Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, June 19, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 15వ, భాగమ్

Posted by tyagaraju on 6:42 AM

 


19.06.2022  ఆదివారం

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 15వ, భాగమ్

అధ్యాయమ్ –12

సాయి అనుభవ గాధ

1916 వ.సం.లో జరిగిన అనుభవం.  ఆరోజుల్లో సాయిబాబా షిరిడీలొ ఉన్నారు.  మహారాష్ట్ర అంతటా సాయిబాబా పేరు మారుమ్రోగుతూ ఉంది.  ప్రతివారు సాయిబాబా దర్శనార్ధం షిరిడికి వెడుతూ ఉండేవారు.

1916 వ.సం. మేము దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నాము.  ఆ రోజుల్లో సంత్ జ్ణ్నానేశ్వర్, సంత్ తుకారాం ఇద్దరూ ఆధ్యాత్మిక వాతావరణానికి పునాదులు వేసారు.

అమర్ భూపాలి రాగంతో రోజు ప్రారంభమయేది.  ప్రతి ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది.  అటువంటి పవిత్ర వాతావరణం నిండి ఉన్న రోజులలో మా తాతగారయిన కీ.శే. విష్ణుపంత్ పితలే గారు విలేపార్లేకి వచ్చి ఒక చిన్న కుగ్రామంలో నివాసం ఏర్పరచుకున్నారు.  ఆయన లాండ్ రెవెన్యూలో తితలి గా ప్రభుత్వ ఉద్యోగి.  అప్పట్లో ఆయన జీతం రూ.40/-.


మాతాతగారు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు.  ఆయన గొప్ప యోగీశ్వరులయిన అక్కల్ కోట స్వామిసమర్ధ, ఖేడ్ గావ్ లోని నారాయణ మహరాజ్, షేన్ గావ్ లోని గజానన్ మహరాజ్ లను దర్శించుకున్న భాగ్యశాలి.

మాతాతగారు షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుందామనుకున్నారు.  మా నాన్నగారు కేంద్ర రైల్వే శాఖలో కొత్తగా ఉద్యోగంలో చేరినందువల్ల మాతాతగారితో కలిసి వెళ్ళలేకపోయారు.  మా తాతగారు సామాను సద్దుకుని, సాయిబాబాకోసం తియ్యటి మామిడిపండ్లు (హాపస్ రకం) కొన్నారు.



ఆరోజు గురువారం.  బాబా ద్వారకామాయిలో విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు.  ఒక భక్తుడు బాబాకు సేవ చేస్తున్నాడు.  ఇంకా అక్కడ బాబాను కలుసుకోవడానికి వచ్చిన ఇతర భక్తులు కూడా ఉన్నారు.  అపుడు బాబా ఒక భక్తునితో నీకేమయినా మామిడిపండ్ల వాసన వస్తూ ఉందా అని అడిగారు.  అదే సమయంలో మరొక భక్తుడు మామిడిపండ్ల వాసన వస్తోందని చెప్పాడు.  ఆ వెంటనే ద్వారకామాయంతా మామిడి పండ్ల వాసనతో నిండిపోయింది.  ఆసమయంలో మా తాతగారు కోపర్ గావ్ లో ఉన్నారు.  ఆయన అక్కడ గోదావరిలో స్నానం చేసి ఎడ్లబండి మీద  షిరిడీకి బయలుదేరారు.

షిరిడికి రాగానే దీక్షిత్ వాడాకి వెళ్ళారు.  అక్కడ ఆయన కోసం అప్పటికే ఒక గది సిధ్ధం చేయబడి ఉంది.  ఆతరువాత ఆయన ద్వారకామాయికి చేరుకున్నారు.  ఆయన అక్కడికి అడుగు పెట్టిన వెంటనే ఆయనకు కూడా అన్నివైపులనుంచి మామిడిపండ్ల వాస గుప్పున కొట్టింది.  బాబా ఆయనని చూడగానే నువ్వు నాకోసం తీసుకువచ్చిన మామిడిపండ్లు నాకు ఇవ్వు అని బిగ్గరగా అడిగారు.  మా తాతగారు మొత్తం తొమ్మిది పండ్లను ఒక పళ్ళెంలో పెట్టి బాబా పాదాల వద్ద పెట్టారు.  బాబా వాటిలోనుంచి రెండు పళ్ళను తీసుకుని మిగిలిన పళ్లను అక్కడ ఉన్న భక్తులకు పంచారు.  ఆమామిడి పళ్లను తిన్న భక్తులందరికీ అధ్బుతమయిన లీలలు అనుభవమయ్యాయి.  కొంతమందికి వారివారి సమస్యలు తీరిపోయాయి.  కొంతమందికి ఆకస్మిక ధనలాభం కలిగింది.  మరికొందరికి సంతానం కలిగింది.



షిరిడిలో రెండు రోజులున్న తరువాత మా తాతగారు ఇంటికి తిరిగి వెళ్లడానికి అనుమతికోసం బాబా వద్దకు వెళ్లారు.  మా తాతగారు బాబా ఫోటో ఒకటి కొనుక్కుని, బాబాకు ఇచ్చారు.  బాబా ఆ ఫొటోని తన హృదయానికి తాకించుకుని తిరిగి మాతాతగారికి ఇచ్చారు.  బాబా మా తాతగారికి ఊదీని కూడా ఇచ్చి రూ.15/- దక్షిణ ఇమ్మన్నారు.   మా తాతగారు బాబాకి దక్షిణ సమర్పించారు.  భగవంతుడు నీకు మేలు చేయుగాక అని బాబా దీవించారు.  బాబా ఆశీర్వాదాలతో మా తాతగారు షిరిడీనుండి బయలుదేరారు.

ఇక మా తాతగారి వద్ద ప్రయాణ ఖర్చులు ఒక్క పైసా కూడా లేదు.  కోపర్ గావ్ కి కాలినడకన బయలుదేరారు.  ఆరోజు ఎండ చాలా విపరీతంగా ఉంది.  అలా మూడు మైళ్ళు నడచిన తరువాత దారిలో ఒక గుఱ్ఱం బండి కనిపించింది.  ఆబండిలో ఒకపెద్దమనిషి కూర్చుని ఉన్నాడు.  ఆయన మాతాతగారిని బండిలో ఎక్కించుకుని మధ్యాహ్నంవేళ  అంత ఎండలో నడచుకుంటూ వెళ్ళడానికి కారణమేమిటని అడిగాడు.  మా తాతగారు వేరే విధంగా చెప్పారు.  తాను రెవెన్యూ శాఖలో తలతి గా ఉద్యోగం చేస్ల్తున్నాననీ, అందు చేత తనకు నడక ఇష్టమనీ చెపారు.  వారు కోపర్ గావ్ స్టేషన్ కి చేరుకున్నారు.  మాతాతగారు బండి దిగి విచారణ కార్యాలయం దగ్గరకు చేరుకుని వెనుకకు చూసారు.  అక్కడ తాను వచ్చిన టాంగా లేదు.  మాతాతగారిని కోపర్ గావ్ కి టాంగాలో తీసుకువచ్చినది సాయి.  మాతాతగారు రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.  బాగా అలసి సొలసి టికెట్ లేకుండా బొంబాయికి ప్రయాణించి క్షేమంగా ఇల్లు చేరుకున్నారు.

మనోహర్ పితలే

అమోల్ పితలే

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List