28.11.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
( రేపు అనగా 29.11.2017 గీతా జయంతి)
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు,
ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
ఈ పుస్తకంలో ముందుమాటగా
సంపాదకులు ఈ విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.
“మనము ఆధ్యాత్మికంగా
ఎదగడానికి మనము అనుసరించవలసిన విధానాలను ఎంతో సరళంగా తెలియచేసారు. ఆయన తమ సంభాషణలలో బాబా, సాధుసత్పురుషులు, గీత, ఉపనిషత్
లలో చెప్పబడిన విషయాలను కూడా సందర్భోచితంగా తెలియచేసారు.
ఆధ్యాత్మికంగా పురోగతి సాగించడానికి ఆయన ఎటువంటి
సత్వర మార్గాలను ప్రోత్సహించలేదు.
“గురువు ఒక్కడే జ్ఞానాన్ని
ప్రసాదిస్తాడు. గురువు లేకుండా మనమేమీ నేర్చుకోలేము. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే గురువు
ద్వారానే సాధ్యం. గురువే దైవం అని ఉధ్భోధించారు. సాధకులకు శ్రీస్వామీజీ చెప్పిన విషయాలు ఎంతో ఉపయోగకరంగా
ఉంటాయి.
శ్రీస్వామీజీ భక్తులతో
జరిపిన అనుగ్రహ భాషణమ్ - 1 వ.భాగమ్
01.05.1970 : స్వామీజీ
కొంతమంది భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు. ఆసమయంలో ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమయిన విశేషాలు.
“జ్ఞానమార్గంతో పోల్చుకుంటే
భక్తి మార్గం చాలా సురక్షితమయిన దారి. ఈ భక్తి
మార్గంలో అనుసరించదగిన సులభమయిన చిన్న పధ్ధతులు మాత్రమే ఉంటాయి. మనలో ఉన్న అహంకారాన్ని తరిమివేయాలంటే కామ, క్రోధ,
మద, మాత్సర్యాలను విసర్జించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అది ముఖ్యం కూడా. అపుడే మనమెవరమో మనకి అర్ధమవుతుంది. ఆత్మజ్ఞానాన్ని పొందగోరే సాధకులకు లభించిన సిధ్ధులు
పెద్ద ప్రతిబంధకాలుగా ఉంటాయి.
02.05.1970 : స్వామీజీ
విష్ణుసహస్ర నామ పారాయణ గురించి వివరిస్తూ కేవలం పుస్తకం చదివినందువల్ల పాండిత్యాన్ని సంపాదించుకున్నవానిలో అహంకారం పెంపొందుతుంది. అసలేమీ చదవనివాడు భగవంతుని పాదాల
వద్ద శరణాగతి చేసి ఆయన నామాన్నే స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. భగవంతుని మీద భక్తితో ఆయనకు సర్వశ్య శరణాగతి చేయాలి. పూర్వజన్మ సుకృతం వల్లనే మానవునికి భగవంతునియందు
భక్తి కలుగుతుందనేది వాస్తవం.
07.05.1970 : స్వామీజీ
--- “బాబా మనలని దేనియందు మోహం పెంచుకోవద్దని
ఈ దృశ్యప్రపంచమంతా అశాశ్వతమని, భ్రమ అని, ఆత్మజ్ఞానమొక్కటే వాస్తవమయినదని చెప్పారు. ఆత్మజ్ఞానాన్ని మరింత విశ్తృతంగా పెంచుకోవడం ద్వారానే
మనం విశ్వమానవాళి ప్రేమను, విశ్వచైతన్యాన్ని పెంపొందించుకోగలము. ఇదే మనలను మానవసేవకు, త్యాగనిరతికి దారి చూపుతుంది. బాబా మననుంచి కోరుకున్నది కూడా అదే.
13.07.1970 : ఈ రోజు
స్వామీజీ తమకు వచ్చిన స్వప్నం గురించి వివరించారు. “ఈ రోజు తెల్లవారుఝాము 3.30 కి నాకు స్వప్నంలో బాబా,
రమణమహర్షి, ఆదిశంకరాచార్య, నరసింహస్వామీజీ వీరందరూ కనిపించారు. వారంతా నా గదిలో ఆశీనులయి ఉన్నారు.
“బాబా! భగవద్గీతపై మీ అభిప్రాయం ఏమిటి?” అని నేను
బాబాని ప్రశ్నించాను. దీనికి సమాధానం శంకరాచార్యులవారిని అడగమని బాబా అన్నారు.
అపుడు శంకరాచార్యులవారు “గీత, గంగ, గాయత్రి. మొట్టమొదటగా గీతను పారాయణ చేయాలి. తరువాత పరిశుధ్ధత కోసం గంగ, చివరిగా జ్ఞానం కోసం గాయత్రి అని ఈ మూడు ‘గ’ లు
చాలు అని సమాధానమిచ్చారు. అపుడు బాబా “ఇంకొక
‘గ’ ఉంది, అదే గణపతి, ఆయనను కూడా చేర్చాలి” అన్నారు ఆ మాట వినగానే శంకరాచార్యులవారికి ఆనంద భాష్పాలు
కారాయి. అపుడు రమణ మహర్షి గారు ధర్మ, అర్ధ,
మోక్ష అనగా ఇవే ఆత్మ సాక్షాత్కారానికి లక్ష్యంగా భావించాలి అన్నారు.
(ధర్మ, అర్ధ, మోక్ష వీటికి పూర్తి వివరణ నాకు కూడా తెలుసుకోవాలని అనిపించింది. శ్రీ పరిపూర్ణానంద స్వామిగారు చాలా సరళంగా చెప్పిన ఈ ఉపన్యాసాన్ని మీరు కూడా వినండి.--- త్యాగరాజు)
15.07.1970 : ప్రధమ
ఏకాదశి గురించి వివరిస్తూ స్వామీజీ చెప్పిన విషయాలుః “భగవంతునికి మనము పూర్తిగా శరణు వేడుకుని ఆయనను
మన హృదయంలోనే నిలుపుకునే ప్రయత్నం చేయాలి.
అది మనలను చెడునుంచి, ఆపదలనుంచి దూరం చేసి రక్షణ కల్పిస్తుంది.
మానవునికి ప్రాధమికంగా ముఖ్యమయిన కోరికలు మూడు ఉన్నాయి. అవి భార్య, సంతానం, సంపద. ఇవన్నీ అనుభవిస్తున్న మానవుడు భగవంతుని కూడా మనసులో
నిలుపుకుని ఆయన గురించే చింతన చేస్తూ ఉంటే ఆ మానవుడు ఉత్తముడు. ఇవేమీ లేకుండా కేవలం భగవంతుని చేరగలిగితే అతడు ఉత్తములలోకెల్లా
ఉత్తముడు. అందువల్ల తనకు తానే స్వాభావికంగా
కోరికలను పరిత్యజించి వాటికి అతీతంగా జీవించాలి.
నిరంతర శ్రమవల్లను, భగవంతుని అనుగ్రహంతోను మనము ఈ అవరోధాలన్నిటిని అధిగమించి ఆధ్యాత్మిక
జ్ఞానాన్ని పొందగలం.
ఇక భగవన్నామాన్ని గురించి
ప్రస్తావిస్తూ కష్టసమయాలలో, ప్రయాణ సమయాలలో విష్ణుసహస్రనామంలోని చివరి శ్లోకమయిన
“వనమాలీ గదీ శార్జ్గ్
శంఖీ చక్రీ చ నన్దకీ
శ్రీమన్నారాయణో విష్ణుః
వాసుదేవోభిరక్షతు”
పఠిస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు
మన రక్షణ కోసం అరుదెంచుతాడు.
10.10.1970 : ఈ రోజు స్వామీజీ విష్ణుసహస్రనామ పారాయణ ప్రాముఖ్యతను
వివరించారు. ప్రతివారు కనీసం సాయంసమయమందయినా
విష్ణుసహస్రనామ పారాయణ చేయాలని ఉధ్భోధించారు.
25.11.1970 : భగవంతుడిని
దర్శించుకోవడానికి దేవాలయాలకు వచ్చేవారి యొక్క ధోరణి ఏవిధంగా ఉంటుందో స్వామీజీ వివరించారు. “దేవాలయంలోని అర్చకునితో సహా అక్కడికి వచ్చిన భక్తులెవరిలోనూ
వారిలో ఉన్న లోపాలను మనం చూడరాదు. మన ముఖ్య
విధి భగవంతుని గూర్చి చింతన మాత్రమే. మిగిలిన
విషయాలవైపు మన ఆకర్షితులం కారాదు. శ్రీమన్నారాయణమూర్తి
ఈ ప్రకృతికి, పంచభూతాలకు కారణభూతుడు. అందువల్ల
ఈ విశ్వమంతా ఆయనకు చెందినదే. ఆయనే ఈ విశ్వసృష్టికి
మూలకారకుడు. ఆయన కోసం మనకున్న వాటినన్నిటినీ
త్యాగం చేయాలి. ఆధ్యాత్మికత ద్వారా మనము పొందిన
ఆనందాన్ని, సంతోషాన్ని సర్వమానవాళితోను పంచుకోవడం మనం నేర్చుకోవాలి.
(నాకు కూడా ఇటువంటి దుర్గుణం
ఉంది. దేవాలయానికి వచ్చిన వారిలో కొందరు ఈ
మధ్య సెల్ ఫోను మాట్లాడుతూ ఉంటారు. వారిని
చూసి నేను చిరాకుగా మొహం పెడుతూ ఉంటాను. ఆలయ
పూజారి కూడా కాస్త కోపిష్టి వాడయినా మనసులోనే ఆయనను విమర్శించుకుంటూ ఉంటాను. స్వామిజీ చేసిన ఉపదేశానికి అనుగుణంగా నాలో ఉన్న
ఈ దుర్గుణాన్ని వదిలించుకుని, గుడికి వెళ్ళినపుడు భగవంతుని మీదనే దృష్టి పెడతాను. --- త్యాగరాజు)
(స్వామీజీ చెప్పిన అనుగ్రహ
భాషణాలు ఇంకా ఉన్నాయి)
0 comments:
Post a Comment