09.02.2012 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 - 24వ. భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 (24)
30.08.1994
నిన్నటిరోజున మానసికముగా చాలా బాధపడినాను. జీవితముపై విరక్తి కలిగినది. బ్రతకాలని కోరిక మనసులో ఉంది. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ జీవించటానికి కావలసిన ధైర్యము ప్రసాదించు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యము నాకు చాలా ధైర్యమును కలిగించినది. వాటి వివరాలు. "అది 1962 సంవత్సరము. భారత చైనాల యుధ్ధము మంచు కొండలలో జరుగుతున్నది. నేను భారత సైన్యములో చేరి యుధ్ధము చేయసాగినాను.
చైనీయులతో యుధ్ధము చేస్తు నేను దారి తప్పి ఒక చిన్న గ్రామమునకు చేరినాను. అక్కడ యున్న ఒక బౌధ్ధలామ యింటిలో తలదాచుకొన్నాను. నాలాగ దారితప్పి నిస్సహాయముగా ఒక ముస్లిం ఆఫీసరు, క్రైస్థవ ఆఫీసరు కూడ అయింటిలో తలదాచుకొన్నారు. ఆ యింటిలో ఒక పంజాబీ స్త్రీ తన తప్పిపోయిన భర్త రాక కోసము ఎదురు చూడసాగినది. ఆ బౌధ్ధలామా ప్రేమ మాకు కావలసినంత ధైర్యము ప్రసాదించినది. యింతలో చైనావారు నన్ను పట్టుకోవటానికి ఆయింటిని చుట్టు ముట్టినారు. ఆయింటిలోని భారతీయులందరు ఆ బౌధ్ధలామ ఆశీర్వచనాలతో ధైర్యముగా నిలబడి యుధ్ధము చేసి ఆ చైనీయులను తరిమి కొట్టినాదు. ఒక్కసారిగా తెలివి వచ్చినది. నిద్రనుండి లేచి శ్రీ సాయి పటమునకు నమస్కరించినాను. ఆ సమయములో శ్రీ సాయి పటములో శ్రీ సాయికి బదులు బౌధ్ధ లామ కనిపించినారు. శ్రీ సాయి ఆశీర్వచనములతోను నాతోటి ఆధ్యాత్మిక మిత్రుల సహాయముతో నా మానసిక శత్రువులను (చైనీయులను) తరిమికొట్టి జీవించటానికి కావలసిన ధైర్యమును పొందగలిగినాను.
05.09.1994
నిన్నటిరోజున సంసార బంధాలపై ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఈ సంసార బంధాలపై సందేశము ప్రసాదించు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి రాత్రి కలలో మా ఆఫీసులో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులను వారి సంసార బాధలను చూపించి నాకు కనువిప్పు కలిగించినారు. ఆదృశ్యాలనుండి నేను సేకరించిన సందేశము.
1) జీవితములో బరువు బాధ్యతలను సరిగా నిర్వర్తించాలి అనే తపనతో మొదటి భార్య చనిపోయిన తర్వాత పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత, తిరిగి వివాహము చేసుకొని సంసార బంధాలలో మునిగి తేలేవారు కొందరు.
2) జీవితములో బరువు బాధ్యతలను సరిగా నిర్వర్తించాలి అనే తపన లేకుండ మొదటి భార్య పిల్లలు యుండగానే రెండవ భార్యను వివాహము చేసుకొని సంసార బంధాలలో మునిగి తేలేవారు కొందరు.
3) జీవితములో బరువు బాధ్యతలను సరిగ నిర్వర్తించి పిల్లలను పెంచి పెద్ద చేసి, వృధ్ధాప్యములో కూడా యింకా యింకా ధన సంపాదన చేస్తు సంసార బంధాలలో మునిగి తేలేవారు కొందరు.
ఈ మూడు రకాల మనుషులలో నీవు ఏకోవకు చెందుతావు నీవు ఆలోచించుకొని నీ బరువు బాధ్యతలను త్వరగా పూర్తి చేసుకొని సంసార బంధాలనుండి బయటపడు.
11.09.1994
నిన్నటిరోజున ఈ జీవితములో మనకు తోడునీడగా యుండేవారు ఎవరు అని ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఈ సమస్యకు సమాధానము చెప్పమని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యము నాకు కనువిప్పు కలిగించినది. ఆ దృశ్య వివరాలు :
"నేను ఒక రైలులో ప్రయాణము చేయుచున్నాను. నేను ఎక్కిన రైలు పెట్టెలో నిండా జనము యున్నారు. కాని ఒక్కరు నాకు తెలిసినవారు కారు. అందరు కొత్తవారే. ప్రతివారు తమ గమ్యస్థానము (స్టేషన్) గురించి ఎదురు చూస్తూ ప్రయాణము సాగించుతున్నవారే.
రైలు ఆగిన ప్రతి స్టేషన్ లోను కొంతమంది ప్రయాణీకులు మాటమంతి లేకుండ దిగి వెళ్ళిపోతున్నవారే. ఒకే రైలు పెట్టెలో అంత సంతోషముగా మాట్లాడినవారు కనీసము తమ స్టేషన్ వచ్చినది, వెళ్ళి వస్తాము అని మాటకూడ అనకుండ దిగిపోతున్నరే అనే బాధ నాలో ఎక్కువ కాసాగినది. ఆ సమయములో ఆ రైలు పెట్టెలో ఒకమూల కూర్చున్న ముసలి ఆయన (తెల్లని కఫనీ, నెత్తిమీద తెల్లని బట్ట, మెడలో రుద్రాక్షమాల, బుజాన ఒక జోలి వేసికొని యున్న ఆయన) నా దగ్గరకు వచ్చి ఈ రైలు ప్రయాణములో ఒకరికి ఒకరు తోడుగా ప్రయాణము చేయరు. ప్రతివ్యక్తి ఒక్కడిగానే ఈ రైలు ఎక్కుతాడు. రైలులో పదిమందితో కలసి మాట్లాడుతాడు. తన స్టేషన్ రాగానె దిగిపోతాడు. నేను కొన్ని లక్షల సంవత్సరాలనుండి ఈ రైలులో ప్రయాణము చేస్తున్నాను. నేను ఒక్కడినే ఎంతోమందికి తోడుగా ఈ రైలులో ప్రయాణము చేసినాను. నీకు నామీద నమ్మకము యుంటే నాతో స్నేహము చేయి. నేను నీకు తోడుగా ఈ రైలు ప్రయాణములో యుంటాను. నీ స్టేషన్ రాగానే నిన్ను అక్కడ దింపి నీవు నీ గమ్యస్థానము చేరేలాగ చూస్తాను". ఒక్కసారిగా నిద్రనుండి మెలుకువ వచ్చినది. నేను మంచముమీద పరుండి యున్నాను. మరి ఈ రైలు ప్రయాణము సంగతి ఏమిటి అని ఆలోచించసాగినాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment