Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, April 10, 2016

శ్రీసాయి లీలామృత ధార - నమ్మశక్యం కాని అద్భుతాలు కూడా జరుగుతాయి

Posted by tyagaraju on 9:05 AM
      Image result for images of shirdi sai smiling face
     Image result for images of yellow rose


10.04.2016 ఆదివారమ్                             
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలామృత ధార
నమ్మశక్యం కాని అద్భుతాలు కూడా జరుగుతాయి

ఈ రోజు మరొక అద్భుతమైన నమ్మశక్యం కాని సంఘటన గురించి తెలుసుకుందాము.  ఎస్.ఎన్. అవచాత్ గారు పంపిన ఈ లీల శ్రీ సాయి లీల మాసపత్రిక జూలై 1983 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.  ఇక చదవండి.
                                      ***

మా దగ్గరి బంధువులు, వాతావరణం కాస్త మార్పుగా ఉంటుందని మా నాన్నగారిని కొన్నాళ్ళు మా ఊళ్ళో ఉండండని  పిలిచారు.  వారు ఉన్న ఊరు పూనా జిల్లాలోని మారుమూల ప్రాంతం అవసరి ఖుర్దు.  


మా నాన్నగారు ఆ ఊరికి చేరుకోగానే మొట్టమొదటగా ఆ గ్రామ దేవత భైరవనాధుడిని దర్శించుకోమని మా బంధువులు చెప్పారు.  ఆ ఊరికి ఎవరు వచ్చినా మొదట భైరవనాధుని దర్శించుకోవాలి.  
                 Image result for images of bhairavnath

అది ఆ గ్రామ ఆచారం.  మా నాన్నగారు వెంటనే భైరవనాధుడి గుడికి బయలుదేరారు.  ఆయన గుడి ఆవరణలోకి ప్రవేశించగానే గుడి హాలుకు ప్రక్కనే చావు బతుకుల్లో ఉన్న ఒక ఆవు కన్పించింది.  కొంతమంది గ్రామస్థులు అక్కడే ఉన్నారు.  చనిపోబోతున్న ఆ ఆవుని పట్టించుకోకుండా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.    "ఏమిటి వీళ్ళంతా? ఒక ప్రక్కన ఆవు చనిపోయే దశలో ఉంది. అందరూ కలిసి ఏమీ పట్టనట్టుగా కబుర్లు చెప్పుకోవడమేమిటని" మానాన్నగారికి చాలా కోపం వచ్చింది.  అక్కడే కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళలో ఒకతనిని పిలిచి ఆవుకు ఏమయిందని అడిగారు.  ఉదయం ఆవుని విష పూరితమైన ఒక పాము కాటు వేసిందని, దాని విషం ఎక్కిందని చెప్పాడు.  ఎప్పటిలాగే ఆచార ప్రకారం గుడిలో పూజలు, మంత్రాలు జరుగుతాయని ఆవు తిరిగి కోలుకుంటుందని చెప్పాడు.  ఆ సమాధానం విని మా నాన్నగారికి చాలా ఆశ్చర్యం వేసింది. “విషం ఎక్కి నాలిక వేళ్ళాడేసి భారంగా ఊపిరి తీస్తు చనిపోవడానికి సిధ్ధంగా ఉండి,  చూస్తే చనిపోయినట్లుగానే ఉన్న ఈ ఆవుని ఈ ప్రపంచంలో ఏది బ్రతికించగలదు? అది చనిపోతూ ఉందని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కదా?” అన్నారు. ఆ గ్రామస్తులు మా నాన్నగారితో “మీరు ఈ విషయం గురించి ఏమీ చర్చించకండి.  గుడిలో పూజలు మొదలవగానే లోపలికి రండి అని ఒప్పించారు.  మానాన్నగారికి దేవుడంటే నమ్మకం ఉన్నాగాని , పాము విషంతో చనిపోయినట్లుగానే ఉన్న ఆ ఆవును బ్రతికించే ప్రయత్నం చేయడం గ్రామస్తుల పిచ్చి కాక మరేమిటని అనుకున్నారు.  వెంటనే ఆయన మా బంధువుల ఇంటికి వచ్చి భైరవనాధ్ గుడిలో చేసే పూజలు, మంత్రాల వల్ల చనిపోతున్న ఆవు బ్రతుకుతుందా అని మా బంధువులలోని ఒక పెద్దాయనని అడిగారు.  అప్పుడాయన, ఈ గ్రామంలో ఇది చాలా సాధారణమయిన విషయం.  పాము కాట్లు జరుగుతూ ఉంటాయి.  దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు అన్నారు.

