11.12.2025 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీలల రచన - మొదటి భాగమ్
కొద్ది రోజుల క్రితం దాదర్ ముంబాయిలో ఉన్న శ్రీ సాయి సంస్థాన్ ను దర్శించుకునే విశేషమయిన అవకాశం కలిగింది. శ్రీ సాయి నాద్వారా మరాఠీ భాషలో వ్రాయించుకున్న పుస్తకం “శ్రీ సాయి భక్త స్తుతి” సాయి భక్తులందరికీ ఉచితంగా పంచడానికి సంస్థాన్ వారి కార్యాలయానికి తీసుకు వెళ్ళాను. ఆ పవిత్రమయిన ప్రదేశంలో శ్రీ సాయి సంస్థాన్ కార్యాలయంలోని కార్యవర్గ సిబ్బందిని కలుసుకున్నాను. తరచుగా సాయి భక్తులందరం కలుసుకున్నపుడు ఎంతో ఆనందంగా మనసు విప్పి మాట్లాడుకొంటూ ఉంటాము. ఆ విధంగా వారిని కలుసుకోగానే వారిని ఆప్తులుగా భావించి వారితో మాట్లాడసాగాను. అప్రయత్నంగానే మేము ఒకరినొకరం బాగా అవగాహన చేసుకుంటూ ఎంతో భక్తితో సంభాషించుకున్నాము.
ఎడిటోరియల్ డిపార్టుమెంటు వాళ్ళు కోరిన మీదట మొదటిసారిగా నేను శ్రీ సాయిబాబా వారు నాకు కలిగించిన అనుభవాలను వ్రాయడానికి నిర్ణయించుకున్నాను. ఈ వ్యాసం ద్వారా “శ్రీ సాయి భక్తస్తుతి” పుస్తకం, భక్తి గురించి మాత్రమే కాకుండా సాయి ఆశీర్వాదాలతో సూక్ష్మమయిన అధ్బుతాలు, అంతర్గతంగా జరిగే పరివర్తనలు, నిశ్శబ్దంగా ప్రవహించే శక్తిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నేను పాత ముంబాయిలో జన్మించాను. మా గృహం ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. అటువంటి గృహంలో నేను జన్మించడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. మా ఇంటి పై వాటాలో ఒకావిడ ఉండేది. (ఆమెను నేను అత్తా అని పిలిచేవాడిని). ఆవిడకు శ్రీ సాయిబాబా మీద ధృఢమయిన భక్తి. ఆవిడ అమ్మమ్మ గారు సాయిబాబాను ప్రత్యక్షంగా అంటే బాబా జీవించి ఉన్న రోజులలో చూశారు. శ్రీ సాయి సత్ చరిత్రలో మనకు అంధేరీలో నివసించే పాటిల్ కుటుంబం గురించిన ప్రస్తావన వస్తుంది. ఆ కుటుంబంలోని ఆవిడే ఈమె. అందుచేత సహజంగానే ఆమె తల్లి వద్దనుండే ఈమెకు కూడా సాయి అంటే భక్తి కలిగి ఉంది. మా ఇంటిలో ఎవరయినా పరీక్షకు తయారవుతున్నా, లేక కాస్త అనారోగ్యంతొ బాధ పడుతూ ఉన్నా ఆవిడ మంచి నీళ్ళలో కాస్త ఊదీ కలిపి త్రాగమని ఇస్తూ ఉండేది. దాని వల్ల తమకు ప్రయోజనం కలిగిందని ఊదీని సేవించినవారు చెబుతూండేవారు. వారికి సాయి మీద నమ్మకం ఏర్పడి ఊదీ వల్ల కలిగిన అధ్బుతాలను అనుభూతి చెందేవారు.
