10.05.2011 మంగళవారము
షిరిడీ దర్శించేవారికి సమాచారం సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీశ్శులు.
ఈ రోజు మనము షిరిడీ వెళ్ళునప్పుడు కూడా తీసుకు వెళ్ళవలసినవి, అక్కడ చూడవలసిన ప్రదేశములు, అక్కడ మనమెలా సంచరించాలి వీటి గురించి తెలుసుకుందాము.
మనలో చాలా మంది షిరిడీ దర్శించి ఉంటారు, కొందరు మొదటి సారి వెడుతూ ఉండవచ్చు. యింతకుముందు దర్శించినవారికి కూడా కొన్ని విషయాలు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. లేక కొన్ని ప్రదేశాలు తెలిసున్న చూడటానికి సమయం చాలక చూసి ఉండకపోవచ్చు. అందుచేత ఈ సారి వెళ్ళినప్పుడు తప్పకుండా అన్ని ప్రదేశాలు చూసి వచ్చేలాగ ముందరే ప్రయాణం పెట్టుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది.
షిరిడీ వెళ్ళేముందు:బయలుదేరే ముందు సచ్చరిత్ర వారం రోజులు పారాయణ చేయండి. శ్రథ్థగా చదవండి. సమయమంతా సాయి లీలలతోనూ, సాయి నామ స్మరణతోనూ గడపండి. షిరిడీ వెళ్ళినప్పుడు, మీరు చదివినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండండి.
షిరిడీ వెళ్ళేముందు తీసుకుని వెళ్ళవలసినవి::1) సాయి సచ్ఛరిత్ర 2) ఆరతుల పుస్తకం 3) సాయి వెలిగించిన థునిలో వేయడానికి రావి, మేడి, తులసి పుల్లలు, గంథపు చెక్క, సాంబ్రాణి, ఆవు నెయ్యి, నవ థాన్యాలు, తేనె, పీచుతో ఉన్న కొబ్బరికాయ, 4) సాయి వెలిగించిన దీపాలలోకి నూనె, 5) ఉదయం హారతి తరువాత బాబాకి మంగళ స్నానం చేయించే నీటిలో కలపడానికి పన్నీరు.
(యివన్నీ కూడా సాథ్యమయినంత వరకు ప్రయాణానికి ముందే సేకరించి పెట్టుకుని కూడా తీసుకెడితే, మనం షిరిడీ వెళ్ళినప్పుడు వీటికోసం షాపుల వద్దకు వెళ్ళి కొనుక్కునే శ్రమ తప్పుతుంది, మనకి సమయం కూడా కలసి వస్తుంది)
షిరిడీ ప్రయాణంలో:ప్రయాణంలో వీలయినంత యెక్కువ సమయం సాయి రూపాన్ని థ్యానిస్తూ, సాయి నామస్మరణతో గడపాలి. సచ్చరిత్ర, లేక సాయి లీలల పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి.
బాబా మొట్టమొదట అహ్మద్ నగర్ వచ్చారు. అక్కడ ఆలీ అనే మహాత్మునితో కొంతకాలం కలిసి ఉన్నారు. అందుచెత అహ్మద్ నగర్ మీదుగా బస్ లో వెళ్ళేవారు, అది స్మరించి ఆ పుణ్యభూమికి నమస్కరించుకోవాలి.
సాయి షిరిడీ చేరేముందు రహతా గ్రామం వచ్చారు. తరువాత కూడా తరచు దౌలూసేఠ్ అనే భక్తుని చూడటానికి వస్తూండేవారు. సాయి బాబా ఈ గ్రామం నుంచే విత్తనాలు తెచ్చి ప్రస్తుతం సమాథి మందిరం ఉన్న ప్రదేశంలో పూలతోట మొలిపించారు. అందుచేత రహతా చేరగానే సాయికీ, ఆ గ్రామానికి ఉన్న అనుబంథాన్ని స్మరించి ఆ భూమికి నమస్కరించుకోవాలి
షిరిడీ చేరగానే::నా అనుమతి లేనిదే యెవరూ షిరిడీలో కాలు మోపలేరు అన్నారు బాబా. అనుచేత మనం షిరిడీలో కాలు మోపామంటే ఆయన మనలని రప్పించుకున్నారు. అందుచేత ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
షిరిడీ ప్రవేశమే సర్వ దుహ్ ఖ పరిహారము అన్నారు బాబా. అందుకని ఆయన దయవల్ల మన కష్టాలన్ని తీరతాయనే నమ్మకంతో ఉండాలి.
షిరిడీ చేరిన తరవాత మనము యెక్కడ నడచినా ఆ బాటలోని ప్రతి యిసుక రేణువూ 60 సంవత్సరాల సాయి సంచరించారని గుర్తుకు తెచ్చుకుని ఆయన పాద స్పర్శతో పవిత్రమైన ప్రదేశమని భావంతో ఉండాలి. బాబా సామాన్యంగా పాదరక్షలు థరించేవారు కాదు. అందుచేత మనం యెండ వేడిమి లేనప్పుడు పాద రక్షలు లేకుండా నడిస్తే మంచిది.
లెండి బాగ్ యెదురుగా ఉన్న భవనంలో (దీక్షిత్వాడా వెనుక భాగం) సంస్థాన్ వారి పుస్తకాల షాపు ఉంది. యిక్కడ బాబా ఫొటోలు, సచ్చరిత్ర పుస్తకాలు అన్నీ దొరుకుతాయి. సచ్చరిత్ర ముందే కొనుక్కుని వుంచుకుని బాబాని దర్శించుకున్నప్పుడు అక్కడ పూజారిగారికి ఇస్తే బాబాకి తాకించి, గ్రంథాన్ని పవిత్రం చేసి యిస్తారు.
మందిరంలోని ఆవరణలో పెద్ద హాలు ఉంటుంది. ఇక్కడ సామూహికంగా సాయి సత్యనారాయణ పూజ జరిపిస్తారు. ఉదయం 6.00 నించి కౌటర్లో టిక్కట్టులు అమ్ముతారు.
సచ్చరిత్ర పారాయణ చేసుకొవడానికి పెద్ద హాలు కూడా ఉంది. ఇక్కడ అన్ని భాషల లో నూ సచ్చ్రిత్ర పుస్తకాలు ఉంటాయి.
ఇక్కడ అందరూ ప్రసాంతంగా కూర్చుని కాసేపు చదువుకుంటూ ఉంటారు.
గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసేముందు అందులొ అగరు వత్తులు కూడా వెలిగించి పెట్టండి. అక్కడ వేప ఆకులు దొరికితే వాటిని బాబా ప్రసాదంగా తినండి.
సమాథి మందిరంలో బాబా దివ్య మంగళ స్వరూపాన్ని తదేకంగా చూడండి. మీరు లైనులో ఉన్నప్పుడు మీ వంతు వచ్చేవరకు మెల్లగా కదులుతూ ఉండండి. ముందుకు వెళ్ళాలనే ఆరాటంతో ముందరున్నవారిని తోసుకుని వెళ్ళకండి. బాబా దృష్టి అందరి మీద ఉంటుందని గుర్తుంచుకోండి. మన ప్రవర్తనని బట్టే ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది. మనం బాబా ని దగ్గిరుండి చూశామా లేదా అన్నది కాదు, ఆయన అనుగ్రహం మనమీద ప్రసరించిందా లేదా అన్నదే ముఖ్యం. ఆయన అందరికీ అవకాసమిస్తారు. ఒకవేళ రద్దీలో మనకి తగిన అవకాశం రాక సరిగా చూడలేకపోయినా, బాబా అనుగ్రహం మనమీద తప్పకుండా ఉంటుంది. బాబా మరొకసారి నీ దర్శన భాగ్యం ఇవ్వు బాబా అని వేడుకోండి.
సమాథికి యెడమవైపునించి వెడితే, బాబా గారి పాదాలు, కుడివైపునించి వెడితే బాబా గారి శిరస్సు భాగము ఉంటాయి.
