26.06.2012 మంగళవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1998 (14)
05.09.1998
నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తిగా దర్శనము ఇచ్చి అన్నమాటలు నాలో అనేక ఆలోచనలును రేకెత్తించినవి.
1) నీజీవితములో నీదగ్గర బంధువుల మరణాన్ని చూసినావు. బంధువులతో పగ వైషమ్యాలను అనుభవించినావు. నీవాళ్ళకోసము అడ్డదార్లు తొక్కి ధనాన్ని సంపాదించినావు. మరల ఆధనాన్ని దోచుకోవడానికి వచ్చినవారితో గొడవలుపడినావు. శారీరిక సుఖాల కోసము పరస్త్రీలను ఆశ్రయించినావు. పదవిని నిలుపుకోవడానికి అడ్డమైనవాడి కాళ్ళు పట్టుకొన్నావు. ఇన్ని చేసి నీవు సాధించినది ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. నీలో పరివర్తన కలిగిన తర్వాత నీవు జీవించే జీవితము నిజమైన జీవితము అని గ్రహించు.
2) నీతోటి సాయి బంధువులను గౌరవించు. తలకు మించిన దాన ధర్మాలు చేయకు. ముసలితనములో పిల్లలపైన, మనవలపైన మమకారమును పెంచుకోవద్దు. నీశేష జీవితాన్ని భగవంతుని అన్వేషణలో వినియోగించు.
08.09.1998
నిన్నరాత్రి శ్రీసాయి ఒక ముదుసలి స్త్రీరూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) అధ్యాత్మిక శక్తిని చక్కగా వినియోగించుకొని ప్రశాంత జీవితము కొనసాగించు.
2) మానవ జీవితములో వైవాహిక సంబంధము ప్రశాంత జీవితమునకు మూలాధారము. ఆ బంధములో స్త్రీ పురుషులు గొడవలు పడటము అంటే జీవితములో ప్రశాంతతను దూరము చేసుకొన్నట్లే.
3) ఈనాడు రోగాలు నయము చేయవలసిన వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులను యితర వైద్యులకు అమ్మివేసి తాము ధనవంతులుగా మారిపోతున్నారు.
రోగులు మాత్రము అప్పుల ఊబిలో కూరుకొనిపోయి మార్వాడీవానికి బానిసలుగా మారిపోతున్నారు. నారాయణ స్వరూపుడైన వైద్యునికి యిది మంచి పధ్ధతి కాదు.
(ఇంకా ఉంది )
సర్వం శ్రిసాయినాదార్పణమస్తు)
0 comments:
Post a Comment