10.02.2012
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బా ని స డైరీ - 1994 25 వ. భాగాన్ని చదువుకుందాము
(ఈ రోజు తిరుపతి యాత్రకు వెడుతున్న కారణంగా మరల ప్రచురణ 14 తారీకు)
సాయి.బా.ని.స. డైరీ - 1994 (25)
13.09.1994
నిన్నటిరోజున కష్ఠ సుఖాలు - వివేకము - వైరాగ్యము గురించి చాలా ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి కష్ఠ సుఖాలు - వివేక వైరాగ్యాల గురించి వివరించమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాల వివరాలు. 1) కష్ఠాలు సుఖాలు అనేవి మన నడవడికతోనే వస్తాయి. మన నడవడికను జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవలసినది మనమే. అందుచేత మన కష్ఠ సుఖాలకు కారణం యింకొకరు అని అనడములో అర్ధములేదు.
2) బత్తాయిపండ్లను వ్యాపారి (శ్రీసాయి) నుండి మనము కొనగలము. ఆ పండ్లను బిలచి యివ్వమని ఆ వ్యాపారిని మనము కోరవచ్చు. ఆ తర్వాత ఆ పండ్లలోని తొనలను తినవసినది, రసమును త్రాగవలసినది మనే అని గ్రహించటము వివేకమునకు మూలము.
3) మన జీవితము ఏడు అంతష్తుల మేడవంటిది. మొదటి ఆరు అంతస్థులు అరిషడ్ వర్గాలు. ఏడవ అంతస్థు మాత్రము (శిరస్సు) ఏడు ద్వారాలు కలిగియుండి భగవంతునికి చేరువలో యుంటుంది. శ్రీ సాయి ఈ ఏడు అంతస్థుల భవనానికి లిఫ్ట్ వంటివారు. వారు మనలను ఏడవ అంతస్తుకు చేర్చటానికి సిధ్ధముగా యండగా మన భార్యపిల్లలు ఆ లిఫ్ట్ ను మొదటి ఆరు అంతష్తుల మధ్యనే తిరగనిస్తూ ఉంటారు. ఏడవ అంతస్థులోనికి వెళ్ళనీయరు. నీవే ధైర్యము చేసి ఆ లిఫ్ట్ ద్వారా ఏడవ అంతష్తుకు చేరాలి అని గ్రహించటము వైరాగ్యమునకు మూలము.
14.09.1994
నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము గురించి, వాటిని ఆచరణలో పెట్టడము గురించి చాలా ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా సమస్యకు సమాధానము తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో (పల్లెటూరివాని రూపములో) తత్వాలుపాడుకొంటు నాముందరనుండి వెళుతున్నారు.
నేను ఆయనను ఆపి, తత్వాలు అంత చక్కగా మర్చిపోకుండ ఎలాగ పాడగలగుతున్నారు అని అడిగినాను. ఆవ్యక్తి అంటారు - "తత్వాలు కంఠస్థము చేయటము గొప్పకాదు. ఆ తత్వాలను ఆచరణలో పెట్టడము గొప్ప విషయము. అందుచేత తత్వాలు రోజూ వల్లె వేసుకొంటూ వాటిని జీవితములో ఆచరణలో పెట్టిననాడు జీవితములో చికాకులు యుండవు. రోజూ నీవు త్రాగే మంచినీరు ఒకే సరస్సులోనివి అయిఉండాలి. నీవు ఎక్కడికి వెళ్ళినా ఆసరస్సులోని నీరు నీతో సీసాలలో తీసుకొని వెళ్ళివాటినే త్రాగాలి. ఆ విధముగా ఒకే సరస్సులోని నీరు నీవు త్రాగిననాడు నీ ఆధ్యాత్మిక దాహము త్వరలో తీరుతుంది." నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయికి నమస్కరించినాను. ఒకే సరస్సులోని నీరు అంటే ఏమిటి అని ఆలోచించినాను. "శ్రీ సాయి సత్ చరిత్ర" అని మనసులో సమాధానము దొరికినది.
16.09.1994
నిన్నటిరోజున మీర్పేటలోని శ్రీ సాయి గుడికి వెళ్ళి 101 రూపాయలు దక్షిణగా వేసినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆశీర్వదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో మా ఆఫీసులోని కార్మిక నాయకుడు శ్రీ షేక్ పాం షావలి రూపములో దర్శనము యిచ్చి నా చేతిసంచిని బలవంతముగా తీసుకొన్నారు. ఆ చేతిసంచిలో శ్రీ సాయితో నా అనుభవాలు వ్రాసుకొన్న డైరీ యున్నది. ఆ డైరీ నాప్రాణముతో సమానమైనది. నా డైరీ నాకు యివ్వమని వేడుకొన్నాను. అతను తనకు 100 రూపాయలు యిస్తే ఆ డైరీ యిస్తాను అంటారు. నాకు నిద్రనుండి మెలుకువ వచ్చినది. నిన్నటిరోజునే కదా శ్రీ సాయికి 101 రూపాయలు దక్షిణ యిచ్చినది మరి శ్రీ సాయి తిరిగి 100 రూపాయలు ఎందుకు దక్షిణ కోరుతున్నారు అని ఆలోచించినాను. నిజానికి 30.08.1994 నాడు రాత్రి కలలో శ్రీ సాయి ట్రాఫిక్ పోలీసు రూపములో దర్శనము యిచ్చి "నీవు పోగొట్టుకొన్న తెల్ల హెల్మెట్ యిదిగో" అని నా హెల్మెట్ నాకు యిచ్చి తనకు 200 రూపాయలు ద్క్షిణ యివ్వమని అడిగినారు. నేను అతితెలివితేటలుకు పోయి నిన్నటి రోజున 101 రూపాయలు దక్షిణ యిచ్చినాను. శ్రీ సాయి మిగిలిన 100 రూపాయలు శ్రీ పాన్ షావలి రూపములో దక్షిణ కోరుతున్నారు అని గ్రహించినాను. ఈ రోజు సాయంత్రము తిరిగి మీర్పేటలోని శ్రీ సాయి గుడికి వెళ్ళి శ్రీ సాయికి మిగిలిన 100 రూపాయలు దక్షిణ యివ్వాలని నిశ్చయించుకొన్నాను.
17.09.1994
నిన్నటిరోజున శ్రీ సాయిబందు శ్రీ ఆలూరి గోపాలరావుగారి నుండి జాబు వచ్చినది. ఆజాబుకు ఏమని సమాధానము యివ్వవలసినది అని శ్రీ సాయినాధుని తెలపమని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీ సాయి మందిరాలకు అనుబంధముగా అనాధ ఆశ్రమాలు కనిపించినవి. ఒక అజ్ఞాతవ్యక్తి శ్రీ సాయిమందిరము దగ్గరనిలబడి నాతో అన్న మాటలు. "తల్లితండ్రులు లేక రోడ్డుమీద బ్రతుకుతున్న అనాధ బాల బాలికలను చేరదీసి నాపేరిట కట్టే మందిరాలలో వాళకు ఆశ్రయము యిస్తే నాయజమాని (భగవంతుడు) పిల్లలకు నేను సేవ చేసుకొనే భాగ్యము నాకు ప్రసాదించేవాళ్ళు అగుతారు మీరు"
ఈ మాటలకు నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయి పటముముందు నిలబడి ఆ అజ్ఞాతవ్యక్తి (శ్రీ సాయి) అన్నమాటలును శ్రీ ఆలూరి గోపాలరావుగారికి వ్రాయాలని నిశ్చయించుకొన్నాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు