్డాను.  అక్కడినుండి నాకు బాబా విగ్రహం స్పష్టంగా కనపడదు.  దానితో నాకు చాలా నిరాశ కలిగింది.   నాకు బాబా వారి గడ్డము,దవడ మాత్రమే కనపడుతున్నాయి. 
                    

నిరాశతోను, అసంతృప్తితోను తలవంచుకొని క్రిందకు చూస్తున్నాను.  కొంతసేపటి తరువాత హటాత్తుగా తలపైకెత్తాను.  నా ఎదుట కనిపించిన దృశ్యాన్ని చూసి అప్రతిభుడినయ్యాను.  గర్భాలయంలో బాబా కూర్చొని ఉన్న రూపం నాకళ్ళెదుట కనిపించింది. బాబా తలతిప్పి ఒక్కసారిగా నాకళ్ళలోకి సూటిగా చూశారు.  ఇదంతా ఒక లిప్తపాటులో జరిగింది.  బాబావారి కళ్ళలోనుండి వస్తున్న ఆ ప్రకాశవంతమయిన వెలుగుని నేను తట్టుకోలేకపోయాను.  నా చుట్టూరా జరుగుతున్నదేమిటో అర్ధం కాక చేతులతో నా మొహాన్ని కప్పుకొన్నాను.   మొహం మీదనుండి చేతులను తీసి అటువంటి అధ్బుత దృశ్యాన్ని యింకా దగ్గరగా చూద్దామనే ఉద్దేశ్యంతో జనాన్ని తోసుకొని ముందుకు  వెళ్ళాను.  అబ్బా! నాస్నేహితుడు ఆర్.వీ. కృష్ణారావు అనే అతను నా వెనుకనించి వచ్చి నేను వీక్షిస్తున్న ఆ దివ్యదర్శనం బాబా అనుగ్రహం సమసిపోయేలాగ నన్ను  ప్రక్కకు తోసి ముందుకు వెళ్ళాడు. నాకు కనిపించిన దృశ్యం ఆ క్షణంలో   నాకు కలిగిన పరవశం, పులకరింపు వర్ణించడానికి మాటలు చాలవు.  ఆ అనుభూతి వర్ణించలేనిది. అప్పుడు నేను చూసినది నా చిత్తభ్రమ కాదు.  ఈ దృశ్యం తరువాత అంతకు ముందు కనిపించినట్లుగానే నాకు బాబా గడ్డం, ఒక వైపు చెంప మాత్రమే కనిపించాయి. అప్పుడప్పుడు ఈ సంఘటనని తిరిగి గుర్తుకు తెచ్చుకున్నప్పుడెల్లా నాకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది.   

1975 లో జరిగిన మా షిరిడీ యాత్ర ఎప్పటికీ మరచిపోలేనిది.  

సాయిలీల పత్రిక
మార్చ్ 1980
ఎస్.ఎస్.మాధవరావు
హైదరాబాదు

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)   


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment