Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, April 12, 2016

శ్రీ సాయి లీలామృత ధార - శ్రీ షిరిడీ సాయి విభూతి లీల

Posted by tyagaraju on 9:16 AM
Image result for images of shirdi sai smiling face
Image result for images of rose yellow

12.04.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నిన్న అనగా 11.04.2016 నాడు “ఆ స్వరం ఎవరిది?” ప్రచురించాను.  అది చదివిన తరువాత శ్రీమతి కృష్ణవేణిగారికి తమ చిన్నప్పటి అనుభవమ్ గుర్తుకు వచ్చిందని చెప్పారు.  దానిని కూడా ఇప్పుడే ప్రచురిస్తేబాగుంటుందని ప్రచురిస్తున్నాను.
“ నా చిన్నప్పటినుండి నేను బాబా భజనలకు వెడుతూ ఉండేదానిని. నాకప్పుడు 14  సంవత్సరాలు.  పదవ తరగతి చదువుతున్నాను. ఆ సంవత్సరంలో డిసెంబరు 31 వ.తారీకున ఒంగోలులో అమ్ముల సాంబశివరావుగారి ఆశ్రమంలో 12 గంటలపాటు అఖండ సాయినామ సంకీర్తన జరుగుతూ ఉంది.  ప్రతి సంవత్సరం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది.  సరిగా 12 గంటలకు బాబా కు అందరూ ఆరతి ఇచ్చి “హ్యాపీ న్యూ ఇయర్” అని చెప్పారు.  అప్పుడు ఆరతి అయిన తరువాత  మాలో కొంతమందికి ఫొటో నుండి “శుభా కాంక్షలు” అని చెపుతున్నట్లుగా వినిపించింది. ఒకావిడ ఎవరో శుభాకాంక్షలు చెప్పారు ఎవరు? అనగానే ఇద్దరు ముగ్గురు మాకు కూడా వినిపించింది అన్నారు.  “శుభాకాంక్షలు” ఆ మాటలు నేను కూడా విన్నాను.

శ్రీ సాయి లీలామృత ధార
శ్రీ షిరిడీ సాయి విభూతి లీల
బాబా గారు చేసే వైద్యం చాలా విచిత్రంగా ఉంటుందని శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్న మనకందరికీ తెలుసు. ఉదాహరణకి 13 వ.అధ్యాయంలో భీమాజీ పాటిల్ క్షయ రోగాన్ని చాలా విచిత్రంగా నయం చేశారు.  అతను షిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవాలనిచ్చి, రోగాన్ని కుదిర్చారు.  మొదటి స్వప్నంలో అతను ఒక పాఠశాల విద్యార్ధిగా పద్యాలని కంఠోపాఠము చేయకపోవటం చేత, బాబా క్లాసు ఉపాధ్యాయునిగా   దెబ్బలు కొట్టినట్లు కనిపించారు.   రెండవ స్వప్నంలో ఒక గృహస్థునిగా కనిపించి అతని చాతీపై పెద్ద బండను వేసి క్రిందకు మీదకు తోయడం వల్ల మిక్కిలి బాధననుభవించాడు.  స్వప్నంలో పడిన ఈ బాధలతో అతని జబ్బు నయమైంది.  ఈ రోజు మీరు చదవబోయే ఈ అద్భుతమైన లీలలో బాబా ఏవిధంగా వైద్యం చేశారో చూడండి.



షిరిడీ ధునిలోని పవిత్రమయిన ఊదీ ఎంతో అధ్బుతంగా ఎన్నో రోగాలని నివారిస్తోంది.  ఎవరయితే సాయిబాబా వారి మీద అచంచలమయిన విశ్వాసం ఉంచి ఆయననే ధ్యానిస్తూ ఉంటారో వారి కష్టాలన్నీ అనుమానం లేకుండా తొలగిపోతాయి.  సాయిబాబా వారి ఊదీ యొక్క అద్భుత శక్తి ఎటువంటిదో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.

సికిందరాబాద్ బోలారంలో నివాసం ఉంటున్న జనార్ధనరెడ్డిగారు కంట్రాక్టరు.  మొదట్లో ఆయనకు సాయిబాబా అంటే నమ్మకం లేదు.  కాని, ఆయన భార్య సులోచనాదేవికి సాయిబాబా మీద సంపూర్ణమయిన భక్తి విశ్వాసాలు.  ఆమె ప్రతిరోజు సాయిబాబాని ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తూ ఉండేది.  జనార్ధనరెడ్డికి సిగరెట్లు కాల్చడం, త్రాగుడు ఇటువంటి చెడు లక్షణాలన్నీ ఉన్నాయి.  విపరీతమయిన త్రాగుడు వల్ల అతనికి కామెర్లు వచ్చాయి.  కిడ్నీలు కూడా పాడయ్యి, చక్కెర వ్యాధి కూడా వచ్చింది.  కాని ఈ విషయాలేమీ తన కుటుంబ సభ్యులకి చెప్పలేదు.  1965 మే 14 వ.తారీకు ఉదయం 7  గంటలకి అతని ఆరోగ్యం దిగజారి పోయింది.  అతనిని  ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు.  అప్పటికి జనార్ధనరెడ్డి వయస్సు కేవలం 32 సంవత్సరాలు.  అతనికి రక్తం, గ్లూకోజు, ఎక్కించడం మొదలుపెట్టారు.  నీరుడు బంధించడం వల్ల గొట్టం ద్వారా మూత్రాన్ని తీయాలిసిన పరిస్థితి వచ్చింది.  రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో అతని స్థితిని చూసి పిల్లలు బాగా భయపడిపోయారు.  అతను కోమాలోకి వెళ్ళిపోయాడు.  వైద్యులు కూడా అతను బ్రతుకుతాడనే ఆశ వదిలేశారు.

అతని భార్య సులోచనా దేవి సద్గురు డా.సాయి కుమార్ దగ్గరకు వెళ్ళి తన భర్తను ఒక్కసారి వచ్చి చూడమని వేడుకుంది.  సద్గురు ఆస్పత్రికి వెళ్ళి ఆమె భర్తని పరీక్షించారు.  పరీక్షించి “బ్రతికే అవకాశం చాలా తక్కువ.  ఇక భగవంతుడె ఆయనను కాపాడాలి” అన్నారు.  ఎలాగయినా తన భర్తను బ్రతికించమని సులోచన చేతులు జోడించి సద్గురుని వేడుకుంది.  అప్పుడాయన “నా చేతుల్లో ఏమీ లేదమ్మా!  బాబాయే నీకు సహాయం చేయాలి” అని చెప్పి తన జేబులోనుండి చిన్న విభూతి పొట్లం తీసి  ఆమెకిచ్చారు. 

సద్గురు చెప్పినట్లుగానే, సులోచనాదేవి భక్తితో “ఓమ్ సాయి, షిరిడీ సాయి, ద్వారకామాయి” అని జపిస్తూ భర్త కాళ్ళకి, చాతీకి, పొట్టకి, నడుముకి విభూతిని రాసింది.  తన భర్తని బ్రతికించుకోవడానికి రాత్రి ఒంటి గంట వరకు అదే మంత్రాన్ని జపిస్తూ కూర్చుంది.  ఆ తరువాత ఆమెకు నిద్ర వచ్చి తెల్లవారుఝాము మూడు గంటల వరకు నిద్రపోయింది.
                 Image result for images of shirdi sai baba in dream to a person

ఈ సమయంలో అంటే రాత్రి ఒంటిగంటనుంచి మూడు గంటల మధ్యలో జనార్ధనరెడ్డికి ఒక విచిత్రమయిన కల వచ్చింది.  సాయిబాబా అతనికి కలలో కనిపించి అతని ముక్కు రంధ్రాలలో మూలికల ద్రవం పోశారు.  
            Image result for images of shirdi sai baba in dream to a person

సులోచనాదేవికి మూడు గంటలకు మెలకువ వచ్చి చూసేసరికి భర్త పడుకున్న తలగడ తడిసిపోయి పసుపు పచ్చగా కనిపించింది.  అతని ముక్కునుండి పసుపు పచ్చటి ద్రవం కారుతూ ఉంది.  సులోచనాదేవి భయపడిపోయి విధి నిర్వహణలో  (డ్యూటీ డాక్టర్) ఉన్న వైద్యుడిని వెంటనే పిలిచింది.  వారు పరీక్షించి రెడ్డిగారి నాడి కొట్టు కోవడంలో కాస్త గుణం కనిపించిందని చెప్పారు.  కాని, ఇందులో సాయిబాబా సాయిబాబా వారి ప్రమేయం ఉందని వారికి తెలీదు.  మరుసటి రోజు జనార్ధనరెడ్డిగారు కాస్త స్పృహలోకి వచ్చారు.  మరలా అతని ముక్కులో నుంచి పసుపు పచ్చటి ద్రవం కారసాగింది.  వైద్యులు బాగా పరీక్షించారు.  కాని ఆ విధంగా ఎందుకు జరుగుతోందని మాత్రం కనుక్కోలేకపోయారు.  మూడవరోజు రాత్రి మరొక అత్యద్భుతమయిన సంఘటన జరిగింది.  ఇంతకు ముందు చెప్పినట్లుగానే సులోచనాదేవి భర్త శరీరానికంతా ఊదీ రాస్తూ, మంచం మీద చివర కూర్చుని “ఓమ్ సాయి, షిరిడీసాయి, ద్వారకామాయి” అనే మంత్రాన్ని జపిస్తూ ఉంది.  అర్ధరాత్రికి ఆయనకి మరొక విచిత్రమయిన కల వచ్చింది.  బాబా ఆయనకి కలలో దర్శనమిచ్చి తన పవిత్ర హస్తంతో, అతని శరీరాన్నంతా విభూతిని రాశారు.  ఆ తరువాత అతనిని తన కాలితో ఒక్క తాపు తన్నారు.  పెద్ద శబ్దంతో జనార్ధన రెడ్డి మంచం మీద నుండి పడ్దారు.  ఆ శబ్దానికి మంత్ర జపం చేస్తూ ఉన్న సులోచనాదేవి మేల్కొంది.  భర్త నేలమీద పడి ఉండటం చూసి ఆశ్చర్యం పోయింది.  అతనికి ఆక్సిజన్ ఇవ్వడానికి పెట్టిన (ట్యూబ్స్) గొట్టాలు, గ్లూకోజు, రక్తం ఎక్కించడానికి అమర్చిన గొట్టాలు, యూరిన్ తీయడానికి అమర్చిన గొట్టం, అన్నీ కూడా ఎంతో నేర్పరితనంతో జాగ్రత్తగా ఎవరో తీసినట్లుగా మంచం మీద ఉన్నాయి.  తన భర్త బ్రతికి ఉన్నాడా లేదా అని చూడటానికి దగ్గరకు వెళ్ళింది.  తన భర్త సాయిబాబా నామాన్ని జపిస్తూ ఉండటం చూసి ఆమెకు ఆనందాశ్చర్యాలు కలిగాయి.  “దయ చేసి అందరూ కూడా ‘ఓమ్ సాయి షిరిడిసాయి, ద్వారకామాయి’ అంటు ఆయన మంత్రాన్ని జపిస్తూనే ఉండండి.  బాబా నన్ను వదలి వెళ్ళద్దు” అని భర్త నోటినుండి ఈ మాటలు వెలువడుతున్నాయి.  అంతవరకు బాబా అంటే నమ్మకం లేని తన భర్త నోటంబట ఈ మాటలు విన్న సులోచనాదేవికి చాలా విస్మయం కలిగింది.  కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు ఆపుకోలేనంతగా కారసాగాయి.  జనార్ధనరెడ్డి మాట్లాడటం చూసి వైద్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారు.  ఆక్సిజన్, గ్లూకోజు, రక్తం ఎక్కించే గొట్టాలని ఎవరు తీశారని జనార్ధనరెడ్డిని అడిగారు.  “నా సాయిబాబా రాత్రి వచ్చారు.  ఆయనే అన్నీ తీసేశారు” అని సమాధానమిచ్చారు జనార్ధనరెడ్డి.  జనార్ధన రెడ్డి అన్న మాటలు వైద్యులకి అర్ధం కాలేదు.  ప్రధాన వైద్యుడు కూడా జనార్ధనరెడ్డి కేసు ఏమిటన్నది నిర్ధారణ చేయలేకపోయాడు.  జనార్ధనరెడ్డి శ్వాస తీసుకోవడంలో చాలా గుణం కనపడింది.  ఇక ఆక్సిజన్ గాని, రక్తం ఎక్కించడం గాని అవసరం లేదని తేల్చారు.  అసలు ఇదంతా ఎలా సాధ్యమయిందని చాలా ఆశ్చర్యం కలిగింది అందరికీ.  శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా త్వరగానే కోలుకున్నాడు.  రెండు వారాలలోనే జనార్ధనరెడ్డి పూర్తిగా కోలుకున్నాడు.  ఎక్స్ రే, రక్త  పరీక్ష, యూరిన్ పరీక్ష అన్నీ చేశారు.  రిపోర్టులన్నీ నార్మల్ గా ఉన్నాయి.  పూర్తి ఆరోగ్యం చేకూరడంతో ఆస్పత్రినుంచి డిస్చార్జి చేశారు.
                      Image result for images of shirdi sai baba in dream to a person
ఇంతవరకు బాబాని ఒక సామాన్య  ఫకీరు గానే భావించిన జనార్ధనరెడ్డి బాబాని హృదయ పూర్వకంగాను, ప్రేమతోను, భక్తితోను, ఆరాధించడం మొదలుపెట్టాడు.  సిగరెట్లు కాల్చడం, మందు త్రాగడం లాంటి చెడు లక్షణాలన్నిటినీ పూర్తిగా వదిలేసి బాబాకు అంకిత భక్తునిగా మారాడు.  సులోచనాదేవి భర్తని సద్గురు గారి దగ్గరకు తీసుకుని వచ్చి ఆయనకు తన కృతజ్ణతలు తెలుపుకుంది.  షిరిడీ సాయిబాబావారి గొప్పతనాన్ని, ఆయన చేసే అధ్బుతమైన లీలలను నేను వర్ణించలేను.  స్వచ్చమయిన మనసుతో తన భక్తులు పిలిచిన వెంటనే ఆయన స్పందిస్తారు.  ఎవరి ఊదీ అయితే వేలాది మంది భక్తులకి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తొందో ఆ ఊదీని ప్రసాదించిన సాయిబాబా వారికి మనం ఎప్పుడూ విధేయులమై ఉండాలి.
                 Image result for images of shirdi sai baba in dream to a person