దర్శించుకుని భక్తి భావంతో శిరసు వంచి నమస్కరించుకోండి.
ద్వారకా మాయిలో మీకిష్టమైనంత సేపు కూర్చుని సచ్చరిత్ర చదవండి. బాబాని దర్శించుకునేముందు, నైవేద్యానికి పాలకోవా, పూలదండలు, తీసుకుని వెళ్ళండి. కోవా బాబా కి తాకించి ప్రసాదంగా మనకి ఇస్తారు. బాబా కి కప్పడానికి శాలువా కూడా తీసుకుని వెళ్ళండి, బాబాకి తాకించి మరలా మనకి ఇస్తారు. ప్రతీ ఆదివారమునాడు మందిరం ఆవరణలో బాబా వారికి సమర్పించిన శాలువాలు, ఆయనని తుడవడానికి ఉపయోగించిన తువ్వాళ్ళు మొదలైనవై వేలం వేస్తారు. మనము పాటలో పాడుకుని కొనుక్కొవచ్చు. పక్కనే వారి షాపు కూడా ఉంది. అక్కడ కూడా కొనుక్కోవచ్చు.
మంగళ స్నానము::
కాకడ ఆరతి తర్వాత బాబా విగ్రహానికి మంగళ స్నానం చేయిస్తారు. తరువాత వేడి నీరు సిథ్థం చేస్తారు. మనం రోజ్ వాటర్ తీసుకుని వెడితే, ఆ రోజ్ వాటర్ సీసా తీసుకుని ఆ నీటిలో కలుపుతారు. ఆయనకి స్నానం చేయించిన నీటిని బయటకు కుళాయి ద్వారా పంపుతారట. ఆ పవిత్రమైన తీర్థాన్ని మనం తల మీద చల్లుకుని సీసాలో కూడా నింపి యింటికి పట్టుకెళ్ళవచ్చు. యిక్కడే బాబాకి నైవేద్యం పెట్టిన వెన్న ప్రసాదం కూడా ఇస్తారట.
యిక లోపల ఆవరణలో బాబా వస్తు ప్రదర్శన శాల కూడా ఉంది. లోపలికి వెళ్ళగానె, బాబా విగ్రహాన్ని ప్రతిష్టించకముందు సమాథి మీద ఉన్న బాబా చిత్రపటం ఉండేది. దీనిని శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడు చిత్రించినది. ప్రదర్శన శాలలో బాబా గారు ఉన్నప్పుడు ఆయన ఉపయోగించిన వస్తువులన్ని చక్కగా చూడండి.
బాబా గారు స్నానం చేయడానికి ఉపయోగించిన రాయి, వెండి గొడుగు, దీపాలు, వింజామర, మొఖమల్ కఫ్నీ, ఆయన వాడిన పాదరక్షలు, చావడి ఉత్సవంలో బాబా భుజాలమీద కప్పిన కోటు, యిత్తడి లోటాలు, చిలుము గొట్టాలు, అప్పటి గ్రామఫోను, తిరగలి, శ్యామ కర్ణకి చేసిన అలంకారాలు, బాబాకి సమర్పించిన రథము,, రాగి హండాలు, సటకా, బిక్షకు వాడిన డబ్బాలు, మొదలైనవన్ని చూడవచ్చు.
ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే దారిలో మారుతి ఆలయం ఉంది. గణపతి శని మహదేవ మందిరాలు, మహాలక్ష్మీ మందిరము, విఠల్ మందిరము, కానిఫ్ మందిరము, నరసిమ్హ మందిరము, విరోబా మందిరము, మాలుబా మందిరము, ఖందోబా మందిరము వీటినన్నిటినీ దర్శించండి.
అప్పటి సాయి భక్తుల యిళ్ళు::
శ్యామా యిళ్ళు, లక్ష్మీబాయి షిండే యిల్లు (యిది చావడికి యెదురుగా ఉన్న చిన్న వీథిలో కొంచెం దూరంలో ఉంది)
భక్త మహల్సాపతి యిల్లు. (యిది లక్ష్మీ బాయి షిండే యింటికి కొద్ది దూరంలో ఉంది)
బాబా రోజూ భిక్ష చేసిన ఐదు యిళ్ళు:
1) సఖారాం షెలకే: యిది చావడికి చాలా దగ్గరలో ఉంది.