నా చిన్న వయసులోనే అంటే నాకు ఆరు లేక ఏడు సంవత్సరాల వయసప్పుడు నేను అత్తతో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పట్లో 1980 వ.సం.లో షిరిడీ ఇంకా చిన్న గ్రామం. చాలా కొద్దిమంది భక్తులు మాత్రమే వస్తుండేవారు. అందుచేత భక్తులందరూ ఒకరితో ఒకరు పరిచయం కలిగి ఉండేవారు. ఇప్పుడు ఉన్నట్లుగా ఆ రోజుల్లో తినడానికి గాని, తగిన ప్రయాణ సౌకర్యాలుగాని అంతగా లేవు. కాని ఆ చిన్న గ్రామం అంతటా సాయి భక్తి, నమ్మకంతో నిండి ఉండేది. ఆ వాతావరణం, అక్కడ వీచే గాలి మనసులో అంతులేని ఆనందాన్ని నింపేది. సమాధి మందిరానికి కూడా చాలా సులభంగానే వెళ్ళేవాళ్ళం. ఆరతి సమయంలో బాబా సమాధి మందిరం దగ్గరగా, చేతిలో వింజామరతో కూర్చొని ఉండటం నాకింగా గుర్తు.
నా మనసులో బలంగా నాటుకున్న ఒక జ్ఞాపకం ఉంది. ఒకసారి మా అత్త నాచేయి పట్టుకుని గురుస్థానంలో ఉన్న పవిత్రమయిన వేపచెట్టు చుట్టు 108 ప్రదక్షిణలు చేయించింది. షిరిడీకి దగ్గరలో ఉన్న సాకోరి, నీమ్ గావ్ వంటి ప్రదేశాలకు ద్రాక్షతోటల గుండా గుఱ్ఱపు బండి మీద గాని, ఎద్దుబండి మీద గాని వెడుతూ ఉన్నపుడు ఎంతో ఆహ్లాదకరంగా సాగేది ఆ ప్రయాణం. మంచి మంచి జామపళ్ళు, తీయని రసం కారే పెద్ద పెద్ద ఎండు ద్రాక్షలు తెచ్చుకునేవాళ్ళం.
మా అమ్మగారు అధ్యాపకురాలు. అందువల్ల నా సమయాన్నంతా మా అత్తతో గడిపేవాడిని చాలా మట్టుకు గురువారాలప్పుడు ముంబాయి లామింగ్ టన్ రోడ్డులో ఉన్న సాయిధామానికి వెడుతూ ఉండేవాళ్ళం.
మా నాన్నగారికి కూడా శ్రీ సాయిబాబా అంటే విపరీతమయిన భక్తి. ఆయనకి మనసులో కోరిక జనించగానే మాకు కూడా చెప్పకుండా చాలా తరచుగా షిరిడీకి వెడుతూ ఉండేవారు. చాలా రోజులు గడిచాక తిరిగి వస్తూ ఉండేవారు. నేను మానాన్నగారితో కలిసి శ్రీ సాయి సత్ చరిత్ర రచయిత అయిన ముంబాయి బాంద్రాలో ఉన్న ధబోల్కర్ గారి ఇంటికి కూడా వెళ్ళినట్లు నాకు జ్ఞాపకం. మా నాన్నగారు జ్యోతిష్యశాస్త్రం చదవనప్పటికీ, జనాలు తరచుగా తమ భవిష్యత్ గురించి తెలుసుకోవాలని మా నాన్నగారి దగ్గరకు వస్తూ ఉండేవారు. సాధారణంగా మా నాన్నగారు చెప్పేవి జరుగుతూ ఉండేవి.
నా జీవితం అలా సాగుతూ ఉండగా, కొన్ని సంవత్సరాలపాటు నేను సాయి భక్తికి దూరమయ్యాను. యుక్తవయసు వచ్చిన తరువాత నాలో కలిగిన చంచల మనస్తత్వం, ఇంకా నేను పెద్దవాడిననే ఒక విధమయిన అహంకారం వల్ల, బాబా అంటే ఆసక్తి పోయి సాయి భక్తి మెల్ల మెల్లగా నా దైనందిన జీవితంలోనుంచి కనుమరుగయింది. సాయిబాబా ఎక్కడో దూరంగా ఉన్నారు, ఎవరయినా కష్టాలు వచ్చినపుడు మాత్రమే ఆయనను పిలవాలనే భావంతో ఉండేవాడిని. కాని బాబా శ్రీ సాయి సత్ చరిత్రలో ఈ విధంగా అన్నారు, “సప్త సముద్రాల అవతల ఉన్నా నా భక్తుడిని నేను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా నా దగ్గరకు లాక్కుంటాను.”
(ఇంకా ఉంది)
( తరువాతి సంచికలో… వివాహమయిన తరువాత జీవితంలో మలుపు తిప్పిన సంఘటనలు)








0 comments:
Post a Comment