Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, October 26, 2012

శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయి -2

Posted by tyagaraju on 8:18 AM


26.10.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు



ఈ రోజు సాయి.బా.ని.స. చెప్పే శ్రీకృష్ణునిగా సాయి వినండి...



                                         
                        


శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయి  -2



గర్భవతిగా ఉన్న ఉత్తరను శ్రీకృష్ణ పరమాత్ములవారు ఎట్లు రక్షించినారో  మనకందరకూ తెలుసు.  అశ్వథ్థామ ఆమె గర్భంలో ఉన్న శిశువును  బ్రహ్మాస్త్రంతో నాశనం చేద్దామనుకున్నాడు.  



కొంతమంది చెప్పేదేమిటంటే శ్రీ కృష్ణుడు తన విష్ణుచక్రాన్ని ప్రయోగించినప్పటికీ, అశ్వథ్థామ ఇంకా జన్మించని శిశువును నాశనం చేశాడని.


 ఏమయినప్పటికీ శ్రీకృష్ణుడు శిశువును తిరిగి ఉత్తర గర్భంలోకి మామూలు స్థితిలోకి తీసుకొనివచ్చి ప్రవేశపెట్టాడు.  



శ్రీసాయి సత్ చరిత్ర 48వ. అధ్యాయములో మనకు ఇటువంటి సంఘటనే కనపడుతుంది. అందులో సపత్నేకర్, బాబా ఆగ్రహానికి గురయి తన కొడుకు చనిపోయాడని అందరి వద్ద బాబాని నిందిస్తూ ఉండేవాడు. ద్వారకామాయిలో బాబా భక్తులందరి యెదుట సపత్నేకర్ని చూపిస్తూ ఇలా అన్నారు "ఈ సపత్నేకర్ తన కొడుకు మరణానికి నేను బాధ్యుడినంటున్నాడు. నేను అటువంటి పనులు చేసేవాడినా?  తన కుమారుడు మరణించినాడని ఏడ్చుచున్నాడు. అదే బిడ్డను మరలా అతని భార్య గర్భములోనికి ప్రవేశపెట్టెదను." అని భాగవతములో శ్రీకృష్ణుడు ఉత్తర గర్భములోనికి శిశువును తిరిగి ప్రవేశ పెట్టినట్లుగానే, సాయి సత్ చరిత్రలో బాబాకూడా అదేవిధముగా సపత్నేకర్ భార్యకు కూడా చేశారు.   



వనవాస సమయంలో పాండవులు ప్రశాంతమైన జీవితాన్ని గడపడం దుర్యోధనుడు సహించలేకపోయాడు. దుర్యోధనుడు దూర్వాస మహామునిని ఆయన 1000 మంది శిష్యులతో పాండవులు ఉన్న చోటికి పంపించాడు. 


తమకున్న చాలీ చాలని పదార్ధాలతో దూర్వాస మహామునికి ఆయన 1000 మంది శిష్యులకు తగు ఆతిధ్యమివ్వలేక పాండవులు అవమానాల పాలయి దూర్వాస మహాముని ఆగ్రహానికి గురవుతారని దుర్యోధనుడు ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు.  మధ్యాహ్ న్నము వేళ దూర్వాస మహాముని తన శిష్యులతో పాండవులు ఉన్న చోటకు వచ్చి తాము ఒక ఘడియలో  తిరిగి వస్తామని ఆలోపుగా తమకందరకూ భోజన ఏర్పట్లు చేసి ఉంచమని ద్రౌపదికి చెప్పి వెళ్ళాడు. ఏమిచేయాలో ద్రౌపదికి అర్ధం కాలేదు. అప్పటికే పాండవులందరి భోజనాలు పూర్తయిపోయి ఏమీ మిగలలేదు. వంట పాత్రలన్ని కూడా శుభ్రం చేయబడ్డాయి.

 వనవాస సమయంలో పాండవులు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తూ ఉండేవారు.  ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్ధించింది. కృష్ణుడు ద్రౌపదిని ఎందుకంత కలతగా ఉన్నావని అడిగాడు. ఆమె జరిగిన విషయమంతా కృష్ణుడికి వివరించింది. తామప్పటికే భోజనాలు కానిచ్చేశామని, దూర్వాసులవారికి ఆతిధ్యమివ్వడానికి  ఏమీ మిగలలేదని చెప్పింది.  తనకేమీ దిక్కు తోచకుండా ఉందని నిస్సహాయతను వ్యక్తం చేసి ఏదయినా దారిచూపమని వేడుకొన్నది.


 శ్రీకృష్ణుడు "ఏదీ పాత్రలను చూపించు" అని ద్రౌపదిని అడిగాడు.  అన్నం గిన్నెలో ఒక్కమెతుకు మాత్రం మిగిలి ఉంది. కృష్ణుడు దానిని ఆరగించాడు.

దూర్వాస మహాముని, వారి శిష్యులు నదిలో స్నానమాచరించి ఒడ్డుకు రాగానే వారందరికి కడుపు నిండి త్రేనుపులు రావడం మొదలుపెట్టాయి. దూర్వాస మహాముని, తామందరికి కడుపు నిండుగా ఉన్నదని ఇంకేమీ తినలేమని ద్రౌపదికి కబురు పంపించాడు. 

కొన్ని పుస్తకాలలో మాత్రం, శ్రీకృష్ణుడు పాత్రలో చూసినప్పుడు ఒక్క మెతుకు ఉన్నదని అదే మధుర పదార్ధాలుగా మారగా, ద్రౌపది అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినదనీ వ్రాయబడి ఉంది.


దీనిని పోలిన సంఘటన ఏదయినా ఉందా అని నేను సత్ చరిత్రలో వెతికాను. సత్ చరిత్ర 35 వ. అధ్యాయములో నెవాస్కర్ కుటుంబములో ఇటువంటి సంఘటనే జరిగింది. నెవాస్ గ్రామములో నెవాస్కర్ యొక్క సంవత్సరీకములప్పుడు జరిగింది.

ఆ సమయములో వారు వంద మందిని భోజనాలకు పిలువగా, నెవాస్కర్ భార్య తన కోడలుతో వారందరికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయమని పురమాయించింది. కాని మూడు వందలమంది భోజనాలకు వచ్చేటప్పటికి కోడలు నిస్సహాయంగా తన అత్తగారివైపు చూసింది.  అత్తగారు కోడలికి ఏమీ కంగారుపడవద్దు సహనంతో ఉండమని చెప్పింది. "మనకు సాయికృష్ణుడు ఉన్నాడు. ఊదీ ఉంది. పదార్ధాలున్న పాత్రలన్నిటిలోను ఊదీ వేసి మూతలు తీయకుండా వచ్చిన అతిధులందరికీ భోజనాలు వడ్డించు.అంతా బాబా చూసుకుంటారు" అని సలహా ఇచ్చింది. ప్రగాఢమైన నమ్మకంతో ఇద్దరూ కూడా వచ్చినవారందరికీ భోజనలు వడ్డించారు.  అందరి భోజనాలు పూర్తయిన తరువాత చూడగా వంటపాత్రలలో ఇంకా పదార్ధాలు మిగిలి ఉన్నాయి. భాగవతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించిన విధంగానే, మన సాయికృష్ణుడు సరియైన సమయంలో వచ్చి నెవాస్కర్ భార్య గౌరవాన్ని కాపాడారు.    

మరిన్ని పోలికలకు ఎదురు చూడండి...

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List