సర్వాంతర్యామి అయిన సాయిబాబా ఇష్టానికే అన్నీ వదలివేసిన జనార్ధనరెడ్డి, సులోచనాదేవి, వారి పిల్లలు ఇప్పుడు ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు.                                  
                                          డా.కె. రామ్ కుమార్
                           కార్యదర్శి, సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమం
                                               సికిందరాబాదు.                                                                                         
  బాబా గారు జీవించి ఉన్నప్పుడు, ఆయన మహాసమాధి చెందిన తరువాత కూడా తన భక్తులకు ఇన్ని అనుభవాలనిచ్చి కాపాడుతున్నారని మనకందరికీ తెలుసు.  ఈ అనుభూతులను పొందిన భక్తులంతా తమకు బాబా అనుభూతులను అనుభవాలను  ఇచ్చారనీ తామెంతో ఆనందాన్ని పొందామనీ  చెప్పినవన్నీ అసత్యాలు కావు.  ఈ ప్రపంచంలో ఇంత మంది సాయి భక్తులు అసత్యవాదులేనా? అనుభవాలు అనుభూతులు అనుభవించిన వారికే తెలుస్తాయి.  కొన్ని అనుభూతులను వర్ణించలేము.   మరి నేటికీ షిరిడీకి తమ సద్గురువయిన బాబా ను దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారే?  మరి అటువంటప్పుడు కొంతమంది కాషాయధారులు బాబాని నిందించడం ఎంతవరకు సబబు? వారికి నమ్మకం లేకపోవుగాక, విమర్శించడం భావ్యం కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి.


(మరికొన్ని అమృత ధారలు ముందు ముందు)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List