మా నాన్నగారు గుడికి తిరిగి వచ్చారు.  గుడి పూజారి స్నానం చేసి తడి బట్టలతో గర్భ గుడిలోకి వెళ్ళాడు.  గర్భ గుడిలో భైరవనాధుని విగ్రహం ఉంది.  పూజారి లోపల కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళాడు.  ఆయన ఆ స్థితిలో ఉండగా గ్రామస్థులు బయట హాలులో రెండు వరుసలలో నిలబడ్డారు.  అందరూ ‘భైరవనాధ్ చాంగ్ భలే’ అనే మంత్రాన్ని గట్టిగా జపిస్తూ చాలా తీవ్ర స్థాయిలో గంటలు మ్రోగించడం మొదలు పెట్టారు.  గంటల శబ్దానికి అనుగుణంగా తీవ్ర స్వరంతో మంత్రోచ్చారణ చేస్తున్నారు.  ఒక గంట తరువాత గంటల మ్రోత, మంత్రోచ్చారణ పతాక స్థాయికి చేరుకున్నాయి.  గుడి తలుపుకి ముందు నిలబెట్టిన త్రిశూలం కాస్త కదిలింది. త్రిశూలంలో కదలిక చూసిన గ్రామస్థులందరికీ ఎంతో ఉత్సాహం కలిగింది.  ఆ కదలిక చనిపోతున్న ఆవు తప్పకుండా బ్రతుకుతుందన్నదానికి సంకేతం.  కొంత సేపటి తరువాత నిద్ర నుంచి లేచినట్లుగా ఆవు హటాత్తుగా లేచింది.  అక్కడున్నవారందరితోపాటు ఈ తతంగాన్నంతా చూస్తున్న ఆ ఆవు యజమాని ముందుకు వచ్చి ఆవుని ప్రేమగా తట్టాడు.  ప్రగాఢమైన పూజ్య భావంతో భైరవనాధునికి నమస్కరించాడు.  గ్రామస్తులందరూ వెళ్ళిపోయారు.  ఊహించడానికి, నమ్మ శక్యంగాని ఈ సంఘటనకి మా నాన్నగారు చాలా ఆశ్చర్యపోయారు.  మా బంధువుల ఇంటికి తిరిగి వచ్చారు.  రాత్రి భోజనాలు అయిన తరువాత మా నాన్నగారు జరిగిన సంఘటన గురించి పూర్తిగా వివరించమని మా బంధువులలో ఒకరిని అడిగారు.  మా నాన్నగారికి ఈ విధంగా వివరించారు. 

“భైరవనాధుడు పరమ శివుని యొక్క రూపం.  ఆయన  విష జంతులన్నింటికి అధిష్టాన దేవత.  ఈ గ్రామంలో ఎవరికి పాము కరిచినా, అతనిని భైరవనాధుని గుడికి తీసుకుని వెడతారు.  అందరూ ఎంతో భక్తితో భైరవనాధుడిని ప్రార్ధిస్తారు.  ఇందులో గుడి పూజారిదే ప్రముఖ పాత్ర.  ఆయన చేసే పూజలు, మంత్రాలవల్లనే ఎక్కిన విషం దిగిపోయి పాము కాటునుండి విముక్తుడయి బ్రతుకుతాడు.  ఏ విధంగా జరుగుతుందనేది ఉదయం మీరు వివరంగా చూశారు.” 

ఈ సంఘటన ద్వారా నేను చెప్పదలచుకున్నదేమిటంటె, ఈ ప్రపంచాన్ని నడిపించే సర్వోన్నతమయిన శక్తి ఉంది.  పరిపూర్ణమయిన భక్తి విశ్వాసాలతో ఆ శక్తికి సర్వశ్య శరణాగతి చేస్తే ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు.  మనస్ఫూర్తిగా శరణు వేడాలి.  మనసులో ఎటువంటి శంకా, అపనమ్మకం ఉండకూడరు.  ఆ శక్తి విజ్ణాన శాస్త్రంలోని నియమాలనన్నిటినీ అధిగమిస్తుంది.  విజ్ణాన శాస్త్రానికి (సైన్స్) కూడా అంతు చిక్కనిది. ఆ విధంగా ముందు వివరించిన సంఘటననే తీసుకుంటె సాధ్యం కాదనుకున్నవి కూడా సుసాధ్యం చేసి చూపించేది కూడా ఆ శక్తే.
                Image result for images of shirdi sai smiling face

సందర్భానుసారంగా సాయిబాబా వారు  కూడా తన భక్తులకి, మంచి గుణాలనలవరచుకోమని, ముఖ్యంగా భక్తితో మెలగమని ఉద్భోధించారు.  సాయిబాబా చెప్పిన తత్వంలో ముఖ్యమయిన సూత్రం భక్తి.
                                                                   
                                                  ఎస్.ఎన్. అవచాత్
                                               బొంబాయి – 400 001

ఈ సందర్భంగా శ్రీసాయి సత్ చరిత్ర 22వ.అధ్యాయంలో  బాబా వారు మనకి బోధించిన విషయాన్ని కూడా వివరిస్తాను.
“సర్పాలలోను, తేళ్ళలోను అన్ని జీవాలలోను ఈశ్వరుడుంటాడు.  ఈశ్వరుడు జగత్తంతటికి సూత్రధారి.  సర్వ జీవులూ వారి ఆజ్ఞానుసారమే ప్రవర్తిస్తాయి.  సర్పమైనా కాని తేలైనా కాని ఈశ్వరుని ఆజ్ఞను జవ దాటవు.  అందువల్ల ప్రాణులపై ప్రేమను దయను చూపాలి.  సాహసాన్ని వదిలి సహనాన్ని చేపట్టాలి.  అందరిని రక్షించేవాడు ఆ శ్రీహరి”.

గ్రామస్తులందరికీ భైరవనాధుని మీద అంతటి పరిపూర్ణమైన విశ్వాసం.  ఆయనని శివునికి మరో రూపంగా కొలుస్తున్నారు. విష జంతువులకి ఆయన అధిపతి అని నమ్ముకున్నవారు.  అందుచేత వారెప్పుడూ పాము కాట్లకి భయపడకుండా, వైద్యానికి కూడా ఎక్కడికీ తీసుకెళ్ళకుండా కేవలం భైరవనాధుని వద్దకే తీసుకుని రావడం చూస్తే భక్తులెవరైనా సరే అంతటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలని మనం అర్ధం చేసుకోవాలి.  పాము కాటుకు గురైన ఆవు గురించి కూడా ఒక్కరు కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ఏమీ జరగనట్లే ఉన్నారు. సాయి భక్తులందరికీ బాబా మీద అంతటి భక్తి ప్రపత్తులు ఉన్నాయి కాబట్టే మనందరికి ఆయన చూపించే లీలలను మనమందరం  ఒకరికొకరం కలిసి పంచుకుంటున్నాము.

ఈ అధ్బుతమైన సంఘటనని చదివిన సాయి పాఠకులందరూ ఒక్కటి గమనించాలి.  మంత్రానికి ఎంత శక్తి ఉందో గమనించండి.  కొన్ని కొన్ని మంత్రాలను, బీజాక్షరాలు ఉన్న మంత్రాలను వాటిని ఏవిధంగా ఉఛ్ఛరించాలో ఆవిధంగానే ఉఛ్ఛరించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్లుగా చేస్తే ఎటువంటి ప్రయోజనం సిద్ధించదు.  దాని వల్ల ఒక్కొక్కసారి విపరీత పరిణామాలు కూడా సంభవించే అవకాశం ఉంది.  గాయత్రి మంత్రాన్ని ఎలా ఉఛ్ఛరించాలో ఆవిధంగానే ఉఛ్ఛరించాలి.  ఈ మధ్య సినిమా పాటలాగా గాయత్రి మంత్రాన్ని రింగ్ టోన్ లాగా, ఉపయోగించడం, ఆఖరికి దేవాలయాల్లో కూడా పాట లాగ సాగే సీ.డి లను పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.  

ఈ సందర్భంగా నిజంగా జరిగిన నమ్మశక్యం కాని ఒక సంఘటన వివరిస్తాను.

క్రిందటి సంవత్సరం దాకా మా మేనకోడలు అమెరికా లో ఉద్యోగం చేస్తూ ఉండేది.  ఆమె భర్త, కుమారుడు కూడా అక్కడే వుండేవారు.  కారులో ఆఫీసుకు వెళ్ళేటప్పుడు పెన్ డ్రైవ్ లో రుద్రమ్ వింటూ ఉండేవారు. ఎన్నో నెలలనుండి కారులో వెడుతున్నప్పుడు రుద్రం వినడం అలవాటు.   ఇక అమెరికానుండి ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కారు అమ్మేసి వద్దామని బేరం పెట్టారు.  ఆ కారును ఒక అమెరికన్ కొనుక్కోవడానికి సిధ్ధ పడ్డాడు. అందు చేత పెన్ డ్రైవ్ తో సహా ఇంకా కారులో ఉన్న అన్నిటినీ తీసేశారు.  మా మేనకోడలు ఒక్కత్తే కారు అమెరికన్ కి అప్పచెపుదామని  డ్రైవ్ చేసుకుంటూ వెడుతూ ఎఫ్.ఎమ్. రేడియో పెట్టింది.  విచిత్రంగా ఎఫ్.ఎమ్. రేడియోలో ఇంగ్లీషు పాటలు, ప్రోగ్రామ్స్ బదులు రుద్రం రావడం ప్రారంభమయింది.  ఒకవేళ పెన్ డ్రైవ్ తీయడం మరిచారేమోనని చూస్తే పెన్ డ్రైవ్ లేదు. అప్పుడు మామేనకోడలు తన భర్తకి ఫోన్ చేసి చెప్పింది.  కారులో ఎఫ్.ఎం. రేడియో పెడితే రుద్రం వస్తోంది అని.  అలా ఎలా వస్తుంది? పెన్ డ్రైవ్ తీసేశాను నా దగ్గరే ఉంది అని చెప్పారు. మరి ఎక్కడినుండి రుద్రం వస్తోందో అర్ధం కాలేదు.  కారు కొనుక్కోదలచిన అమెరికన్ దగ్గరకు వెళ్ళగానే రుద్రం రావడం ఆగిపోయి ఎఫ్.ఎమ్ కార్యక్రమాలు రావడం మొదలయిందట. కారణం ఎప్పటినుండో కారులో రుద్రం పెడుతూ ఉండేవారు.  మంత్రానికి ఎంతటి శక్తి ఉందో చెప్పడానికే ఈ సంఘటన మీతో పంచుకున్నాను.  రుద్రం కూడా మీరందరూ వినే ఉంటారు.  రుద్రాన్ని   ఎలా చదవాలో ఆ విధంగానే చదివితే ఫలితం ఉంటుంది అంతేగాని సినిమా వరసలాగ గాయత్రీ మంత్రాన్ని చదివినట్టు చదివితే ఫలితం సూన్యం.

(మరికొన్ని అమృత ధారలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List