2) వామన్ గోండ్కర్ : యిది చావడికి యెదురుగా సఖారాం యింటికి దగ్గరలో ఉంది.
3) బయ్యాజీ అప్పకోతే పాటిల్: (సాయి కుటీర్) యిది చావడినించి తూర్పుదిశగా యెడమవైపు సందులో నరశిమ్హ లాడ్జి వెనకాల ఉంది.
4) బాయజా బాయి కోతే పాటిల్ యిల్లు : యిది సాయి కుటీర్ పక్కనే ఉంది.
5) నంద్ మార్వాడీ యిల్లు :యిది ద్వారకా మాయికి దగ్గరగానె ఉంది. ఈ యింటికి బాబా ఆఖరుగా బిక్షకు వెళ్ళేవారట.
(ఇది ద్వారకా మాయి యెదురుగా పెద్ద ఫాన్సీ షాపు. షాపు బోర్డ్ మీద నంద్ మార్వాడీ యిల్లు అని తెలుగులో కూడా రాసి ఉండటం చూడవచ్చు)
యింకా చూడవలసిన ప్రదేశాలు:1) కోపర్గావ్ యిక్కడ బాబా మందిరం చూడవచ్చు. బహుశా 10 కిలోమీటర్లు దూరం అనుకుంటాను. బాబా తపోభూమిలో సాయిబాబా మందిరం, యితర దేవాలయాలు ఉన్నాయి.
2) ఉపాసనీ బాబా ఆశ్రమం: షిరిడీకి ఆరు కిలోమీటర్ల దూరంలో సకోరీలో ఉంది.
3) శ్రీ శివనేసన్ సమాథి : ఈయన కోయంబత్తూరుకు చెందినవారు. బాబా కృప ఈయన మీద యెంతో ఉంది. యిది సాయి ప్రసాదాలయం నించి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలో వెళ్ళి రావచ్చు. తప్పక చూడవలసిన ప్రదేశం. చల్లగా ప్రసాంతంగా ఉంటుంది. (నేను వెళ్ళినప్పుడు చూశాను.)
4) శని సింగణాపూర్: యిది షిరిడీకి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రముఖ శనీశ్వర ఆలయం ఉంది.
యిక్కడకు 7 కిలోమీటర్ల దూరంలో సోనయీలో జగదాంబ రేణుకా మాత మందిరం ఉంది.
తిరుగు ప్రయాణంలో :షిరిడీలో మనం పొందిన అనుభూతిని, పవిత్ర బావాలని చక్కగా మన మనసుల్లో పదిలపరుచుకోవాలి. మనం ప్రయాణం చేసినంత సేపూ షిరిడీ లో మన అనుభూతులని, మనం చూసిన ప్రదేశాల గొప్ప తనాన్ని నెమరు వేసుకుంటూ సాయి స్మరణతో యిల్లు చేరాలి. మనం షిరిడీ వెళ్ళేది విహార యాత్రకి కాదు అని తెలుసుకోవాలి.
బాబా ఆజ్ఞ లేనిదే యెవరూ షిరిడీలో అడుగు పెట్టలేరు. షిరిడీ యాత్ర మనం అనుకుంటే అయ్యేది కాదు. అందుచేత ఈ అనుభవాన్ని చక్కగా పదికాలాలపాటు మన మనసుల్లో స్థిరంగా గుర్తుండిపోయేలా యాత్ర చేయండి.మనం చేసిన యాత్ర సార్థకమవ్వాలి.
షిరిడీలో అంగ వికలురు, సాథువులులాంటి వారికి ఒక్కరికైనా భోజనం పెట్టించాలి. పవిత్ర క్షేత్రాల్లో మనము చేసే ప్రతీ మంచి పనికి యెన్నో రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్ర వాక్యం.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment